నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది.
పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం:
రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్‌గాయ్‌లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్‌లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు.
జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా..
పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు.
సఫారీకి అధునాతన హంగులు
జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం.
– విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల
Comments
Please login to add a commentAdd a comment