nallamala forest
-
హరిణి.. హరివిల్లులా!
తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు,సింహం తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 8 రకాల హెర్బీవోర్స్లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్), నీల్గాయ్ వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్‌డీర్ సెతం ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నాగార్జున సాగర్– శ్రీశైలం అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్ప్రమాదం అంచున.. కొండ గొర్రె కంటే కాస్త భారీగా, కణుతుల కంటే కాస్త చిన్నగా ఉండే మరో ఆంటిలోప్.. బుర్రజింక. చింకారా అనికూడా పిలిచే ఈ జింక తలపై రెండు కొమ్ములు కృష్ణజింకను పోలి పురి తిరిగి ఉంటాయి. కానీ వాటి అంత పొడవు పెరగవు. నల్లమలలో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయ ఉపకరణాలలో చింకారా కొమ్ములను అందంగా వినియోగిస్తుంటారు. చర్నాకోల పిడిగా, మోకులు, పగ్గాలు తయారు చేసేందుకు ఉపయోగపడే పరికరంగా కూడా వీటి కొమ్ములను రైతులు సేకరించే వారు. సాంబర్ డీర్..జింకలలో అతి పెద్దది కణితి(సాంబర్ డీర్). దట్టమైన అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఇవి పెద్ద పంగల కొమ్ములు కలిగి ఉంటాయి (మగవాటికి మాత్రమే కొమ్ములుంటాయి). ఈ కొమ్ములను అవి నిర్ణీత సమయంలో విసర్జిస్తుంటాయి. కొన్ని సార్లు ఆడ కణితి కోసం జరిగే పోరాటంలో అవి ఊడి పోతుంటాయి.నల్లమలలో ప్రధాన రక్షిత వన్యప్రాణి అయిన పెద్దపులికి ఆహార జంతువులుగా జింకలు పర్యావరణ సమతుల్యానికి తమవంతు కృషి చేస్తున్నాయి. జింకలతో పాటు అడవి పంది, ముల్ల పంది, కుందేలు వంటి జంతువులు కూడా పులి ఆహార మెనూలో ఉన్నాయి. కణుతులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పెద్ద పులులకు చక్కటి ఆవాసంగా గుర్తిస్తారు. నేనూ జింకనే..జింకకాని జింక ఈ మౌస్ డీర్. నిజానికి ఇది జింకజాతి వన్యప్రాణి కాదు. కాని రూపం బట్టి దీన్ని మూషిక జింకగా చెబుతారు. ఇది పంది జాతికి చెందిన ప్రాణి. వెనక కాళ్లు కాస్త బలహీనంగా కనిపించే ఈ జింక పూర్తిగా దట్టమైన వర్షారణ్యాలను పోలిన అడవుల్లో కనిపిస్తుంది. పెద్ద కుందేలు పరిమాణంలో ఉండే మూíషిక జింక నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్రకోడు, పెచ్చెర్వు వంటి దట్టమైన పర్వతప్రాంత అడవుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రుళ్లు మాత్రమే తిరుగాడుతుంది. చెట్టు తొర్రల్లో నివాసముంటుంది. నల్లమలలో ఇది అంతరించి పోయింది అనుకున్న సమయంలో తిరిగి కనిపిస్తుండటం శుభపరిణామం. కొమ్ములతోకుమ్మేస్తూ..తలపై రెండు, పనపై మరో రెండు చిన్న కొమ్ములు కలిగి ఉండడమే కొండ గొర్రె ప్రత్యేకత. ఈ కారణంగానే కొండగొర్రెను చౌసింగా అని కూడా పిలుస్తారు. నల్లమలలోని కొండ తిప్పలపై నివసించే ఈ వన్యప్రాణి ఉనికి దట్టమైన పచ్చటి అడవికి గుర్తుగా చెప్పుకోవచ్చు. కొండగొర్రె తనను తాను మాంసాహార జంతువుల నుంచి రక్షించుకునేందుకు కొండకొమ్ముల ఏటవాలును వీలుగా ఉపయోగించుకుంటుంది. కొండగొర్రె మాంసం రుచిగా ఉంటుందన్న కారణంగా ఇవి ఎక్కువగా వేటగాళ్ల చేతిలో బలి అవుతుంటాయి. అడవికే అందం..పొడ దుప్పి (స్పాటెడ్ డీర్).. దీనిని చుక్కల దుప్పి అని కూడా అంటారు. జింకలలో అత్యంత అందమైనది. బంగారు వర్ణం చర్మంపై తెల్లటి మచ్చలతో అత్యంత లావణ్యంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మగ వాటికి పంగలతో కూడిన కొమ్ములు ఉంటాయి. దుప్పులు కూడా తమ కొమ్ములను వదులుతుంటాయి. మగ దుప్పి అరిచే శబ్దాన్ని బట్టి వర్లుపోతు అనికూడా పిలుస్తారు. ఇవి అడవుల్లో అన్ని ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. పులి ఆహారంలో ఇది కూడా ఉంది.మనిమేగం.. ప్రత్యేకం నల్లమలలో ప్రధానంగా కనిపించే మరో ఆంటిలోప్ మనిమేగం (నీల్గాయ్). ఇది కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. కొంతమేర గుర్రాన్ని పోలి ఉండే మగ మనిమేగాలు వయస్సుకు వచ్చాక నల్లటి పైకప్పుతో కనిపిస్తాయి. అందుకే వీటిని నల్లపోతు అనికూడా అంటారు. కృష్ణజింకలు, మనిమేగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయంటే అది అటవీ క్షీణతకు సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు జింకలు పెద్దపెద్ద గడ్డి మైదానాల్లో మాత్రమే మనగలుగుతాయి. జంగిల్ మే సవాల్.గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవించే జింకల్లో కృష్ణజింక (బ్లాక్ బక్) ప్రధానమైనది. మగ జింకలకు పొడవాటి కొమ్ములు ఉంటాయి. పురి తిరిగినట్లుండే ఈ కొమ్ములపైన ఉన్న పురులను బట్టి వాటి వయస్సును నిర్ధారిస్తారు. ఇవి బాగా వయస్సుకు వచ్చాక వాటి చర్మం నల్లటి కప్పును కలిగి అందంగా తయారవుతుంది. ఇలా బలంగా నల్లటి కప్పుతో కనిపించే కృష్ణజింక.. జింకల గుంపుకు నాయకత్వం వహిస్తుంది. అత్యంత వేగంగా పరిగెత్తే వీటిని వేటాడే మాంసాహార జంతువు నల్లమలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. గంటకు 100 కి.మీ పైగా వేగంతో పరిగెత్తే చీతాలు దేశంలో కనుమరుగు కావడంతో వీటికి పోటీపడి పరిగెత్తే జంతువులు లేకుండా అయ్యాయి. తోడేల్లు, హైనాలు మాటువేసి వీటిని చంపుతుంటాయి. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక జంతువుగా ఉంది.జీవవైవిధ్యంలో జింకలు కీలకం నల్లమలలో ముఖ్య రక్షిత వన్యప్రాణి పెద్దపులి, ఆతరువాతి స్థానాల్లో ఉన్న చిరుత వంటి మాంసాహార జంతువులకు ఆహార సమృద్ధి కలిగిస్తూ మొత్తం పర్యావరణ సంరక్షణలో జింకలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పెద్దపులికి నల్లమల ఆవాసంగా మారడంలో ఈ జింకలు కూడా ప్రధాన కారణం. నల్లమలలో జీవ వైవిధ్యంలో ఇవి కీలకంగా ఉన్నాయి. – పట్టాభి, ఎఫ్ఆర్వో, ఆత్మకూరు రేంజ్ -
అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి చిరుతలు
-
రేపటి నుంచి పులుల గణన
రాష్ట్రవ్యాప్తంగా జనవరి1 నుంచి 45 రోజులపాటు పులుల లెక్కింపు జరుగనుంది. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీశాఖ ప్రాంతాలతోపాటు పల్నాడు, తిరుపతి, రాజంపేట, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతి 2 చదరపు మీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏకైక టైగర్ రిజర్వు ఫారెస్టు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. పులుల గణన కోసం సుమారు 2.15 లక్షల ఎకరాల్లో 400పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో 86 నుంచి 88 వరకూ పులులు సంచరిస్తున్నట్లు అంచనా. – మార్కాపురం బేస్ క్యాంపులు..ప్రస్తుతం నల్లమలలో గంజివారిపల్లి సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంపు, పాలుట్ల, వెదురుపడియ, నారుతడికల, ఇష్టకామేశ్వరి, పాలుట్ల, దొరబైలు, తుమ్మలబైలు, చిన్నమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, కొలుకుల తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులున్నాయి. రాత్రి 9 దాటితే దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులుల సంచారం ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన..రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు పులుల గణన జరుగుతుంది. ఇవి శేషాచలం బయోస్పియర్ రిజర్వులో కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణలో లంకా మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, పెంచల నరసింహ అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. – సందీప్‌కృపాకర్, అటవీశాఖ డెప్యూటీ డైరెక్టర్, మార్కాపురం -
నన్నారి @ నల్లమల
ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గిరిజనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షరబత్) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజనులు ప్రధానంగా నన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్‌గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమలలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభించారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు. కిలో నన్నారి వేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల నన్నారిని తయారు చేయవచ్చు. లీటర్ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక లీటర్ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మరసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.షుగర్ ఫ్రీ నన్నారి నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సేవించేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చారు. మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు. నల్లమల నన్నారి ఉపయోగాలు వేసవిలో దాహార్తి తీరుతుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది. వ్యాధి నిరోధకత పెంచుతుంది. హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధిఎండాకాలం వ నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొండల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి, వెతికి కొండల వెంబడి తిరగాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా ఎదుగుతాం. -శివలింగమ్మ, చెంచు మహిళ, ఎర్రమఠం గూడెంతిరిగే కష్టం తప్పుతుందిఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నన్నారి నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆరి్థకంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గరలోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది. – ఈదమ్మ, బైర్లూటీ గూడెం -
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్‌లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్‌కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఫుట్ పెట్రోలింగ్‌కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్‌లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్‌ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్‌పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు..వన్యప్రాణుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్–శ్రీశైలం రహదారి వెళుతోంది. దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగానే వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిషేధం ఉన్నా.. తగ్గని వేగం హైదరాబాద్–శ్రీశైలం హదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ. నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలు గంటకు కేవలం 30 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడవిలోని రహదారి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే అడవిలో గరిష్ట వేగం 30 కి.మీ. కాగా, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అడవిలో ఏదైనా వన్యప్రాణి అడ్డుగా వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడంతో వాహనాల కింద పడి అవి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో సుమారు 800కు పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి మరణించాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిపోర్టు కాని వన్యప్రాణుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. సూచిక బోర్డులకే పరిమితం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవురోజుల్లో వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. నల్లమలలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతో పాటు 35 చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా సూచిక బోర్డులు ఉన్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటం నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, మనుబోతులు, సరీసృపాలు తదితర అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వాహనదారులకు వి్రస్తృతంగా అవగాహన కలి్పంచడంతో పాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచుగా రహదారులు దాటే ప్రాంతాల్లో 35 చోట్ల సూచికబోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేశాం. వాహనాలు అటవీమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ -
మాయమయింది మళ్లీ వచ్చింది
అనుకోని అతిథి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడి అడవుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.ఆత్మకూరు రూరల్: నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్లలో కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. çకర్ణాటకలోని పశి్చమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే. నెల క్రితమే కనిపించినా.. నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది. ఆ వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఆ తరువాత ఇదే అటవీ డివిజన్లోని వెలుగోడు రేంజ్లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది.అప్రయత్నంగానే సాకారం ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్లూడబ్ల్యూఎఫ్) సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యమైనదేమీ కాదు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం -
చెంచుల అడ్డాలో లక్ష్మీగడ్డ
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది. కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.చెంచులకు అవినాభావ సంబంధం చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్ఓఎఫ్ఆర్, పెద్దదోర్నాలఎన్నో ఔషధ గుణాలు భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు. -
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్‌క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్‌క్లోజర్‌లోకి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
బాబోయ్.. పులి!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పులులు సంచరిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో వారం కిందట ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆవుపై దాడి చేసిన విధానం, ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా రెండు పులులు దాడి చేసినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకుని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి ఆ రెండు పులులు దారి తప్పి వచ్చాయని వారు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆహారం దొరక్క వచ్చాయా!? శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గత రెండు మూడేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 73 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా.. అనధికారికంగా మరో పది పులులు ఉండొచ్చని భావిస్తున్నారు. టైగర్ జోన్లో ఆహారం లభించక వేట కోసమో, నీటి లభ్యత తగ్గడం వల్లనో పులులు పల్నాడు జిల్లా వైపు వచ్చి ఉంటాయంటున్నారు. ఈ పులులు దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, దారి తప్పి వచ్చిన రెండు పులులను తిరిగి అభయారణ్యంలోకి సురక్షితంగా పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సాయంతో పులుల జాడ తెలుసుకుని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అభయారణ్యంలో నుంచి నీటి కోసం పులులు వచ్చే అవకాశం ఉండటంతో మంచి నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్‌ను నిలుపుదల చేయాలని విద్యుత్ శాఖను కోరారు. అప్రమత్తంగా ఉండండి..దుర్గి మండల పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ప్రస్తుతం పులులకు ఎటువంటి ఆపద రాకుండా సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపడం, ప్రజలను అప్రమత్తం చేసి వాటికి దూరంగా ఉంచడం మా కర్తవ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగానే వెళ్లాలి. – రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి. రెండు పులులను చూశా.. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి పూట పొలానికి వచ్చిన సమయంలో రెండు పులులను చూశాను. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. పొలంలోని గుంతల్లో నీటిని తాగి వెళ్లాయి. ఇటీవల మా పొలం సమీపంలోనే ఆవును చంపి లాక్కెళ్లాయి. రాత్రి పూట పొలానికి రావాలంటే భయంగా ఉంది. – గోవింద, పులిని చూసిన ప్రత్యక్ష సాక్షి, గజాపురం, దుర్గి మండలం. -
పొలం గట్టున పొంచిన గండం.. రక్తపింజర, కొండచిలువలు కోకొల్లలు
మార్కాపురం డివిజన్లోని నల్లమల సమీప గ్రామాల్లో పాముల బెడదతో రైతులు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములను చంపకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేసేందుకు అటవీశాఖ స్నేక్ వాచర్లను నియమించి.. వందల సంఖ్యలో పాముల్ని రక్షించి వాటి ఆవాసాలకు చేరుస్తోంది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): పాము అంటే ప్రతి ఒక్కరికీ భయం. దేశంలో ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో మొదటిది రక్తపింజర, తరువాత తాచుపాము, కట్లపాము. రక్తపింజర ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా సంచరించటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి, పత్తి పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. అత్యధికంగా నవంబర్ నెలలో మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీం 103 పాములు పట్టుకోగా అందులో ఎక్కువగా ప్రమాదకరమైన రక్తపింజరలు ఉన్నాయి. మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో స్నేక్ వాచర్ నిరంజన్ 10 రోజుల వ్యవధిలో 8 రక్తపింజర పాములను పొలాల్లో పట్టుకున్నాడు. వేములకోటలో 4, కొండేపల్లి బ్రిడ్జి కింద 1, శివరాంపురం పొలాల్లో 1, ఎస్కొత్తపల్లిలో 1, పట్టణంలోని పీఎస్ కాలనీలో ఒక రక్తపింజర పామును పట్టుకున్నాడు. 5 అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే చనిపోతారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఒళ్లంతా చమటలు పట్టి రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో గుండె బలహీన పడుతుంది. ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొండచిలువలు కూడా మార్కాపురం ప్రాంతంలో జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు, 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు 10 రోజుల వ్యవధిలో 3 ప్రాంతాల్లో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బుడ్డపల్లిలో 2, పొదిలి దగ్గర ఒక కొండచిలువను పట్టుకున్నారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి కొండ చిలువలు వస్తున్నాయి. కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను తింటున్నాయి. మనిషిని చుట్టేస్తే కొండచిలువ నుంచి బయటపడటం చాలా కష్టం. పాముల పట్టివేత ఇలా: నవంబర్ నెలలో నల్లమల పరిధిలోని శ్రీశైలంలో 15, సున్నిపెంటలో 27, మార్కాపురంలో 103, వైపాలెంలో 55, దోర్నాలలో 14, విజయపురి సౌత్‌లో 23 కలిపి మొత్తం 237 పాములను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో 163 పాములను పట్టుకున్నారు. పాముకాటు సంఘటనలు అక్టోబర్ 23న కొనకనమిట్ల మండలం గనివెనపాడులో యద్దనపూడి మరియమ్మ పాటుకాటుతో మృతిచెందింది. సిద్దవరంలో ఆగస్టులో ఒకేసారి 8 మంది పాముకాటుకు గురై చికిత్స పొందారు. విషపూరితమైనవే కాదు..మేలు చేసేవీ ఉన్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాములు సంచరిస్తున్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజర, కొండ చిలువలతో పాటు రైతులకు మేలు చేసే పాములు కూడా ఉన్నాయి. జర్రిపోతు, నీరుకట్టు పాము, చెక్డ్కిల్ బ్యాక్, బ్రౌన్జి, పసిరిక పాములు ఉన్నాయి. ఇవి పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, తొండలు, బల్లులను తిని జీవిస్తుంటాయి. కొండ చిలువ మాత్రం కుందేళ్లు, పక్షులు, కోళ్లు, చిన్న మేకలను తింటుంది. పసిరికపాము చెట్లపైనే ఉండి తొండలను, పిట్టలను తింటుంది. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర, నాగుపాము, కట్లపాము పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
సఫారీకి జీవకళ...రూ.కోటితో సరికొత్త హంగులు
ప్రకృతి అందాలు, రమణీయ, కమనీయ దృశ్యాలకు నెలవైన నల్లమల అభయారణ్యం సరికొత్త సొబగులు దిద్దుకుంటోంది. రూ.కోటితో పర్యావరణ ప్రేమికులకు మరో కొత్త లోకాన్ని చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ఓపెన్ టాప్ జీపుల్లో విహరిస్తూ సాగే జంగిల్ సఫారీ ఇకపై సరికొత్త అనుభూతులు నింపనుంది. తుమ్మలబైలు సమీపంలో రూపుదిద్దుకుంటున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో ఉట్టిపడుతున్న జీవకళ ప్రకృతిని ప్రేమించే మనసులను కట్టిపడేస్తోంది. పెద్దదోర్నాల(ప్రకాశం): నల్లమల అభయారణ్యం.. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. అక్కడ సాగే జంగిల్ సఫారీని ఆస్వాదించేందుకు ఆరాటపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ పర్యటిస్తుంటే కలిగే ఆనందమే వేరు. నల్లమలలో ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న పర్యాటకులకు అటవీశాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోంది. తాజాగా సుమారు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. వన్యప్రాణుల ఆకృతులతో కూడిన పర్యావరణ విజ్ఞాన కేంద్రంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు పగోడాలు, క్యాబిన్లో అధునాతనంగా రూపుదిద్దుకున్న టాయిలెట్లు, ఆరు బయట పచ్చిక బయళ్లతో ఆకట్టుకునే రీతిలో జంగిల్ సఫారీ ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ఎకో టూరిజం పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేందుకు సరికొత్త వాటిని సిద్ధం చేస్తోంది. శరవేగంగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పనులు... జంగిల్ సఫారీలో భాగంగా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో పెద్దపులి, చిరుతపులి, జింకలు, కృష్ట జింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలతో పాటు రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలి, ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్ఠించారు. ఆయా ఆకృతులకు సంబంధించి విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి ఆకృతి వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి గాండ్రింపుతో పాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన్యప్రాణుల శిలాప్రతిమల్లో జీవకళ... పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఆకృతులు జవకళను సంతరించుకుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పులుల ప్రతిమలు చూస్తుంటే.. మన కళ్ల ముందే సజీవంగా ఉన్నాయన్న అనుభూతి కలుగుతోంది. సహజసిద్ధ వాతావరణంలో రాజసంగా నిలుచుని ఉండే పెద్దపులి ప్రతిమ సందర్శకులను కట్టిపడేసేలా ఉంది. చెట్టుపై కూర్చున్న చిరుతపులితో పాటు పెద్ద పులులను సైతం ఎదిరించే మొండితనం, ధైర్యం ఉన్న బుల్లి జీవి హనీబ్యాడ్జర్, ప్రపంచంలోని జింకలలో కెల్లా అత్యంత చిన్న జింకగా ప్రసిద్ధి గాంచిన మూషిక జింకలు సైతం జీవకళతో అబ్బురపరుస్తున్నాయి. గడ్డి మైదానంలో కూర్చుని సేదతీరుతున్న కణితి, పర్యావరణ విజ్ఞాన కేంద్రం గోడలపై ఏర్పాటు చేసిన నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతుల ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. జంగిల్ సఫారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి సరస్సు, పచ్చిక బయళ్లు, చిన్నారులు కూర్చునేందుకు చెక్కతో తీర్చిదిద్దిన సీతాకోక చిలుక, తాబేలు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా జంగిల్ సఫారీకి అధునాతన వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నెలవైన పులిచెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ముఖద్వారంతో పాటు 14 కిలోమీటర్లు జంగిల్ సఫారీ కొనసాగే రహదారిని అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలతో జంగిల్ సఫారీని అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకు గొప్ప అనుభూతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి రూపాయలతో పనులు నల్లమల జంగిల్ సఫారీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో వన్యప్రాణుల ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాం. విద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. జంగిల్ సఫారీ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఆద్యంతం పచ్చని పచ్చిక బయళ్లతో అందంగా తయారు చేస్తున్నాం. పులిచెరువు ముఖద్వారం ఆర్చిని ఆకర్షణీయంగా మారుస్తున్నాం. వన్యప్రాణుల ప్రతిమలు జీవకళతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. – విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి -
అడవిలో అగ్నిశిఖ
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అడవినాభి అద్భుతమైన ఔషధి నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. – ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు -
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్‌ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్‌లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్‌వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్‌వో కేడర్‌లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
నల్లమలలో పెరిగిన పులులు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 21
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెరుగుతున్న ఆడ పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్ ఏరియాపరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. ప్రజల మద్దతుతో... ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్‌ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్ఎస్టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్ఎస్టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్‌లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది. ప్రతి స్వచ్ఛ సేవక్కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్‌రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్‌ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్‌కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్‌ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి. – వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల -
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2017 నుంచి మౌస్‌డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్‌లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్‌లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్‌లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు.. చెంచులదే కీలకపాత్ర
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఇక్కడ అవి సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ 37 మాత్రమే పులులుండగా, ఇప్పుడవి 73కి పెరిగాయి. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మ గా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ►చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమెరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ►ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ►ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ►బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ►అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ►మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ►ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ►ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ►ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. –శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులుల క్రాసింగ్ టైమ్ లో చాలాజాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో అవి కలిసే(మేటింగ్) సమయం. అప్పుడు ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే ట ప్పుడూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని దాడి చేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
సర్పాలతో మేలే.. ఏపీలో విషపూరిత సర్ప జాతులు నాలుగే
నల్లమల అభయారణ్యం ఎన్నో జీవజాతులకు ఆలవాలం. వందల రకాల పక్షులు, జంతువులతో పాటు పాములు కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. విషపూరితమైన వాటితో పాటు విష రహిత పాములూ ఎక్కువే. ఈ నేపథ్యంలో సర్పాలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పెద్దదోర్నాల: సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం. విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ. పాము కనబడగానే దాన్ని మట్టుబెట్టడమో లేదా దానిని పట్టుకోవటానికి శిక్షణ పొందిన వారిని ప్రేరేపించటమో చేస్తుంటాం. అయితే మనకు ఎదురు పడిన పాములన్నీ మానవాళికి కీడు చేసేవి కావన్న నిజాన్ని గ్రహించాలని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. వాటికి కోరలే ఉండవు. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. దీంతో పాటు కొన్ని పాముల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్‌ను తయారు చేయాలంటే దానికి పాము విషమే కావాలి. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో రకాల సర్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు పరోక్షంగా సర్పరాజులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వరి, గోధుమ లాంటి పంటలను నాశనం చేయటంలో మూషికాలదే ప్రధాన పాత్ర. అటువంటి మూషికాలను పాములు వేటాడి, వెంటాడి భక్షించటం వల్లనే పంటలకు మేలు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 రకాలకు పైగా సర్పాలుంటే, వాటిలో కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదభరితమైనవిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటిల్లో కూడా ఎక్కువగా సముద్ర జలాల్లోనే జీవిస్తుంటాయి. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) విషపూరితమైన పాములతో అప్రమత్తంగా ఉండాలి నల్లమలలో సంచరించే విషపూరితమైన పాముల్లో ప్రధానంగా చెప్పుకునే సర్పజాతులు నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర పాములు ఉన్నాయి. నాగుపాము పడగ విప్పుకొని మనుషులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నాగుపాములకు ఎలుకలు మంచి ఆహారం. ఎలుకల కోసమే నాగుపాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో పాటు ఆకారంలో ఎంతో చిన్నదిగా ఉండేవి చిన్న పింజర పాములు. ఎంత ఆకారంలో చిన్నదైనా దీని విషం మాత్రం చాలా భయంకరమైంది. అది మనుషులపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఖాళీ ప్రాంతాలు, బీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. గడ్డి లోపల, కాలిన ఆకుల మధ్య ఎక్కువగా ఉంటుంది. కట్లపాము రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని వెతికే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో నేల మీద పడుకుని ఉన్న వారిని కాటు వేసే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాని పెద్ద ఆకారం, పెద్ద కోరలు, భయంకరమైన విషం. పాము కాట్ల మరణాలకు ఎక్కువ కారణం రక్తపింజరే. రాలిపోయిన ఆకుల మధ్య ఎక్కువగా దాక్కుని ఉంటుంది. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) విషరహితమైన పాములతో ప్రమాదమే లేదు నల్లమల అభయారణ్యంలో సంచరించే విషరహిత పాముల్లో పసిరిక పాము, జెర్రిపోతు, రెండు తలల పాములు, మట్టిపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిలో చెట్లపై ఉండే పసిరిక పాములు ఆకుల రంగులో ఉండి పక్షుల గుడ్లు, చిన్న చిన్న పురుగులను తిని జీవిస్తుంటాయి. జెర్రిపోతు పాములకు భయం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. భూమి లోపల ఉండే పాముల్లో రెండు తలల పాములు ఒకటి. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు. అవి వేగంగా పరిగెత్తలేవు. దగ్గరలో ఉన్న బొరియల్లో ఎక్కువగా ఉంటాయి. మరో పాము మట్టిపాము. దీని వల్ల కూడా ఎవరికీ ప్రమాదం ఉండదు. ఇవి ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంటాయి. -
తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై..
మన్ననూర్/ సాక్షి, హైదరాబాద్: పెంచి పెద్ద చేసిన తల్లిని స్నేహితులతో కలిసి కిరాతకంగా హత్య చేసిన దత్తపుత్రుడు సాయితేజ (27) అంతే కిరాతకంగా హతమయ్యాడు. తల్లిని చంపేందుకు సాయితేజకు సహకరించిన స్నేహితుడే అతడినీ హత్యచేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. పెంచి పెద్ద చేసిన తల్లిని చంపి.. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులు.. 1995లో బంధువుల నుంచి నెల రోజుల మగబిడ్డను దత్తత తెచ్చు కున్నారు. సాయితేజ అని పేరు పెట్టి పెంచుకున్నారు. మతిస్థిమితం సరిగా లేని సాయితేజకు స్థానికంగా ఉన్న ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇం ట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసు కున్న సాయితేజ.. వాటిని తన ప్రేయసికి ఇవ్వాలనుకున్నాడు. తల్లి అడ్డువస్తుందన్న ఉద్దేశంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన డ్రైవర్ నర్సింహను సాయం చేయాలని కోరాడు. కొంత డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో నర్సింహ ఒప్పుకున్నాడు. తర్వాత నర్సింహ ఈ విషయాన్ని తన స్నేహితులైన చంపాపేటకు చెందిన వట్టికోటి శివ, చింటు, అంజి, సాయిగౌడ్‌లకు తెలిపాడు. అందరూ కలిసి ఈనెల 6న అర్ధరాత్రి సాయితేజ ఇంటికి వెళ్లారు. నిద్రలో ఉన్న భూదేవిని చంపి.. 10 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పరారయ్యారు. బయటపెడ్తాడని భయపడి.. ఎత్తుకెళ్లిన నగలు, నగదును అంతా పంచు కున్నారు. కానీ మతిస్థిమితం సరిగా లేని సాయితేజ.. ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడేమోనని శివ, నర్సింహ, ఇతర స్నేహి తులు భయపడ్డారు. సాయితేజను చంపేస్తే సమస్య తీరుతుందని నిర్ణయించు కున్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం శ్రీశైలం వెళ్తున్నామ ని, అక్కడ తన ప్రేయసిని కలవచ్చని సాయితేజకు చెప్పారు. అంతా కలిసి బస్సులో శ్రీశైలం వెళ్లారు. ఆ రోజు రాత్రి సత్రంలో గడిపారు. తర్వాతిరోజు ఉదయం దైవ దర్శనం చేసుకొని, గుండు కొట్టించుకున్నారు. రాత్రికి వట్టె్టవారిపల్లికి చేరుకుని నిద్రించారు. ఈనెల 10న ఉదయం అమ్రాబాద్ మండల పరిధిలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లారు. ముఖం గుర్తుపట్టకుండా.. మల్లెలతీర్థం ప్రాంతంలో శివ, సాయితేజ మద్యం తాగారు. శివ ఈ క్రమంలో సాయితేజతో గొడవ పెట్టుకుని దాడికి దిగాడు. సాయితేజ కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి చంపాడు. అదే రాయితో ముఖం గుర్తు పట్టకుండా ఛిద్రం చేశాడు. తర్వాత బ్యాగులో రాళ్లునింపి మృతదేహానికి కట్టి.. మల్లెలతీర్థం కింది భాగంలో ఉన్న నీటి గుండంలో పడేశాడు. మత్తు దిగాక తీవ్ర భయాందోళనకు గురైన శివ.. బస్సులో నేరుగా హైదరాబాద్‌కు వచ్చాడు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం 10:30 గంటలకు అమ్రాబాద్ పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో మల్లెల తీర్థం జలపాతం వద్దకు చేరుకుని సాయి తేజ మృతదేహాన్ని వెలికితీశారు. శివ వద్ద రూ.1.40 లక్షల నగదు, బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతను చెప్పిన వివరాల మేరకు మిగతా నిందితులు నర్సింహా, చింటు, అంజి, సాయిగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చదవండి: కల్యాణ మండపంలో నవ వధువు మృతి కేసులో ట్విస్ట్ -
పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..
సాక్షి, ఆత్మకూరురూరల్: తూర్పు కనుమల్లో విస్తరించిన నల్లమల అడవులు జీవ వైవిధ్యానికి ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగా నిలిచాయి. సింహం, ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. మాంసాహార, గడ్డి తినే జంతువులతో పాటు పలు సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు, పక్షులు ఉన్నాయి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, వన్యప్రాణి వేటగాళ్లను కట్టడి చేయడంతో అడవిలో జంతుజాలం అలరారుతోంది. ఏటా జంతువులసంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మాంసాహార జంతువులలో ప్రముఖమైన పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు మొత్తం 17 రకాలు, తొమ్మిది రకాల గడ్డి తినే జంతువులు ఉన్నాయి. అంతరించి పోయే దశలో ఉన్న పెద్దపులులతో పాటు అరుదైన జీవజాలానికి నెలవుగా ఉన్న కొండగొర్రెలు (చౌసింగా) తన ఉనికిని చాటుతూ నల్లమల అటవీ సాంద్రతను నిరూపిస్తున్నాయి. అలాగే నిశాచరి అయిన హనీబాడ్జర్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. అటవీ పరిధిలోని కృష్ణానది, పలు కొండవాగుల్లో, నీటిదొరువుల్లో సరీ సృపాలకు చెందిన మొసళ్లు జీవిస్తున్నాయి. అలాగే భారీ తాబేళ్లు (టోలిలు) కూడా ఉన్నాయి. నెమలి, కొండ కోడి (గ్రే జంగిల్ పౌల్), హార్న్‌బిల్ వంటి 200 రకాల అరుదైన పక్షుల కిలకిలరావాలతో నల్లమల పులకిస్తోంది. ఇవే గాక 13 రకాల గబ్బిలాలు, బెట్టుడత లాంటి ఉడుత జాతి జంతువులు, ఎలుక జాతులు, సాలెపురుగు, చెదపురుగులు వంటి లెక్కలేని కీటకాలు ఉన్నాయి. అయితే వెదురు తోపులు పచ్చిక బయళ్లను ఆక్రమించడంతో జింకలు ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరులుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నల్లమలలో తరచూ కనిపించే జింకలు ఇప్పుడు సమీపంలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. విఫలమైన గడ్డి పెంపకం.. నల్లమలతో పాటు చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో కూడా పశువుల సంఖ్య గణనీయంగానే ఉంది. 2001 లెక్కల ప్రకారం అడవిలో 5.81 లక్షల వన్యప్రాణులు ఉండగా సమీప గ్రామాల్లో (3 కిమీ లోపు) 6.24 లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటిల్లో గడ్డితినే జంతువులన్నింటికీ నల్లమలనే ఆధారం. నల్లమలలో 1,33,122 హెక్టార్ల గడ్డి లభించే ప్రాంతం ఉండగా.. ఏటా సుమారు 3,86,053 టన్నుల గడ్డి లభ్యమవుతోంది. ఇప్పుడున్న జంతువులకు 6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం కాగా 3.073 టన్నుల కొరత ఉంది. వేసవిలో గడ్డి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ల వద్ద గడ్డి పెంచే చర్యలు చేపట్టారు. అయితే నాటిన గడ్డి మొక్కలను జంతువులు వేర్లతో సహా పెకిలించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దేశంలోని కొన్ని అభయారణ్యాలలో గడ్డి మైదానాలను పెంచేందుకు వెదురు పొదలను తొలగించిన సందర్భాలున్నాయి. గడ్డి తినే, మాంసాహార జంతువుల మధ్య సమతుల్యం లోపిస్తే పర్యావరణ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మాంసాహార జంతువులు.. పెద్దపులి, చిరుతపులి, జంగం పిల్లి, ఆకుచిరుత, చేపలుపట్టే పిల్లి, రస్టీస్పాటెడ్ క్యాట్, పునుగు పిల్లి, కామన్ పామ్సివిట్, ముంగీస, నీటికుక్క(ఆటర్), హానీబాడ్జర్, ఎలుగు బంటి, నక్క, గుంటనక్క, చారల హైనా (దొమ్ములగొండి), తోడేలు, రేచుకుక్క (వైల్డ్‌డాగ్). గడ్డి తినే జంతువులు: దుప్పి (స్పాటెడ్ డీర్), కణితి (సాంబర్ డీర్), మనిమేగం (నీల్గాయ్), కృష్ణజింక (బ్లాక్‌బక్), బుర్ర జింక (మౌస్‌డీర్), కొండగొర్రె(చౌసింగా), చింకారా, అడవి పంది (వైల్డ్బోర్), ముళ్ల పంది (మిశ్రమ ఆహార జంతువు. చెద పురుగులు తిని జీవిస్తుంది.) కొండ గొర్రె కొండ గొర్రెలు మైదాన ప్రాంతాల్లో కాక దట్టమైన అడవుల్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి జింక జాతికి చెందినవైనప్పటికీ మూషిక జింకకు, కృష్ణజింకకు మధ్యరకం పరిమాణంతో ఉంటాయి. రెండు కొమ్ములు నిటారుగా మరో రెండు చిన్న కొమ్ములు ముందుకు ఉంటాయి. మొత్తం నాలుగు కొమ్ములు ఉండటంతో దీనికి చౌసింగా అన్న పేరు వచ్చింది. దీని మాంసం రుచికరంగా ఉంటుందన్న అపోహతో వేట గాళ్ల దృష్టి వీటిపై ఎక్కువగా ఉండేది. అధికారులు నిఘా పెంచడంతో వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. హనీబాడ్జర్ వన్యప్రాణుల టీవీ చానల్స్‌లో తరుచూ కనిపించే హనీబాడ్జర్ను ఆఫ్రికా జంతువుగా చాలా మంది భావిస్తారు. ఇది రాత్రి పూట మాత్రమే సంచరించడంతో నల్లమల ప్రాంత ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియలేదు. అందుకే దీనికి తెలుగు పేరు కూడా లేకుండా పోయింది. బిలకారి జీవనం చేసే హనీబాడ్జర్లు మానవ సామాజిక వ్యవహారానికి దగ్గరగా తమ జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపల నివాసం ఏర్పరుచుకుని పెద్దవి, పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తాయి. అలాగే తమ నివాసం వెలుపల మల విసర్జనకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అవసరమై సమయంలో పెద్దపులికి కూడా ఎదురుతిరిగే సాహసం చేస్తాయి. -
బెబ్బులి కోట.. పులుల ఆవాస కేంద్రంగా నల్లమల
పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తుంటాయి. మనదేశంలో పర్యావరణ పిరమిడ్‌లో పెద్ద పులిని అగ్ర సూచిగా గుర్తించారు. అలాంటి పులులకు నల్లమల ఫారెస్ట్ సురక్షిత ఆవాస కేంద్రంగా మారింది. వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతుండడంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచంలో బతికి ఉన్న పెద్ద పులుల సంఖ్య 4000 వరకు ఉండగా అందులో ఒక్క భారత దేశంలోనే వాటి సంఖ్య యాభై శాతానికి పైగా అంటే 2,226 గా ఉండడం గమనార్హం. ఇటీవల ప్రకటించిన అరుణాచల్ ప్రదేశ్ లోని కమలంగ్ టైగర్ రిజర్వ్‌తో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 50 పెద్ద పులుల అభయారణ్యాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) దేశంలోనే అతి పెద్దది(3,568 చ.కిమీ). నల్లమలలో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రా రెడ్ కెమెరా నల్లమల పులి సంరక్షణకు దుర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులు పులి సంరక్షణకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాయి. పులి సంతతి వృద్ధికి ఈ ప్రాంతం అత్యంత అనుకూల పర్యావరణాన్ని కలిగి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం (జీబీఎం)లో కూడా పులులు క్రమేపి విస్తరిస్తూ కడప జిల్లా వరకు చేరుకుంటున్నాయి. నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యంలో సిబ్బంది పర్యవేక్షణ, మానవవనరులను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకోవడం ద్వారా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని గుర్తించిన ఎన్టీసీఏ 2014లో అత్యున్నత ప్రతిభా అవార్డుతో అభినందించింది. సుదీర్ఘ ఆకలి తర్వాతే వేటపులి ఎప్పుడంటే అప్పుడు వేటాడదు. ఎంతో ఆకలి వేస్తేనే వేట మొదలుపెడుతుంది. సంవత్సరానికి ఒక పులి 50 నుంచి 60 జంతువులను తన ఆహారానికి వినియోగించుకుంటుందని అటవీ అధికారులు తెలిపారు నల్లమలలో పులుల ఉనికి పెరుగుతుందిలా.. సంవత్సరం ఎన్ఎస్టీఆర్ జీబీఎం మొత్తం 2016 23 17 40 2017 25 21 46 2018 50 పైగా ఉండొచ్చని అంచనా 100 పైగానే పెద్ద పులులు ఉన్నట్లు అంచనా పులి సామ్రాజ్యం ప్రత్యేకం పులుల తమ కోసం ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. సాధారణంగా ఒక మగ పులి తన ఆహార లభ్యతను బట్టి తన విహార ప్రాంతాన్ని గుర్తిస్తుంది. నల్లమలలో ఒక పులి సాధారణంగా తన ఆధీన ప్రాంతం (టెరిటరీ) 50 చ.కిమీ గా ఉంచుకుంటుంది. అయితే తన భాగస్వామి, ఆహారం కోసం 200 చ.కి.మీ. పరిధి వరకు విహరిస్తుంది. అదే రాజస్థాన్‌లోని రణతంబోర్ పులుల అభయారణ్యంలో అది ఇందులో సగం మాత్రమే ఉంటుంది. పులి తన మూత్రం వెదజల్లడం ద్వారా తన టెరిటరీ సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. నల్లమల అడవిలో పులులు లెక్కింపులో ప్రామాణికం స్టాండర్డ్ పగ్ మార్క్ పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేస్తారు. దీనినే స్టాండర్డ్ పగమార్క్ ఎన్యూమరేషన్ పద్ధతి అని అంటారు. ప్రస్తుతం జాతీయ జంతువుల అంచనాకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. వాటి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి సంరక్షణ కఠినతరం పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. నల్లమల అడవులు ఆకురాల్చు అడవులు కావడంతో పులికి ఆహారమైన జంతువులకు సంవత్సరం పొడవునా గడ్డి లభించదు. దీంతో పులికి కావాల్సిన ఆహారపు జంతువుల సంఖ్య అడవిలో తగ్గకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నల్లమలలో పులుల పెరుగుదల కనిపించడం సిబ్బంది పనితనానికి గుర్తుగా చెప్పవచ్చు. – అలాన్ చోంగ్ టెరాన్, డీఎఫ్ఓ, ఆత్మకూరు