
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది.
అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
బరువు తక్కువ.. భయం ఎక్కువ!
భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి.
మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2017 నుంచి మౌస్‌డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం.
::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య..
అటవీశాఖ హైదరాబాద్‌లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్‌లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు.
► ఒక్కో బ్యాచ్‌లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్‌మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు.
► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు.
► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు.
► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment