నన్నారి @ నల్లమల | Special Story On Nannari Nallamala Forest | Sakshi
Sakshi News home page

నన్నారి @ నల్లమల

Published Thu, Dec 26 2024 8:52 PM | Last Updated on Thu, Dec 26 2024 8:59 PM

Special Story On Nannari Nallamala Forest
  • కొన్ని ప్రాంతాల్లో షర్బత్, ఇంకొన్ని ప్రాంతాల్లో సుగంధ పాలుగా పేరు
  • ∙వేర్లను వెలికి తీసి ఉడికించి.. పానీయంగా మార్చి విక్రయం
  • ∙కొంతకాలంగా తగ్గిపోతున్న మొక్కలతో గిరిజనులకు ఉపాధి కరువు
  • రాష్ట్రపతి దృష్టికి విషయం.. ప్రత్యేక చర్యలకు ఆదేశం
  • ఫలితంగా ‘పీఎం వందన యోజన’ పథకం కింద పెంపకానికి ఏర్పాట్లు
  • నంద్యాల జిల్లా కొత్తపల్లి, ఆత్మకూరులో ప్రత్యేక నర్సరీలు
  • ∙ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు ప్రత్యేక శిక్షణ   

ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గిరిజనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షరబత్‌) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజనులు ప్రధానంగా నన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన  సొమ్ముతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. 

ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్‌గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమలలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది.    

పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం 
నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభించారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు.  కిలో నన్నారి వేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల నన్నారిని తయారు చేయవచ్చు. లీటర్‌ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఒక లీటర్‌ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మరసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

షుగర్‌ ఫ్రీ నన్నారి  
నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్‌ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా సేవించేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చారు. మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు.  

నల్లమల నన్నారి ఉపయోగాలు 
వేసవిలో దాహార్తి తీరుతుంది. 
శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. 
మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది. 
వ్యాధి నిరోధకత పెంచుతుంది. 
హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది. 
జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది.  
శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.

నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధి
ఎండాకాలం వ నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొండల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి, వెతికి కొండల వెంబడి తిరగాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా  ఎదుగుతాం. 
-శివలింగమ్మ, చెంచు మహిళ, ఎర్రమఠం గూడెం

తిరిగే కష్టం తప్పుతుంది
ఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నన్నారి నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆరి్థకంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గరలోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది. 
  – ఈదమ్మ, బైర్లూటీ గూడెం  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement