ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులి ఆవాసానికి, ఆహారానికి పెను ముప్పు!
పులుల సంతతికి అనుగుణంగా పెరగని ఆహార లభ్యత
నల్లమలలో వేటగాళ్ల స్వైర విహారం..అడుగడుగునా ఉచ్చులు
తగ్గుతున్న దుప్పులు, కణుతుల సంఖ్య
పిడికెడు సిబ్బందితో వేల చ.కి.మీ. జల్లెడ పట్టలేని అటవీశాఖ
ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఉండాల్సిన సిబ్బంది 750..ఉన్నది 250 మాత్రమే!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు.
వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.
ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు.
ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్‌లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రమాదకర స్థితిలో పులి
ఎంతో భద్రమైనదని భావించే ఎన్‌ఎస్‌టీఆర్ లో ప్రాణాంతక వైరస్‌లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్‌ఎస్‌టీఆర్ సర్కిల్‌లో మొత్తం నాలుగు డివిజన్‌లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది.
ఫుట్ పెట్రోలింగ్‌కు అదే సమస్య
అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఫుట్ పెట్రోలింగ్‌కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే.
పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్‌లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్‌కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్‌వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది.
వేధిస్తోన్న ఆహార కొరత ..
శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది.
కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి.
ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది.
అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం?
అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్‌ను కాని చార్జ్ షీట్‌ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.
ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్‌పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉచ్చులతో పులికీ ప్రమాదం
వేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది.
ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కాగా దీనిపై ఎన్‌ఎస్‌టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎవరీ వేటగాళ్లు...
నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి.
మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment