నాడు జానీ.. నేడు జీనత్
ఒడిశా టైగర్ రిజర్వు నుంచి తప్పించుకున్న ఆడ పులి జీనత్.. 21 రోజుల్లో 3 రాష్ట్రాల్లోని 300 కిలోమీటర్ల పయనం
రేడియో కాలర్ ఉన్నా ఎక్కడా ఉచ్చులో పడకుండా ముప్పుతిప్పలు పెట్టిన పులి.. దొరికినట్టే దొరికి జారిపోవడంతో పరుగులు పెట్టిన అటవీ శాఖ
ఎట్టకేలకు బెంగాల్‌లోని బంకురా జిల్లాలో బంధించిన అధికారులు
మొన్నటికి మొన్న జానీ అనే మగ పులి.. తోడు కోసం మహారాష్ట్ర ఆడవుల నుంచి వచ్చి.. తెలంగాణలో వందల కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో జీనత్ అనే ఈ ఆడపులి మగతోడు కోసం ఒడిశాలోని టైగర్ రిజర్వు నుంచి తప్పించుకొని 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లు పయనించింది. లవ్.. ఇష్క్.. కాదల్.. పేరేదైనా ఓసారి ప్రేమలో పడితే.. ఇదిగో ఇలా లవర్ కోసం పడరాని పాట్లు పడాల్సిందే. జానీ ప్రేమ కథ మనకు తెలిసిందే.. జీనత్ లవ్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.
సాక్షి, అమరావతి : మగ తోడును వెతుక్కుంటూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాల అధికారులను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడె క్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేకచోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది.
21 రోజులపాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్లినా అది వారి కళ్లు గప్పి తప్పించుకుని వెళ్లిపోయేది.
చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాల్లో దానికి మత్తు మందు ఇచ్చి బంధించడంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.
మహారాష్ట్ర నుంచి తెచ్చి..
ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా–అంధారి టైగర్ రిజర్వ్ నుంచి జీనత్, యమున అనే ఆడ పులులను ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వుకు తీసుకొచ్చారు. కొత్త ప్రాంతం కావడంతో జీనత్‌ను 10 రోజులపాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి నవంబర్ 24న సిమ్లిపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో రెండు పులులు సిమ్లిపాల్ పరిధిలోనే తిరిగాయి.
డిసెంబర్ 8న మూడేళ్ల జీనత్ టైగర్ రిజర్వు పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండటంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే పలుచోట్ల నైలాన్ ఉచ్చులు వేసి, మత్తు బాణాలు వదిలినా అది దొరకలేదు.
ట్రాన్స్‌లొకేషన్ షాక్‌తోనే..
అలా వెళుతూ అది ఒడిశా నుంచి జార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడంతో అక్కడి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు. పులి పాదముద్రలు గుర్తించేలోపే మరో చోటుకు వెళ్లిపోయేది. ఆ తర్వాత జార్ఖండ్ దాటి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. మొదట ఝార్‌గ్రామ్‌లో స్థానికుల్ని హడలెత్తించింది. చివరకు అడపాదడపా వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా 21 రోజుల తర్వాత బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో జీనత్ జాడ కనిపెట్టి మత్తు మందు ఇచ్చి బంధించారు.
మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పులిని బంధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పట్టుకున్న తర్వాత పరీక్షించగా అది ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నట్టు గుర్తించారు. అయితే.. తన భూభాగం కాకపోవడంతో అది ట్రాన్స్‌లొకేషన్ షాక్‌కు గురైనట్టు భావిస్తున్నారు.
పులులు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు. బయట ప్రాంతం కావడం, ఆ ప్రాంతంలో ఇతర పులులు కూడా ఉండటంతో అది సర్దుకోలేక, దిక్కు తెలియక ఎటు పడితే అటు వెళ్లినట్టు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మగ తోడు కోసం వెతుకులాట కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment