ఎవరైనా మరణించినా అంత్యక్రియలు నిర్వహించరు
నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరులో వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం
ఎంతో నియమనిష్టలతో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు
పాణ్యం: ఆదివారం వచ్చిoదంటే చాలా మందికి మాంసాహారం లేనిదే ముద్ద దిగదు. కొందరికైతే గొంతులో మద్యం చుక్క పడాల్సిందే. కానీ నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు (S. Kotturu) గ్రామ ప్రజలు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎంతో నియమనిష్టలతో ఉంటున్నారు. ఆదివారం (Sunday) ఆ గ్రామంలో ఎవ్వరూ మాంసాహారాన్ని తినరు.. మద్యం సేవించరు.
గ్రామంలో ఎవరైనా మరణించినా.. ఆదివారం మాత్రం అంత్యక్రియలు నిర్వహించరు. ఆ మరుసటి రోజు గానీ, ఆ తర్వాత గానీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ గ్రామంలోని ఆలయ గర్భగుడికి పైకప్పు కూడా ఉండదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ గ్రామానికి, ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు.
తెల్లవారేసరికి ఆలయం..
సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బీరం చెన్నారెడ్డి పొలం దున్నతుండగా.. నాగలికి (Nagali) ఏదో రాయి అడ్డుతగిలినట్లు శబ్దం వచ్చిoదట. వెంటనే అతను కంటి చూపు కోల్పోవడంతో చుట్టుపక్కల రైతులు నాగలిని వెలికి తీసి.. భూమిలో ఏముందో చూడగా పన్నెండు శిరస్సులతో నాగేంద్ర స్వామి విగ్రహం బయటపడిందంట.
ఆ దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహమని.. స్వామికి మూడు అభిషేకాలు చేస్తే రైతుకు చూపు వస్తుందని సూచించారట. దీంతో గ్రామస్తులు స్వామికి అభిషేకాలు చేయగా.. రైతుకు చూపు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.
ఆ తర్వాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించగా.. స్వామి కలలో కనిపించి ఆలయ నిర్మాణాన్ని రాత్రి చేపట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలని ఆజ్ఞాపించారట. దాంతో రాత్రి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. కోడి కూసే సమయానికి గర్భగుడి, దాని చుట్టూ గోడ మాత్రమే పూర్తయ్యిందంట. దీంతో ఇప్పటికీ స్వామి వారి గర్భాలయానికి పైకప్పు ఉండదు.
కాలసర్పదోష పూజలకు ప్రసిద్ధి..
శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఎంతో ప్రీతికరమైన రోజుగా గ్రామస్తులు, భక్తులు భావిస్తారు. దీంతో ప్రతి ఆదివారం వారంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో 200 కుటుంబాలు.. 1,000 మందికి పైగా జనాభా నివసిస్తుండగా.. ఆదివారం మాంసాహారం అస్సలు ముట్టరు. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించినా అంత్యక్రియలు ఆదివారం నిర్వహించరు.
అలాగే ప్రతి ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి.. స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం కాలసర్పదోష పూజలు జరుగుతాయి.
చదవండి: ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!
ఈ పూజలు జరిపించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయం వద్ద బారులు తీరుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సంతానమూర్తిగా కొలుస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను గ్రామ ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు.
స్వామిని దర్శించుకున్న తర్వాతే.. దినచర్య మొదలు
శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో ఎస్.కొత్తూరు గ్రామస్తులంతా ఆ రోజు నియమనిష్టలతో ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
గ్రామస్తులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్వామి వారిని దర్శించుకొని దినచర్యలు ప్రారంభిస్తారు. ఆదివారంతో పాటు మంగళవారం ఆలయంలో కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. వీటి కోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
– కంపమల్ల పుల్లయ్యస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment