హరిణి.. హరివిల్లులా! | Rare deer in Nallamala | Sakshi
Sakshi News home page

హరిణి.. హరివిల్లులా!

Published Mon, Jan 20 2025 5:44 AM | Last Updated on Mon, Jan 20 2025 5:44 AM

Rare deer in Nallamala

నల్లమలలో అరుదైన జింకల సంచారం   

ఏడురకాల జింకలతో అలరారుతున్న జీవవైవిధ్యం   

పెద్ద పులి మెనూలో ఇవి ప్రధానం

తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు,సింహం తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్‌ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్‌ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 

8 రకాల హెర్బీవోర్స్‌లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్‌), నీల్‌గాయ్‌ వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్‌డీర్‌ సెతం ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నాగార్జున సాగర్‌– శ్రీశైలం అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి.  – ఆత్మకూరు రూరల్‌

ప్రమాదం అంచున.. 
కొండ గొర్రె కంటే కాస్త భారీగా, కణుతుల కంటే కాస్త చిన్నగా ఉండే మరో ఆంటిలోప్‌.. బుర్రజింక. చింకారా అనికూడా పిలిచే ఈ జింక తలపై రెండు కొమ్ములు కృష్ణజింకను పోలి పురి తిరిగి ఉంటాయి. కానీ వాటి అంత పొడవు పెరగవు. నల్లమలలో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయ ఉపకరణాలలో చింకారా కొమ్ములను అందంగా 

వినియోగిస్తుంటారు. చర్నాకోల పిడిగా, మోకులు, పగ్గాలు తయారు చేసేందుకు ఉపయోగపడే పరికరంగా కూడా వీటి కొమ్ములను రైతులు సేకరించే వారు.  

సాంబర్‌ డీర్‌..
జింకలలో అతి పెద్దది కణితి(సాంబర్‌ డీర్‌). దట్టమైన అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో  ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఇవి పెద్ద పంగల కొమ్ములు కలిగి ఉంటాయి (మగవాటికి మాత్రమే కొమ్ములుంటాయి). ఈ కొమ్ములను అవి నిర్ణీత సమయంలో విసర్జిస్తుంటాయి. కొన్ని సార్లు ఆడ కణితి కోసం జరిగే పోరాటంలో అవి ఊడి పోతుంటాయి.

నల్లమలలో ప్రధాన రక్షిత వన్యప్రాణి అయిన పెద్దపులికి ఆహార జంతువులుగా జింకలు పర్యావరణ సమతుల్యానికి తమవంతు కృషి చేస్తున్నాయి. జింకలతో పాటు అడవి పంది, ముల్ల పంది, కుందేలు వంటి జంతువులు కూడా పులి ఆహార మెనూలో ఉన్నాయి. కణుతులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పెద్ద 
పులులకు చక్కటి ఆవాసంగా గుర్తిస్తారు.  

నేనూ జింకనే..
జింకకాని జింక ఈ మౌస్‌ డీర్‌. నిజానికి ఇది జింకజాతి వన్యప్రాణి కాదు. కాని రూపం బట్టి దీన్ని మూషిక జింకగా చెబుతారు. ఇది పంది జాతికి చెందిన ప్రాణి. వెనక కాళ్లు కాస్త బలహీనంగా కనిపించే ఈ జింక పూర్తిగా దట్టమైన వర్షారణ్యాలను పోలిన అడవుల్లో కనిపిస్తుంది. 

పెద్ద కుందేలు పరిమాణంలో ఉండే మూíషిక జింక నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్రకోడు, పెచ్చెర్వు వంటి దట్టమైన పర్వతప్రాంత అడవుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రుళ్లు మాత్రమే తిరుగాడుతుంది. చెట్టు తొర్రల్లో నివాసముంటుంది. నల్లమలలో ఇది అంతరించి పోయింది అనుకున్న సమయంలో తిరిగి కనిపిస్తుండటం శుభపరిణామం.  

కొమ్ములతోకుమ్మేస్తూ..
తలపై రెండు, పనపై మరో రెండు చిన్న కొమ్ములు కలిగి ఉండడమే కొండ గొర్రె ప్రత్యేకత. ఈ  కారణంగానే కొండగొర్రెను చౌసింగా అని కూడా పిలుస్తారు. నల్లమలలోని కొండ తిప్పలపై నివసించే ఈ వన్యప్రాణి ఉనికి దట్టమైన పచ్చటి అడవికి గుర్తుగా చెప్పుకోవచ్చు. 

కొండగొర్రె తనను తాను మాంసాహార జంతువుల నుంచి రక్షించుకునేందుకు కొండకొమ్ముల ఏటవాలును వీలుగా ఉపయోగించుకుంటుంది. కొండగొర్రె మాంసం రుచిగా ఉంటుందన్న కారణంగా ఇవి ఎక్కువగా వేటగాళ్ల చేతిలో బలి 
అవుతుంటాయి.  

అడవికే అందం..
పొడ దుప్పి (స్పాటెడ్‌ డీర్‌).. దీనిని చుక్కల దుప్పి అని కూడా అంటారు. జింకలలో అత్యంత అందమైనది. బంగారు వర్ణం చర్మంపై తెల్లటి మచ్చలతో అత్యంత లావణ్యంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మగ వాటికి పంగలతో కూడిన కొమ్ములు ఉంటాయి. 

దుప్పులు కూడా తమ కొమ్ములను వదులుతుంటాయి. మగ దుప్పి అరిచే శబ్దాన్ని బట్టి వర్లుపోతు అనికూడా పిలుస్తారు. ఇవి అడవుల్లో అన్ని ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. పులి ఆహారంలో ఇది కూడా ఉంది.

మనిమేగం.. ప్రత్యేకం 
నల్లమలలో ప్రధానంగా కనిపించే మరో ఆంటిలోప్‌ మనిమేగం (నీల్‌గాయ్‌). ఇది కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. కొంతమేర గుర్రాన్ని పోలి ఉండే మగ మనిమేగాలు వయస్సుకు వచ్చాక నల్లటి పైకప్పుతో కనిపిస్తాయి. 

అందుకే వీటిని నల్లపోతు అనికూడా అంటారు. కృష్ణజింకలు, మనిమేగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయంటే అది అటవీ క్షీణతకు సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు జింకలు పెద్దపెద్ద గడ్డి మైదానాల్లో మాత్రమే మనగలుగుతాయి.  

జంగిల్‌ మే సవాల్‌.
గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవించే జింకల్లో కృష్ణజింక (బ్లాక్‌ బక్‌) ప్రధానమైనది. మగ జింకలకు పొడవాటి కొమ్ములు ఉంటాయి. పురి తిరిగినట్లుండే ఈ కొమ్ములపైన ఉన్న పురులను బట్టి వాటి వయస్సును నిర్ధారిస్తారు. ఇవి బాగా వయస్సుకు వచ్చాక వాటి చర్మం నల్లటి కప్పును కలిగి అందంగా తయారవుతుంది. ఇలా బలంగా నల్లటి కప్పు­తో కనిపించే కృష్ణజింక.. జింకల గుంపుకు నాయకత్వం వహిస్తుంది. 

అత్యంత వేగంగా పరిగెత్తే వీటిని వేటాడే మాంసాహార జంతువు నల్లమలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. గంటకు 100 కి.మీ పైగా వేగంతో పరిగెత్తే చీతాలు దేశంలో కనుమరుగు కావడంతో వీటికి పోటీపడి పరిగెత్తే జంతువులు లేకుండా అయ్యాయి. తోడేల్లు, హైనాలు మాటువేసి వీటిని చంపుతుంటాయి. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికారిక జంతువుగా ఉంది.

జీవవైవిధ్యంలో జింకలు కీలకం 
నల్లమలలో ముఖ్య రక్షిత వన్యప్రాణి పెద్దపులి, ఆతరువాతి స్థానాల్లో ఉన్న చిరుత వంటి మాంసాహార జంతువులకు ఆహార సమృద్ధి కలిగిస్తూ మొత్తం పర్యావరణ సంరక్షణలో జింకలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పెద్దపులికి నల్లమల ఆవాసంగా మారడంలో ఈ జింకలు కూడా ప్రధాన కారణం. నల్లమలలో జీవ వైవిధ్యంలో ఇవి కీలకంగా ఉన్నాయి.  
– పట్టాభి, ఎఫ్‌ఆర్‌వో, ఆత్మకూరు రేంజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement