
ఐదుగురి అరెస్ట్
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.
గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.
శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్‌కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment