illegal trafficking
-
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
నగదు అక్రమ రవాణాపైనా సిట్ నజర్!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు. ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కిలో కొకైన్కు... రూ.2.40 లక్షలు
‘సేవకు సేవ...సొమ్ముకు సొమ్ము’ అనేలా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. బంగారం, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇలా అందించి అలా బహుమతి సొమ్ము పట్టుకు పోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై : విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2012లో చెన్నై విమానాశ్రయంలో రూ.23 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. 2013లో ఈ అక్రమ రవాణా రూ.36 కోట్లకు పెరిగింది. 2014లో రూ.102 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జూలై మాసాంతానికే అంటే ఏడు నెలల్లోనే రూ.53 కోట్ల బంగారం పట్టుబడింది. ఇలా ఏడాదికి ఏడాది అక్రమ రవాణా పెరిగిపోవడంపై ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. విమానం ద్వారా విదేశాల నుంచి బంగారం, పలురకాల మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులు రహస్యంగా తమిళనాడుకు చేరుకుంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు కొందరు ఇదేపనిలో నిమగ్నమై ఉన్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు ప్రజల సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. సెంట్రల్ కస్టమ్స్, ఎక్సైజ్, కేంద్ర మత్తుపదార్థాల నిరోధక శాఖ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖలకు అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే బహుమానం ఇచ్చే విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. అయితే ఈ బహుమానం స్వల్పం కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం తెలుసుకుంది. ఈ కారణంగా బహుమతి మొత్తాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. గత నెల 31వ తేదీన ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఈ కొత్త బహుమతుల విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఒక కిలో బంగారం అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారికి గతంలో రూ.50 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని మూడింతలు అంటే రూ.1.50 లక్షలుగా పెంచారు. అలాగే వెండి రవాణా సమాచారం ఇచ్చిన వారికి కిలోకు రూ.1000 మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు. కొకైన్ అనే మత్తుపదార్థంపై గతంలో కిలోకు రూ.40 వేలు కాగా ప్రస్తుతం ఆరింతలు పెంచారు. అంటే రూ.2.40లక్షలు బహుమతిని అందజేయనున్నారు. హెరాయిన్, బ్రౌన్ షుగర్ తదితర మత్తుపదార్థాలపై కిలోకు గతంలో ఇస్తున్న రూ.20 వేలను రూ.1.20 లక్షలకు పెంచారు. గంజాయికి కిలోకు రూ.100 మొత్తాన్ని రూ.600 చేశారు. అలాగే కెట్టమైన్, ఎపిడ్రిన్, అంబిట్టమిన్ వంటి మత్తుపదార్థాల సమాచారం ఇచ్చినవారికి గతంలో ఎటువంటి ప్రతిఫలం ముట్టేది కాదు. అయితే ఇందులో కూడా మార్పులు తెచ్చారు. కెట్టమైన్కు రూ.700, ఎపిడ్రిన్‌కు కిలోకు రూ.180, అంబిట్టమిన్కు రూ.20 వేలు బహుకరించేలా నిర్ణయించారు. విదేశాల నుంచి రహస్యంగా విలువైన వస్తువులను తెచ్చుకుంటున్నవారి సమాచారం ఇస్తే, సదరు ప్రయాణికుడి నుంచి వసూలు చేసే కస్టమ్స్ సుంకంలో 20 శాతం బహూకరిస్తామని చెబుతున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమాచారం ఇచ్చినవారికి సైతం భారీ బహుమానాలను చెల్లించనున్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటూ అవసరమైతే రక్షణ కూడా ఇస్తామని చెబుతున్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని నేరుగా, ఫోన్ ద్వారా, ఉత్తరాలు, ఈ మెయిల్ ద్వారా చేరవేయవచ్చు. సమాచారం ఇచ్చినవారు తమ పేరు, చిరునామా తెలపాల్సిన అవసరం లేదు. అయితే రెండు పుట్టుమచ్చలు, ఎడమ అరచేతి రేఖలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇందు కోసం సదరు వ్యక్తులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, తామున్న చోటు సమాచారం ఇస్తే అధికారులే వారి వద్దకు వచ్చి పుట్టుమచ్చలు, చేతిరేఖలను నమోదు చేసుకుని వెళతారు. వీరి వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. గతంలో సమాచారం ఇచ్చినవారు బహుమతి మొత్తం కోసం నాలుగైదేళ్లు వేచి ఉండాల్సివచ్చేది, అయితే ఇకపై వెంటనే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకేం అక్రమ రవాణా అరికట్టడం ద్వారా దేశసేవ, భారీగా సొమ్ము ఇక మీ సొంతం. బహుమతుల జాబితా : ఒక కిలో కొకైన్కు రూ.2.40 లక్షలు, ఒక కిలో బంగారుకు రూ.1.50 లక్షలు, ఒక కిలో బ్రౌన్ షుగర్ రూ.1.20 లక్షలు, ఒక కిలో హెరాయిన్‌కు రూ.1.20 లక్షలు, ఒక కిలో కేట్టమైన్కు రూ.700 , ఒక కిలో గంజాయికి రూ.600 , ఒక కిలో ఎపిడ్రిన్‌కు రూ.180 .