ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో తరలింపు
కీలక పాత్ర పోషించిన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు
మరో కేసు నమోదుకు సన్నాహాలు చేస్తున్న పోలీసులు
ట్యాపింగ్ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది: సిటీ కొత్వాల్
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు.
ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు.
ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు.
2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు..
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు.
అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment