
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.
2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా.