
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివిధ కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్‌లు జారీ అయ్యాయి. ముఖ్యంగా ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.
అయితే అరెస్ట్ భయంతో గత కొన్ని నెలలుగా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో తన తల్లి అంత్యక్రియల కోసం వచ్చిన ఆయన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల కోసం ఆయన్ని బోధన్‌కు తీసుకెళ్లి ఆపై స్టేషన్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
షకీల్ అమీర్ మహమ్మద్ గతంలో బీఆర్‌ఎస్ తరపున రెండుసార్లు బోధన్ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
సాహిల్‌ను తప్పించి..
2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా.