కిలో కొకైన్‌కు... రూ.2.40 లక్షలు | Govt announcements on gifts due to illegal trafficking gold ,cocaine | Sakshi
Sakshi News home page

కిలో కొకైన్‌కు... రూ.2.40 లక్షలు

Published Tue, Aug 11 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

కిలో కొకైన్‌కు... రూ.2.40 లక్షలు

‘సేవకు సేవ...సొమ్ముకు సొమ్ము’ అనేలా ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. బంగారం, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇలా అందించి అలా బహుమతి సొమ్ము పట్టుకు పోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
చెన్నై :   విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2012లో చెన్నై విమానాశ్రయంలో రూ.23 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. 2013లో ఈ అక్రమ రవాణా రూ.36 కోట్లకు పెరిగింది. 2014లో రూ.102 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జూలై మాసాంతానికే అంటే ఏడు నెలల్లోనే రూ.53 కోట్ల బంగారం పట్టుబడింది. ఇలా ఏడాదికి ఏడాది అక్రమ రవాణా పెరిగిపోవడంపై ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. విమానం ద్వారా విదేశాల నుంచి బంగారం, పలురకాల మత్తుపదార్థాలు, నిషేధిత వస్తువులు రహస్యంగా తమిళనాడుకు చేరుకుంటున్నాయి.
 
సంఘ విద్రోహ శక్తులు కొందరు ఇదేపనిలో నిమగ్నమై ఉన్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు ప్రజల సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. సెంట్రల్ కస్టమ్స్, ఎక్సైజ్, కేంద్ర మత్తుపదార్థాల నిరోధక శాఖ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ శాఖలకు అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే బహుమానం ఇచ్చే విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది.

అయితే ఈ బహుమానం స్వల్పం కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం తెలుసుకుంది. ఈ కారణంగా బహుమతి మొత్తాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. గత నెల 31వ తేదీన ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఈ కొత్త బహుమతుల విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
 
ఒక కిలో బంగారం అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారికి గతంలో రూ.50 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని మూడింతలు అంటే రూ.1.50 లక్షలుగా పెంచారు. అలాగే వెండి రవాణా సమాచారం ఇచ్చిన వారికి కిలోకు రూ.1000 మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు. కొకైన్ అనే మత్తుపదార్థంపై గతంలో కిలోకు రూ.40 వేలు కాగా ప్రస్తుతం ఆరింతలు పెంచారు. అంటే రూ.2.40లక్షలు బహుమతిని అందజేయనున్నారు.

హెరాయిన్, బ్రౌన్ షుగర్ తదితర మత్తుపదార్థాలపై కిలోకు గతంలో ఇస్తున్న రూ.20 వేలను రూ.1.20 లక్షలకు పెంచారు. గంజాయికి కిలోకు రూ.100 మొత్తాన్ని రూ.600 చేశారు. అలాగే కెట్టమైన్, ఎపిడ్రిన్, అంబిట్టమిన్ వంటి మత్తుపదార్థాల సమాచారం ఇచ్చినవారికి గతంలో ఎటువంటి ప్రతిఫలం ముట్టేది కాదు. అయితే ఇందులో కూడా మార్పులు తెచ్చారు.  కెట్టమైన్‌కు రూ.700, ఎపిడ్రిన్‌కు కిలోకు రూ.180, అంబిట్టమిన్‌కు రూ.20 వేలు బహుకరించేలా నిర్ణయించారు.
 
విదేశాల నుంచి రహస్యంగా విలువైన వస్తువులను తెచ్చుకుంటున్నవారి సమాచారం ఇస్తే, సదరు ప్రయాణికుడి నుంచి వసూలు చేసే కస్టమ్స్ సుంకంలో 20 శాతం బహూకరిస్తామని చెబుతున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమాచారం ఇచ్చినవారికి సైతం భారీ బహుమానాలను చెల్లించనున్నారు.

సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటూ అవసరమైతే రక్షణ కూడా ఇస్తామని చెబుతున్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని నేరుగా, ఫోన్ ద్వారా, ఉత్తరాలు, ఈ మెయిల్ ద్వారా చేరవేయవచ్చు. సమాచారం ఇచ్చినవారు తమ పేరు, చిరునామా తెలపాల్సిన అవసరం లేదు. అయితే రెండు పుట్టుమచ్చలు, ఎడమ అరచేతి రేఖలు నమోదు చేయాల్సి ఉంది.
 
అయితే ఇందు కోసం సదరు వ్యక్తులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, తామున్న చోటు సమాచారం ఇస్తే అధికారులే వారి వద్దకు వచ్చి పుట్టుమచ్చలు, చేతిరేఖలను నమోదు చేసుకుని వెళతారు. వీరి వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. గతంలో సమాచారం ఇచ్చినవారు బహుమతి మొత్తం కోసం నాలుగైదేళ్లు వేచి ఉండాల్సివచ్చేది, అయితే ఇకపై వెంటనే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకేం అక్రమ రవాణా అరికట్టడం ద్వారా దేశసేవ, భారీగా సొమ్ము ఇక మీ సొంతం.
 
బహుమతుల జాబితా :
ఒక కిలో కొకైన్‌కు   రూ.2.40 లక్షలు, ఒక కిలో బంగారుకు రూ.1.50 లక్షలు,  ఒక కిలో బ్రౌన్ షుగర్ రూ.1.20 లక్షలు, ఒక కిలో హెరాయిన్‌కు రూ.1.20 లక్షలు,  ఒక కిలో కేట్టమైన్‌కు రూ.700 , ఒక కిలో గంజాయికి రూ.600 , ఒక కిలో ఎపిడ్రిన్‌కు రూ.180 .
 

Advertisement
 
Advertisement
 
Advertisement