కోనసీమ లంకల్లో అరుదైన కృష్ణ జింకలు
కంటికి రెప్పలా చూసుకుంటున్న రైతులు
వరదలతో గ్రామాల్లోకి వస్తున్న ప్రాణులు
సాక్షి అమలాపురం:చుట్టూ ఇసుక తిన్నెలు.. వాటి మధ్య ఒంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి.. అక్కడక్కడా నీటి చెలమలు.. ఆరు అడుగుల ఎత్తున పెరిగే గడ్డి దుబ్బులు.. వాటి కొసన తెల్లటి వింజామరల్లాంటి గడ్డి పువ్వులు. ప్రకృతి స్వర్గధామమైన కోనసీమలో గోదావరి లంకల్లో కనిపించే సహజ దృశ్యాలు ఇవి. చూసిన కనులదే భాగ్యం అన్నట్టు అప్పుడప్పుడూ చెంగుచెంగున గెంతే కృష్ణ జింకల సమూహాలు కనువిందు చేస్తాయి.
గోదావరి నదీ పాయల్లోని మధ్య ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని లంకల్లో జనం నివాసముండరు. ఆ లంకల్లో కృష్ణ జింకలు నివాసముంటున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, ఆలమూరు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లోని గౌతమీ గోదావరి లంకల్లో వీటి ఉనికి అధికం.
ఇటీవల మొక్కజొన్న పట్టుబడికి వెళ్లిన రైతులు ఊబలంక, నారాయణలంక, రావులపాలెం, కేదార్లంక సమీపంలో కృష్ణ జింక గుంపులు ఉండటాన్ని గుర్తించారు. లంక రైతులకు ఇవి పెంపుడు జంతువులుగా మారిపోయాయి. వీటి ఆలనాపాలనా స్థానిక లంక రైతులే చూస్తుంటారు. వీటిని వేటాడేందుకు వచి్చన వారిని రైతులే అడ్డగిస్తారు. అవసరమైతే పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించిన సందర్భాలున్నాయి.
ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి
గోదావరిలో లంక భూములను రెవెన్యూ అధికారులు సొసైటీలకు అప్పగిస్తున్నారు. ఇక్కడ వరదలకు ఇసుక మేటలు వేస్తుంది. ఇది వ్యవసాయానికి యోగ్యం కాదంటూ ప్రజాప్రతినిధులతో కలిసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాల వల్ల ఇక్కడ ఉండే చీమచింత చెట్లు, తుమ్మ చెట్లు, రేగి చెట్లు, రెల్లు గడ్డి దుబ్బులు కనుమరుగవుతున్నాయి. దీంతో కృష్ణ జింకలకు సహజ సిద్ధమైన ఆవాసాలు లేకుండా పోతున్నాయి.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఇవి నివాసముంటున్న లంక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. లంకలను అటవీ ప్రాంతాలుగా మార్పు చేయాలని, అప్పుడే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని వారంటున్నారు. దీంతోపాటు వరదల సమయంలో వీటి రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వరదలతో ముప్పు
వేటగాళ్ల కన్నా గోదావరి వరద కృష్ణ జింకల ఉనికికి ప్రమాదంగా మారింది. ప్రస్తుతం గోదావరికి వరద పోటెత్తడంతో కృష్ణ జింకల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో కృష్ణ జింకలు వరదలు వచ్చిన సమయంలో అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయేవి. కాని కోనసీమ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఇవి వరదల్లో కొట్టుకుపోవడం లేదా ఏటిగట్లలో సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందుతుంటాయి.
2022లో భారీ వరదలకు అధికంగా కృష్ణ జింకలు మృత్యువాత పడ్డాయని లంక రైతులు చెబుతున్నారు. వరదల సమయంలో రైతులను, పశువులను పడవల మీద మెరక ప్రాంతాలకు, ఏటిగట్ల మీదకు తరలిస్తుంటారు. అయితే జింకలను పట్టుకోవడం నేరం కావడం.. అవి వేగంగా పరుగు పెట్టడం వల్ల వీటిని మెరకకు తరలించడం ఇక్కడ రైతులకు అసాధ్యంగా మారింది.
మంత్ర ముగ్ధులను చేసే కృష్ణ జింకలు
కృష్ణ జింక అరుదైన జంతువు. మన రాష్ట్ర అధికార జంతువు కూడా. నలుపు.. తెలుపు.. గోధుమ వర్ణాల్లో మెలికలు తిరిగిన కొమ్ములతో... చెంగుచెంగున గెంతుతూ చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇవి మన దేశంతోపాటు పాకిస్తాన్, నేపాల్‌లో కూడా ఉంటాయి.
పచ్చగడ్డితోపాటు పండ్లను ఆహారంగా తీసుకునే ఈ జింకలు 15 నుంచి 20 కలిసి మందగా తిరుగుతుంటాయి. వీటి కొమ్ములు మూడు నాలుగు మెలికలు తిరిగి 28 అంగుళాల పొడవు ఉంటాయి. మగ జింకలు పైభాగం నలుపు, లేదా గోధుమ రంగులో ఉంటుంది. దిగువన తెల్లరంగులో ఉంటుంది. ఆడజింకలు పూర్తిగా గోధుమ రంగులో ఆకట్టుకునేలా ఉంటాయి.
లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తించాలి
జింక రక్షణ కోసం అటవీ, జీవవైవిధ్య మండలిని, జిల్లా రెవెన్యూ అధికారులను పలు దఫాలుగా కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. జింకలు నివాసముంటున్న లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ చట్టాలతో కొంత రక్షణ కలుగుతుంది. లేకపోతే భవిష్యత్ తరాలు కృష్ణ జింకలను కేవలం ఫొటోల్లోనే చూడాల్సి వస్తుంది. – పెదపూడి బాపిరాజు, వాడపాలెం, కొత్తపేట మండలం
ప్రభుత్వానికి నివేదిస్తాం
కృష్ణ జింకల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిస్తాం. వరదల సమయంలో కృష్ణ జింకలు అవి ఎంపిక చేసుకున్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతాయి. వరదలు తగ్గిన తరువాత తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళతాయి.
– వరప్రసాద్, కోరంగి వైల్డ్ లైఫ్ రేంజ్, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment