దివ్యాంగులకు బకాయిలతో కలిపి చెల్లించని పింఛన్
కేవలం పెంచిన రూ.6 వేలే ఇచ్చిన వైనం
మూడు నెలల బకాయిలు రూ.9 వేలు ఎగనామం
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం.
– జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు.
ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు.
దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment