![Gundla Brahmeswara Swamy temple In Nallamala Forest](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Gundla-Brahmeswara.jpg.webp?itok=U61KEZAw)
అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి
మహిమాన్విత క్షేత్రం.. గుండ్ల బ్రహ్మేశ్వరం
ఆత్మకూరు : ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ క్షేత్రాన్ని చూడాలంటే ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. శివరాత్రి వరకు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆలయంలో మహాశివుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో మహాభారత కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అశ్వత్థామ.. శ్రీకృష్ణుడి ఆదేశానుసారంతో గుండ్లకమ్మ నది జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయంలో గుండ్లబ్రహ్మేశ్వరస్వామితో పాటు రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు కొలువై ఉన్నాయి. శివరాత్రి మినహా మరొకరోజు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/05_22.jpg)
ప్రకృతి రమణీయత..
గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఎన్నో వృక్షాలు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 353 వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులులు, మచ్చలపిల్లి, ఉడతలు తదితర జంతువులు, దుప్పులను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయం సమీపంలో గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/06_25.jpg)
ఇలా చేరుకోవచ్చు..
వెలుగోడు మీదుగా గట్టుతండా నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని ట్రాక్టర్లు, వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాల్లో ఈ క్షేత్రానికి వెళ్లేవారు. తెలుగుగంగ రిజర్వాయర్‌ను నిర్మించడం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి.. ఈ రహదారిని మూసి వేశారు. ఈ రహదారిని ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా అనుమతించాలని అటవీశాఖ అధికారులకు భక్తులు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి దృష్టికి కూడా భక్తులు తీసుకెళ్లారు. ప్రస్తుతం నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు గ్రామం నుంచి పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి దిగువమెట్ట మీదుగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి అన్నిరకాల వాహనాలు వెళ్తాయి. దూరం 42 కి.మీ ఉంటుంది. ఈ కేత్రానికి చేరాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తీసుకోవాలి. వారు కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. వాహనాలు ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/07_27.jpg)
ప్రతి ఒక్కరూ సందర్శించాలి
నల్లమల అటవీ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వరిమాతను పూ జించాలి. ఈ క్షేత్రానికి ఒకప్పుడు వెలుగోడు, సంతజూటూరు, గిద్దలూరు మీదుగా వేలాది మంది భక్తులు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వెళ్లేవారు. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందాలంటే భక్తులను అనుమతించాలి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరస్వామిని దర్శిస్తే అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటుంది.
– కృష్ణశర్మ, ఆలయ పురోహితుడు
రెండు రోజులు మాత్రమే
నల్లమల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఎవరినీ అనుమతించం. కేవలం మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ప్రకాశం, కర్నూలు జిల్లాల భక్తులను రెండు రోజులు మాత్రమే అనుమతిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– ఉదయ్‌దీప్,గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment