ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి నీళ్ళు కాదురా బుర్రమీద రేగిపళ్ళు... జిల్లేడు ఆకు పెట్టుకుని పోసుకోరా పెరట్లొంచి మనవడు ఆదిత్య మీద కేకేసింది నానమ్మ సూరమ్మ.. ఏటే నాయినమ్మా పొద్దుట నుంచి గొల్లు గొల్లు పెడతన్నావు.. చిరాకు పడ్డాడు ఆదిత్య .
గొల్లు కాదురా పిక్కిరోడా మన ఊరి దేముడు లోకానికే నాయకుడు ..ప్రపంచానికి దారి చూపే నాయకుడు.. యేటనుకున్నావు చెబుతోంది నానమ్మ పొయ్యిమీంచి నీళ్ళు దించుతూ... ఒసే.. పల్లకోయే నువ్వాన్నీ ఇలాగే సెప్తవు. సిరాకు పడ్డాడు బుడ్డోడు ఆదిత్య.. అవునురా నీకేకాదు..మీ నాన్నకు కూడా ఇలాగే నీళ్ళు పోసేదాన్ని.. మన ఊళ్లో ఆన్న సూర్యనారాయణ స్వామి మన శిక్కోలుకు ఆస్తి. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మన ఊళ్లో ఉండడం అంటే గొప్ప కాదేట్రా అంది.. పిల్లాడి నెత్తిన జిల్లేడు ఆకులు పెడుతూ అవునే నానమ్మ.. ఈ జిల్లేడు ఆకుల ఎందుకే.. చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టి నీళ్ళు పోస్తావు అన్నాడు ఆదిత్య.. ఒరేయ్ ఇవి వట్టి ఆకులు కాదురా
జిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశిష్టత ఉంది. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న చెడును సైతం తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా ఉందిరా.. ఏదైనా చోట దెబ్బ తగిలి వాపు, నొప్పి వచ్చినా ఈ ఆకులు నయం చేస్తాయిరా అంది నానమ్మ. ఓహో అన్నాడు బుడ్డోడు. ఒరేయ్ నీకు ఇంకో విషయం చెప్పాలిరా అంది నానమ్మ.. పొద్దున్నుంచి నోరు ఆపకుండా వాగుతూనే ఉన్నావు మళ్లీ ఇంకేం చెప్తావె అన్నాడు ఆదిత్య. ఒరేయ్ అప్పట్లో ఎవరికైనా కొడుకు పుట్టాలి అంటే మన సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని మొక్కుకొని.. సూర్య నమస్కారాలు చేస్తే కొడుకు పుట్టేవాడ్రా.. మీ నాన్న కూడా నాకు అలాగే పుట్టాడు.. అందుకే వాడికి సురేష్ అని పేరు పెట్టాం అంది నానమ్మ.. ఓహో అందుకేనా మా నాన్న తరచు అరసవిల్లి గుడికి వెళుతుంటాడు అన్నాడు పిల్లాడు.. అవున్రా సూర్యనారాయణ స్వామి మన శ్రీకాకుళానికి ఆస్తి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి ఒక వెలుగు.. అందుకే మనం అందరం గుడికి పోదాం.. ముందు పిడకల మీద పరమాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టి రిక్షాల వెళ్లిపోదాం సరేనా అంది నానమ్మ..
మన ఊళ్లో కాకుండా ఇంకెక్కడా సూర్యుడికి గుళ్ళు లేవా నానమ్మా అడిగాడు ఆదిత్య.. ఉన్నాయిరా కాశ్మీర్లో మార్తాండ ఆలయం ఉండేది.. కానీ అందులో పూజల్లేవు.. శిథిలమైంది.. ఒరిస్సా కోణార్క్ లో ఉన్నదీ సూర్యుని ఆలయమే కానీ అక్కడా పూజలు ఉండవు.. ఈ దక్షిణ దేశంలో పూజలందుకుంటున్న సూర్య ఆలయం మన ఊళ్లోనే ఉందిరా చిన్నా అని.
చదవండి: పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు
సూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ధన.. గుణ సంపన్నులు అవుతారు బుజ్జి..నువ్వు రోజూ ఆయన్ను నమస్కరించి వీలైతే సూర్యనమస్కారాలు చేసుకో.. ఆరోగ్యం ఐశ్వర్యం దక్కుతాయి.. చెప్పింది నానమ్మ.. అదెలాగే అన్నాడు ఆదిత్య... అవునురా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించడం ద్వారానే శమంతక మణిని పొందాడు.. అది రోజుకు ఎంత బంగారం ఇస్తుందో తెలీదు.. అంతెందుకు రోజూ ఎండలో కాసేపు నిలబడితే ఒంటికి కూడా మంచిదిరా.... విటమిన్లు వస్తాయి చెప్పింది నానమ్మ.. నానమ్మ విటమిన్లు ఎండలో వస్తాయి కదాని నన్ను ఎండలో నడిపిస్తే కుదరదు. రిక్షాలో వెళ్దాం . నాకు అక్కడ సెనగలు ఖజ్జూరం కొనాలి మరి అన్నాడు..పిల్లాడు.. సరే పదండి..గమ్మున వెళ్ళి లైన్లో నిలబడదాం.. ఆదిత్యుణ్ణి దర్శిద్దాం అంటూ అందరూ బయల్దేరారు..
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment