
కందకు లేని దురద కత్తిపీటకు రావడం.. గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు రావడం అంటే ఇదే కావచ్చు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లకు.. రావాల్సిన వారి నుంచి స్పందన రాలేదు. కానీ మంత్రి నారా లోకేష్ బాబు మాత్రం సత్వరమే స్పందించారు. అంతేకాకుండా ఎవరు ఎవర్ని విమర్శించాలన్నదాని మీద ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు.
ఎన్నికల్లో ఎవరికీ తక్కువ మెజారిటీ ఉంటె వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్లను విమర్శించరాదని కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చారు. బుధవారం జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘‘రెండు చోట్లా ఓడిపోయి .. దిక్కూదివాణం లేక మూడు పార్టీల పొత్తుతో గెలిచాడు.. అయన కార్పొరేటరుకు ఎక్కువ .. ఎమ్మెల్యేకు తక్కువ’’ అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ నుంచి ఎలాంటి సమాధానం.. కౌంటర్ రాలేదు.. కానీ ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్‌ను డిఫెండ్ చేస్తూ ఏదో రిప్లై ఇచ్చారు. ఇక జనసేన కన్నా ఎక్కువగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో లోకేష్ ఏకంగా పవన్ కాళ్లకు నమస్కారం చేసారు. పవన్ లేకుంటే.. బీజేపీ మద్దతు లేకుంటే తమకు ఈ అధికారం దక్కేది కాదని తెలుగుదేశంలో అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఓ వైపు పవన్‌ను కంట్రోల్ చేస్తూ ఆయనకు స్వేచ్ఛ లేకుండా నియంత్రిస్తూనే మరోవైపు పవన్‌ను డిఫెండ్ చేయడం కూడా తమదే బాధ్యత అన్నట్లుగా లోకేష్ పెద్దరికం తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఏయ్ జగన్.. నీ మెజారిటీ ఎంత.. పవన్ మెజారిటీ ఎంత.. నీకన్నా పవన్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అలాంటి నువ్వు ఆయన్ను విమర్శిస్తావా? అన్నారు. రాజకీయ విమర్శలకు మెజారిటీతో ముడిపెట్టి మాట్లాడడం సరికొత్త కాన్సెప్ట్.. లోకేష్ చెప్పినదానిప్రకారం పవన్ మెజారిటీ 70,279. కాగా జగన్ మెజారిటీ 61,687.. ఇక్కడ జగన్ కు పవన్ కన్నా తక్కువ మెజారిటీ కాబట్టి అయన పవన్ను విమర్శించకూడదు..
మరి ఈలెక్కన చంద్రబాబు 48,000 మెజారిటీతో గెలిచారు.. ఇది జగన్ కన్నా తక్కువే మెజారిటీ .. ఇప్పుడు లోకేష్ కొత్త కాన్సెప్ట్ ప్రకారం చంద్రబాబు కూడా తనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన జగన్‌ను విమర్శించడం.. అవహేళన చేయడం కూడా తగదు కదా!.. ఇంకా లెక్కవేస్తే గతంలో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచినా మెజారిటీ ఒక రికార్డ్.. కడప ఎంపీ స్థానానికి 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,43,053 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్. తెలుగుదేశంలో ఎవరూ ఇంత భారీ ప్రజామద్దతు పొందలేదు.

తన అద్దె అన్నయ్యను కాపాడుకోవడం.. మద్దతు ఇవ్వడం ద్వారా అభిమానాన్ని పొందాలన్న దుగ్ధతో లోకేష్ కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment