
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.
దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.

ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.
అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment