
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి.
👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది.
👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు.
👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్‌లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు.
ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment