
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది.

తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం.

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment