సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.
వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలం
మరో వైపు ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్‌పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్‌పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్‌పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్‌పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్‌పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్‌పీటీసీల్లో వైఎస్సార్‌సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్‌పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్‌పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.
16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment