యువ‌త పోరు విజ‌య‌వంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొద‌లైంది | Ysrcp Yuvatha Poru Grand Success | Sakshi
Sakshi News home page

యువ‌త పోరు విజ‌య‌వంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొద‌లైంది

Published Wed, Mar 12 2025 5:49 PM | Last Updated on Wed, Mar 12 2025 6:27 PM

Ysrcp Yuvatha Poru Grand Success

సాక్షి, తాడేపల్లి: విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత పోరు' విజయవంతం అయ్యిందని ఆ పార్టీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గ‌డిచిన 15 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్ప‌టికీ దివంగ‌త వైఎస్సార్‌ ఆశ‌య సాధ‌నే ల‌క్ష్యంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ముందుకు సాగుతోంది. అందుకే వైఎస్సార్‌సీపీ ప‌క్షాన పార్టీ శ్రేణులు మాత్ర‌మే కాకుండా వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న, పార్టీ విధానాలతో ఏకీభ‌వించి ఎంతోమంది మేధావులు మాకు అండ‌గా నిలుస్తున్నారు. వారంద‌రికీ హృద‌యపూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నాము. యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు రాజీలేని పోరాటం చేస్తున్నాం.

ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం అయిన‌ప్ప‌టికీ విద్యార్థులు యువ‌త స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించి ప్ర‌భుత్వంపైన పోరాటానికి ముంద‌డుగేశాం. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ నిర్వ‌హించిన యువ‌త పోరు కార్య‌క్ర‌మానికి స్వ‌చ్ఛందంగా యువ‌త త‌ర‌లిరావ‌డం చూస్తుంటే ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా కనిపిస్తోంది. 9 నెల‌ల్లోనే ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌మైన తిరుగుబాటును ఈ ప్ర‌భుత్వం ఎదుర్కొంటోంది. 

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాలి
కూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీల‌కు క‌నీస గౌర‌వం ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, యువ‌త‌ను ప్ర‌భుత్వం గాలికొదిలేసింది. పేద‌రికంతో విద్యార్థులు చ‌దువులకు దూర‌మైపోతున్నా ఈ ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినా లేదు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు చెల్లించ‌కుండా విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటోంది. విద్యాదీవెన, వ‌స‌తి దీవెన‌కు గాను గ‌తేడాదికి సంబంధించి రూ. 3,200 కోట్లు బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మ‌రో రూ. 3,900 కోట్లు చెల్లించాలి. మొత్తంగా రూ. 7,100 కోట్లు కావాల్సి ఉండ‌గా బ‌డ్జెట్‌లో కేవ‌లం రూ. 2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెల‌కు రూ. 3 వేలు చెల్లిస్తామ‌ని చెప్పి యువ‌త ఓట్లు దండుకుని అధికారంలోకి వ‌చ్చాక 9 నెల‌లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేదు. ఈ ఏడాది బ‌డ్జెట్‌లో సైతం ప‌థ‌కం ఊసెత్త‌లేదు.

Lella Appi Reddy: యువ‌త పోరు విజ‌య‌వంతం

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు
గత ప్రభుత్వంలో పేద‌వారికి ఉచితంగా నాణ్య‌మైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే ల‌క్ష్యంతో 17 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించిన‌ వైఎస్‌ జ‌గ‌న్‌, ఐదేళ్ల‌లోనే 5 కాలేజీల‌ను పూర్తి చేసి అడ్మిష‌న్లు కూడా ఇచ్చారు. మిగ‌తా కాలేజీలు వివిధ ద‌శ‌ల్లో నిర్మాణం జ‌రుపుకుంటుండ‌గా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్ర‌బాబు సేఫ్ క్లోజ్ పేరుతో ప‌క్క‌న పెట్టారు. కేంద్రం సీట్లు ఇస్తామ‌ని ముందుకొస్తే వ‌ద్ద‌ని ఐఎంఏకి లేఖ‌లు రాసిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. ఆ విధంగా మెడిసిన్ చ‌ద‌వాల‌న్న పేద విద్యార్థుల‌ను కల‌ను చంద్ర‌బాబు నాశనం చేశాడు. క‌మీష‌న్ల కోసం కార్పొరేట్ల‌కు మెడిక‌ల్ కాలేజీల‌ను దారాద‌త్తం చేసే కార్య‌క్ర‌మానికి తెర‌లేపారు.  

వైఎస్‌ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపునకు 9 నెల‌ల‌కే ప్ర‌జా స్పంద‌న ఈ స్థాయిలో ఉందంటే, హామీలు అమ‌లు చేయ‌క‌పోతే రాబోయే రోజుల్లో ఈ వ్య‌తిరేక‌త ఏ స్థాయికి పెరుగుతుందో కూట‌మి నాయ‌కులే అంచ‌నా వేసుకోవాలి. ఇప్ప‌టికే వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని ఉద్య‌మం చేశాం. ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాం. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తుంటే ఈ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డిపోతోంది. నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డం లేదు.

వారం రోజుల నుంచే నిర‌స‌న కార్య‌క్ర‌మానికి సంబంధించి పోలీసుల‌ను అనుమ‌తి కోరుతున్నా ఇవ్వ‌కుండా కాల‌యాప‌న చేశారు. అడుగ‌డుగునా నాయ‌కుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అన్ని నిర్బంధాల‌ను దాటుకుని ఈ రోజున యువ‌త పోరు నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున విజ‌యవంతంగా నిర్వ‌హించాం. ఇప్ప‌టికైనా కూట‌మి ప్ర‌భుత్వం ఎలాంటి భేషజాల‌కు పోకుండా హామీల అమ‌లుపై దృష్టిసారించాలి. మెడిక‌ల్ కాలేజీలు పూర్తి చేస్తే జ‌గన్‌కి పేరొస్తుంద‌నే ఆలోచ‌న వీడాలి. మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయాల‌న్న నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాలి. తక్ష‌ణం విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాలి. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌తో టైం పాస్ చేయాల‌ని చూస్తే ఊరుకునేది లేదు. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేవ‌ర‌కు విద్యార్థులు, యువ‌త ప‌క్షాన నిల‌బ‌డి వైయ‌స్సార్సీపీ పోరాడుతుంది. ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాస్త‌వాలు తెలుసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement