‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్‌ నిరంకుశ వైఖరి’ | Ysrcp Mlc Lella Appi Reddy Slams On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్‌ నిరంకుశ వైఖరి’

Published Wed, Feb 26 2025 3:11 PM | Last Updated on Wed, Feb 26 2025 4:06 PM

Ysrcp Mlc Lella Appi Reddy Slams On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు.  ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్‌సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్‌సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.

ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారు
తొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్‌సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్‌సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాం
శాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన  ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement