ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం | YSRCP Protest Assembly Council Over Fee Reimbursement Arrears | Sakshi
Sakshi News home page

ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం

Published Wed, Mar 12 2025 10:41 AM | Last Updated on Wed, Mar 12 2025 12:59 PM

YSRCP Protest Assembly Council Over Fee Reimbursement Arrears

అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి.. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్‌ చేశారు. 

అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదు?.  మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారాయన. 

నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?.  పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు.  కానీ గత వైఎస్సార్‌సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. 

అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు  నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్‌ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్‌ క్యాలెండర్‌ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్‌ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలంతా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement