
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు తీరనున్న నీటి కష్టాలు
2011లోనే ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించిన నీటిపారుదల శాఖ
కొన్ని ముంపు గ్రామాలకు గతంలోనే పరిహారం ఇచ్చిన వైఎస్ ప్రభుత్వం
ప్రాజెక్ట్ సాకారమైతే కేసీ–కెనాల్‌కు శాశ్వతంగా తీరనున్న నీటి సమస్య
2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. సమీప గ్రామాలకు తాగునీరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఏటా సగటున 200 టీఎంసీలకుపైగా నీరు కృష్ణాలో కలుస్తోంది. ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గతేడాది 341.99 టీఎంసీలకుపైగా నీరు దిగువకు వదిలారు. కళ్లెదుటే ఇంత నీరు వృథాగా పోతుంటే.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్టంలో అన్ని ప్రాంతాల కంటే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ. సాగునీటి వనరులు అత్యల్పంగా ఉన్న ప్రాంతం. వర్షాధారంపై సాగు చేసే పంటలే అధికం.
ప్రతి పదేళ్లలో ఎనిమిదేళ్లు ఈ ప్రాంతంలో కరువే ఉంటుంది. అరకొరగా ఉన్న సాగునీటి వనరులు కూడా మృగ్యమవుతున్నాయి. దీంతో ‘సీమ’లో వ్యవసాయం ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కరువుతో అల్లాడిపోతున్న కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది.
వైఎస్ హయాంలో బీజం పడినా...
కోడుమూరు నియోజకవర్గంలో సుంకేసుల రిజర్వాయర్‌కు 15 కిలోమీటర్ల ఎగువన సీ.బెళగల్ మండలంలో గుండ్రేవుల, రంగాపురం పరిధిలో 20.15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు విన్నవించారు. దీంతో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైఎస్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మృతి చెందారు.
కాగా.. 2011 ఏప్రిల్ 30న గుండ్రేవుల ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పటి ఈఈ సుబ్బరాయుడు ప్రభుత్వానికి నివేదించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాలు గుండ్రేవుల నిర్మాణాన్ని విస్మరించాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా 2019 ఫిబ్రవరి 21న జీవో154 జారీ చేసింది. గుండ్రేవుల ప్రాజెక్టుకు రూ. 2,890 కోట్ల నిధులతో చేపట్టేలా పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో పూర్తిగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. కర్నూలు నగరపాలక సంస్థకు కూడా తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కూడా ఉంది.
ఇప్పటికే కొన్ని గ్రామాలకు పరిహారం
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో తుంగభద్రకు వరదలు వచ్చాయి. అప్పట్లో తుంగభద్ర పరీవాహక గ్రామాలు మునిగిపోయాయి. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొన్ని గ్రామాలకు పరిహారం కూడా చెల్లించింది. గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. కాబట్టి ముంపు పరిహారం కూడా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలను బేరీజు వేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సానుకూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమవుతోంది.
గుండ్రేవుల నిర్మించకపోతే ‘ సీమ’కు ఇబ్బందే!
తుంగభద్రలో నీటి లభ్యత ఎక్కువ. దీనిపై ఆధారపడే వైఎస్సార్, కర్నూలు జిల్లాల ఆయకట్టు ఆధారపడి ఉంది. భవిష్యత్‌లో కేసీ కెనాల్‌కు సమృద్ధిగా నీటిని అందించాలంటే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మించాలి. 2009లో అప్పటి ప్రభుత్వం డీపీఆర్‌కు రూ.53 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వానికి డీపీఆర్ కూడా అందింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపడేశారు.
సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యమే. దీంతో పెద్దగా ఉపయోగం లేదు. ఆ నీటిని కూడా తుమ్మిల ఎత్తిపోతల ద్వారా తెలంగాణ తోడేస్తోంది. విభజన తర్వాత ఆ ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. గుండ్రేవుల నిరి్మస్తే 20 టీఎంసీలకు పైగా నిల్వ చేసుకోవడంతో పాటు కర్నూలు పశి్చమ ప్రాంతం ఆయకట్టుతోపాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. – శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment