తుంగభద్ర నదిపై రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజీలు
కర్నూలులో ఇంజనీర్లకు వివరించిన కర్ణాటక మంత్రి, ఎంపీ
ప్రభుత్వ అతిథి గృహంలో అనధికార సమావేశం
పాల్గొన్న కర్నూలు ఎంపీ, ఇంజనీర్లు
త్వరలోనే రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అ«ధికారుల సమావేశం
కర్నూలు సిటీ: ఇప్పటికే తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లోని అనధికార ఆనకట్టలు, చెక్ డ్యాంలతో ఆయా ప్రాంతాల్లో నీటిని అక్రమంగా వాడుకుంటున్న కర్ణాటక చర్యలతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా తుంగభద్ర నదిపై మరో రెండు బ్యారేజీలను నిర్మిస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే టీబీ డ్యామ్ ఎగువన అనధికారికంగా నిర్మించిన సుమారు 50 ఎత్తిపోతల పథకాలతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
వీటితో పాటు డ్యామ్ దిగువ భాగంలో నిర్మించిన వివిధ నిర్మాణాల వల్ల.. హక్కుగా రావాల్సిన వాటా నీటికి ఏటా గండి పడుతోంది. ఇలాంటి సమయంలో మరోసారి తుంగభద్ర జలాలను తాగునీటి సమస్య పేరుతో కాజేసేందుకు కర్ణాటక ఎత్తు వేసింది. ఇందులో భాగంగానే తుంగభద్ర నదిపై రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజీ పేరుతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటిపై ఏపీ ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో కర్ణాటక చిన్ననీటిపారుదల శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.బోస్‌రాజు, రాయచూరు ఎంపీ బాలానాయక్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జలవనరుల శాఖ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి, సింథనూరు, శిరుగుప్ప తాలూకాలోని 40 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఏటా వేసవిలో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ సమస్య పరిష్కారం చేయడంతో పాటు నదికి కుడివైపు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 19 గ్రామాలకు సైతం నీటి సమస్య లేకుండా పరిష్కారం చూపేందుకు రాయచూరు జిల్లా చికలపర్వి గ్రామం దగ్గర తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న నేషనల్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ నిర్మించనున్నామని కర్ణాటక మంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రాలయం దగ్గర సైతం బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించేందుకు రూ.138 కోట్లతో తమ రాష్ట్రం చేసిన ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉన్నాయని, ఈ రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు 0.318 సామర్థ్యంతో నిర్మించనున్నామని వివరించారు.
వీటి నిర్మాణం వల్ల ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, త్వరలోనే దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నామని మంత్రి తెలియజేశారు. ఏపీ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుందేమోనని కొందరు ఇంజనీర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ముందుగా బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణమని, ఆ తర్వాత ఆ బ్యారేజీల నుంచి నీటిని తోడేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తే తమ రాష్ట్ర ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటని కొందరు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల దగ్గర 1.2 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీ ఎడమ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీరందని పరిస్థితి ఉందన్నారు. జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్టు సీఈ కబీర్ బాషా, కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎల్‌ఎల్‌సీ ఈఈ శైలేష్ కుమార్, కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment