Tungabhadra River
-
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘టీజీ’కో టీఎంసీ!
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీలు..! రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! చేతిలో మంత్రి పదవి..! ఏకంగా పరిశ్రమలశాఖ! ఇంకేముంది..? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికారంలో ఉండగానే తన ఫ్యాక్టరీల నీటి అవసరాల కోసం చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ ఉపక్రమించారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించడంతో కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల పేరుతో తుంగభద్ర నదిపై చెక్‌డ్యాం నిర్మించి నది ఒడ్డున ఉన్న తమ ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీర్చుకునే ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ! పైగా మంత్రి పదవిలో ఉండటంతో అధికారులు ‘జీ హుజూర్’ అంటూ ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు.– సాక్షి ప్రతినిధి కర్నూలు కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో రెండు ఆల్కలీస్ ఫ్యాక్టరీలున్నాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి–జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేశ్ తన ఫ్యాక్టరీకి సమీపంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించాలని భావించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించేందుకు 2013 జూన్ 18న జీవో 56 జారీ చేయించారు. రూ.64.89 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి 0.50 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలా ఫలకాన్ని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆపై టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో 2017లో మరోసారి అధికారులు రూ.177 కోట్లతో డీపీఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సీడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్‌డ్యాం నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కూటమి రాగానే మరోసారి ప్రతిపాదనలుప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యాం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21న ఇరిగేషన్ ఎస్ఈకి ఓ లేఖ రాశారు. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీపై చెక్‌డ్యాం నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని, 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీనిపై అదే నెల 27న ఇరిగేషన్ ఎస్ఈ తిరిగి కార్పొరేషన్ ఎస్ఈకి లేఖ రాశారు.చెక్‌డ్యాం నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలతలు, ప్రతికూలతలతోపాటు సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలన్నీ పరిశీలించి ఫీజుబులిటి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి అధికారుల ప్రతిపాదన ఇదీ.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. శివారు కాలనీలకు తాగునీటి సమస్య ఉండటంతో మునగాలపాడు వద్ద రూ.15 కోట్లతో మరో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీంతో పాటు అమృత్ ద్వారా హంద్రీ–నీవా నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అమృత్ పథకం కింద మంజూరైన రూ.130 కోట్లు కాకుండా తక్కిన మొత్తాన్ని మంజూరు చేయించుకుని చెక్‌డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మిస్తే 0.50 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని, అందులో 0.30 టీఎంసీలు కర్నూలు తాగునీటి అవసరాలకు, తక్కిన 0.20 టీఎంసీలు తన పరిశ్రమలకు వినియోగించుకునేలా జీవో మంజూరు చేసేలా మంత్రి టీజీ భరత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రివర్స్ పంపింగ్ చేస్తారా? కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే హంద్రీ–నీవా నుంచి ప్రతిపాదనలు ఉన్నపుడు దాన్ని పూర్తి చేయకుండా చెక్‌డ్యాంను తెరపైకి తేవడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం టీజీ ఫ్యాక్టరీల కోసమే మంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ చెక్‌డ్యాం నిర్మించాల్సి వస్తే మునగాలపాడు సమీపంలో నిర్మిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు దగ్గరవుతుంది. అలా కాకుండా రాఘవేంద్ర మఠం సమీపంలో చెక్‌డ్యాం నిర్మించి తిరిగి రివర్స్ పంపింగ్ చేయాలని అంటున్నారు.పైగా కర్నూలు మురుగునీరు మొత్తం అందులో నిల్వ ఉంటుందని, తుంగభద్రలో నీటి ప్రవాహం లేనపుడు కేవలం మురుగునీటి మడుగుగా మారే అవకాశం ఉందని, ఆ నీటిని తాగునీటికి ఎలా వినియోగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నీటితో కేవలం టీజీ ఫ్యాక్టరీల అవసరాలు మాత్రమే తీరుతాయని చర్చించుకుంటున్నారు. -
తుంగభద్ర జలాలకు కర్ణాటక ఎసరు!
కర్నూలు సిటీ: ఇప్పటికే తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లోని అనధికార ఆనకట్టలు, చెక్ డ్యాంలతో ఆయా ప్రాంతాల్లో నీటిని అక్రమంగా వాడుకుంటున్న కర్ణాటక చర్యలతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా తుంగభద్ర నదిపై మరో రెండు బ్యారేజీలను నిర్మిస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే టీబీ డ్యామ్ ఎగువన అనధికారికంగా నిర్మించిన సుమారు 50 ఎత్తిపోతల పథకాలతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.వీటితో పాటు డ్యామ్ దిగువ భాగంలో నిర్మించిన వివిధ నిర్మాణాల వల్ల.. హక్కుగా రావాల్సిన వాటా నీటికి ఏటా గండి పడుతోంది. ఇలాంటి సమయంలో మరోసారి తుంగభద్ర జలాలను తాగునీటి సమస్య పేరుతో కాజేసేందుకు కర్ణాటక ఎత్తు వేసింది. ఇందులో భాగంగానే తుంగభద్ర నదిపై రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజీ పేరుతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటిపై ఏపీ ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో కర్ణాటక చిన్ననీటిపారుదల శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.బోస్‌రాజు, రాయచూరు ఎంపీ బాలానాయక్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జలవనరుల శాఖ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు.కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి, సింథనూరు, శిరుగుప్ప తాలూకాలోని 40 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఏటా వేసవిలో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ సమస్య పరిష్కారం చేయడంతో పాటు నదికి కుడివైపు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 19 గ్రామాలకు సైతం నీటి సమస్య లేకుండా పరిష్కారం చూపేందుకు రాయచూరు జిల్లా చికలపర్వి గ్రామం దగ్గర తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న నేషనల్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ నిర్మించనున్నామని కర్ణాటక మంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రాలయం దగ్గర సైతం బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించేందుకు రూ.138 కోట్లతో తమ రాష్ట్రం చేసిన ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉన్నాయని, ఈ రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు 0.318 సామర్థ్యంతో నిర్మించనున్నామని వివరించారు. వీటి నిర్మాణం వల్ల ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, త్వరలోనే దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నామని మంత్రి తెలియజేశారు. ఏపీ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుందేమోనని కొందరు ఇంజనీర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ముందుగా బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణమని, ఆ తర్వాత ఆ బ్యారేజీల నుంచి నీటిని తోడేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తే తమ రాష్ట్ర ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటని కొందరు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల దగ్గర 1.2 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీ ఎడమ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీరందని పరిస్థితి ఉందన్నారు. జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్టు సీఈ కబీర్ బాషా, కర్నూలు సర్కిల్ ఎస్ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎల్ఎల్సీ ఈఈ శైలేష్ కుమార్, కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్రలో నీటి లభ్యత సగంలోపే!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. తుంగభద్ర నదిలో వందేళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని.. టీబీ డ్యామ్ వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా 1976లో వేసింది. దీన్ని బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ.. రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దాంట్లో సగం నీళ్లు కూడా ఈ ఏడాది టీబీ డ్యామ్‌లోకి చేరకపోవడం గమనార్హం. టీబీ డ్యామ్ చరిత్రలో 2016–17లో వచి్చన 85.71 టీఎంసీలే కనిష్ట ప్రవాహం. ఈ ఏడాది వచ్చింది రెండో కనిష్ట ప్రవాహం. శనివారం నాటికి టీబీ డ్యామ్‌లో 10.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 76.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. టీబీ డ్యామ్‌లో ఇదే సమయానికి గత పదేళ్లలో సగటున 50.60 టీఎంసీలు నిల్వ ఉండేవి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కనిష్ట నీటి నిల్వ ఉండడం కూడా ఇదే తొలిసారి. టీబీ డ్యామ్ నుంచి కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండడంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్నది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈ ఏడాది నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో ఆయకట్టులో ఆరు తడి పంటలకు నీటిని సరఫరా చేశారు. 2019–20 నుంచి 2022–23 వరకుటీబీ డ్యామ్‌లోకి భారీగా వరద చేరడంతో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించారు. టీబీ డ్యామ్ చరిత్రలో గతేడాది అంటే 2022–23లో వచి్చన 606.64 టీఎంసీలే గరిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. -
ఘనంగా తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అత్యంత ప్రాశస్త్యమున్న తుంగభద్ర నదీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారిసంఖ్యను ముందే అంచనా వేసి.. ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏర్పాట్ల కోసం రూ.199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పనుల్ని నవంబర్ 16 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది. నవంబర్ 20న ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్ 1న ముగుస్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వరద తగ్గగానే పుష్కర ఘాట్ల నిర్మాణం తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.91 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పదిరోజుల్లో వరద తగ్గిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్లు, నదీ తీరప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యమున్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.117 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.30 కోట్లు మంజూరు చేశాయి. కర్నూలు నగరంలోను, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోను పారిశుధ్యం, అంతర్గత రహదారులకు కొత్తరూపు ఇవ్వడానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. నిరంతరం మంత్రుల సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కార్మికశాఖ మంత్రి జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ నేతృత్వంలో 21 శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్ల కమిటీ ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్లతోపాటు జల్లు స్నానం చేసేందుకు షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఘాట్ల సమీపంలో స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పారిశుధ్యం పనుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు. -
బెంగ తీర్చే ‘తుంగ’.. కృష్ణమ్మ ఉత్తుంగ
సాక్షి, కర్నూలు : బెంగ తీర్చడానికి ‘తుంగ’ ఉధృతంగా ముందుకు సాగుతోంది. ‘తుంగభద్రమ్మ’ను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు కృష్ణమ్మ ఉత్తుంగ తరంగమై మహోధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలాన్ని వేగంగా నింపుతూ..ముందుకు కదలడానికి సమాయత్తమవుతోంది. ఈ పరిణామాలతో ‘సీమ’ రైతుల గుండెల్లో సంతోషం ఉప్పొంగుతోంది. అప్పర్ తుంగ నుంచి భారీ వరద ఇన్నాళ్లూ హెచ్చుతగ్గుల నీటి చేరికతో ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ప్రస్తుతం భారీ ప్రవాహం మొదలుకానుంది. ఎగువన శివమొగ్గ జిల్లాలో నిర్మించిన అప్పర్ తుంగ(గాజనూరు) ప్రాజెక్ట్ నుంచి దిగువకు 95,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు గురువారం సాయంత్రానికి తుంగభద్ర జలాశయానికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో 40,781 క్యూసెక్కులు ఉంది. అప్పర్ తుంగ ప్రాజెక్ట్ నుంచి విడుదలయిన నీటితో గురువారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటవచ్చని జలాశయం అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమలలోని వర్శపర్వతాలతో పాటు చిక్‌మగళూరు, హావేరి జిల్లాల్లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగ నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. తుంగ డ్యాంలోకి 95,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 3.24 టీఎంసీలు. డ్యాంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రలోనూ పోటెత్తిన వరద శివమొగ్గ జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షాలతో భద్ర నదిలోనూ వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. భద్రావతి వద్ద నిర్మించిన భద్ర ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో బుధవారం 41,487 క్యూసెక్కులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో నీటి నిల్వ 38 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 63 టీఎంసీలు. మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో భద్ర నుంచి కూడా దిగువన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1610.8 అడుగుల వద్ద 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 40,781 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1011 క్యూసెక్కులు. జలాశయంలోకి భారీ వరద ప్రవాహాన్ని అంచనా వేసిన కర్ణాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం కర్ణాటక పరిధిలోని ఎల్లెల్సీ కుడి, ఎడమ కాలువలు, రాయబసవన కెనాల్, విజయనగర కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోటెత్తుతున్న కృష్ణమ్మ కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. నదిలో నీటి ప్రవాహం సుమారు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఆల్మట్టి డ్యాంకు ఎగువ భాగంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం ఉంది. వచ్చిన నీటినంతా ఆల్మట్టి గేట్లన్నీ పైకెత్తి దిగువకు వదిలేస్తున్నారు. అలాగే నారాయణపూర్ జలాశయం నుంచి 4.65 లక్షల క్యూసెక్కులు, జూరాల నుంచి 3,41,512 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 872.70 అడుగుల నీటి మట్టంతో 153.16 టీఎంసీల నీరు నిల్వఉంది. డ్యాంలోకి ఎగువ నుంచి వస్తున్న నీరు నేటి ఉదయానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. ఫలితంగా డ్యాంలో నీటినిల్వ 175 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. ఎగువ నుంచి వచ్చే నీటిని బట్టి శుక్రవారం ఉదయానికి 205 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వదిలేందుకు ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ సాగర్ వైపు 74,496 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా బుధవారం సాయంత్రానికి 10 వేల క్యూసెక్కుల వరద జలాలను, హంద్రీ–నీవా ద్వారా 1013 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి స్కీమ్ ద్వారా 1,600 క్యూసెక్కులు, ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా కేసీకి 245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
పెన్నా అహోబిలం ప్రాజెక్టును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ అక్రమంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ఏ అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్, సుంకేశులకు మధ్య ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లా కు నీరిచ్చేలా పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. తుంగభద్ర పరీవాహకం నుంచి కృష్ణా ప్రధాన నదికి స్థిరమైన ప్రవాహాలు ఉంటాయని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 తేల్చి చెప్పిందని, రెండో ట్రిబ్యునల్ దీన్ని ధ్రువీకరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి ఏపీ 40 టీఎంసీల మేర నీటిని తరలిస్తే, దిగువన తెలంగాణలోని కల్వకుర్తి, ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది నీటి అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. అదీగాక రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎలాంటి కొత్త ప్రాజెక్టును చేపట్టినా, ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, తెలంగాణ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. బోర్డు పరిశీలించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని ప్రస్తావించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టు పనులను సాగించాలని వివరించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించే ఏర్పాటు చేయాలని కోరారు. -
తుంగభద్ర కరుణించినా..
సాక్షి, అమరావతి: తుంగభద్ర నదిలో ఈ ఏడాఇ నీటిలభ్యత బాగా పెరిగినప్పటికీ రాయలసీమలో హెచ్చెల్సీ(ఎగువ కాలువ), దిగువ కాలువ(ఎల్లెల్సీ), కేసీ(కర్నూలు–కడప) కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో తుంగభద్ర నదిపై ఆధారపడిన 6.44 లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 40 శాతానికి కూడా నీళ్లందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు కూడా వరి పంటకు కాదు కదా.. కనీసం ఆరుతడి పంటలకూ నీళ్లివ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. తుంగభద్ర నదిలో ఈ ఏడాది నీటి లభ్యత పెరిగింది. ఇప్పటివరకు తుంగభద్ర జలాశయంలోకి 351.69 టీఎంసీలు రాగా దిగువకు 180 టీఎంసీలను విడుదల చేశారు. ఇందులో సుంకేసుల బ్యారేజీలోకి 173 టీఎంసీలు చేరాయి. దీనిలో 166 టీఎంసీలను దిగువకు.. అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్‌కు పది, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.51 టీఎంసీలు చొప్పున కేటాయించింది. కేసీ కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ 39.90 టీఎంసీలను కేటాయించింది(ఇందులో 29.9 టీఎంసీలు సుంకేశుల బ్యారేజీ వద్ద లభిస్తాయని, మిగతా 10 టీఎంసీలను తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది). అంటే, ఆర్డీఎస్ కింద తెలంగాణ వాటా పోనూ తుంగభద్ర జలాల్లో కనీసం వంద టీఎంసీలు రాయలసీమకు దక్కాలి. కానీ ఇప్పటివరకూ కేసీ కెనాల్‌కు పది, ఎల్లెల్సీకి ఆరు, హెచ్చెల్సీకి 11 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. కేసీ కెనాల్ కింద సాగు చేసిన పంటలు చేతికి అందాలంటే ఇంకా 24 టీఎంసీలు అవసరం. హెచ్చెల్సీ, ఎల్లెల్సీల ఆయకట్టుకు సక్రమంగా నీటిని విడుదల చేయకపోవడం వల్ల 25 శాతం ఆయకట్టులో కూడా పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం పరిధిలో పదివేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. హెచ్చెల్సీ ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 84.96 టీఎంసీలుగా ఉంది. ఈ నీటిలో సింహభాగం రాష్ట్రానికే దక్కాలి. కానీ ఆ మేరకు తుంగభద్ర బోర్డుపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. కర్ణాటక జలచౌర్యాన్ని అడ్డుకోవడంలోనూ చేతులు ఎత్తేసింది. పర్యవసానంగానే ఆయకట్టుకు నీళ్లందట్లేదని రైతులు మండిపడుతున్నారు. -
తుంగభద్రలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చితాభస్మాన్ని శనివారం తుంగభద్ర నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత నదీ తీరంలోని పుష్కరఘాట్‌లో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఉత్తర వాహిణి తుంగభద్ర నదిలోని పవిత్ర దేవద్రోణి తీర్థంలో చితాభస్మాన్ని కలిపి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆత్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుతూ అర్ఘ్యం వదిలారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ వాజ్‌పేయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నాగూరావు నామోజీ, పద్మజరెడ్డి, తుమ్మల రవికుమార్, అశోక్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన తుంగభద్ర ప్రవాహం
కోసిగి(కర్నూలు): తుంగభద్ర నదీ మూడు రోజులుగా తగుముఖం పట్టింది. జూలై 18న కర్ణాటక హోస్పేట్ డ్యామ్ నుంచి నదికి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కోసిగి మండలం అగసనూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నదీ ఒడ్డున నిర్మించిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై రెండు అడుగులు ఎత్తు వరకు నీటి ప్రవాహం ఉంది. శుక్రవారం ప్రవాహం ఆనకట్ట లెవల్ వరకు తగ్గిపోయింది. కర్నూలు వైపు కేవలం ఒక స్లూయిస్ నుంచి మాత్రమే దిగువకు ప్రవహిస్తున్నాయి. నీళ్లు తగ్గడంతో నదితీర ప్రాంత రైతులు ఆందోళనకు గురువుతున్నారు. సాగుకు నోచుకోని పంట పొలాలు : కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి నీళ్లు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పదిహేను రోజులు గడవక ముందే నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నేటికి నదతీర పంట పోలాలు సాగుకు నోచుకోలేదు. వరినార ఏర్పాటుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అంతలోనే నదీ ప్రవాహం తగ్గడంతో సాగుచేకున్న తర్వాత నదికి నీళ్లు వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిండని ఎత్తిపోతల పథకాలు: ఎల్లెల్సీ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే దిశగా నదితీరంలో నిర్మించిన ఎత్తి పోతల పథకాలు నిండని కుండలుగా మారిపోయాయి. కోసిగి మండలంలోని దుద్ది ఎత్తి పోతల పథకం కింద 3200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎత్తిపోతల పథకం వద్ద రెండు మిషన్లు పనిచేయడం లేదు. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఒక మిషన్‌తో పంపింగ్ చేశారు. మూడు మిషన్లు మరమ్మత్తులకు గురైనా విషయం తెలిసినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం, పులికనుమ రిజర్వాయర్ కూడా నిండేది కష్టమే. ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. -
తుంగభద్ర పరవళ్లు!
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సైతం ప్రాజెక్టులోకి 48,410 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం శుక్రవారం ఉదయానికి 11.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మొత్తంగా ప్రాజెక్టులోకి 10 టీఎంసీల నీరు చేరినట్టయింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 0.93 టీఎంసీల నిల్వలు ఉండగా, ఈ ఏడాది 11 టీఎంసీల మేర అధికంగా నీరు ఉండటం రాష్ట్ర ఆశలను సజీవం చేస్తోంది. తుంగభద్రలో కనిష్టంగా మరో 80 టీఎంసీల నీరు చేరితే దిగువ శ్రీశైలానికి వరద ఉంటుంది. ప్రతి ఏడాది ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌లో ముందుగా నిండితే తుంగభద్ర మాత్రం నవంబర్ నాటికి గానీ నిండేది కాదు. కానీ ఈ ఏడాది దానికి విరుద్ధంగా తుంగభద్రలోకి ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇంతవరకు ఆల్మట్టిలోకి చుక్క కొత్త నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, కేవలం 22 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 12 టీఎంసీల నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. నారాయణపూర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు నారాయణపూర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 2వేల క్యూసెక్కుల మేర నీరు వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వలు 37.65 టీఎంసీలకు గానూ 24.45 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లోనే ఇక్కడ 5.26 టీఎంసీల కొత్త నీరు చేరింది. జూరాలకు ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 2,087 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ 5.26 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్‌లోకి 2,365 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ఇక్కడ 312 టీఎంసీలకు గానూ 134.32 టీఎంసీల నీటి లభ్యత ఉంది. గతేడాది ఇదే సమయానికి సాగర్‌లో 118.49 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 16 టీఎంసీల మేర ఎక్కువ నీటి లభ్యత ఉండటం విశేషం. ఎస్సారెస్పీలో కొనసాగుతున్న ప్రవాహాలు.. ఇక ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సైతం ప్రాజెక్టులోకి 12,784 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 10.39 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీకి ఈ సీజన్లో కొత్తగా 3.91 టీఎంసీల మేర నీరు వచ్చింది. ఇక సింగూరులోకి 1,453 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాని నిల్వ 29.9 టీఎంసీలకు గానూ 7.93 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు ప్రవాహాలు తగ్గాయి. నిన్నమొన్నటి వరకు వేల క్యూసెక్కుల నీరు రాగా, అది ప్రస్తుతం వందలకు పడిపోయింది. కడెంలోకి 181 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలోకి 952 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. -
మాకు సరిపోగా మిగిలింది మీకు
సాక్షి, హైదరాబాద్ తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ సాగు అవసరాలకు పోగా మిగిలిన జలాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కర్ణాటక మంత్రుల బృందానికి స్పష్టం చేశారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక నీటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ నేతృత్వంలోని బృందం గురువారం ఇక్కడి జలసౌధలో హరీశ్‌రావుతో సమావేశమైంది. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాలకు ఆర్డీఎస్లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని ఎంబీ పాటిల్ మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగం, కర్ణాటక నీటి వాడకానికి అనుమతిపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు 3.5 టీఎంసీల నీటి వాటా ఉందని, ప్రాజెక్టు కింద 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేశాక మిగిలిన నీటిని కర్ణాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని హరీశ్‌రావు కర్ణాటక మంత్రులకు తేల్చి చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. తుంగభద్ర నీటిని వాడుకున్న దానికి బదులుగా వచ్చే వేసవిలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతేడాది కూడా మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం తాము నారాయణ్‌పూర్ నుంచి ఒక టీఎంసీ నీటిని జూరాలకు తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు విడుదల చేసిన విషయాన్ని కర్ణాటక మంత్రులు గుర్తుచేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోందని, కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఒక టీఎంసీ నీటిని తెలంగాణకు విడుదల చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే రకమైన స్ఫూర్తిని చాటుతోందని మంత్రి హరీశ్ కితాబిచ్చారు. ఆర్డీఎస్‌పై త్వరలో మూడు రాష్ట్రాల భేటీ... ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై ఆంధ్రప్రదేశ్‌తో కలసి త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని తెలంగాణ, కర్ణాటక మంత్రులు నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంత రైతాంగానికి 87 వేల ఎకరాలకు ఆర్డీఎస్ నుంచి నీరందాల్సి ఉన్నా ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందట్లేదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉమ్మడి ఏపీలో ఆధునీకరణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆరు నెలల వర్కింగ్ సీజన్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఏపీ సహకారం లేకుండా పనులు పూర్తి కావని కర్ణాటక మంత్రి పాటిల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ అంశంపై త్రైపాక్షిక సమావేశానికి తెలంగాణ చొరవ చూపాలన్నారు. ఈ ప్రతిపాదనకు హరీశ్‌రావు అంగీకరించారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో బుధవారమే తాను మాట్లాడానని, ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఇండెంట్‌ను తుంగభద్ర బోర్డుకు పంపించడానికి అంగీకారం కుదిరిందన్నారు. త్రైపాక్షిక సమావేశానికి కూడా దేవినేనితో మాట్లాడతానని హరీశ్ హామీ ఇచ్చారు. సమావేశంలో కర్ణాటక మంత్రులు తన్వీర్‌సైత్, సంతోష్ లాడ్, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు శివరాజ్ తంగడగి, అంపుల గౌడ, ప్రతాప్ గౌడ, అంపయ్య నాయక్, ఎమ్మెల్సీలు కేసీ కొండయ్య, బోస్‌రాజు, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ పెడితే ఒప్పందం రద్దే..!
రహదారులు, వంతెనల విషయంలో సర్కారు కీలక నిర్ణయం నాలుగేళ్లుగా కదలిక లేని అలంపూర్ వంతెన నిర్మాణం పాత కాంట్రాక్టర్‌తో తెగతెంపులు కొత్త సంస్థకు పనుల అప్పగింత ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం.. పనులు షురూ ఇదే బాటలో మరిన్ని ప్రాజెక్టుల పనులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానిస్తూ తుంగభద్ర నదిపై నిర్మించతలపెట్టిన వంతెన అది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో దీని పనులు మొదలయ్యాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాక పిల్లర్లు వెక్కిరిస్తున్నాయి. ఫలితం.. అదనంగా 50 కిలోమీటర్లు ప్రయా ణించి కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. ఇది ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అలంపూర్ జోగుళాంబ దేవాలయం చెంత ఉన్న అసంపూర్తి వంతెన నిర్మాణం కథ. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఎన్నో పనులు ఏళ్ల తరబడి పడకేసి జనానికి తిప్పలు పెడుతున్నాయి. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు దక్కించుకో వటం.. ఆ తర్వాత పనులు చేయలేక చతికిలపడటం.. ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడటం సాధారణంగా కనిపించే విషయం. ఇలాంటి వాటిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. సకాలంలో పనులు పూర్తి చేయక పెండింగ్‌లో పడిన ప్రాజెక్టుల తీరును సమీ క్షించి నిర్మాణ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుని కొత్త సంస్థలకు పనులు అప్పగిం చాలని నిర్ణయించింది. వెసులుబాటు ఉన్నా.. ప్రతి ప్రాజెక్టుకు గడువుంటుంది. అది ఎప్పట్లోగా పూర్తి చేయాలో ముందే నిర్ణయి స్తారు. సాంకేతిక సమస్య ఏర్పడితే గడువును ప్రభుత్వం పొడిగిస్తుంది. సాంకేతిక సమస్య లేకుండా, సొంత ఇబ్బందులతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే ఒప్పందం రద్దు చేసుకువే వెసులుబాటు చట్టంలోనే ఉంది. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా కొన్ని పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం కొనసాగుతోంది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం పనుల్లో వేగం పెంచేందుకు ఒప్పందాలను పునఃసమీక్షిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు అలంపూర్ వంతెన నిర్మాణాన్ని మరో సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని కొత్త గడువు విధించింది. పనుల్లో నాణ్యతతో పాటు, కొత్త సంస్థ పనులు ప్రారంభించిన తీరును ఆదివారం రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ విభాగం ఈఎన్సీ బిక్షపతి పరిశీలించారు. మళ్లీ వానలు కురిసి నదిలో నీటిమట్టం పెరిగేలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఇదీ కథ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ను అనుసం «ధానిస్తూ కృష్ణా నదిపై కర్నూలు వద్ద వం తెన ఉంది. జాతీయ రహదారి కావటంతో అదే ప్రధాన మార్గం. అలంపూర్‌కు చేరువలో ఉన్న ఏపీ పరిధిలోని నందికొట్కూరు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే వెనక్కు మళ్లి జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి వెళ్లాల్సి వస్తోంది. దీంతో 50 కిలోమీటర్ల మేర చుట్టూ తిరగాలి. ఇక తుంగభద్ర నది ఆవల కూడా తెలంగాణ పరిధిలోకి మూడు నాలుగు గ్రామాలు వస్తాయి. ఆ గ్రామాలవారు అలంపూర్ రావాలంటే కర్నూలు చుట్టూ తిరిగి రావాలి. 7 కిలోమీటర్ల దూరం రావటానికి 70 కి.మీ. ప్రయాణించాలి. ఈ నేపథ్యంలో అలంపూర్ వద్ద తుంగభద్ర నదిపై రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 600 మీటర్ల వంతెనకు 2009లో ప్రణాళిక సిద్ధం చేశారు. 2010లో పనులు మొదలుకాగా నాలుగేళ్లక్రితం 24 పిల్లర్లు, వాటిపై 72 గర్డర్లు ఏర్పాటు చేశారు. వాటి మీదుగా స్లాబ్ నిర్మించి రోడ్డు వేయాలి. వంతెనకు అలంపూర్ వైపు 900 మీటర్లు, ఆవలివైపు 1,300 మీటర్ల అనుసంధాన రహదారి నిర్మించాలి. కానీ నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగలేదు. -
ప్రాణాలకు తెగించి.. ఏడుగురిని రక్షించి
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకే కాదు.. ప్రాణాలను కూడా కాపాడుతామని ఓ పోలీసు చాటి చెప్పాడు. ప్రమాదవశాత్తు తుంగభద్రనదిలో ఎనిమిది మంది కొట్టుకుపోతుండగా ఓ ఎస్ఐ సాహసం చేసి ఏడుగురిని రక్షించారు. మరో వ్యక్తిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కందకూరు గ్రామంలో సోమవారం తుంగభద్ర నదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గల్లంతు కాగా.. ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. – మంత్రాలయం/కోసిగి ఏటా శ్రావణ మాసం ఆఖరి సోమవారం ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి కోసిగి మండలం కందకూరు గ్రామం చేరుకుంటుంది. తుంగభద్రమ్మ నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో పవిత్ర నదీజలంలో ఉత్సవమూర్తికి పుణ్యస్నానం చేస్తారు. ఆనవాయితీలో భాగంగా కందకూరు వేడుకను తిలకించేందుకు నది అవతలి వైపు ఉన్న కర్ణాటక రాష్ట్రం మాన్వి నియోజకవర్గం పొన్నూరు గ్రామం నుంచి రాము, శేఖర్, చాకలి నాగరాజు, హనుమేష్, బసవరాజ్, ఆంజనేయ, దేవరాజుతో కలిసి పుట్టిలో బయలు దేరారు. పుట్టి తుంగభద్ర నడి బొడ్డులోకి రాగానే అనుకోకుండా పుట్టిలోకి నీళ్లు ఉబికాయి. పుట్టి చోదకుడు యువరాజ్ వెంటనే నీళ్లు తోడేయండని చెప్పి తెడ్డుతో పుట్టిని ముందుకు నడపసాగాడు. అయితే హడావుడితో యువకులు నీళ్లను తోడేసే క్రమంలో ఒక్కపాటుగా జరిగారు. ఇంతటితో నీటి ఉధృతికి పుట్టి ఒక్కసారిగా బోల్తా పడింది. రెండు రోజుల క్రితం తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదిలో పడి పోయిన వారికి ఈత వచ్చినా ఒడ్డు చేరలేకపోతున్నారు. మరోవైపు భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవతలి వైపు ఒడ్డున ఉన్న భక్తులు కేకలు వేశారు. ఎదురీది.. ఉరకుంద ఈరన్న స్వామి పల్లకి అప్పటికే నది ఒడ్డుకు చేరుకుంది. పూజలు అనంతరం ఉత్సవమూర్తికి జలాభిషేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా బందోబస్తుగా వెళ్లిన పెద్దతుంబళం ఎస్ఐ శ్రీనివాసులు ఈత సరదాతో అప్పటికే నదిలోకి దిగారు. అదే సమయంలో అతనికి 100 మీటర్ల దూరంలో పుట్టి మునిగి ఎనిమిది మంది నదిలో పడ్డారు. గమనించిన ఎస్ఐ వారిని రక్షించేందుకు సాహసం చేశారు. నదిలో పడిన భయంతో కేకలు వేస్తున్న వారిని సమీపించి వారికి ధైర్యం చెప్పి ఏడుగురిని నదిలో నిలబడే స్థాయిలో నీళ్లు ఉండే చోటుకి చేర్చారు. అనుమన్న, యల్లమ్మ రెండో కుమారుడు రాము(22) ఎస్ఐ చేతికందినట్లే అంది నీటి మునిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అప్పటికే అలసిపోయిన ఎస్ఐ చేసేదేమి లేక అక్కడి నుంచి ఆయాశపడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. సురక్షిత ప్రాంతం చేరుకున్న యువకులు అక్కడి నుంచి చిన్నగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోసిగి సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ ఇంతియాజ్‌బాష అక్కడికి చేరుకుని పుట్టి చోదకుడు యువరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గల్లంతైన యువకుడి మృతదేహం కోసం మాన్వి, ఎమ్మిగనూరు అగ్ని మాపక సిబ్బంది గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాయచూరు నుంచి ప్రత్యేక బోటును తెప్పించేందుకు సమాయత్తమయ్యారు. ప్రతి ఒక్కరు ఎస్ఐ సహసాన్ని అభినందించారు. ఆశలు వదులుకున్నాం : శేఖర్, ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి అనుకోకుండా ప్రయాణిస్తున్న పుట్టి అడుగుభాగాన చిల్లు పడి పుట్టిలోకి నీరు ఉబికింది. నీరు తోడేసే క్రమంలో అందరూ ఒక్కపాటున వచ్చాం. దీంతో ఉన్నపాటున ఒక్కవైపు బరువై పుట్టి బోల్తా పడింది. నిండునదిలో ఒరిగిపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. ఎస్ఐ శ్రీనివాసులు దేవుడిలా వచ్చి మా ప్రాణాలకు ఆయువు పోశాడు. ఆయన సాహసం చేయకుంటే బతికేవాళ్లం తక్కువే. -
తొలకరి ఆనందం
► సుంకేసులలో ఒక టీఎంసీ, ► జీడీపీలో 2 టీఎంసీల నీరు చేరిక ► వరద నీటి సద్వినియోగానికి ముందస్తు ప్రణాళికలు ► నేటి నుంచి కేసీకి నీటి విడుదల కర్నూలు సిటీ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన తొలకరి చినుకులకే జలశయాలు, చెరువులకు జల కళ వచ్చింది. వారం రోజుల క్రితం నీరు లేక వెలవెలబోయిన మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న నీటి తరహా ప్రాజెక్టుల్లో కొంత నీరు వచ్చి చేరింది. ఇందులో భాగంగా హంద్రీ నది పైనున్న గాజులదిన్నె ప్రాజెక్టు, తుంగభద్ర నది పైనున్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ(సుంకేసుల)లకు ఇటీవల కురిసిన వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. సుంకేసులకు సుమారు టీఎంసీ, గాజులదిన్నెకు 2 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. సుంకేసుల నుంచి వర్షపు నీటిని వృథాగా దిగువకు వదలకుండా జల వనరుల శాఖ అధికారులు తుంగభద్ర జలాలను కర్నూలు-కడప కాలువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌లు కేసీకి నీరు విడుదల చేయనున్నారు. యేటా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నెల రోజులకు కానీ జలాశయాలకు కొత్త నీరు వచ్చేది కాదు. అయితే ఈ ఏడాది సీజన్ మొదలయిన మొదటి రోజే జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుండటం విశేషం. ఇక ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఆర్డీఎస్ ఆనకట్టు పొంగి పొర్లుతోంది. అదేవిధంగా జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని 157 చెరువుల్లో ఇప్పటికే 20కి పైగా జల కళ సంతరించుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని సుమారు 30 చెరువుల్లోనూ నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. -
తుంగభద్ర బోర్డు పరిధిలోకి ఆర్డీఎస్!
► ఆనకట్ట ఎత్తు పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణ, కర్ణాటక ► చర్చలకు పిలిచినా స్పందించని ఏపీ ప్రభుత్వం ► ఆర్డీఎస్ వివాదంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు ► మూడు రాష్ట్రాలతో చర్చించాలని టీబీ బోర్డుకు లేఖ ► ఈ నెల 25న మూడు రాష్ట్రాలతో చర్చించే అవకాశం? కర్నూలు సిటీ: రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదంగా మారిన రాజోలి బండ డెవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను తుంగభద్ర బోర్డు పరిధిలోకి చేర్చేందుకు కసరత్తు జరుగుతుంది. తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ఆనకట్టతో పాటు, కాల్వల ఆధునికీకరణకు 2008లో నిధులు మంజూరు అయ్యాయి. కాల్వల ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తికాగా ఆనకట్ట పనులు మిగిలాయి. ఈ పనులు చేసేందుకు కుడి వైపు ఉన్న కర్నూలు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. సున్నితమైన ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆనకట్ట ఎత్తును పెంచేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి పాటిల్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆనకట్ట పనులు చేసేందుకు రాయచూర్ సర్కిల్ ఇంజనీర్లు సామగ్రితో ఆర్డీఎస్ దగ్గరకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన అధికారులు అక్కడికి చేరుకుని పనులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తరువాతే ముందుకు పోవాలని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఆనకట్ట ఎత్తు పెంచే పనులు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆ పనులు చేయడం వల్ల దిగువ ప్రాంతానికి ఎలాంటి నష్టం లేదంటూఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. స్పందించిన కృష్ణాబోర్డు ఆర్డీఎస్ ఆనకట్టను టీబీబోర్డు పరిధిలోకి చేర్చుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో చర్చలు జరపాలని మూడు రోజుల క్రితమే టీబీ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఈమేరకు ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించేందుకు టీబీ బోర్డు అధికారుల బృందం సోమవారం రానుంది. ఈ నెల 25వ తేదీన మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులతో చర్చలు జరిపేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్చలతోనే వివాదం పరిష్కారం ఆర్డీఎస్ ఆనకట్టపై చాలా రోజుల నుంచి రగులుతున్న వివాదంపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితే పరిష్కారమవుతుంది. సున్నితమైన సమస్యపై తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింటే బాగుండేది. ఆర్డీఎస్ టీబీ బోర్డు పరిధిలోకి పోతే నష్టం అని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఆనకట్ట వెంట్స్ మూత వేస్తే మాత్రం దిగువ ఉన్న కేసీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. - సుబ్బరాయుడు, సాగు నీటిరంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ టీబీ బోర్డుపరిధిలోకి చేర్చితే సీమకే నష్టం ! తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి మండలం రాజోలి బండ గ్రామం, కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామాల మధ్య ఆర్డీఎస్ ఆనకట్టను నిర్మించారు. ఎడమ వైపునకు ఆర్డీఎస్ కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ నుంచే కర్ణాటక, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్ట ఎత్తును మరో 6 ఇంచులు పెంచుకుంటే తమ ప్రాంతానికి కొంత మేరకైనా నీరు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరాట పడుతుండగా.. ఈవిధంగా చేస్తే దిగువకు నీరు రాదని కర్నూలు జిల్లా ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక వేళ ఆనకట్టను టీబీ బోర్డు పరిధిలోకి చేర్చితే రాయల సీమ జిల్లాలకు తీవ్రమైన సాగు, తాగు నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బోర్డు పరిధిలో ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాల్వలకు వాటా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ వివాదంపై చర్చించేందుకు చర్చలకు రావాలని తెలంగాణ ప్రభుత్వం పిలిచినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. కనీసం దీనిపై కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వివాదం పరిష్కారమయ్యేలా చూడాలని ఈ ప్రాంత రైతులు, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయండి : నాగం
నాగర్‌కర్నూల్ : జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి 8లక్షల ఎకరాలకు సాగునీరందించాలని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ పీఆర్ అతిధిగృహంలో బుధవారం ఆయన విలేకరుతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేఎల్ఐ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. 1944లోనే తుంగభద్ర నదీజలాలపై ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్ రాష్ట్రానికి లక్ష, మద్రాస్ రెసిడెన్సీకి లక్ష ఎకరాలకు నీరందించాలని, ఆర్డీఎస్ ఎత్తు పెంచి పాలమూరు జిల్లాలో 87 వేల ఎకరాలకు నీరివ్వాల్సిందిగా ఒప్పందం జరిగిందని, అనుమానం ఉంటే ఆంధ్ర ప్రభుత్వం నిజాంకాలం నాటి పత్రాలను చూడాలని సూచించారు. 1956లో అప్పర్ కృష్ణ, భీమా రూపకల్పన జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రెండోపంచవర్ష ప్రణాళికలో నిధుల మంజూరుకు ఒప్పుకుందని, ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులుగా నిర్మించాలనుకున్న వీటి ద్వారా రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో 14లక్షల ఎకరాలకు నీరందేదన్నారు. కానీ ఆంధ్రా పాలకులు దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్టులు చేపట్టలేదని గుర్తుచేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని భూములకు నీరిచ్చిన తర్వాతే కృష్ణా నీటిని వేరే చోటికి తరలించాలన్నారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి,లక్ష్మీనారాయణ, నసీర్, షఫీ పాల్గొన్నారు. -
తుంగభద్ర నదిలో ప్రమాదం ఇద్దరి మృతి
కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం ఎర్లదిన్నె వద్ద తుంగభద్ర నదిలో మునిగి తల్లీ కుమార్తెలు మృతి చెందారు. ఉరుకుణ్ణమ్మ (26) తన కుమార్తెలు నందిని (6), నాగేశ్వరి(8)తో కలసి తుంగభద్ర నదిలో చేపల సేకరణకు గాను తెప్పపై వెళ్లింది. దానికి రంధ్రం ఏర్పడి లోపలికి నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఉరుకుణ్ణమ్మ, నందిని నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందగా... నాగేశ్వరి మాత్రం ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుంది. -
తుంగభద్రలో పడి కర్నూలువాసి మృతి
అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ తుంగభద్ర నదిలో పడి మృతిచెందాడు. కర్నూలు వివేక్నగర్కు చెందిన రమేష్‌బాబు(52), శారద(47) దంపతులు జోగులాంబ దర్శనార్థం ఆదివారం అలంపూర్ వచ్చారు. తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగిన రమేష్‌బాబు ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడ్డాడు. వెంటనే ఒడ్డున కూర్చున్న శారద కేకలు వేయడంతో అక్కడున్నవారు రమేష్‌బాబును కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. రమేష్‌బాబు కర్నూలు జిల్లా కానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శారద అదే గ్రామంలో టీచర్‌గా పనిచేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయానికి మంగళవారం వరద నీటి ప్రవాహం తగ్గింది. ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి వచ్చే జలాలు మంగళవారం నిలిచిపోయాయి. జలాశయం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 1690 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 76.144 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 848.20 అడుగులుగా నమోదైంది. డ్యాం కెపాసిటీ 257 టీఎంసీలు. -
కృష్ణమ్మ పరవళ్లు!
సాక్షి, హైదరాబాద్/జూరాల: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కొద్దిరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవ్వడంతో ప్రాజెక్టుల్లో నీటి ఉధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మకు తుంగభద్ర కూడా తోడవ్వడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల్లోనే శ్రీశైలానికి సుమారు 11 టీఎంసీల నీరు రాగా, 57 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇక ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్, రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టులు దాదాపు నిండుకున్నాయి. నారాయణ్‌పూర్ ప్రాజెక్టు వద్ద రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల నుంచి నేడో, రేపో గేట్లను ఎత్తే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీశైలంలోకి 11 టీఎంసీల నీరు.. నాలుగు రోజులుగా తుంగభద్ర నదిలో కొనసాగుతున్న వరద ఉధృతి కారణంగా సుంకేశుల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలంలోకి భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. తుంగభద్ర నది ఉధృతికి కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలు కూడా తోడవ్వడంతో శ్రీశైలంలో ప్రవాహాలు మరింత పెరిగాయి. గురువారం 31 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా శుక్రవారం నాటికిఇది 57 వేల క్యూసెక్కులకు చేరింది. గురువారం 31.98 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ శుక్రవారం ఉదయానికి 35.68 టీఎంసీలకు.. సాయంత్రానికి 37.65 టీఎంసీలకు పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి 11 టీఎంసీల మేర నీరు చేరిన ట్లైంది. ప్రాజెక్టు పరీవాహకంలో వర్షాలు కొనసాగుతుండటం, ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉండటంతో నీటి నిల్వ మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 885 అడుగుల నీటి మట్టానికిగానూ 815.5 అడుగుల వద్ద నీరు ఉంది. మరో 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరితే విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిండుగా జూరాల, నారాయణపూర్.. ఎగువ కృష్ణా బేసిన్లో విసృ్తతంగా కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్, జూరాలకు ప్రవాహాలు పెరుగుతున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.12 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,363 క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు దాదాపు నిండింది. శనివారంతో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి దిగువకు 13,445 క్యూసెక్కుల నీటి ప్రవాహాలున్నాయి. ఇవన్నీ జూరాలలో వచ్చి చేరడంతో ఆ ప్రాజెక్టు సైతం శనివారంతో పూర్తిగా నిండనుంది. ప్రస్తుతం జూరాలలో 11.94 టీఎంసీల నీటి నిల్వకుగానూ 11.79 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్‌కు పరీవాహక ప్రాంతం నుంచి 34,150 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో విద్యుదుత్పత్తికి 32 వేల క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. నాలుగు టర్బైన్ల సాయంతో 156 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నారాయణపూర్ నిండటంతో ఇప్పటికే జూరాల నిండేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడి నుంచి నీటి విడుదలకు పూనుకున్నా ఆ నీరంతా శ్రీశైలానికి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తుంగభద్ర నుంచి వస్తున్న ప్రవాహాలకు ఎగువ కృష్ణా ప్రవాహాలు తోడైతే శ్రీశైలంలో భారీగా నీరు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 20 నుంచి దిగువ జూరాలలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఈ నెల 20 నుంచి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు జెన్కో డెరైక్టర్ వెంకటరాజం చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల, మూలమళ్ల గ్రామాల శివారులో దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాల్ని ఆయన పరిశీలించారు. -
ఇక ఇంటి ముందుకే ఇసుక !
కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం నేడోరేపో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మీకు ఇసుక అవసరం ఉందా..? ఇక దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్, ఈ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తారు. సీనరేజి చార్జీలు, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు. ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేసేం దుకు నిర్ణయించిన టీ సర్కార్ ఇసుకపై కొత్త విధానం ప్రకటించనున్నట్టు తెలిసింది. దీనికి మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. దీనిపై నేడోరేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. స్థానికులకు సీనరేజి ఉండదు తెలంగాణ ప్రాంతంలో నదులు, వాగులు, రిజర్వాయర్లలో డీ సిల్టింగ్, ప్రైవేట్ భూముల్లో డీసిల్టింగ్ చేయడం ద్వారా ఇసుక లభ్యత ఉంటుందని తెలి పింది. ఇసుకను 5 రకాలుగా విభజించారు. అందులో ఒకటి, రెండు రకాలుగా నిర్ధ్దారించిన వాటిలో ఇసుక రీచ్‌లను స్థానిక సంస్థలకు వదిలేస్తారు. స్థానికులు వీటి నుంచి గృహావసరాలు, స్కూల్ భవనం, కమ్యూనిటీ హాల్స్‌కు ఎలాంటి సీనరేజి చెల్లించకుండా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని కమిటీ తెలిపింది. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదు. గ్రామపరిధి దాటి రవాణా చేయడానికి వీల్లేదు. కేటగిరీ 3, 4, 5లకు సంబంధించి ఇసుక తవ్వకాలకు ‘వాల్టా’ చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. ఈ 3 కేటగిరీల్లో ఇసుక రీచ్‌లను గనులు, భూగర్భవనరుల శాఖ యంత్రాంగం నీటిపారుదల, రెవెన్యూ, భూగర్భ జలవనరులను సంప్రదిస్తుందని వివరించారు. జేసీల ఆధ్వర్యంలో కమిటీ తుంగభద్ర నది ఎడమవైపు, కృష్ణా, గోదావరి, రిజర్వాయర్ల బ్యాక్‌వాటర్, ఈ నదుల ఉపనదులు, రిజర్వాయర్లలో ఇసుక డీ సిల్టింగ్‌ను ఆ శాఖ గుర్తిస్తుందని మంత్రి ఉపసంఘం తెలిపింది. తరువాత సంబంధిత జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఇసుక రీచ్‌లకు సంబంధించి సాధ్యాసాధ్యాలను వాల్టా చట్టానికి లోబడి నిర్ణయిస్తుంది. వీటిలో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, సరఫరా బాధ్యతను తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ)కు అప్పగించనున్నట్టు పేర్కొంది. దీని కోసం అన్ని అనుమతులను టీఎస్ఎండీసీ నుంచి తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ‘పెసా’ చట్టం ప్రకారం ఇసుక విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు వసూలు చేస్తున్న సీనరేజి రూ. 40ను పెంచాలని ఉపసంఘం సిఫారసు చేసింది. ప్రస్తుతం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే.. నియంత్రణ పెంచాలని నిర్ణయించింది. వేధింపుల కట్టడికే.. ఇసుక రీచ్‌ల నుంచి రవాణా చేసే సమయంలో అధికారుల వేధింపుల నుంచి తప్పించడానికి కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది. తక్కువ ధరకు ఇసుక ప్రజలకు అందించాలన్న ఉద్దేశం మేరకు ప్రభుత్వమే సరఫరా చేయనుంది, ఇసుక కావాల్సిన వ్యక్తికి సొంత రవాణా వ్యవస్థ ఉంటే, సీనరేజి చార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. ఇక గతంలో క్వారీల అనుమతి తీసుకుని డబ్బు చెల్లించకుండా, వినియోగించుకుండా ఉన్న వాటిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఖరీదైన డోలమైట్, సున్నపురాయి, ఐరన్‌ఓర్, గ్రానైట్, బంగారం, వజ్రాలను బహిరంగ వేలంలో విక్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. క్వారీలకు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తహశీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది. -
రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: తుంగభద్ర నదిపై హవేరీ జిల్లాలో మరో రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవాలని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న కర్నూలు జిల్లా రైతాంగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఆమె ఉమాభారతికి శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఆగస్టు తర్వాత శ్రీశైలం డ్యాంకి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎగువ తుంగభద్రపై మరో డ్యాం నిర్మిస్తే జిల్లా రైతుల ఇబ్బందులు మరింత పెరుగుతాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు. -
పడవ బోల్తా: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో మంగళవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీట మునిగి మరణించారు. ఈ రోజు ఉదయం జాలర్లు తుంగభద్రలో చేపల వేటకు వెళ్లారు. ఆ క్రమంలో నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సహచర జాలర్లు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర జాలర్లు నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు జాలర్ల మృతదేహాలను తుంగభద్ర నుంచి వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతుల్లో ఒకరు స్థానికుడు కాగా, మరోకరు కర్నూలు జిల్లాకు చెందిన వాడని సహాచర జాలర్లు తెలిపారు. -
ప్రతిపల్లెకూ తాగునీరు
గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డలో తాగునీటి కష్టాలకు ఇక చెక్ పడినట్లే..! చెంతనే రెండు జీవనదులు ఉన్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదన్న బాధ ఇక ఉండదు..! జిల్లాలో సాగు, తాగునీటికి ఢోకా ఉండదని సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్ర కటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గద్వాల డివిజన్లోని 319 గ్రామాలకు మూడున్నరేళ్లలో రూ.600 కోట్ల వ్యయం తో పనులను చేపట్టే విధంగా వాటర్‌గ్రిడ్ ప్ర తిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం పథకానికి నిధులు సమకూరిస్తే మరో మూడేళ్లలో తాగునీటి సమస్య లేకుండా ప్రతి పల్లెకూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డిజైన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగానే జూరాల భారీ తాగునీటి పథకం స్థానంలోనే గ్రిడ్ ప్రధాన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సంకల్పించారు. ఇప్పటివరకు ఈ పథకంలో పైపులైన్లలో పగుళ్లకు కారణమైన కాంట్రాక్టర్, పైబర్ పైపు ల ఏర్పాటుపై సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఫైబర్‌పైపుల స్థానంలో డీఐ పైపులు వేసి ప్రతిపల్లెకు తాగునీటిని అందించాలని సంకల్పించారు. ఆ నాలుగు గ్రామాలకు లేనట్లే..! గద్వాల మండలంలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామం, అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నది అవతలివైపున ఉన్న ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాలకు మంచినీటి గ్రిడ్ ద్వారా నీటిని పంపింగ్చేసే అవకాశం లేదు. ఈ నాలుగు గ్రామాలకు ప్రత్యేకంగా తాగునీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తారు. నడిగడ్డ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి తెలిపారు. గ్రిడ్ రూపక ల్పన ఇలా.. జూరాల తాగునీటి పథకాన్ని తాగునీటి గ్రిడ్‌లో అనుసంధానం చేస్తారు. జూరాల రిజర్వాయర్ నుంచి జూరాల తాగునీటి పథకం ఫిల్టర్బెడ్స్వరకు నీటినిపంపింగ్ చేస్తా రు. అక్కడ శుద్ధిచేసిన నీటిని 4.5 కి.మీ దూరంలో ఉన్న కొండగట్టుపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తారు. కొండగట్టు పైనుంచి నందిన్నె మీదుగా ఒకలైన్, బూరెడ్డిపల్లి మీదుగా మరో ప్రధానలైను, చింతరేవుల మీదుగా మూడో ప్రధానలైన్లలో డీఐ పైపులను 300 కి.మీ మేర వేస్తారు. గట్టు మండలంలో ఈ పథకం ద్వారా తాగునీరు అంద ని గ్రామాలకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గజ్జెలమ్మగుట్టపై రిజర్వాయర్‌ను ఏర్పాటుచేసి అక్కడికి నీటిని పంపింగ్చేస్తారు. అక్కడి నుండి గ్రావిటీఫ్లో ద్వారా గట్టు మండలంలోని పడమటి గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే విధంగా డిజైన్‌ను రూపకల్పన చేశారు. గద్వాల నియోజకవర్గంలో 171 గ్రామాలు, అలంపూర్ నియోజకవర్గంలో 148 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు హెచ్డీ పైపులతో గ్రామాలకు మంచినీటి లింకులను ఏర్పాటుచేస్తారు. ఈ పైపులను రెండు నియోజకవర్గాల్లో 800కి.మీ పొడవునా నిర్మిస్తారు. ఇలా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు సమగ్ర నమూనాను రూపొందించారు. -
తుంగభద్రకు కొనసాగుతున్న వరదనీరు
మహబూబ్‌నగర్ : తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1632 అడుగులుకు ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,66,706 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,89254 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 0.33 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 289 అడుగులకు ఉంది. మరోవైపు తుంగభద్రలోకి ఒకేసారి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో రాజోలి సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. దీంతో పాత గ్రామంలోని మాలగేరి, ఎస్సీ కాలనీ, మార్లబీడు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
పోటెత్తిన తుంగభద్ర
మంత్రాలయం రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని టీబీ డ్యాం నిండటంతో అధికారులు దిగువకు భారీ ఎత్తును నీటిని వదులుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ నీరు మంత్రాలయానికి చేరాయి. పరవళ్లు తొక్కుతున్న నదిని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. దీంతో నది తీర ప్రాంతంలో సందడి కనిపించింది. వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలను తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ సీసీ నాగార్జునరెడ్డిలు అప్రమత్తం చేశారు. ఆర్డీఎస్కు జలకళ.. కోసిగిరూరల్: అగసనూరు సమీపంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) జలకళను సంతరించుకుంది. ఆర్డీఎస్ ఆనకట్టపై నుంచి సుమారు 4 అడుగుల ఎత్తులో నీరు దిగువకు ప్రవహిస్తున్నాయి. వరద నీటిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి రంగనాథ్ పరిశీలించారు. టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువగా నీరు వదిలే అవకాశం ఉన్నందున తీరప్రాంత గ్రామల ప్రజలు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జలమయమైన పొలాలు కౌతాళం: తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని తీర ప్రాంత పొలాలు జలమయమయ్యాయి. విద్యుత్ మోటర్లు నీటమునిగాయి. మేళిగనూరు, వల్లూరు, కుంబళనూరు, మరళి, గుడికంబాల గ్రామాల్లో పత్తి, ఉల్లి పైర్లకు నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది తమకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని రైతులు తెలిపారు. -
ఆర్డీఎస్ రగడ
గద్వాల: ఆదినుంచీ అదే రగడ.. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) నీటి వివాదం మరోసారి రాజుకుంది. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై హెడ్‌వర్క్స్ వద్ద స్పిల్‌వే గోడపై కాంక్రీట్ పనులను ఆదివారం కర్నూలు రైతుల బృందం అడ్డుకుంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునికీకరణకు రూ.92 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హెడ్‌వర్క్స్‌లో స్పిల్వేగోడపై అరడుగు మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది. రాయిచూర్ జిల్లా వైపు వంద అడుగుల మేర కాంక్రీట్‌ను గతేడాది వేశారు. ప్రస్తుతం కుడివైపు కర్నూలు జిల్లా నుంచి కాంక్రీట్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించాడు. కాగా, విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి నేతృత్వంలో రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఇదీ ఆర్డీఎస్ క(వ్య)థ..! ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 87,500ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. స్లూయీజ్ రంధ్రాలు కాల్వలు అధ్వానంగా మారడంతో 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీనికితో డు 1992లో ఆర్డీఎస్ స్లూయీజ్ రంధ్రాల కర్రషట్టర్లను రాయలసీమ ప్రాంతానికి చెం దిన కొందరు నాటు బాంబులతో బద్దలుకొట్టారు. స్పందించిన ప్రభుత్వం ఇనుపషట్టర్లను ఏర్పాటు చేయించింది. ఈ ఘటన అ ప్పట్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతుల మధ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ క్రమంలో కర్నూలు రైతులు తుంగభద్ర నదికి కుడివైపున తాగునీటి పథకాలు, వ్యవసాయ అవసరాలకు నీళ్లు రాకుండా షట్టర్ల ద్వారా అడ్డుకుంటున్నారని, వాటిని తగ్గించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. 2002లో అప్పటి ప్రభుత్వం షట్టర్ల వ ద్ద మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరుచేసింది. కర్ణాటక అధికారులు పనులు ప్రారంభించిగా కర్నూలు రైతులు అడ్డుకున్నారు. ఇదిలాఉండగా, దశాబ్దాలు గా నలుగుతున్న ఆర్డీఎస్ సమస్యకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరి ష్కారం చూపుతామని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీఇచ్చారు. ఆ మాదిరిగానే 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరుచేశారు. ఇందులో కర్ణాటకలో రూ.72 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో రూ.20కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించాలి ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడం సరికాదు. ఎవరికి నష్టం చేసే పనుల్లేవు. కేవలం అక్కడి ప్రాంత రైతుల మెప్పు కోసమే నాయకులు అలా చేస్తున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చిన నిధుల ఆధునికీకరణ పనులు కొనసాగుతుంటే అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సుంకేసుల బ్యారేజీని తొలగించి నీటిమళ్లింపు పథకంలా పాత లెవల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలి. - తనగల సీతారాంరెడ్డి,ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ -
తుంగభద్రకు తూట్లు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నదీ తీర ప్రాంతాల్లో మాఫీయా మాటేసింది. లాభాలు అధికం కావడంతో అక్రమార్కులు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటం లేదు. అధికారులను నయానోభయానో దారికి తెచ్చుకుంటూ బేరం కుదుర్చుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారికి వాటాలు ముడుతుండటంతో వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది. ప్రధానంగా నదీ తీర గ్రామాలైన నిడ్జూరు, మనగాలపాడు, పంచలింగాల, ఇ.తాండ్రపాడు, దేవమాడ, పడిదెంపాడు, పూడూరు నుంచి రాత్రి 10 గంటల తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుక తరలింపు జోరందుకుంటోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తూ.. ఆ తర్వాత జేసీబీలతో లారీల్లోకి నింపి హైదరాబాద్, శంషాబాద్, బళ్లారి తదితర సుదూర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైరదాబాద్‌లో డిమాండ్ దృష్ట్యా లారీ ఇసుక ధర లక్ష రూపాయలకు పైనే పలుకుతోంది. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక టీములు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జాతీయ రహదారి, ఇసుక తరలించేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంది. అయితే టీమ్ సభ్యులు తీరిక సమయాల్లో చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. కొందరు సభ్యులు ఒక్కో వాహనానికి రేటు కట్టి వసూలు చేస్తుండటం కూడా తరలింపునకు మార్గం సుగమం చేస్తోంది. తనిఖీల్లో ట్రాక్టర్లు పట్టుబడితే ఆయా ప్రాంతాల్లోని వీఆర్వోలు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు దండుకుంటున్నారు. గత నెల 18న ఏర్పాటైన టీమ్ ఇప్పటి వరకు 24 ట్రాక్టర్లు, రెండు లారీలను మాత్రమే సీజ్ చేయడం వారి పనితీరుకు నిదర్శనం. ఆదాయం అధికంగా ఉండటంతో ఓ ఆర్ఐ తన విధులను పక్కనపెట్టి ఇసుక లారీలపైనే అధికంగా దృష్టి సారిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరో సీనియర్ అసిస్టెంట్.. పట్టణం, గ్రామీణ ప్రాంతానికి చెందిన వీఆర్వోలు.. ఇటీవల వీఆర్వోలుగా విధుల్లో చేరిన మరో ఇద్దరు అక్రమ వసూళ్లలో తలమునకలవుతున్నారు. నదీ తీర గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా వీరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పత్రికల్లో వార్తలు ప్రచురితమైన మరుసటి రోజు ఆర్డీఓ, తహశీల్దార్లు హడావుడి చేస్తున్నా ఆ తర్వాత షరా మామూలే. వారం రోజుల క్రితం ఏపీ28 టీఈ 2349 లారీని సీజ్ చేశారు. నాలుగు రోజులకే ఆ వాహన యజమానితో ఓ ఆర్ఐ రూ.25 వేల జరిమానా కట్టించి.. సుమారు రూ.75 వేలు తన ఖాతాలోకి వేసుకున్నట్లు ఆ శాఖ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. పంచలింగాల, దేవమాడ గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులే నేరుగా హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన బిల్డర్లతో మాట్లాడుకుని మొబైల్ టీమ్ సభ్యుల సహకారంతో రోజూ పదుల సంఖ్యలో లారీలను తరలించేస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనాలను సీజ్ చేస్తే రవాణాకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంది. భూగర్భ, గనుల శాఖ అధికారులతో పాటు తహశీల్దార్లకు ఆ వివరాలను తెలియజేసి వారి స్పందన మేరకు వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. ట్రాక్టరుకు రూ.12 వేల నుంచి రూ.25 వేలు.. లారీకి రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా వేసి 30 రోజుల పాటు సీజ్ చేసిన అధికారి పరిధిలోనే వాహనం ఉంచుకోవాల్సి ఉన్నా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఫ్యాక్టరీ వల్లే దుర్వాసన
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల వల్లే తుంగభద్ర నదీ తీరం వె ంట ఉన్న కాలనీల్లో దుర్వాసన వస్తోందని మానవహక్కుల వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మూ డు వారాలుగా సమస్య తీవ్రం కావడంతో సోమవారం వేదిక నాయకులు జమ్మిచెట్టు, సుబ్రహ్మణ్యం మఠం, చిత్తారి వీధి, ఖండేరి ప్రాంతాల్లో పర్యటించారు. నదిలో గుంతలు పడ్డ పలుచోట్ల దుర్వాసనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మూడు వారాలుగా దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజాసంఘాలు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చే స్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గుంతల్లో పాచీ పేరుకుపోయి దుర్వాసన వస్తోందని చెబుతున్నా దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కె మికల్ వ్యర్థ పదార్థాల వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. తుంగభద్రలో నీటి ప్రవాహం లేక భరించలేని దుర్వాసన వస్తోందన్నారు. వేదిక ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి, ఆల్కాలీస్ ఫ్యాక్టరీ యజమానులను కలసి సమస్యను వివరిస్తామన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో మానవ హక్కు ల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సోష ల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అబ్దుల్ వారిస్, దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీజీవీ పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి
తుంగభద్రనది పరిసర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అఖిలపక్ష పార్టీల నేతల డిమాండ్ కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తుంగభద్ర నది సమీపంలో రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేశ్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లైడ్ కెమికల్స్, శ్రీరాయలసీమ హైపో హైస్ట్రెంత్ (టీజీవీ గ్రూప్) పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగరం బీఏఎస్ కల్యాణ మండపంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభార్‌రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీజీవీ గ్రూప్ పరిశ్రమల కాలుష్యంతోతుంగభద్ర నది జలాలన్నీ కలుషితం అవుతున్నాయన్నారు. తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల గ్రామాల పొలాలన్నీ కలుషితమై బీడుభూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ.. తుంగభద్రనది కలుషితం కావడంతో పాతనగరంలోని ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూలేదని, దీనికి కారణాలు విశ్లేషించి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు, టీజీవీ గ్రూప్ పరిశ్రమల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. సమస్యకు పరిష్కారం వెతికి ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల బాధ్యతా రాహిత్యాన్ని సీపీఐ, లోక్‌సత్తా, బీఎస్పీ, సమాజ్‌వాది తదితర పార్టీల నాయకులు ఎండగట్టారు. సీపీఐ జిల్లా నాయకులు ఎ.శేఖర్, లోక్‌సత్తా జిల్లా నాయకులు డేవిడ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీఎస్పీ కర్నూలు నియోజకవర్గ నాయకులు మౌలాలి, రాజేశ్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఇ.పుల్లారెడ్డి, సత్యనారాయణగుప్త పాల్గొన్నారు. -
బీడు బతుకులు
ఆదోని/ఆలూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. సగటు వర్షపాతం 1200 మిల్లీమీటర్లు కాగా.. ఈ ప్రాంతాల్లో 500 మిల్లీమీటర్లు కూడా మించని పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెట్టడమే కానీ.. ఏనాడు లాభాలు ఎరుగని దయనీయం. అందునా నల్లరేగడి భూములు కావడంతో ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అరకొర వర్షాలతో రైతన్న ఏటా ఆర్థికంగా చితికిపోతున్నాడు. పంటల సాగుకు ప్రత్యామ్నాయ జలవనరులు లేక చాలా మంది భూములను బీడు పెట్టుకుంటున్నారు. ఫలితంగా వేలాది మంది చిన్న, మధ్య తరగతి రైతులు పొట్ట చేతపట్టుకుని గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి తదితర నగరాల వైపు అడుగులేస్తున్నారు. ఆదోనిలో పుట్టి పెరిగిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక తమకు మంచి రోజలు వస్తాయని ఆశించిన ఆలూరు, ఆదోని, హొళగుంద, చిప్పగిరి, హాలహర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల ప్రజలకు నిరాశే మిగులుతోంది. తుంగభద్రకు ఉపనది అయిన వేదావతి ఆధారంగా సాగునీటి పథకాలు నిర్మిస్తే ఈ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. ఈ ప్రాంత రైతాంగాన్ని టీజీతో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాగునీటి పథకాల నిర్మాణానికి అధికారులు పంపిన ప్రతిపాదనలు పాలకుల కార్యాలయాల్లో బూజు పట్టిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుర్భర జీవనం గడుపుతున్నారు. చెంతనే నీరున్నా... కృష్ణా బేసిన్-9 పరిధిలోని తుంగభద్రకు వేదావతి ఉపనది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ప్రవహిస్తున్న ఈ నదిలో దాదాపు 87.8 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా ట్రిబునల్ అంచనా వేసింది. 75 శాతం సగటు లభ్యతను లెక్కించి 56.4 టీఎంసీలు కరువు పీడిత ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో మన రాష్ట్రానికి 12.47 టీఎంసీలు, కర్ణాటకకు 38.07 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సైతం నోరుమెదపకపోవడం రైతులకు శాపమవుతోంది. -
సుంకేసుల సీమాంధ్రదే..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో తుంగభద్ర నదిపై నిర్మించిన అతిపురాతనమైన సుంకేసుల బ్యారేజ్ ఏ ప్రాంతానికి చెందుతుందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, బ్యారేజ్ మొత్తం కర్నూలు జిల్లాలోని సుంకేసుల గ్రామ పంచాయితీ పరిధిలోనే ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని సీమాంధ్రకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ‘సుంకేసుల’ సరిహద్దుకు సంబంధించిన పూర్తి వివరాలతో వారు రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందాన్ని(జీఓఎం) కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. జీఓఎంకు సమర్పించేందుకు వారు ఒక సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో రిటైర్డు డీఈ వెంకట్రావు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. అయితే, వారికి రెండు మూడు రోజుల్లో తమను కలిసే అవకాశం ఇస్తామని జీవోఎం చెప్పినట్టు తెలిసింది. అధికారుల వాదన ప్రకారం.. కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజక వర్గంలోని కర్నూలు మండలం.. మహబూబ్‌నగర్ జిల్లా, వడ్డెపల్లి మండలం మధ్యలో నిర్మించిన సుంకేసుల బ్యారేజ్ రెవెన్యూ రికార్డుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు, కడప జిల్లాల ఆయకట్టు రైతులకు సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. సుంకేసుల గ్రామ రెవెన్యూ సరిహద్దు.. బ్యారేజ్‌కి అవతలవైపున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి గ్రామంలో ఉండేది. బ్యారేజీ అవతలివైపు ఉన్న భూములను సుంకేసుల గ్రామ రైతులే సాగుచేసేవారు. 1980 వరకు రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమెర సరిహద్దు రాయి ఉండేదని స్థానికులు చెపుతున్నారు. అయితే బ్యారేజి నిర్మాణానంతరం అవతలివైపు సుంకేసుల వాసులు సాగుచేసుకుంటున్న భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని వారు వెల్లడించారు. సీమాంధ్ర రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమ వాదనలకు ఆధారంగా బ్రిటిష్ కాలంనాటి రెవెన్యూ మ్యాప్‌లను చూపుతున్నారు. బ్రిటీష్ కాలంలో రామళ్లకోట తాలూకా ఉన్న సమయంలోని సుంకేసుల రెవెన్యూ సరిహద్దు మ్యాప్ ఆధారంగా తుంగభద్రనదిలో సుమారు 390 ఎకరాలు ఉన్నాయని వివరిస్తున్నారు. తెలంగాణదే అనడానికి ఆధారాలు లేవు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా సుంకేసులపై తమకు హక్కుందని వాదిస్తున్నారని ఆ రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమేర సరిహద్దు రాయి ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తెలంగాణ వారు ప్రస్తావిస్తున్నారని, అయితే, వరదల్లో ఆ రాయి కొట్టుకుపోయి ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 1న సుంకేసుల జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ బ్యారేజి సరిహద్దులపై కర్నూలు జిల్లాకు చెందిన అధికారులతో వాదించారు. అయితే ప్రాజెక్టు రిపోర్ట్, సుంకేసుల రెవెన్యూ గ్రామ సరిహద్దు రికార్డుల ప్రకారం బ్యారేజ్‌పై మహబూబ్‌నగర్ వారికి ఎటువంటి హక్కులేదని కర్నూలు జిల్లా అధికారులు వారికి వివరించారు. సుంకేసుల బ్యారేజ్ నేపథ్యం 1861లో డచ్ కంపెనీ వారు వ్యాపార సౌలభ్యం కోసం తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టారు. ఆ తరువాత ఎన్టీ రామారావు 1985లో బ్యారేజీగా మార్చి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం 1998లో రూ.8కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో నిర్మాణం పూర్తయింది. -
ఇసుక తవ్వకాల్లో కొట్లాట
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇసుక అక్రమ రవాణా వ్యవహారం మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లోని రెండు సరిహద్దు గ్రామాల మధ్య దాడులకు దారి తీసింది. కర్రలతో కొట్టకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కొందరు ఇసుక అక్రమ రవాణాదారులు రాయలసీమలోని కర్నూలు జిల్లా మునగలపాడు వైపు వచ్చి ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం ఇసుకను తోడుకునేందుకు మునగాలపాడు సమీపంలోని తుంగభద్ర నది వద్దకు చేరుకున్నారు. నదిలో తాగునీటి పథకానికి చెందిన పైప్లైన్లు ఉన్నాయని.. ఇటువైపు రావద్దని అక్కడున్న వాటర్‌మన్ మద్దిలేటి వారించినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మద్దిలేటి కర్నూలు తహశీల్దారుకు ఫిర్యాదు చేశాడు. విష యం తెలుసుకున్న పుల్లూరు వాసులు అతనిపై దాడిశారు. దీంతో ఇరుగ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని పరస్పరం దాడులకు దిగారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. కర్నూలు పోలీసులు రావడంతో పుల్లూరు వాసులు పరారయ్యారు. మిగిలిన వారిలో కొంతమంది పోలీసులపై దాడికి యత్నించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
తుంగభద్ర నదిపై ఆనకట్ట నిర్మాణానికి కదలిక
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: నగర సమీపంలో తుంగభద్ర నదిపై ఆనకట్ట, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. డీటైల్ ప్రాజెక్టు సర్వే చేసేందుకు నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నిర్మాణంతో నదికి అవల వైపు గ్రామాల ప్రజలు గ్రామాలకు రాకపోకలు సులభం కానున్నాయి. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమడ, పూలతోట, సుందరయ్య నగర్, వసంతనగర్, దొడ్డిపాడు, మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద శింగవరం, అలంపూర్, చిన్న శింగవరం, భైరాపురం, కాశాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం లాంచీలు, పుట్టిల సహాయంతో తుంగభద్ర నదిపై కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు. ఆయా గ్రామాల ప్రజలు నగరానికి రోడ్డు మార్గంలో నగరానికి రావాలంటే 18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. బస్సు చార్జీలు ఖర్చు అధికమవుతుండటంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిపైనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 2009లో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు నదీ తీర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ప్రజల మాటున ప్రజాప్రతినిధి కోసం: నదీ తీర ప్రాంత ప్రజల అవసరాల కోసమైతే వంతెన మాత్రమే నిర్మించాల్సి ఉంది. అయితే ఓ ప్రజాప్రతినిధి తన ఫ్యాక్టరీలకు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసమే ఆనకట్ట, రోడ్డు నిర్మిస్తున్నారని ప్రతి పక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణంపై నదీ తీర గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిపై రూ. 64 కోట్లతో ఆనకట్ట, రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మే నెలలో కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు సర్వే చేసేందుకు జూలైలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం రూ. 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించింది. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఐడియల్ ఏజెన్సీ రూ.27 లక్షలకే సర్వే టెండరును దక్కించుకుంది. సర్వే చేసేందుకు ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే గడువు విధించినట్లు ఇరిగేషన్ ఎస్ఈ ఆర్. నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా గుండ్రేవుల ప్రాజెక్టు సర్వే, సుంకేసుల జలాశయ పూర్తి స్థాయి మరమ్మతులకు నిధులు రెండులు మంజూరు చేయడం లేదు. -
అక్రమార్కుల దెబ్బకు తరిగిపోతున్న ఇసుక దిబ్బలు
తుంగభద్ర నదీతీరప్రాంత గ్రామాలకు పెట్టని కోటగా.. ప్రకృతి ప్రసాదించిన రక్షాకవచంగా నిలిచిన ఇసుక దిబ్బలు అక్రమార్కుల దెబ్బకు కరిగిపోతున్నాయి. వారికి కాసులు కురిపిస్తూ.. జనాన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడకపోతే.. భారీ వర్షాలకు ఊళ్లన్నీ జలఖడ్గానికి బలయిపోతాయి. అప్పుడు ప్రజలకు మిగిలేది కన్నీళ్లే.. పర్యావరణవేత్తలు చేస్తున్న ప్రమాద హెచ్చరికలివి. అయినా కొందరు అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్క పంచలింగాల గ్రామంలోనే ఇసుక అక్రమరవాణా వ్యాపారం నెలకు రూ. 20కోట్లపైమాటే. ఇసుకాసురుల నుంచి వచ్చే నజరానాలు వారి కళ్లు కప్పేస్తున్నాయని జనం దుమ్మెతిపోస్తున్నారు. జాతీయ రహదారిపైనే నిత్యం వందల వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా సంబంధిత శాఖలేవీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జేసీ ఆదేశాలు బేఖాతర్.. తుంగభ్రద నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్రమార్కులు అనుమతులు లేకుండా తవ్వుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు రంగంలోకి దిగారు. తానే స్వయంగా అర్ధరాత్రి వేళ తనిఖీలు చేశారు. నిజమేనని నిర్ధారించారు. ఇసుక మాఫియాకు అధికారుల సహకారాన్ని నిగ్గు తేల్చారు. పద్ధతి మార్చుకోవాలని కఠినంగా హెచ్చరించారు. అయినా ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. ఇసుక రవాణాదారులతో చేతులు కలిపి ‘రాత్రి వేళల్లో తరలించండి.. తనిఖీలుండవు’ అని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే జేసీ తనిఖీల తర్వాత కూడా అక్రమ రవాణా ఆగలేదు. పైగా మాఫియానే ఉన్నతాధికారుల కదిలికలపై కౌంటర్ నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. వీరికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల నుంచి మంచి తోడ్పాటు అందుతోంది. పంచలింగాల, మునగాలపాడు, దేవమడ గ్రామాల వద్ద నుంచి రోజూ రాత్రి వేళ 50 నుంచి వంద లారీల ఇసుక తరలిస్తున్నారు. నిజానికి పంచలింగాలలో అధికారికంగా ఇసుక రేవులు లేవు. ఇక్కడ తవ్వుతున్నవన్నీ అనధికారిక క్యారీలే. ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి రాత్రి వేళ క్షణాల్లో జేసీబీల ద్వారా లారీలకు లోడింగ్ చేసి హైదరాబాద్‌కు పంపుతున్నారు. ప్రైవేటు స్థలాల్లో డంపింగ్.. ఉన్నతాధికారులు తనిఖీ చేసినా దొరకకుండా ఇసుకాసురులు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రైవేటు స్థలాల్లో డంప్ చేసి రహస్యంగా అక్కడి నుంచి అవసరం మేరకు తరలిస్తున్నారు. పంచలింగాలలో నిత్యం మూడు, నాలుగు డంప్‌లలో 40, 50 లారీలకు సరిపడా ఇసుక నిల్వలు ఉంటాయి. ఈ ఇసుకను స్థానిక నిర్మాణాల కోసం అన్నట్లుగా ఇసుక కుప్పలు పోస్తున్నారు. రాత్రివేళ తరలిస్తున్నారు. ఇటీవల అక్రమార్కులపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడడంతో పంచలింగాల నదిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అవతలి గట్టున ఉన్న పుల్లూరు గ్రామంలోని బీడు భూములను లీజుకు తీసుకొని అక్కడ డంపింగ్ చేసి.. అక్కడ్నుంచి లారీల్లోకి లోడింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు 50 లారీలకు పైగా అక్రమంగా తరలిస్తున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు దూరంలోనే ఇదంతా జరుగుతున్నా.. కర్నూలు నుంచి జేసీ కన్నబాబు వచ్చి తనిఖీ చేయడం మినహా.. ఏ అధికారీ పట్టించుకోవట్లేదు. ఇసుక డంపులను సీజ్ చేసిన కలెక్టర్... అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్టే వేసేందుకు స్వయంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి నడుంబిగించారు. గురువారం కలెక్టర్, ఎస్పీ రఘురామిరెడ్డితో కలిసి పంచలింగాల గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డంపులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, రవాణా శాఖ అధికారుల సహకారంతో గురువారమే అక్కడ్నుంచి వీలైనంత ఇసుకను తరలించాలని హౌసింగ్ పీడీ రామసుబ్బుకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక తనిఖీలు చేయాలని కలెక్టర్ నిర్ణయించడంతో.. జాతీయ రహదారిపైన నిరంతరం నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. -
తవ్వుకో.. అమ్ముకో!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది కేంద్రంగా ఇసుక మాఫియా విజృంభిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలో ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇసుక రీచ్‌లను అధికారికంగా ఎవరికీ అప్పగించకపోవడంతో జేసీబీ ఓనర్లు మొదలుకొని లారీలు, ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా తుంగభద్ర ఇసుకను తరలించకుపోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గత నెలరోజులుగా సాగుతున్న ఈ అక్రమ ఇసుక రవాణా ఇటీవలికాలంలో ఎక్కువవడంతో విజిలెన్స్ అధికారులు శనివారం సర్వసాధారణంగా జరిపిన దాడిలో 9 లారీలు పట్టుబడ్డాయి. అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఉంటే ప్రతిరోజు వందలాది లారీలు, ట్రాక్టర్లు తుంగభద్ర నదీ తీరంలో అడ్డంగా దొరికిపోతాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. తుంగభద్ర నదీ తీర గ్రామాలైన పంచలింగాలతో పాటు మునగాలపాడు నుంచి నిత్యం లారీల్లో అక్రమంగా ఇసుక తరలుతోంది. ఇక్కడి స్థానికులే ఈ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులు. సాధారణంగా ప్రభుత్వ రాయల్టీ చెల్లిస్తేతప్ప ఇసుక రవాణాకు అవకాశం ఉండదు. కానీ పంచలింగాలలో కొందరు అక్రమార్కుల వద్ద పదికి పైగా జేసీబీలు ఉన్నాయి. వీటి ద్వారానే ఇసుకను లారీల్లో నింపి హైదరాబాద్, శంషాబాద్, కడప వంటి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 50 లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం. విషయం అధికారులకు తెలిసినా అక్రమార్కులను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతి పొందితే ఒక్కో లారీకి(17 టన్నులు) ప్రభుత్వ రాయల్టీ కింద రూ.4వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రీచ్‌లలో ఎవరికీ అనుమతి లేకపోవడంతో రాయల్టీ కూడా అక్రమార్కులకు మిగిలిపోతోంది. ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పూర్తిగా అక్రమ రవాణా కావడంతో 17 టన్నుల లారీలో అంతకు మించి ఇసుకను తరలిస్తున్నా అడ్డుకునే అధికారులు లేకుండాపోయారు. దీంతో ఇసుకాసురులు ఒక్కో లారీలో దాదాపు 20 నుంచి 50 టన్నుల మేర రవాణా చేస్తూ దానిని రూ.50 వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం గమనార్హం. తరులుతోందిలా... ప్రతి రోజూ తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటలు, రాత్రి 10 నుంచి 1 గంట వరకు నగరంలోని సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారి ఇసుక ట్రాక్టర్ల మోతతో మారుమ్రోగుతోంది. ప్రస్తుతం నదిలో నీరు తగ్గడంతో పూడూరు, పంచలింగాల గ్రామాల్లో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను నది నుంచి తోడేసి పంచలింగాల, మహబూబునగర్ జిల్లా సరిహద్దు గ్రామమైన పుల్లూరు సమీపంలో భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి నుంచి జేసీబీల సహాయంతో ప్రతి రోజు కనీసం 30 నుంచి 40 లారీలకు పైగానే హైదారబాద్కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కలిసొచ్చిన ఉద్యోగుల సమ్మె జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అయితే ఈ మొబైల్ టీంలు నదికి వరద నీరు రావడంతో తనిఖీలు చేయడం లేదు. రెవెన్యూలోని అధికారులంతా సమ్మెలో ఉండగా ఇద్దరు వీఆర్వోలు మాత్రం ఆన్ డ్యూటీ అంటూ రెండు వారాల క్రితం వరకు ఇసుకాసురుల నుంచి భారీగా అక్రమ వసూళ్లు చేశారు. ఇక రాత్రి విధుల్లో ఉండే పోలీసులు వాహనాలను నిలిపి ఒక్కో ట్రాక్టర్ కు రూ.500 ప్రకారం వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. నాల్గో పట్టణ పోలీసు స్టేషన్లో పని చేసే ఇద్దరు హోంగార్డులు రాత్రయితే చాలు జాతీయ రహదారిపై నిలబడి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 9 లారీలు సీజ్ శనివారం రాత్రి పంచలింగాల సమీపంలో డంపు చేసిన ఇసుకను లారీల్లో నింపుతున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా.. వారి రాకను పసిగట్టిన లారీ డ్రైవర్లు, కూలీలు పరారయ్యారు. అక్కడ ఇసుక నింపుకుంటున్న 3 లారీలను అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి నుంచి అంతకు ముందే 6 లారీలు కడపకు బయలుదేరిన సమాచారం స్థానికులు ఇవ్వడంతో ఓర్వకల్లు మండల సమీపంలో వాటిని వెంబడించి పట్టుకుని సీజ్ చేశారు. డంపు దగ్గరున్న వాహనాలను అక్కడి నుంచి తరలించడం కోసం విజిలెన్స్ అధికారులు తీవ్రంగా శ్రమించారు.