మృతదేహం కోసం నదినీటిలో పుట్టితో వెతుకుతున్న రాము కుటుంబ సభ్యులు
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకే కాదు.. ప్రాణాలను కూడా కాపాడుతామని ఓ పోలీసు చాటి చెప్పాడు. ప్రమాదవశాత్తు తుంగభద్రనదిలో ఎనిమిది మంది కొట్టుకుపోతుండగా ఓ ఎస్‌ఐ సాహసం చేసి ఏడుగురిని రక్షించారు. మరో వ్యక్తిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కందకూరు గ్రామంలో సోమవారం తుంగభద్ర నదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గల్లంతు కాగా.. ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు.
– మంత్రాలయం/కోసిగి
ఏటా శ్రావణ మాసం ఆఖరి సోమవారం ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి కోసిగి మండలం కందకూరు గ్రామం చేరుకుంటుంది. తుంగభద్రమ్మ నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో పవిత్ర నదీజలంలో ఉత్సవమూర్తికి పుణ్యస్నానం చేస్తారు. ఆనవాయితీలో భాగంగా కందకూరు వేడుకను తిలకించేందుకు నది అవతలి వైపు ఉన్న కర్ణాటక రాష్ట్రం మాన్వి నియోజకవర్గం పొన్నూరు గ్రామం నుంచి రాము, శేఖర్, చాకలి నాగరాజు, హనుమేష్, బసవరాజ్, ఆంజనేయ, దేవరాజుతో కలిసి పుట్టిలో బయలు దేరారు. పుట్టి తుంగభద్ర నడి బొడ్డులోకి రాగానే అనుకోకుండా పుట్టిలోకి నీళ్లు ఉబికాయి. పుట్టి చోదకుడు యువరాజ్ వెంటనే నీళ్లు తోడేయండని చెప్పి తెడ్డుతో పుట్టిని ముందుకు నడపసాగాడు. అయితే హడావుడితో యువకులు నీళ్లను తోడేసే క్రమంలో ఒక్కపాటుగా జరిగారు. ఇంతటితో నీటి ఉధృతికి పుట్టి ఒక్కసారిగా బోల్తా పడింది. రెండు రోజుల క్రితం తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదిలో పడి పోయిన వారికి ఈత వచ్చినా ఒడ్డు చేరలేకపోతున్నారు. మరోవైపు భయంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇవతలి వైపు ఒడ్డున ఉన్న భక్తులు కేకలు వేశారు.
ఎదురీది..
ఉరకుంద ఈరన్న స్వామి పల్లకి అప్పటికే నది ఒడ్డుకు చేరుకుంది. పూజలు అనంతరం ఉత్సవమూర్తికి జలాభిషేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా బందోబస్తుగా వెళ్లిన పెద్దతుంబళం ఎస్‌ఐ శ్రీనివాసులు ఈత సరదాతో అప్పటికే నదిలోకి దిగారు. అదే సమయంలో అతనికి 100 మీటర్ల దూరంలో పుట్టి మునిగి ఎనిమిది మంది నదిలో పడ్డారు. గమనించిన ఎస్‌ఐ వారిని రక్షించేందుకు సాహసం చేశారు. నదిలో పడిన భయంతో కేకలు వేస్తున్న వారిని సమీపించి వారికి ధైర్యం చెప్పి ఏడుగురిని నదిలో నిలబడే స్థాయిలో నీళ్లు ఉండే చోటుకి చేర్చారు. అనుమన్న, యల్లమ్మ రెండో కుమారుడు రాము(22) ఎస్‌ఐ చేతికందినట్లే అంది నీటి మునిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అప్పటికే అలసిపోయిన ఎస్‌ఐ చేసేదేమి లేక అక్కడి నుంచి ఆయాశపడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. సురక్షిత ప్రాంతం చేరుకున్న యువకులు అక్కడి నుంచి చిన్నగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోసిగి సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ ఇంతియాజ్‌బాష అక్కడికి చేరుకుని పుట్టి చోదకుడు యువరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గల్లంతైన యువకుడి మృతదేహం కోసం మాన్వి, ఎమ్మిగనూరు అగ్ని మాపక సిబ్బంది గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాయచూరు నుంచి ప్రత్యేక బోటును తెప్పించేందుకు సమాయత్తమయ్యారు. ప్రతి ఒక్కరు ఎస్‌ఐ సహసాన్ని అభినందించారు.
ఆశలు వదులుకున్నాం : శేఖర్, ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి
అనుకోకుండా ప్రయాణిస్తున్న పుట్టి అడుగుభాగాన చిల్లు పడి పుట్టిలోకి నీరు ఉబికింది. నీరు తోడేసే క్రమంలో అందరూ ఒక్కపాటున వచ్చాం. దీంతో ఉన్నపాటున ఒక్కవైపు బరువై పుట్టి బోల్తా పడింది. నిండునదిలో ఒరిగిపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం. ఎస్‌ఐ శ్రీనివాసులు దేవుడిలా వచ్చి మా ప్రాణాలకు ఆయువు పోశాడు. ఆయన సాహసం చేయకుంటే బతికేవాళ్లం తక్కువే.