
సాక్షి, కోస్గి (నారాయణపేట): అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి బతకలేమనుకున్నారో ఏమో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోగారం శివారులోని అమ్లికుంటలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్‌కు చెందిన యువకుడు శివకుమార్ (20) తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని నాగులపల్లికి చెందిన పదో తరగతి బాలిక (15) ప్రేమలో పడ్డాడు. ఈ నెల 27న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబీకులు వాకబు చేయగా ప్రేమ విషయం బయటపడటంతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మైనర్ కిడ్నాప్‌తో పాటు డబ్బులు దొంగతనం జరిగినట్టు శివకుమార్, అతని కుటుంబీకులపై ఫిర్యాదు చేశారు.
చదవండి: (యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు)
ఇరు కుటుంబాలు రాజీ చేసుకొని రెండ్రోజుల్లో బాలికను అప్పగిస్తామని లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కోస్గి మండలంలోని బోగారం చెరువు సమీపంలో అమ్లికుంటకు చెందిన ఓ రైతు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ప్రాథమికంగా విచారించగా సదరు ప్రేమజంటనే అని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment