
– హంపీ విహారయాత్రలో విషాద ఘటన
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది.
నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్‌రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment