సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది కేంద్రంగా ఇసుక మాఫియా విజృంభిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలో ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇసుక రీచ్‌లను అధికారికంగా ఎవరికీ అప్పగించకపోవడంతో జేసీబీ ఓనర్లు మొదలుకొని లారీలు, ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా తుంగభద్ర ఇసుకను తరలించకుపోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గత నెలరోజులుగా సాగుతున్న ఈ అక్రమ ఇసుక రవాణా ఇటీవలికాలంలో ఎక్కువవడంతో విజిలెన్స్ అధికారులు శనివారం సర్వసాధారణంగా జరిపిన దాడిలో 9 లారీలు పట్టుబడ్డాయి. అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఉంటే ప్రతిరోజు వందలాది లారీలు, ట్రాక్టర్లు తుంగభద్ర నదీ తీరంలో అడ్డంగా దొరికిపోతాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
తుంగభద్ర నదీ తీర గ్రామాలైన పంచలింగాలతో పాటు మునగాలపాడు నుంచి నిత్యం లారీల్లో అక్రమంగా ఇసుక తరలుతోంది. ఇక్కడి స్థానికులే ఈ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులు. సాధారణంగా ప్రభుత్వ రాయల్టీ చెల్లిస్తేతప్ప ఇసుక రవాణాకు అవకాశం ఉండదు. కానీ పంచలింగాలలో కొందరు అక్రమార్కుల వద్ద పదికి పైగా జేసీబీలు ఉన్నాయి. వీటి ద్వారానే ఇసుకను లారీల్లో నింపి హైదరాబాద్, శంషాబాద్, కడప వంటి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 50 లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం. విషయం అధికారులకు తెలిసినా అక్రమార్కులను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతి పొందితే ఒక్కో లారీకి(17 టన్నులు) ప్రభుత్వ రాయల్టీ కింద రూ.4వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రీచ్‌లలో ఎవరికీ అనుమతి లేకపోవడంతో రాయల్టీ కూడా అక్రమార్కులకు మిగిలిపోతోంది.
ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పూర్తిగా అక్రమ రవాణా కావడంతో 17 టన్నుల లారీలో అంతకు మించి ఇసుకను తరలిస్తున్నా అడ్డుకునే అధికారులు లేకుండాపోయారు. దీంతో ఇసుకాసురులు ఒక్కో లారీలో దాదాపు 20 నుంచి 50 టన్నుల మేర రవాణా చేస్తూ దానిని రూ.50 వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం గమనార్హం.
తరులుతోందిలా... ప్రతి రోజూ తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటలు, రాత్రి 10 నుంచి 1 గంట వరకు నగరంలోని సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారి ఇసుక ట్రాక్టర్ల మోతతో మారుమ్రోగుతోంది. ప్రస్తుతం నదిలో నీరు తగ్గడంతో పూడూరు, పంచలింగాల గ్రామాల్లో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను నది నుంచి తోడేసి పంచలింగాల, మహబూబునగర్ జిల్లా సరిహద్దు గ్రామమైన పుల్లూరు సమీపంలో భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి నుంచి జేసీబీల సహాయంతో ప్రతి రోజు కనీసం 30 నుంచి 40 లారీలకు పైగానే హైదారబాద్‌కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
కలిసొచ్చిన ఉద్యోగుల సమ్మె
జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అయితే ఈ మొబైల్ టీంలు నదికి వరద నీరు రావడంతో తనిఖీలు చేయడం లేదు. రెవెన్యూలోని అధికారులంతా సమ్మెలో ఉండగా ఇద్దరు వీఆర్వోలు మాత్రం ఆన్ డ్యూటీ అంటూ రెండు వారాల క్రితం వరకు ఇసుకాసురుల నుంచి భారీగా అక్రమ వసూళ్లు చేశారు.
ఇక రాత్రి విధుల్లో ఉండే పోలీసులు వాహనాలను నిలిపి ఒక్కో ట్రాక్టర్ కు రూ.500 ప్రకారం వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. నాల్గో పట్టణ పోలీసు స్టేషన్‌లో పని చేసే ఇద్దరు హోంగార్డులు రాత్రయితే చాలు జాతీయ రహదారిపై నిలబడి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
9 లారీలు సీజ్
శనివారం రాత్రి పంచలింగాల సమీపంలో డంపు చేసిన ఇసుకను లారీల్లో నింపుతున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేయగా.. వారి రాకను పసిగట్టిన లారీ డ్రైవర్లు, కూలీలు పరారయ్యారు. అక్కడ ఇసుక నింపుకుంటున్న 3 లారీలను అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి నుంచి అంతకు ముందే 6 లారీలు కడపకు బయలుదేరిన సమాచారం స్థానికులు ఇవ్వడంతో ఓర్వకల్లు మండల సమీపంలో వాటిని వెంబడించి పట్టుకుని సీజ్ చేశారు. డంపు దగ్గరున్న వాహనాలను అక్కడి నుంచి తరలించడం కోసం విజిలెన్స్ అధికారులు తీవ్రంగా శ్రమించారు.
తవ్వుకో.. అమ్ముకో!
Published Mon, Sep 23 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement