samai kayandhara
-
చివరి 5 గంటలు...సమైక్యాంధ్ర సీఎస్‌గా కృష్ణారావు
ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలు స్వీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జె.వి.రాముడు నియామకం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బయ్యారపు ప్రసాదరావు హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సీ బ్లాకులో పదవీ విరమణ చేయనున్న సీఎస్ మహంతి నుంచి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా కొనసాగిరికార్డు సృష్టించినట్లైంది. ఒక రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా పనిచేసిన చరిత్ర ఇప్పటివరకూ ఎక్కడా లేదు. 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతి ఆదివారం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటంతో.. కృష్ణారావుకు సమైక్యాంధ్రప్రదేశ్ సీఎస్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావును నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారమే మరో ఉత్తర్వును జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఐ.వై.ఆర్.కృష్ణారావు నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల కిందటే సీఎస్ కావాల్సింది... సీఎస్‌గా మహంతి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అప్పుడే కృష్ణారావు సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలనాపరమైన కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం మహంతినే మరో నాలుగు నెలలు సీఎస్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడే కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహంతి ఈ నెలాఖరు వరకు సీఎస్‌గా కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో నెల రోజుల ముందుగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. దీంతో కృష్ణారావుకు రాష్ట్రం విడిపోవటానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్రప్రదేశ్‌కు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా రాముడు రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా ఉన్న డాక్టర్ బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి టి.పి.దాస్‌ను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్‌గా, ఆర్.పి.ఠాకూర్‌ను ఆ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ప్రసాదరావుకు విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. సాధారణంగా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కొత్తగా ఆ పోస్టులోకి వచ్చిన వారికి లేదా మరో డీజీ స్థాయి/అదనపు డీజీ స్థాయి వారికి అప్పగించి రిలీవ్ అవుతుంటారు. ప్రసాదరావు విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డీజీపీ కావడంతో ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తాత్కాలిక డీజీపీలుగా నియమితులైన జె.వి.రాముడు, అనురాగ్ శర్మలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పోలీసు విభాగంలో హెచ్ఓడీలుగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) వ్యవహరించే వారంతా ఈ రకంగానే బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఐదుగురు ఐపీఎస్‌ల డెప్యుటేషన్ పొడిగింపు రాష్ట్రంలో డెప్యుటేషన్‌పై పని చేస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న జె.అజయ్‌కుమార్ (1997), డి.కల్పననాయక్ (1998), మహేందర్కుమార్రాథోడ్ (2001), ఎస్.గోపాల్‌రెడ్డి (1985), బి.బాలనాగదేవి (1995) డెప్యుటేషన్ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. -
నేడు జిల్లా బంద్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ దూకుడుకు నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలన్నీ బంద్‌లో భాగంగా మూతపడనున్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా చేపడుతున్న బంద్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తిరుగనివ్వబోమన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. -
సమైక్యవాదుల కన్నెర్ర
వైవీయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్సర్కిల్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్నారాయణపై ఏపీభవన్‌లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులో ఎన్జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు. ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రజల మనోభావాలు పట్టవా..! వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్సర్కిల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ నాయకులు గోపాల్‌రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్‌బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దద్దమ్మలు వీళ్లు
సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దద్దమ్మలుగా మారిపోయారని ఏపీ ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఫొటోలున్న ఫ్లెక్సీలను శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సోనియాగాంధీతో పాటు మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిందంబరం, షిండే, జైరాం రమేష్ తదితరుల ఫొటోలు కల్గిన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఉద్యోగులు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసేందుకు జాక్టో ముందుకు వచ్చి కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై చర్చించాయి. ఆదివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చే సేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా 9వ తే దీన నల్ల బ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జాక్టో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరోసారి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలగకుండా, ఉద్యమ తీవ్రత తగ్గకుండా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలో భాగంగా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయంలో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చే శారు. జీతాలు రాకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు రెండు నెలలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. హిందూపురంలో ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓలు విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మడకశిర , పెనుకొండ, గోరంట్లలో ఆందోళనలు చేపట్టారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ 160వ రోజూ దీక్ష కొనసాగించారు. -
నేటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యశంఖారావం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్మోహన్రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు. రాత్రి గూడూరులో బస చేస్తారు. రెండోరోజు యాత్ర వివరాలు శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు. -
రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఈ మూడు రోజులూ పల్లెలు సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. కొలువుల కోసం పల్లెలు విడిచి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెలోగిళ్లలో చేరిపోతారు. రావమ్మా.. సంక్రాంతి లక్ష్మి అంటూ సంక్రాంతిని స్వాగతించాల్సిన పల్లెల్లో ప్రస్తుతం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఏరోజుకారోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. చాలీ చాలని వేతనాలు.. కరువు.. కాటకాలు.. ఇలా రకరకాల కారణాలతో నేడు పల్లెసీమలు సంక్రాంతి శోభను సంతరించుకోలేకపోతున్నాయి. అయినా ఉన్నంతలో తృప్తిగా.. సంతోషంగా జరుపుకునేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు ఏం పండగో ఏమో అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకల తీరుతెన్నులపై న్యూస్‌లైన్ ప్రత్యేక కథనం. కడప కల్చరల్, న్యూస్‌లైన్ : సంక్రాంతిని తెలుగునాట పెద్ద పండుగగా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పండుగ అంటే ఎవరికైనా సంతోషమే. అందులోనూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఆశించినమేరకు పండుగ సందడి కనిపించడం లేదు. అకాల వర్షాలతో అందివచ్చిన పంటలు దెబ్బతిని రైతు దిగాలుగా ఉన్నాడు. ధరలు చుక్కలను చూపుతున్నాయి. వ్యాపారుల పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో ఆ వర్గాల్లో సైతం నిరాశ నెలకొని ఉంది. పెరిగిన ధరల స్థాయిలో జీతాలు పెరగక ఉద్యోగుల పరిస్థితి కటకటగానే ఉంది. అయినా తప్పదు : ధరల బరువుతో ఎగువ మధ్యతరగతి స్థాయి ప్రజల్లో కూడా పండుగ ఉత్సాహం కనిపించడం లేదు. అయినా పిల్లల ఉత్సాహంపై నీళ్లు చల్లలేక, నలుగురిలో చిన్నతనంగా ఉంటుందని భావించి అప్పోసప్పో చేసైనా ప్రజలు పండుగకు సిద్ధమయ్యారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న జిల్లా వాసులు ఆదివారానికే స్వగ్రామాలకు చేరారు. ప్రైవేటు బస్సుల సంఖ్య బాగా తగ్గడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇన్స్టంట్ పేడరంగు సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిళ్లను శుభ్రపరిచి కల్లాపి (పేడ) చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను లక్ష్మిదేవికి ప్రతిరూపమని చెబుతారు. అందుకే శుభప్రదంగా పండుగల సమయంలో సిరిని ఆహ్వానించేందుకు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆవు పేడ దొరకడమే కష్టంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇన్స్టంట్ పేడ రంగు అందుబాటులోకి వచ్చింది. ప్యాకెట్ ఖరీదు రూ.5. దీనిని నీటిలో కలిపి నేలపై చల్లితే అచ్చం కల్లాపి చల్లినట్లుగా ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. ఈ రంగును కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. - న్యూస్‌లైన్, సింహాద్రిపురం పల్లెకు పోదాం. చలో చలో సంక్రాంతి సెలవులొచ్చాయి. ఊరికెళ్లాలి. అంతే.. అది బస్సయితేనేం.. ఆటో అయితేనేం.. అంటూ పట్నం నుంచి పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పాటికే ఊర్లకు చేరుకున్నారు. మిగిలిన వారు కూడా భోగి పండుగ నాటికంతా ఇంట్లో ఉండాలని ఏ వాహనం దొరికితే దాన్ని పట్టుకుని ఇలా చాపాడు మండల కేంద్రం నుంచి గ్రామాలకు పయనమయ్యారు. - చాపాడు, న్యూస్‌లైన్ పిండి వంటలకు ప్రిపరేషన్ సంక్రాంతి అంటూనే నోరూరించే పిండి వంటలే గుర్తుకొస్తాయి. ఒకప్పుడైతే బియ్యాన్ని రోటిలో పోసి దంచి పిండి వంటలకు వాడేవారు. క్రమక్రమంగా రోళ్లు మాయం కావడంతో ఇప్పుడంతా పిండి మిషన్లపై ఆధారపడుతున్నారు. రాయచోటిలో ఆదివారం ఇలా ఓ పిండి మిషన్ వద్ద మహిళలు తమ టిఫిన్ బాక్సులను ఇలా వరుసగా పెట్టారు. పిండి మిషన్ యజమానులకు ఇప్పుడు పండగే పండగ. - న్యూస్‌లైన్, రాయచోటిటౌన్ సకల భోగాల భోగి.. సకల భోగాలతో ప్రజలు సంతోషంగా ఉండే కాలాన్ని భోగిగా పిలుచుకుంటారు. భోగి పండుగ రోజు భోగి మంటలు కాలుస్తారు. అందులో పాత పనికిరాని వస్తువులు వేసి చెడు తొలగి మంచి చేకూరాలని వేడుకుంటారు. ఇదేరోజు పిల్లలకు భోగి పండ్లు కోస్తారు. ఇలా చేయడం ద్వారా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. పతంగుల సందడి.. సంక్రాంతి వేడుకల్లో పతంగుల సందడి మరువలేనిది. చిన్నా, పెద్దా తారతమ్య భేదం లేకుండా గాలి పటాలను ఎగురవేస్తారు. సంక్రాంతి వేడుకల్లో బాహ్యంగా కనిపించే సంబరాలకు ప్రతీకగా గాలిపటాలు నిలుస్తాయి. పండగకు వారం రోజు ల ముందు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా చిన్న పిల్లలు గాలిపటాల ఎగురవేతతో ఈ పండుగ రాకను తెలియజేస్తుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం.. సంక్రాంతి పండుగకు, రైతుకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఏ పండుగకు ఇంట్లో చేరకపోయినా సంక్రాంతికి మాత్రం పంటలు చేతికంది ధాన్యరాసులు కళకళలాడుతుంటాయి. ఎంతో శ్రమకోర్చి పండించిన పంట ఇంటికి చేరిన తర్వాత చూసి రైతు కళ్లల్లో ఆనందం పొంగిప్రవహిస్తుంది. ఎండనక, వాననక, రేయనక, పగలనక తాను పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా రైతు కుటుంబం సంక్రాంతి రోజు ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మను ఇంటి ముందు పెట్టి భూమాత రుణం తీర్చుకుంటుంది. ఆ రూపేణా ధాన్యలక్ష్మీ, పుష్పలక్ష్మీలను ఇంటిలోకి ఆహ్వానిస్తారు. రైతుల పండుగ కనుమ.. సంక్రాంతి మరునాడు రోజును కనుమ అంటారు. కనుమ రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రైతులందరికీ చేతినిండా పనిఉంటుంది. అందుకే కనుమ రోజు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రం చేస్తారు. కల్లాపి చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. అందులో గొబ్బెమ్మలను పెడుతారు. పాలిచ్చి మనల్ని పోషించే ఆవులు, వ్యవసాయంలో తమకెంతగానో ఉపయోగపడే ఎడ్లను శుభ్రంగా కడుగుతారు. పశులకు దిష్టి తీసి గుమ్మడికాయ పగులగొట్టి గజ్జెలు, పట్టెడలు, పూలదండలు వేసి చక్కగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. పొంగళి, పసుపు, కుంకుమలు కలిపి పొలాల్లో చల్లుతారు. గంగిరెద్దుల విన్యాసాలు.. సంక్రాంతి వేడుక ఆరంభమైందంటే చాలు గంగిరెద్దు ఆటలు మొదలవుతా యి. వీధుల్లో, ముఖ్య కూడళ్లలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు... ఇంటిళ్లిపాదిని సల్లంగ చూడు అంటూ డూడూ బసవన్నలను ఆడిస్తా రు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రా లను ఎద్దులకు అలంకరించి గంగిరెద్దులను తయారు చేస్తారు. నేలపై పడుకొని గంగిరెద్దును ఆమాంతం పైకి ఎక్కించుకోవడం, గంగిరెద్దు నోట్లో తలపెట్టడం వంటి విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. రై తులు ఆనందంగా తోచిన రీతిలో గంగి రెద్దుల వారికి సమర్పించుకుంటారు. ఎద్దుల శ్రమను రైతుకు గుర్తు చేయడానికి పండుగ రోజు గంగిరెద్దులను ఇళ్లముందుకు తీసుకొస్తారు. డూడూ బసవన్నా.. ఎన్నాళ్లకొచ్చావయ్యా! గ్రామాలలో సంక్రాంతి సందడి మొదలైందంటే చాలు రకరకాల వేషధారణలో భిక్షగాళ్లు వస్తుంటారు. ఇలాంటి వారిలో డూడూ బసవన్నలు ఒకరు. వీరు ఏడాదిలో రెండు మూడు సార్లుగా గ్రామాలలో పర్యటించి గంగిరెద్దులను ఆటాడించి వినోదాన్ని పంచి గ్రామీణులు ఇచ్చే చిరుకానులన తీసుకెళుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ మొదలు కాగానే డూడూబసవన్నలు వచ్చేశారు. రాత్రివేళల్లో రాముడు - సీత పేర్లతో శ్రీరామచంద్రుడి కథను నాటక రూపంలో ప్రదర్శించి పురాణాలు గుర్తుకుతెస్తున్నారు. వీరిని చూసిన గ్రామీణులు అరే డూడూ బసవన్నా ఎన్నాళ్లకు వచ్చావు.. అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. - న్యూస్‌లైన్, సంబేపల్లె ‘పుంజు’కోనున్న పందేలు సంక్రాంతి పండుగ సందడి పల్లెల్లో మొదలైంది. పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. సత్తా ఉన్న కోడిపుంజులను వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల వద్ద కోళ్లు సమరానికి సై అంటూ రె‘ఢీ’గా ఉన్నాయి. - న్యూస్‌లైన్, చిన్నమండెం కొత్త కళ వచ్చేసింది గ్రామాల్లో సంక్రాంతి శోభ సంతరించు కొంది. మహిళలు కొత్త ఉత్సాహంతో లోగిళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇళ్లముందు అందమైన ముగ్గులు వేస్తున్నారు. గాజులు విక్రయించే మహిళలు పల్లెల్లో దర్శనమిస్తున్నారు. చేతులకు మట్టి గాజులు తొడిగించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చేసింది సంక్రాంతి అంటూ ఆనందంగా గడుపుతున్నారు. - న్యూస్‌లైన్, దువ్వూరు పెద్ద పండుగ చిన్నబోయింది.. అతివృష్టి, అనావృష్టితో పైరు ఎత్తిపోయింది.. ధాన్యం లేక గాదె బావురుమంటోంది.. రైతన్నకు తిండిగింజల దిగులు పట్టుకుంది.. కిటకిటలాడాల్సిన దుకాణాలు వెలవెలబోయాయి.. వ్యాపారం లేక వర్తకులు దివాలా తీశారు.. ఉద్యోగులకు ‘సమైక్య’ ఉద్యమం నిరాశను మిగిల్చింది.. వేతనాలందక అడ్వాన్సులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కర్మాగారాలు నడవ లేదు.. కార్యాలయాలు పనిచేయ లేదు.. పనుల్లేక కార్మికుల పరిస్థితి అప్పుచేసి పప్పుకూడు తిన్నట్టైంది... సగటు మనిషిలో సంతోషం ఆవిరైంది. కొత్త బట్టలు.. పిండి వంటల మాటే లేదు.. గంగిరెద్దులు.. డూడూ బసవన్నల సందడీ లేదు... కొత్త అల్లుళ్ల జాడ లేదు.. పండుగ పూట ‘పెద్ద’ సందడి లేదు.. బక్కచిక్కిన బడుగుజీవి సంక్రాంతి లక్ష్మిని పిలువ లేక పిలుపు లేక పెద్ద పండుగ చిన్నబోయింది.. -న్యూస్‌లైన్, కమలాపురం పండుగ చేసు‘కొన’లేం పులివెందులలో ఆదివారం సంక్రాంతి పండుగ సందడి కనిపించలేదు. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. పూలు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మూర రూ.30లు అమ్మాల్సిన పూలు రూ.10లకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. వస్త్ర, రంగు పొడుల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. -న్యూస్‌లైన్, పులివెందుల టౌన్ -
సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ముత్తుకూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య దీవెనయాత్రలో భాగంగా శుక్రవారం ముత్తుకూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త దళితవాడ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయంపై రాష్ట్రపతి పునరాలోచించేవారని కాకాణి అభిప్రాయపడ్డారు. తీర్మానం చేయకుండా, ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం ద్వారా సమైక్యవాదానికి తూట్లు పొడిచారన్నారు. తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్సీపీ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరించడంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు బయటపడిందన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, బలవంతంగా వ్యానులో తరలించడం వెనుక ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ఉదంతం ద్వారా సమైక్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి డ్రామాలాడుతున్న విషయం స్పష్టమైపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాదం బట్టబయలయిందన్నారు. మొహం చూపని ఎమ్మెల్యే ఆదాల ఓట్లేసిన ప్రజలకు మొహం చూపని ఎమ్మెల్యేల్లో ఆదాల ప్రభాకరరెడ్డి ప్రముఖులని కాకాణి ఎద్దేవా చేశారు. పనుల కోసం ఎవరైనా వెళ్లి అడిగితే ‘నేనిచ్చిన నోటు, మీరేసిన ఓటుకు చెల్లు’ అంటూ హేళన చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్దనరెడ్డి, నాయకులు దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, నంగా చెంగారెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, సర్పంచ్ పల్లంరెడ్డి జనార్దనరెడ్డి, దువ్వూరు గోపాలరెడ్డి, సన్నారెడ్డి రమణారెడ్డి, కారంచేటి ప్రసాద్‌శర్మ, సుమంత్‌రెడ్డి, జవహర్, టీ రాజ పాల్గొన్నారు. -
సమైక్య దీక్షలు
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పది నియోజకవర్గాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహరదీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలకు దిగారు. ఈ దీక్షలకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగనున్నాయి. వెంకటగిరిలో వెఎస్సార్సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీభవానీ సెంటర్లో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు స్థానిక బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండల కన్వీనర్ పెద్దమల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూ ళ్లూరుపేట బస్టాండు సెంటర్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. -
‘ఇండియాటుడే’ తీయబోతున్నా
ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాల నేపథ్యంలో నేతల స్వార్థ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జయం మూవీస్ పతాకంపై ‘ఇండియాటుడే’ సినిమా తీయనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలో చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 500 మందికి జగదీశ్వరరెడ్డి అన్నదానం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనది సొంత జిల్లా నెల్లూరే అన్నారు. సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వలో ఇండియాటుడే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. ఇందులో అందరూ కొత్త నటులే నటిస్తారన్నారు. అన్యాయాన్ని ఎదిరించే జర్నలిస్టు పాత్రను సినిమాలో ప్రధానంగా చిత్రీకరించనున్నట్టు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇది వరకు జయం, నిజం, జై, అందరం, కేక సినిమాలతో పాటు ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు కేతిరెడ్డి తెలిపారు. గత ఏడాది శ్రీలంకలో తమిళులు పడుతున్న బాధల ఇతివృత్తంగా తీసిన ‘రావణదేశం’ సినిమాను తమిళ రాజకీయ నేతలు వైగో, విజయ్‌కాంత్ లాంటి వారు చూసి తాము చేయలేని పనిని తెలుగువాడివైన నీవు చేశావని తనను ప్రశంసించారన్నారు. రాజకీయ జీవితంలో గత 35 ఏళ్లుగా మహానేత వైఎస్సార్ అభిమానినన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానిగా ఉంటున్నానని చెప్పారు. ఇండియాటుడే సినిమాను వీలైనంత త్వరలో ప్రారంభించి దక్షిణాదిలో అన్ని భాషల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్ పాల్గొన్నారు. -
ఉద్యమ దండు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్య మం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉద్యమ దండులా ముందుకు కదిలి సమైక్యవాణి వినిపించాయి. అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు భారీ ఎత్తున సాగాయి. పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుజబుజనెల్లూరులో ర్యాలీ చేశారు. గూ డూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీ వయ్య సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహించారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు, తిరిగి మర్రిపాడు వ రకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరిలో ర్యాలీ జరిగింది. -
కడపలో క్రీడా సందడి
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప గడపలో ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దీంతో మరో 30 రోజుల్లో జిల్లాలో క్రీడాసందడి నెలకొననుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి శనివారం కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులను సూచించారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు టోర్నమెంట్ నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వివరించారు. దాదాపు 700 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లను చక్కగా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడే బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చిన ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, డీఎస్డీఓ బాషామొహిద్దీన్లను కలిసి టోర్నమెంట్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, సభ్యులు మారుతీమోహన్రెడ్డి, రెడ్డిప్రసాద్, మునికుమార్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, సుదర్శన్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీల సంపూర్ణ సహకారం.. జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డిలను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ కడపలో నిర్వహించే టోర్నమెంట్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
సమైక్యోద్యమం
ఓట్లు, సీట్లు.. అధికారమే పరమావధిగా రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు జూలై 30న విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో పురుడుపోసుక్ను సమైక్య ఉద్యమం తమ మనోభిప్రాయాలను ‘అధికారం’ కోసం తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీలను చీదరించుకుంటోన్న జనం మనోభీష్టాల మేరకు సమైక్యాంధ్ర ఉద్యమ బావుటా ఎగరవేసిన వైఎస్సార్సీపీకీ జైకొడుతున్న ప్రజాసైన్యం విశాలాంధ్ర ప్రజారాజ్యమన్న సీపీఐ విభజనకు జైకొట్టిన వైనం.. సమైక్యాంధ్రకే కట్టుబడిన సీపీఎం తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీసేందుకు సిద్ధమైన కమలనాథులపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం జనంతిరగబడటంతో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రణాళికపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్,టీడీపీ అగ్రనేతలు 2013లో ‘అనంత’ రాజకీయ ప్రస్థానం ఇదీ..! సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభిప్రాయాలను గౌరవించని రాజకీయపార్టీలకు మనుగడ ఉండదన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. రాష్ట్ర విభజన ప్రక్రియలో అది మరో సారి నిరూపితమైంది. ఓట్లు, సీట్లే ప్రాతిపదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు బాటలు వేశాయి. అధికారం కోసం ప్రజల మనోభిప్రాయాలను తాకట్టు పెట్టాయి. తమ మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్, టీడీపీలను జనం చీదరించుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ‘అనంత’లో పురుడుపోసుకున్న ‘సమైక్య’ ఉద్యమం సీమాంధ్రకు దావానలంలా వ్యాపించి.. మహోద్యమంగా రూపాంతరం చెందింది. ప్రజల మనోభీష్టాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వెంట ‘అనంత’ జనం కదంతొక్కుతున్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమన్న నినాదాన్ని ఆరు దశాబ్దాలపాటు ప్రతిధ్వనింపజేసిన సీపీఐ ప్లేటు ఫిరాయించి.. వేర్పాటువాదం ఎత్తుకుంది. ప్రజల మనోభిప్రాయాల మేరకు సీపీఎం సమైక్యాంధ్రకే కట్టుబడింది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసేందుకు సహకరిస్తామంటోన్న కమలనాథులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ‘అనంత’ రాజకీయాలను 2013 ఓ కుదుపు కుదిపేసింది. ఏడాది ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 30, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా నిర్వహించిన సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని రాజకీయశక్తిగా వైఎస్సార్సీపీ అవతరించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సొసైటీ(డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురువేస్తుందనే సాకుతో ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయించింది. అధికారం కోసం సహకార వ్యవస్థను నీరుగార్చుతోంది. పంచాయతీల్లోనూ కుమ్మక్కు పర్వం సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి రచించిన ప్రణాళికను రైతులు ఛీ కొట్టారు. అయినా.. ఆ రెండు పార్టీలు తీరు మార్చుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే సూత్రాన్ని అమలుచేశాయి. జూలై 23, 27, 30 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌కు పోటీగా అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించలేదు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ కూడా అభ్యర్థులను పోటీకి దించకుండా ముందస్తుగా కుదుర్చుకున్న అవగాహనను అమలుచేశాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులను చావుదెబ్బతీయాలన్న కుట్రను ప్రజలు చీదరించుకున్నారు. సింహభాగం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. ప్రజాభిమానంతో వైఎస్సార్సీపీ కదం తొక్కుతుండటంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక రచించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారు. విశాలాంధ్రలోనే ప్రజారాజ్యమన్న నినాదంతో ఆరు దశాబ్దాలపాటూ నడచిన సీపీఐ వేర్పాటువాదంతో జతకట్టింది. సీపీఎం మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడింది. సీట్లే లక్ష్యంగా కమలనాథులు తెలుగుజాతిని రెండు మక్కలు చేయడానికి సహకరిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి హామీ ఇచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగా కాంగ్రెస్ ఏపీ విభజనకు కుట్ర పన్నింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ పక్షాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ జూలై 30న తీర్మానం చేశాయి. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్ర సమైక్య ఉద్యమంతో రాజకీయ మనుగడ ఉండదని కాంగ్రె స్, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను సీమ నుంచి విడదీసి.. తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొట్రికే మధుసూదన్ గుప్తా బలంగా ముందుకు తెచ్చారు. సమైక్య ఉద్యమంలో ముసుగువీరుడైన ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తెరచాటుగా జేసీతో చేతులు కలిపి.. రాయలతెలంగానం చేశారు. సీమ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రపై ‘అనంత’ ప్రజానీకం తిరగబడ్డారు. ప్రజాసైన్యం తిరగబడటంతో రాయలతెలంగానం ప్రతిపాదనను పక్కనపెట్టారు. ‘రాయల తెలంగాణపై నన్ను ముందుకు తోసి.. ఆ తర్వాత అంతా తప్పుకున్నారు’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల ప్రకటించడమే అందుకు తార్కాణం. ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం విభజన తీర్మానం చేయగానే ‘అనంత’ నడి వీధుల్లో సమైక్య ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానలంలా వ్యాపించింది. సమైక్య ఉద్యమంలో సీమాంధ్రకు ‘అనంత’ మార్గనిర్దేశనం చేసింది. వేర్పాటువాదం చేసిన టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ అడ్టుకుంటూ ఛీకొట్టారు. ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సెప్టెంబరు 4న సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కదిరి, హిందూపురం, అనంతపురంలో నిర్వహించిన సభలకు జనం భారీ ఎత్తున హాజరై, మద్దతు ప్రకటించారు. విభజన తీర్మానానికి నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సారి.. టీనోట్‌పై కేంద్ర మండలి ఆమోదముద్ర వేయడానికి నిరసనగా మరొక సారి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో అక్టోబరు 26న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు ‘అనంత’ ప్రజానీకం భారీ ఎత్తున తరలివెళ్లారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలుగుతారని జనం గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆ రెండు పార్టీల నేతలు జంకుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం. -
చివరి వరకు పోరాటం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు తెలిపారు. గడపగడపన సమైక్య నినాదం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సురేష్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్కాంగ్రెస్పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. వైఎస్ కృషి వల్ల జిల్లాకు ఎంతో మేలు జరిగిందన్నారు. జైలులో సైతం సమైక్యాంధ్ర కోసం దీక్ష చేసిన ఘనత జగన్‌దేనని తెలిపారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ర్టం కోసం ఎక్కడా లేని విధంగా నాలుగు నెలలుగా ప్రొద్దుటూరులో దీక్షలు చేపడుతున్నారన్నారు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని, రైతులకు సాగు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రయత్నాన్ని సోనియా గాంధీ చేస్తున్నారన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి శ్రమిస్తున్నారన్నారు. తెలుగు సంస్కృతిపై ఏమాత్రం అవగాహన లేని ఇటలీ మహిళ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిచెందాలంటే హైదరాబాద్‌పై వచ్చే పన్నులే ఆధారమని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు, తెలంగాణాలో మరో 30 శాతం సీట్లను వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు. డబ్బు ఇచ్చి రాజ్యసభ సీటును కొనుక్కున్న సీఎం రమేష్‌నాయుడుకు జగన్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవ్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం పదవి కోసం కక్కుర్తి పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజకీయ అవకాశవాది చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ద్వారా రాష్ట్ర విభజనను సులువుగా ఆపవచ్చన్నారు. కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్ బాషా మాట్లాడుతూ తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అనకుండా రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గోపికృష్ణ విద్యా సంస్థల అధినేత కేవీ రమణారెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, మాధవ్ రెసిడెన్సీ మాధవరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పోరెడ్డి నరసింహారెడ్డి, గరిశపాటి లక్ష్మిదేవి తదితరులు ప్రసంగించారు. జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు వేదికపైనే కేక్ కట్ చేశారు. -
రోడ్ల దిగ్బంధం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు, సమైక్యవాదులు రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఎన్‌హెచ్-5 జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అంగీకరించేది లేదంటూ పార్టీశ్రేణులు నినదించాయి. ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. ఆత్మకూరులో జరిగిన ఆందోళనల్లో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. సర్వేపల్లి సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై మనుబోలు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వందలసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి. అనీల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చింతారెడ్డిపాళెం హైవేపై రాస్తారోకో నిర్వహించింది. ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ విద్యార్థి విభాగం నాయకులు ఎన్‌హెచ్-5 కనుపర్తిపాడు సెంటర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుజాతిని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సెంటర్ వద్ద గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల వద్ద కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బం ధించారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కోట క్రాస్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై గూడూరు సమన్వయకర్త బాలచెన్నయ్య ఆధ్వర్యంలో వంటావార్పు, రాస్తారోకోలను నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండు సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట-శ్రీకాళహస్తి జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి రాస్తారోకో నిర్వహించారు. -
దేశ సంస్కృతి సోనియాకేం తెలుసు
ఉదయగిరి, న్యూస్‌లైన్: భారతదేశ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం విదేశీయురాలైన సోని యాకు ఏం తెలుసని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో బుధవారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్వప్రయోజనాల కోసమే ఆమె తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోనియాగాంధీ తెలుగువారి ఉసురుపోసుకోక తప్పదన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో ఎవరూ విభజనను కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలోని కొందరు రాజకీయ బికారులు మాత్రమే విభజనను కోరుకుంటుంటే, వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితమిస్తుందనే నమ్మకముం దన్నారు. ఆర్టికల్ 3ను రద్దు చేయాలనే డిమాండ్‌కు అందరూ మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, మరో అవకాశం తమకు కల్పిస్తే మరిం త అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. మొదట ఆయన రైతు వేషధారణలో ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ముందుకుసాగారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కల్లూరి రమణారెడ్డి, అక్కుల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఆనందరావు, గడియాల్చి ఎస్ధాని, ఖిల్జీ సలీం, ఏడుకొండలు, ముర్తుజా హుస్సేన్, పెద్దిరెడ్డి, సోమిరెడ్డి, అశోక్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, గుంటుపల్లి నాగభూషణం, పాణెం రమణయ్య పాల్గొన్నారు. -
గీన్ సిగ్నల్‌పై ‘అనంతా’గ్రహం
ఏదైతే కాకూడదనుకున్నారో అదే అయ్యింది. సమైక్య వాదులు అలుపెరుగకుండా 129 రోజుల పాటు సాగించిన ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు ఇసుమంతైనా పట్టించుకోలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపిందంటూ ప్రకటించడంతో అనంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం అర్ధరాత్రి దాటినా నిరసన కొనసాగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేటి బంద్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగు ప్రజల మనోభావాలకన్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జన్మదినోత్సవ కానుక ఇవ్వడానికే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపడంపై ‘అనంత’ ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. 129 రోజులుగా సాగుతోన్న సమైక్యాంధ్ర మహోద్యమాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరశించారు. ఎస్కేయూ వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి సమైక్యాంధ్ర మహోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు పూనుకుంది. అధిక శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా జీవోఎంను కోరారు. సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం ఒకానొక దశలో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. రాయలసీమను నిలువునా చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసేందుకు పూనుకుంది. జీవోఎం కూడా రాయల తెలంగాణకే ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రాయలసీమ విభజనపై సీమ ప్రజానీకం భగ్గుమనడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసు బలగాలతో భారీ ఎత్తున కవాతు నిర్వహించి.. ప్రజలను భయోత్పాతానికి గురిచేసే యత్నం చేయడం గమనార్హం. కాగా కేంద్ర ప్రకటనపై ఉరవకొండ, కదిరి, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దందా!
సాక్షి ప్రతినిధి, న్యూస్‌లైన్: ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా.. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకుల వుతున్నా.. ఆర్టీఏ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు. కళ్లముందే అదనపు ప్రయాణికులతో పాటు ప్రమాద కరమైన లగేజీని బస్సులో తరలిస్తుంటే రూ.500 తీసుకుని రైట్ చెబుతున్నారు. ఈ శాఖ అవినీతికి పునాది రాయిలా నిలిచిందని జిల్లా వాసులు నెత్తి నోరు బాదుకున్నా.. దాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోరు. నెల వస్తే ఎవరి వాటా వారి ఇళ్లకు చేరాల్సిందే. పైసా తగ్గినా సహించరట! కింది స్థాయి సిబ్బందినీ ఉపేక్షించరట! తాజాగా మూడు నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితే ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది కూడా అందులో పాల్గొన్నారు. కాగా తిరిగి విధులకు హాజరైన సిబ్బంది పనిదినాల్లో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకుని ఓ ఉన్నతాధికారికి ఆయన వాటా ముట్టజెప్పేందుకు వెళ్లారు. అక్రమ సొమ్మును లెక్కపెట్టుకున్న అధికారి డబ్బును విసిరి కొట్టినట్లు తెలిసింది. ఇదేంది లెక్క తగ్గిందని సిబ్బందిపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. కాగా సిబ్బంది రెండు నెలల పాటు ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు అదంతా సంబంధం లేదని అధికారి తేల్చి చెప్పారట! ప్రతి నెలా తనకు చెందాల్సిన సొమ్ము పక్కాగా ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో మీ ఇష్టం అని చెప్పడంతో సిబ్బంది వారి వాటాల్లో తగ్గించుకుని మిగిలిన సొత్తు పోగేసి ఇచ్చినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షలు పెనుకొండ చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షల నగదు ప్రతి నెలా జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. కాగా ఆ డబ్బును వసూలు చేయాలంటే అక్కడి సిబ్బంది వాహనాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా.. వదిలి పెట్టాల్సిందే. కాక పోతే వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. మాట వినక పోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు హజరు పరుస్తూ వస్తారు. అధికారుల ఒత్తిడితోనే తాజాగా ఓ టూరిస్ట్ బస్సును కూడా రూ.500 లంచంగా తీసుకుని వదిలిపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో చెక్ పోస్ట్‌కు ఆఫీస్ సబార్డినేటర్లను వేయకుండా వారిని కేవలం కార్యాలయం విధులకు నియమించినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్‌లో ప్రెవేట్ వ్యక్తులను నియమించి వారి ద్వారానే డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. మహాబూబ్‌నగర్ ఘటనతో కురుస్తున్న ధనం మహబూబ్‌నగర్ జిల్లా పాల్యం వద్ద ఓల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల అధికారులకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బస్సులను కట్టడి చేయాలని సూచించింది. దీంతో ఆర్టీఏ అధికారుల జేబుల్లో ధన వర్షం కురుస్తోంది. అర్ధ రాత్రిళ్లు 44వ జాతీయ రహదారిపై వందలాది బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఓ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకే నెంబరుతో తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు స్పందించడం లేదని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పర్వానికి తెర వేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ అధికారుల అవినీతి బాగోతాలపై అసలు నిజాలను వెలికి తీసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పక్కాగా ‘పది’
సాక్షి, కర్నూలు: ‘‘ జిల్లాలో గత మూడేళ్లుగా పదోతరగతి ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయి. గతేడాది జిల్లా చరిత్రలోనే అత్యధికంగా 91.06 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ప్రస్తుతం దీనిని కాపాడుకోవడం కత్తిమీద సాములాంటిదే. అయినా పక్కా ప్రణాళికతో ఇంతకంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తాం.’’ అని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో 33 పనిదినాలను నష్టంపోయామని, ఇందుకు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే.. డిసెంబర్1 నుంచి త్రైమాసిక పరీక్షలు సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సమ్మె చేసిన ఉపాధ్యాయులు వచ్చే ఏడాది మార్చి 18 వరకు వచ్చే అన్ని రెండో శనివారాలు, ఆదివారాలు పనిచేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సిలబస్ పూర్తవుతుందనే నమ్మకం ఏర్పడింది. పదోతరగతి సహా అన్ని తరగతులకు డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు త్రైమాసిక, జనవరి మొదటి వారంలో అర్థసంవత్సర పరీక్షలను నిర్వహిస్తాం. సంక్రాంతికి ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. విద్యార్థులకు గ్రేడ్లు.. పదోతగరతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల మొదటివారం హాఫ్యర్లీ పరీక్షలు ముగిశాక విద్యార్థుల స్థాయిని ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రేడులుగా విభజిస్తాం. ఆ తరువాత సీ, డీ కేటడిరీ విద్యార్థులను కొంతమంది ఉపాధ్యాయులకు దత్తత ఇస్తాం. వీరిని మార్చి నాటికి మెరుగుపడేలా చూస్తాం. సీ, డీ గ్రేడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబోతున్న స్టడీ మెటీరియల్‌ను అన్ని పాఠశాలలకు తర్వలో అందజేస్తాం. తక్కువ ఉత్తీర్ణత ఉన్న పాఠశాలలను మండల విద్యాశాఖాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 150 పాఠశాలల్లో అదనపు గదులు ఎనిమిదో తరగతి వరకు మౌలిక సదుపాయాలన్నింటినీ రాజీవ్ విద్యామిషన్ చూస్తుంది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విడుదలవుతున్న నిధులను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆర్ఎంఎస్ ద్వారా 150 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. సైన్స్ ల్యాబ్‌లను కడుతున్నారు. మరో 125 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టారు. లేబొరేటరీల ఏర్పాటుకు చర్యలు పదోతరగతి విద్యార్థుల కోసమైతే సైన్స్ లేబొరేటరీలు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలల్లో లేవు. గదులు లేకపోవడమే ఇందుకు కారణం. అయినా విద్యార్థుల కోసం నమూనా పరికరాలను ఉంచి బోధిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి గదులు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి సైన్స్ లేబొరేటరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘ప్రైవేట్’లో పనివేళల నియంత్రణ ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపునిచ్చిన సమయంలోనే అన్ని ప్రభుత్వ నిబంధనలకు, మార్గదర్శక సూత్రాలకు బద్ధులమై ఉంటామని డిక్లరేషన్‌ను తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. దీనిని ఉల్లంఘించిన ఆయా యాజమాన్యాలపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు హైకోర్టు కూడా ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జీవనోపాధి’పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్ : నిరుద్యోగుల జీవనోపాధి కోసం కేటాయించిన యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్ సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాలకు చెందిన బ్యాంక ర్లు, ఎంపీడీఓలు, ఐకేపీ ఏపీఎం, సీసీలతో మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీడీ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన జేఎంఎల్‌బీసీ సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఐదు నెలలుగా నిర్వహించడం లేదన్నారు. దీంతో ఎక్కడి పనులు నిలిచిపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల కింద 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన జీవనోపాధి యూనిట్లను త్వరిత గతిన మంజూరు చేసి వాటిని ప్రారంభించాలని సూచించారు. ఆయా బ్యాంకుల అధికారులు, ఎంపీడీఓలు యూనిట్ల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోవెలకుంట్ల స్టేట్‌బ్యాంక్ పరిధిలో 41, ఎస్బీహెచ్ పరిధిలో 19, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో 38, గోస్పాడు పరిధిలో 21 యూనిట్లను కేటాయించగా ఇప్పటి వరకు ఒక్కయూనిట్ కూడా ప్రారంభం కాకపోవడంపై పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే చర్యలు తీసుకుని అర్హులైన వారికి లబ్ధీ చేకూర్చాలన్నారు. డిసెంబర్లో ఆయా బ్యాంకులకు కేటాయించిన యూనిట్లన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెల రెండో వారంలో జేఎంఎల్‌బీసీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీఎం ఆండవార్, బ్యాంకు ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, ఫణికుమార్, తహశీల్దార్ సుధాకర్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎంపీడీఓలు, ఏపీజీబీ మేనేజర్లు సుజాతమ్మ, శ్రీలత, కేవీసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ఇందిరకాంత్రిపథం ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు. -
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
కళ్యాణదుర్గం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి మరోసారి ‘సమైక్య’ సెగ తగిలింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆదివారం కళ్యాణదుర్గంలోని రఘువీరా ఇంటిని ముట్టడించారు. మంత్రి కళ్యాణదుర్గానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంట పాటు అక్కడే బైఠాయించారు. మంత్రి బయటకు రావాలని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి స్పందించలేదు. దీనికి ఆగ్రహించిన జేఏసీ నాయకులు.. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రి రఘువీరా జేఏసీ నాయకుల వద్దకు వచ్చారు. ఆయన రాగానే ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మరింత హోరెత్తించారు. ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి మాత్రం గంట పాటు మౌనం వీడలేదు. చివరకు ఇలా నినాదాలు చేస్తే ఫలితం లేదని, అందరం కూర్చుని సమస్యపై చర్చించుకుందామని జేఏసీ నాయకులను కోరారు. అనంతరం మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయల్ వెంకటేశులు, కన్వీనర్ మాధవ్, కో-కన్వీనర్లు జె.నాగరాజు, పోతుల రాధాకృష్ణ, మల్లారెడ్డి, చల్లా కిశోర్, అశోక్, ఈశ్వరయ్య, నరసింహులు, మోరేపల్లి నారాయణ, పాల్గుణప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజులకు పైగా సమైక్య ఉద్యమం సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మీరు ఇక్కడి స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని అన్నారు. దీంతో ఉద్యమకారులు శాంతించారు. రాజీనామాలతో సాధించేదేమీ లేదు ‘మా రాజీనామాలతో సాధించేదేమీ లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నాం. అసెంబ్లీకి తీర్మానం వస్తే మా అభిమతం వ్యక్తం చేస్తాం. విభజన జరిగితే మేం శిక్షార్హులం. ప్రజలు ఏ శిక్ష విధించినా శిరసావహిస్తాం. పదవుల కోసం డ్రామాలాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో నేను లేన’ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గం వైపు మూడు నెలలకుపైగా కన్నెత్తి చూడని మంత్రి రఘువీరా ఆదివారం ఇక్కడికి వచ్చారు. ఆయనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. -
పన్ను వసూళ్లకు ‘సమైక్య’ పోటు
సాక్షి, కడప: ప్రజలపై సమైక్య భారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలు మొదటి విడతగా చెల్లించే ఇంటి, నీటి పన్నును సకాలంలో చెల్లించలేకపోయారు. ప్రస్తుతం దీనికి అధికారులు వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి, నీటి పన్ను ఏప్రిల్-సెప్టెంబర్, అక్టోబర్-మార్చి వరకు రెండు విడతలుగా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే మొదటి విడత గడువు దాటి నెలరోజులైంది. 50 శాతం లోపే వసూళ్లు : జిలా ్లవ్యాప్తంగా కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో 50శాతం లోపే వసూళ్లు జరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉదాహరణకు కడప కార్పొరేషన్‌ను పరిశీలిస్తే నగరంలో 78,656 గృహాలు, 1094 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అయితే దీనికి ఏప్రిల్-సెప్టెంబర్ మొదటి విడతకు ఇంటిపన్ను మొత్తం 8 కోట్ల 55 లక్షల 57 వేల రూపాయలు. కాగా, కేవలం వసూలైంది 4 కోట్ల 23 లక్షల 95 వేల రూపాయలు. అంటే వసూలైన మొత్తం 50 శాతం లోపే ఉంది. 33,413 మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా, వీటికి 3 కోట్ల 72 లక్షల 66 వేల రూపాయలు పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 51.12 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పరిశీలిస్తే కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయి. అధికారులు మాత్రం.. మొదటి విడత, రెండో విడత బకాయిలను మార్చి లోపల వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్ణీత సమయంలో ఇంటిపన్ను చెల్లించని వారికి నెలకు 2శాతం అదనంగా వడ్డిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంటిపన్ను, నీటిపన్నుతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారం కానుంది. సమైక్య సమ్మె నేపథ్యంలో కార్యాలయాలు లేకపోవడంతో తాము పన్నులు చెల్లించలేకపోయామని, ఇప్పుడు ప్రభుత్వం అదనంగా రెండు శాతం చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం సమ్మెకాలంలో సైతం మీసేవ కేంద్రాలు పనిచేశాయి. కాబట్టి ఆన్లైన్లో చెల్లింపులు చేసే అవకాశమున్నందున పన్ను కట్టుకోవాల్సి ఉందని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వసూళ్లను వేగవంతం చేశాం : కార్పొరేషన్ పరిధిలో నిలిచిపోయిన ఇంటి, నీటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేశాం. మొదటి విడత ఏప్రిల్-సెప్టెంబరుకు సంబంధించి 50శాతం లోపు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పన్నులు సకాలంలో చెల్లించని వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా రెండు శాతం వడ్డీని చెల్లించాల్సిందే. - చంద్రమౌళీశ్వరరెడ్డి, కమిషనర్, కడప నగర పాలక సంస్థ. నోటీసులు జారీ చే స్తున్న అధికారులు మార్చిలో పన్నులు చెల్లిస్తే గతంలో మాదిరి వడ్డీ మాఫీ జరిగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం రెండు శాతం వడ్డీ తప్పక కట్టాల్సిందేనని, మాఫీ కాదని అధికారులు పేర్కొంటున్నారు. కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో ఇంటి, నీటి పన్ను వసూళ్లకు సంబంధించి డిమాండ్ నోటీసులను జారీచేస్తున్నారు. -
దారులన్నీ బంద్
సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా, జీవోఎంకు నిరసనగా వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల జాతీయరహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం కొనసాగింది. కడపలో రాజంపేట వైఎస్సార్ సర్కిల్లో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో, ఇర్కాన్సర్కిల్లో నగరసమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ర హ దారులను దిగ్బంధించారు. ఇర్కాన్సర్కిల్లో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. కళాకారులు సమైక్యాంధ్ర పాటలు పాడి ఉద్యమకారులను అలరించారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు, చిన్నపిల్లల తల్లులు రోడ్లపక్కన చెట్లకింద సేదతీరారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దారులను దిగ్బంధించారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలను రోడ్లకు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజంతా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేకపోయారు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. రోడ్లలో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పొలీసులు మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు సాయంత్రం వరకూ దిగ్బంధనాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ర హదారులను దిగ్బంధించారు. రోడ్లపై ట్రాక్టర్లు, బస్సులు అడ్డుగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్లపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అందరినీ అరెస్టు చేశారు. పులివెందులలో యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసీపీ జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకూ రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొండూరులో రోడ్డుపై టెంటు ఏర్పాటు చేసి వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్చార్జ్ శెట్టిపల్లి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నాలుగరోడ్ల కూడలిని దిగ్బంధించారు. టెంటు ఏర్పాటు చేసి వంటవార్పు చేపట్టారు. రైల్వేకోడూరులో రాఘవరాజుపురం వద్ద రోడ్డుపై ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా కంప, మొద్దులు వేశారు. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం 3.30గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల, అట్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి మూడుచోట్లా పాల్గొన్నారు. అట్లూరులో గోవిందరెడ్డిని అరెస్టుచేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6.30-11గంటల వరకూ రహదారులను దిగ్బంధించారు. రోడ్డుపై టెంట్లు వేసి కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను మళ్లించేందుకు పోలీసులు యత్నించగా ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 11 గంటలకు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కమలాపురంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. -
సమ్మె పేరుతో చేతివాటం
అక్రమార్కులు సమైక్యాంధ్ర సమ్మెనూ వదల్లేదు. ఆ పేరుతో సొమ్ము చేసుకున్నారు. ఎంచక్కా రేషన్ బియ్యం, కిరోసిన్‌లను డీలర్లు అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. కంచే చేనుమేసినట్లుగా.. అడ్డుకోవాల్సిన అధికారులే దగ్గరుండి సహకరించారు. అక్టోబర్ కోటా సరుకుల కోసం చౌకదుకాణాల వద్దకు వెళ్లిన నిరుపేదలను పలు గ్రామాల్లో ‘సమ్మె వల్ల ఈ నెల సరుకు రాలేదు’ అంటూ డీలర్లు వెనక్కు పంపారు. కొండాపురం, న్యూస్‌లైన్ : నిరుపేదలను రేషన్‌డీలర్లు, అధికారులు ఏమార్చారు. కొండాపురం మండలంలోని పలు రేషన్‌దుకాణాల్లో అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం, కిరోసిన్ పేదలకు అందలేదు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై పక్కదారి పట్టించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లపల్లి, లింగనపాలెం, కొమ్మి-1, సత్యవోలు, కుంకువారిపాలెం, అగ్రహారం గ్రామాల్లోని రేషన్‌షాపుల పరిధిలో ఇలా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఆరు దుకాణాల్లో కలిపి 1610 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 17,308 కిలోల పీడీఎస్ బియ్యం, అంత్యోదయ లబ్ధిదారులకు 3,080కిలోల బియ్యం, 3145 లీటర్ల కిరోసిన్ ఇస్తారు. వింజమూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరకులు ఆయా షాపులకు వెళ్తాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఈ ఆరు దుకాణాల సురుకులను అధికారులు, డీలర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై గ్రామాల్లో డీలర్లను ప్రజలు ప్రశ్నిస్తే తుపాను, సమైక్యాంధ్ర సమ్మెల వల్ల సరుకులు రాలేదని జవాబు ఇస్తూ తప్పించుకుంటున్నారు. సహకరించని దుకాణాలపై దాడులు మండలంలో 34 రేషన్‌షాపులు ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి సరుకులు నల్లబజారులో అమ్ముకోవాలని, అందుకుగాను షాపునకు రూ.పదివేలు చొప్పున తమకు ఇవ్వాలని మండలానికి చెందిన ఓ అధికారి డీలర్లను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారికి భయపడిన ఆరుగురు డీలర్లు సరుకులను పక్కదారి పట్టించినట్లు సమాచారం. అతడి మాట వినని డీలర్ల షాపులపై దాడులు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా గొట్టిగొండాల-2 షాపుపై దాడిచేసి సొమ్ముచేసుకోవడం ఈ కోవకే చెందినదని సమాచారం. అధికారి మాట విననందుకు తమ షాపులపై దాడులు చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. -
సమైక్యం కోసం..
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్సీపీ రహదారుల దిగ్బంధం తొలిరోజు విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు బుధవారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పార్టీ సమన్వయకర్తలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై మరోమారు రాస్తారోకో చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అనిల్‌తో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు నేదరుమల్లి పద్మనాభరెడ్డి, బత్తిన విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అరెస్టయ్యారు. ఉదయగిరిలో ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో కార్యకర్తలు అరగంటపాటు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వింజమూరు బంగ్లా సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. కలిగిరిలోని కలిగరమ్మ దేవాలయం వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. జలదంకి బస్టాండ్‌లో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలిరూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సహా 30 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం కూడలి వద్ద మండల కన్వీనర్ ఇందూరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచి పోయాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం జాతీయ రహదారిపై పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో రోడ్డును దిగ్బంధించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కాకాణితో సహా 26 మందిని అరెస్ట్‌చేశారు. సూళ్లూరుపేలో పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. తడలో పార్టీ కార్యకర్తలు ఆర్కే సుందరంరెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో తడ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నెలబల్లి, అక్కరపాక వద్ద జాతీయ రహదారుల దిగ్భంధం జరిగింది. నాయుడుపేటలో వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లాం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయుడుపేట-శ్రీకాళహస్తి రోడ్డులో జాతీయ రహదారులను దిగ్బంధించారు. వెంకటగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు కూడలి వద్ద రహదారులను దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కలువాయిలో మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. సైదాపురంలో మండల కన్వీనర్ కష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. కోవూరు నియోజక వర్గంలోని కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రహదారుల దిగ్బంధం జరిగింది. కోవూరులో ములుముడి వినోద్‌రెడ్డి, ఇందుకూరుపేటలో మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ నాయకులు ముంబయి రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
మళ్లీ తెరపైకి రాయల తెలంగానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర మహోద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. బయట సమైక్యాంధ్ర గానం చేస్తూ.. లోపల వేర్పాటువాదాన్ని బలంగా చాటిచెబుతోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఉద్యమాన్ని తప్పుదోవపట్టించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దించారు. ఆది నుంచి జేసీ కుటుంబంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ వస్తోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే.. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి జేసీతో కలిసి ముందుకు సాగుతున్నారు. ‘రాయల తెలంగాణ’కు అనుకూలంగా జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో బహిరంగంగా సంతకాల సేకరణ చేస్తోంటే.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రహస్యంగా సంతకాలను సేకరిస్తూ మద్దతు కూడగడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన నిమిషాల్లోనే ‘అనంత’ నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానంలా వ్యాపించి.. మహోగ్ర రూపం సంతరించుకుంది. 99 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతోన్న ఉద్యమమే అందుకు తార్కాణం. ఓట్లు, సీట్లే లక్ష్యంగా కుమ్మక్కై రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు.. ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆది నుంచి పావులు కదుపుతూ వచ్చాయి. రాయలసీమను నిట్టనిలువున చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాలని కుట్రపన్నాయి. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను రైల్వేశాఖ సహాయ మంత్రి, కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అప్పగించారు. ఆ మేరకు ఆగస్టు 5న కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో కలిసి సోనియాను కోట్ల కలిశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను సీమ నుంచి చీల్చి తెలంగాణలో కలిపి.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి తనను కలిసే బాధ్యతను సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అప్పట్లోనే సోనియా అప్పగించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో ‘రాయల తెలంగానం’ చేయించే బాధ్యతను తాను సమైక్యవాదిగానే ప్రకటించుకునే ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేకు చంద్రబాబు అప్పగించారు. కానీ.. కోట్ల ప్రతిపాదనపై సీమలో, ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి కాస్త తగ్గిందని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది. సోనియా కనుసైగల మేరకు జేసీ దివాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలతో రాయల తెలంగాణకు మద్దతుగా సంతకాలు సేకరించి.. అధిష్టానానికి పంపారు. మిగతా ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరహాలోనే ప్రతినిధి బృందంతో కలిసి సోనియాతో సమావేశమయ్యేందుకు జేసీ దివాకర్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో రాయల తెలంగాణకు అనుకూలంగా రహస్యంగా సంతకాలు సేకరిస్తోన్న ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే.. వాటిని జీవోఎంకు పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కుట్ర గుట్టు బహిర్గతం కాకుండా చూసేందుకు సమైక్యాంధ్రగానం వడిని మరింత పెంచి విన్పిస్తున్నారు. ముందే రచించిన ప్రణాళిక మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో తనపై విమర్శలు చేయించుకుంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సమైక్యవాదుల కన్నుగప్పేయత్నం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. అధిష్టానాల ఆదేశాల మేరకు రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కోట్ల, జేసీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు జీవోఎంను కలిసి తమ వాదనను విన్పించడానికి సిద్ధమయ్యారని ఇరు పక్షాల నేతలూ అంగీకరిస్తుండటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచే కాంగ్రెస్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. -
దిగ్బంధం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జీవోఎంకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయరహదారులను ఎక్కడికక్కడ దిగ్బంధించారు. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో ప్రతి రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్‌లో, నగర సమన్వయకర్త అంజాద్‌బాషా, మాసీమబాబు ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్లో కార్యకర్తలు ఉదయం 6 గంటలకు బైఠాయించి రాకపోకలు అడ్డుకున్నారు. అలాగే చింతకొమ్మదిన్నె వైఎస్సార్ సర్కిల్లో కూడా కడప-రాయచోటి రహదారిపై వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ఉదయం 10.45 గంటలకు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చెన్నూరు, రిమ్స్ పోలీస్‌స్టేషన్ లకు తరలించారు. దీంతో పదినిమిషాల వ్యవధిలో మళ్లీ అఫ్జల్‌ఖాన్‌తో పాటు పలువురు కార్యకర్తలు బైపాస్‌లో బైఠాయించారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పులివెందులలో ఉదయం 6 గంటలకే పులివెందుల- కదిరి, అనంతపురం, కడప, వీరపునాయునిపల్లి, జమ్మలమడుగు రహదారులను దిగ్బంధించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ బైఠాయించారు. ఆపై పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. గౌరీ అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టుకు నిరసనగా వైఎస్ అవినాష్‌రెడ్డి గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు మాత్రం అరెస్టులకు బెదరకుండా సాయంత్రం వరకూ దిగ్బంధం కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కడప-రేణిగుంట హైవే దిగ్బంధించారు. 1.30 గంటలకు డీఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర కోసమే వైఎస్సార్సీపీ ఉద్యమం చేస్తోందని, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు-మైదుకూరుతో పాటు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, చాగలమర్రి రహదారులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దిగ్బంధించారు. ఆపై డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వీరిని అరెస్టు చేశారు. జమ్మలమడుగులో తెల్లవారుజామున 4.30 గంటలకే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు నిలిపేశారు. మధ్యాహ్నం డీఎస్పీ జాన్‌మనోహర్ వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యం కోసం పోరాడుతున్న జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్‌పార్టీ నేతలు అరెస్టులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. ఎర్రగుంట్లలో పార్టీ నేతలు రహదారులను దిగ్బంధించారు. పులివెందుల, రాయచోటి, కడప జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరులో వంటా వార్పు నిర్వహించారు. ప్రొద్దుటూరు, వేములలో రహదారిపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి బైఠాయించారు. బద్వేలు, పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు-నెల్లూరుతో పాటు పలు రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి-12 గంటల వరకు రహదారులను దిగ్బంధించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ప్రజలు వందరోజులుగా ఉద్యమిస్తుంటే మరో వైపు జీవోఎం ఏర్పాటు చే సి విభజన ప్రక్రియను వేగవంతం చేసేదిశగా కేంద్రం అడుగులు వేయడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజంపేట-తిరుపతి రహదారిపై బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత సాయంత్రం 4.30-5గంటల వరకు మళ్లీ బైఠాయించారు. దీంతో పోలీసులు మళ్లీ వారిని అరెస్టు చేశారు. తమ అరెస్టులతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుకోలేరని, జగన్ సారథ్యంలో సమైక్యాంధ్రను సాధించుకుంటామని కొరముట్ల అన్నారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్చార్జ్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వారిని అరెస్టు చేశారు. నేటితో ఉద్యమానికి వందరోజులు సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం వందరోజులకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిలేదీక్షలు సాగిస్తున్నారు. బుధవారం బాలవికాస్ ఇంగ్లీషుమీడియం పాఠశాల డెరైక్టర్ గంగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశనాయకుల వేషధారణలతో వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు నాగమునిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో మహేశ్వరరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో పెద్దదండ్లూరు రైతులు దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
వైఎస్సార్ సీపీ రోడ్ల దిగ్బంధం సక్సెస్
సాక్షి, గుంటూరు : సమైక్యంపై కేంద్రానికి, జీవోఎం(గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్)కు కనువిప్పు కలిగించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్భంధం మొదటి రోజు విజయవంతమైంది. సమైక్య రాష్ట్రమే కావాలనే ప్రజల బలీయమైన ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేందుకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజైన బుధవారం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పలు చోట్ల హైవేలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కి నిరసన తెలియజేశాయి. పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదాన్ని కాంక్షించే వారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పలు చోట్ల పోలీసులు ఓవరాక్షన్ చేసి జులుం ప్రదర్శించారు. చిలకలూరిపేటలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధం జరిగింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి, యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి, చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెంలో రాష్ట్ర రహదారిపై ఈ కార్యక్రమం జరిగింది. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. మంగళగిరి వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ నియోజకవర్గ కేంద్రం మంగళగిరిలో జాతీయ రహదారిపై కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో తెనాలి జంక్షన్ వద్ద కార్యకర్తలు ఉదయం 10 గంటలకు చేరుకుని రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆర్కే సహా 28 మంది కార్యకర్తలను అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-మాచర్ల రహదారిని దిగ్బంధించారు. ట్రాక్టర్లు అడ్డుపెట్టి ధర్నా చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద మాచర్ల-గుంటూరు ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు. పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి పిడుగురాళ్ల స్టేషన్‌కు తరలించారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేను పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. దాచేపల్లి మండలం నడికుడి పంచాయతీలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద పార్టీ కేంద్రపాలక మండలిసభ్యులు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి రాస్తారోకోలో పాల్గొన్నారు. మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించిన తరువాత జంగాతో పాటు మరికొంతమంది నాయకులను పోలీస్‌లు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు శ్రీనగర్, పొందుగల గ్రామాల్లో హైవేను దిగ్బంధం చేశారు. పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పోలీసుల ఓవరాక్షన్ పొన్నూరు నియోజకవర్గంలో రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పెదకాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధిం చాయి. పోలీసులు ఓవరాక్షన్‌తో డీఎస్పీ మధుసూదనరావు వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని దూషించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇదేంటని ప్రశ్నించిన రావి వెంకటరమణతోనూ డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ తీరుపై పార్టీ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బాపట్లలో దిగమర్రు జాతీయరహదారిపై సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్, వెదుళ్లపల్లి, కర్లపాలెం మండల కేంద్రం, పిట్టలవానిపాలెంలో చందోలు వద్ద రహదారులపై ఆందోళన చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-హైదరాబాద్ హైవేపై నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1.30 గంటల సమయంలో పోలీసులు బలవంతంగా నాయకులను స్టేషన్‌కు తరలించారు. ఆయా మండలాల కన్వీనర్లు షేక్ మస్తాన్, మీరయ్య, కోటేశ్వరరావు, మర్రి ప్రసాదరెడ్డిలు సత్తెనపల్లి-మాదిపాడు, అమరావతి-బెల్లంకొండ రోడ్లను దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాచర్ల , విజయపురిసౌత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రెంటచింతల రహదారి పై రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో చీకటీగలపాలెం వద్ద రహదారులను దిగ్బంధం చేశారు. సుమారు 2గంటలు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు- కర్నూలు రాష్ట్ర రహదారిపై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచి పోయాయి. డాక్టర్ సుధతో పాటు డాక్టర్ లతీష్‌రెడ్డి, మండల కన్వీనర్ అనుమాల నాసర్‌రెడ్డి, నూజెండ్ల మండల కన్వీనర్ తుమ్మా వెంకటరెడ్డి, తిప్పిశెట్టి కోటేశ్వరరావుతో పాటు నాయకులు, కర్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి ంది. రైతు విభాగం నాయకులు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నందివెలుగు రోడ్డులో గళ్లా చందు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయసారధి ఆధ్వర్యంలో పాత మద్రాసు రోడ్డులో రహదారులను దిగ్బంధించారు. తాడికొండలో సమన్వయకర్త మందపాటి శేషగిరిరావు, మేడికొండూరులో కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఫిరంగి పురంలో ఈపూరు అనూప్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రహదారులను దిగ్భంధం చేశారు. రేపల్లెలో మోపిదేవి హరనాథబాబు ఆధ్వర్యంలో పెనుమూడి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంటూరు నగరంలో.. గుంటూరులో పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన నేతలు అంకిరెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు షౌకత్, నసీర్ అహ్మద్‌లు కూడా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించి పలువురిని అరెస్ట్ చేసి తాలూకా స్టేషన్‌కు తరలించారు. పార్టీ యూత్ విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు నేతృత్వంలో ఏటుకూరు రోడ్డులో హైవేను దిగ్బం ధించారు. రాష్ట్ర పార్టీ యువజన విభాగం నేతలు మారూరి రామలింగారెడ్డి, దాది మురళి, గుంటూరు రూరల్ మండల కన్వీనర్ ఆళ్ల రవిదేవరాజు నాయుడు పాల్గొన్నారు. -
సమైక్య జోరు
సాక్షి,కడప : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కడప నగరంలో నాగార్జున మోడల్‌స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో సమైక్య నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఒంటిమిట్ట మండల ఉపాధ్యాయులు దీక్షల్లో కూర్చొన్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ సర్పంచ్ రమణయ్య నేతృత్వంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో విజయ్‌కుమార్ సర్కిల్లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ నేత, దొమ్మరనంద్యాల మాజీ సర్పంచ్ బుసిరెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కుండా రామయ్య సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ కార్యకర్తలు ఖాజావలీ నేతృత్వంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ ఛెర్మైన్ ఓబులేసు ఆధ్వర్యంలో పాతబస్టాండు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. రాయచోటిలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మైదుకూరులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. -
6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటల పాటు చేపట్టనున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి పోరాటం కొనసాగిస్తోందని గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 900 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయించినట్లు తెలిపారు. మిగిలిన పంచాయతీల్లోనూ మరో రెండు రోజుల్లో తీర్మానాలు చేస్తారన్నారు. వీటిని మంత్రుల బృందానికి(జీఓఎం)కు పంపుతామన్నారు. ర హదారుల దిగ్బంధం కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు, ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న జరిగే జీఓఎం సమావేశంలో అన్ని పార్టీలు అభిప్రాయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఎంతో నష్టపోతారని మేధావులు, రాజకీయవేత్తలు చెబుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షను కూడా లెక్క చేయకుండా విభజన వైపు అడుగులు వేయడం దారుణమన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కొర్రపాడు హుసేన్‌పీరా, రంగంపేట గోపాల్ రెడ్డి, బండి పరశురాం, మారుతీ ప్రకాష్, మారుతీనాయుడు, జేఎం బాషా పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు ఎందుకు జై కొట్టవు ?
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్ : సీమాంధ్రలో పుట్టి, తొమ్మిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి సమైక్యాంధ్రకు ఎందుకు జైకొట్టరని చంద్రబాబు నాయుడిని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులోని కేవీఆర్ పెట్రోలు బంక్ సెంటర్లో ఆదివారం నరకాసురుడితో పాటు సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ చిత్రపటాలు తగిలించిన 15 అడుగుల ఎత్తై దిష్టిబొమ్మను టపాసులు కట్టి దహనం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలనే దుర్మార్గపు నిర్ణయం వచ్చినప్పటి నుంచి కోట్లాది మంది ప్రజలు జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని తెలిపారు. వీరందరికి బాసటగా, సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని చెప్పారు. సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల పాలిట రాక్షసిలా మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేస్తూ సోనియా డెరైక్షన్‌లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను వేరుచేస్తుంటే సీమాంధ్రకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు, కె.వి.రాఘవరెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మందా బాబ్జీ, నరసింహయ్య ముదిరాజ్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, బత్తల వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యుడు చిం తంరెడ్డి జనార్దన్‌రెడ్డి, పురుషోత్తం యా దవ్, జానా శివప్రసాద్, మస్తాన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, తో టకూర అశోక్‌నాయుడు, జి.నరేష్, మ హేష్, హజరత్‌నాయుడు, మందా పెద్దబాబు, పట్రంగి అజయ్, రమమ్మ, హ సీనా, సుజిత, సరళ, విద్యార్థి విభాగ రూరల్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, గగ న్, హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధరలు ఢాం..ఢాం
నిత్యావసర వస్తువుల ధరలు ఢాం..ఢాం అంటూ పేలుతుంటే సంబరాల దీపావళి చిన్నబోనుంది. ఉప్పు నుంచి పప్పు వరకు.. ఆకుకూరల నుంచి కూరగాయల వరకు ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. తలుచుకుంటేనే కంట నీరు తెప్పిస్తోంది ఉల్లి. అదే దారిలో పయనిస్తోంది టమాట. ఈ రెండూ లేనిదే ఏ కూరా సిద్ధం కాదు. బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల భారాన్ని మోయలేక మోస్తున్న సామాన్యుడు దీపావళి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడు ఈ ఏడాది దిపావళిని సంబరంగా జరుపుకునేందుకు వెనకడుగు వేస్తున్నాడు. సటపాసుల విక్రయాలకు అనుమతులు పొందేందుకు అడిగినంతా ఇచ్చుకుని..లెసైన్స్‌లు పొందిన విక్రయదారులు గిట్టుబాటు పేరుతో ఈ ఏడాది ధరలు పెంచనున్నారు. ఈ భారమంతా కొనుగోలుదారుల మీదే పడుతోంది. వీటిని కొని పండుగ చేసుకోవాలా..వద్దా అన్న సందిగ్దంలో పడిన సామాన్యుడు.. పిల్లల సరదా తీర్చేదెట్టా అన్న ఆవేదనలో ఉన్నాడు. ఎంత వెచ్చించినా.. కాసింతైనా సంతృప్తికరంగా సరంజామా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు సమైక్య ఉద్యమం కారణంగా వేతనాలు కోల్పోయారు. ఈ నెలలో పూర్తి వేతనం రానందున ప్రభుత్వం ఇచ్చిన రుణంతో గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదో పండుగా చేశామంటే చాశామన్నట్లు జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. కొత్త దుస్తులు కొనడం ఈసారి వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరిగా కొనలాంటే అప్పు చేయాల్సిందే. దీపావళికి పిండి వంటలు చేసుకోవడం మామూలే. ఇందుకు చక్కెర, బెల్లం, పప్పులు, శనగపప్పు, శనగపిండి, నూనె, ఉద్దిపప్పు తదితరాలు తప్పనిసరి. వీటి ధరలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి. కూరగాయల ధరలైతే ఇక చెప్పక్కరలేదు. పేదలు పచ్చడి కూడా చేసుకోలేక బతుకీడుస్తున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాలో ఈ ఏడాది టపాకాయలు విక్రయాలు అంతగా ఆశాజనకంగా ఉండక పోవచ్చని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో దాదాపు 250 మంది లెసైన్స్ దారులు ఉండగా..ఒక్క అనంతపురం నగరంలోనే 47 మంది ఉన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా రూ.27 నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండగా ఒక్క అనంతపురం నగరంలోనే రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. మొత్తం జీరో వ్యాపారం కావడంతో ఈ విక్రయాల్లో వ్యాపారులకు 80-90 శాతం వరకు లాభాలు సమకూరుతాయి. అయితే ఈ ఏడాది అధికారులకు మామూళ్లు కూడా పెరగడంతో ఆ ప్రభావం టపాకాయల ధరలపై పడటం ఖాయం. -
సమైక్యమే లక్ష్యం
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో పర్యటించేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు ఆనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని సమైక్య వాదుల్లో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తోంది. ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో 92వ రోజు బుధవారం కూడా జిల్లా అంతటా నిరసనలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్‌క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలి పారు. ఎస్కేయూలో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ధర్మవరం, గుంతకల్లులో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. గుంతకల్లులో డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. గుత్తిలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో దిగ్విజయ్‌సింగ్ ది ష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు కలసి ర్యాలీ చే శారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. పభు త్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేతబట్టుకుని..అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అమరాపురంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాయదుర్గంలో విద్యార్థులు, జే ఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నది వైఎస్సార్సీపీ మాత్రమేనని ఆయన అన్నారు. -
సమైక్య హోరు
సాక్షి, అనంతపురం : జిల్లాలో ‘సమైక్య’ ఉద్యమ కెరటం ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరాలన్న దృఢ సంకల్పం ఉద్యమకారుల్లో బలంగా కన్పిస్తోంది. అందుకే వారు రోజులు గడుస్తున్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం 91వ రోజు జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమించారు. అనంతపురం నగరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ చేశారు. స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో విద్యార్థి నాయకులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగాయి. ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంతకల్లులో రిలేదీక్షలు కొనసాగాయి. పామిడిలో మౌనదీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘శాడిస్టు సోనియా, యూపీఏ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కదిరిలో ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక వేమారెడ్డి కూడలిలో మానవహారం నిర్మించి... సమైక్య నినాదాలు చేశారు. ఉద్యమం 91 రోజులకు చేరుకున్న సందర్భంగా విద్యార్థులు 91 ఆకారంలో కూర్చున్నారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు పాఠశాల ఆటస్థలాన్ని శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. -
ఇదేం న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఇంట్లోవాడే కంట్లో పుల్ల పెట్టాడు’ అన్న చందంగా తయారయ్యారు మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎలాంటి హామీ ఇవ్వకుండా ఉత్తుత్తి మాటలతో ఉపాధ్యాయుల సమ్మె విరమింపజేసిన ముఖ్యమంత్రి వారి జీతాల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాడు సకల జనుల సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు ఇవ్వాలంటూ జీఓ విడుదల చేసిన కిరణ్ సర్కారు..నేడు సీమాంధ్ర ఉపాధ్యాయులు సమ్మె విరమించి మూడు వారాలు దాటుతున్నా జీఓ ఊసే ఎత్తకుండా కాలం వెల్లబుచ్చుతున్నారు. ఇదేం పక్షపాత పాలన అంటూ ఇక్కడి అయ్యవార్లు శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణా టీచర్ల విషయంలో... సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణా అయ్యవార్లు 2011 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సమ్మెలో పాల్గొన్నారు. ఈ 32రోజుల సమ్మె కాలంలో 16 రోజులు పనిదినాలు కావడంతో ఆ 16 రోజులు అదనంగా పని చేయాలని నాటి కిరణ్ సర్కార్ అక్టోబర్ 21వ తేదీన ఓ మెమో జారీచేసింది. అంతేకాకుండా సమ్మెకాలంలోని రోజులకు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు జీతాలు బిల్లులు చేసుకోవాలని జీఓ నంబర్ 151ని అదేనెల 28వ తేదీన విడుదల చేసింది. అంటే సమ్మె ముగిసిన 10 రోజులకే తెలంగాణా అయ్యవార్లకు సమ్మెకాలపు జీతాలు అందజేసిందన్నమాట. అదే కిరణ్ సర్కారు నేడు సీమాంధ్ర అయ్యవార్ల జీతాల విషయంలో దొంగాట ఆడుతోంది. సీమాంధ్ర ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం సమైక్యాంధ్ర ఉద్యమంలో 2013 ఆగస్టు 22వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సీమాంధ్ర అయ్యవార్లు బడులు మూసివేశారు. మొత్తం 49 రోజుల సమ్మె కాలంలో 33 రోజులు పనిదినాలు కోల్పోయారు. వీటికి బదులు రాబోయే ఆదివారాలు, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని పేర్కొంటూ ఈనెల 19వ తేదీన ఓ మెమో (ఆర్సి నంబర్ 31) విడుదలైంది. సెలవు రోజుల్లో చదువు చెప్పాలని గట్టి ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం జీతాల జీఓ విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రస్తుతం సమ్మె కాలపు జీతాలకు సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలన విభాగం కూడా దాటలేదు. అటు నుంచి విద్యాశాఖ, ఆర్థిక శాఖలను దాటుకుంటూ ముఖ్యమంత్రి వద్దకెళ్లేసరికి కనీసం ఐదు, ఆరు రోజుల సమయం పడుతుందని విశ్వసనీయ సమాచారం. మాటలు ఘనం.. చేతలు శూన్యం... తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరగదని, సమ్మె వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు గురించి ఆలోచించండంటూ చర్చల సమయంలో తీపి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవసరం తీరిన తర్వాత తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఇక్కడి అయ్యవార్లు మండిపడుతున్నారు. సమ్మె ముగిసి మూడు వారాలు దాటినా జీతాల జీఓ విడుదల కాకపోవడం పట్ల వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయులకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయ్యవార్ల ఎదురుచూపులు... దాదాపు రెండున్నర లక్షల మంది సీమాంధ్ర అయ్యవార్లు గత మూడురోజులుగా జీతాలు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి ఉద్యమాలు చేసిన ఉపాధ్యాయులు నేడు బడులకు పోతూ కూడా జీతాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది. వాస్తవానికి ఉపాధ్యాయుల జీతాల బిల్లులను సంబంధిత ఎంఈఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రతినెల 25వ తేదీలోపే ఖజానాకు పంపించేవారు. జీఓ త్వరగా వస్తే ఒకేసారి మూడు నెలల జీతాల బిల్లులను పెట్టుకోవచ్చన్న ఆశతో చాలామంది అధికారులు అక్టోబర్ నెల జీతాల బిల్లులను కూడా ఆపి ఉంచారు. అయితే జీఓ రోజురోజుకు ఆలస్యమవుతుండడంతో వీరి ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వంద్వ నీతిని మానుకొని జీతాల జీఓ విడుదలపై దృష్టిసారించాలని సీమాంధ్ర ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
సమైక్య నాదం.. అదే జన గళం
సాక్షి, అనంతపురం : జిల్లా అంతటా సమైక్య నినాదం.. అదే జనగళమైంది. 86 రోజులుగా ఎవరి నోట విన్నా.. సమైక్యాంధ్ర నినాదమే మారుమోగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా నడుస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం మొక్కవోని దీక్షతో ఉద్యమం కొనసాగిస్తున్నారు. గురువారం అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయ జాక్టో రిలే దీక్షకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ మద్దతు తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమం మొదలై 86 రోజులు కావడంతో ఎస్కేయూ వద్ద పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చుని ఆందోళన చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తనకల్లులో విద్యార్థులు రాస్తారోకో చేశారు. నంబులపూలకుంటలో ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో ప్రభుత్వ నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఓడీ చెరువులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, నాయకుడు కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్నంగా ర్యాలీ చేశారు. రొద్దంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా నీవైనా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా దీవించు అంటూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కళ్లకు గంతలు కట్టుకుని టవర్‌క్లాక్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి విన్నవించారు. విశ్వభారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాప్తాడులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్ష కొనసాగింది. ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రోడ్డుపై మోకాళ్లపై నిలుచుని ఆందోళన చేశారు. -
రాష్ట్రం విడిపోతే చేనేతకు గడ్డుకాలం
ఉరవకొండ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు తరలిరావాలని ఆల్ ఇండియూ హ్యాండ్లూమ్ డెరైక్టర్ చందావెంకటస్వామి పిలుపు నిచ్చారు. స్థానిక చౌడేశ్వరీ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయుంలో బుధవారం జిల్లా చేనేత పారిశ్రామిక నాయుకుల సవూవేశం నిర్వహించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు తరలివెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం విలేకరులతో చందావెంకటస్వామి వూట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి ఆశయు సాధన కోసం పాటు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల సవుస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. ధర్మవరంలో ఆవురణ దీక్షతోపాటు, సిరిసిల్లలో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయువ్ము ఆవురణదీక్ష చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించారన్నారు. విభజన అంశంపై ఇతర రాజకీయు పార్టీలు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుండగా, వైఎస్సార్సీపీ వూత్రం స్పష్టమైన సమైక్య నినాదంతో పోరాడుతోందన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగ తగిలేలా హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభకు చేనేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. -
సమైక్య జడి
సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్య పోరు ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారులు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తున్నా... ఉద్యమ హోరు మాత్రం తగ్గలేదు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకూ విస్తరింపజేయాలన్న లక్ష్యంతో అనంతపురంలోని ఎన్జీఓ హోంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి.. ఉద్యోగులతో సమావేశమై ‘సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యులు సమావేశమై.. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కష్టాలు మొదలవుతాయని జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నగరంలో ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థి సంఘాల నాయకులు దీక్షలు కొనసాగించారు. దర్మవరం, గుంతకల్లు, పామిడిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడి, బెళుగుప్పలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మానవహారం నిర్మించారు. కుందుర్పిలో విద్యార్థులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. గాడిదకు వినతిపత్రం అందజేశారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేత బట్టుకుని ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
నిర్విరామ పోరు
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయాన్ని పాలకులు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటుతున్నారు. జిల్లాలో ప్రతి ఊరూ వాడ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. మంగళవారం అనంతపురం నగరంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థులు, ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి.. మానవహారం నిర్మించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక కోస్తామని హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వారు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాస్క్ధారికి నాలుక కోస్తున్నట్లు ప్రదర్శన చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. నంబులపూలకుంట, మడకశిరలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విరామ సమయం లో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కణేకల్లులో నాలుగవ తరగతి విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. తాడిపత్రిలో నాయీబ్రాహ్మణ సంఘం, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యాంధ్ర సాధ నే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రసాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్ స్టేడియంలో జరగనున్న సమైక్యశంఖారావం సభను విజయవంతం చేయూలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరుకావాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంను విభజించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా రాష్ట్ర విభజనకే మొగ్గుచూపుతోందన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీగా మొదటి నుంచి మద్దతు ఇస్తున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగన్ మోహన్‌రెడ్డి రెండు సార్లు ఆమరణదీక్ష చేపట్టిన విషయూన్ని గుర్తుచేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో వైఎస్సార్ సీపీ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం జగన్మోహనరెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీనేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమతీరు చూస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు అధికారమే ధ్యేయంగా రాజకీయలబ్ధి పొందేం దుకు ఏమాత్రం వెనుకాడడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా ఒకేఒక్కరు పోరాడుతున్నారని, జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం ప్రకటిస్తున్నారన్నారు. తెలుగుజాతి సమైక్యత కోసం చేస్తున్న పోరాటమే సమైక్య శంఖారావసభని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. -
పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టుల మధ్య మాటల యుద్ధం అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది. లేఖల బాణాలు వేసుకోవడం,ప్రెస్కాన్ఫరెన్సుల్లో దెప్పిపొడుచుకోవడం మానలేదు. కలసి మెలసి ప్రజాసమస్యలపై పని చేస్తామంటూనే పరస్పరం కత్తులు నూరుకోవడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంకో ఐదారు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ ‘పోరేమిటని’ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలపైన, విధివిధానాలపైన, వ్యూహాత్మక ఎత్తుగడలపైన వాదులాడుకోవడం వీరికి కొత్త కాకున్నా మరీ ఇంత ‘దిగజారి’ దూషించుకోవాలా? అని నివ్వెరపోతున్నాయి. గతంలో పార్టీ ప్రణాళికలపై ఉభయ కమ్యూనిస్టులు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినప్పుడు సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఆ ఆందోళనకు మద్దతివ్వడం దేనికి సంకేతమంటూ సీపీఎం నేతలు, తెలంగాణలో సీపీఎం గోడమీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నదంటూ సీపీఐ నేతలు ఒకరిపై ఒకరు కాలుదువ్వుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సర్దుబాట్లపై బజారున పడ్డాయి. ఎన్నికలొస్తున్న ప్రతిసారీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల వ్యవహారంలో కాట్లాడుకోవడం షరామామూలైందని, పార్టీ నాయకత్వాలే ఇటువంటి దుస్థితిలో ఉంటే కార్యకర్తల మధ్య సయోధ్య ఎలా సాధ్యమని పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం వాపోతోంది. సొంతంగా పోటీ చేసి బలాన్ని పెంచుకోవడానికి బదులు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలనుకోవడమే తమ పార్టీల బలహీనత అని విశ్లేషిస్తున్నాయి. తాము తప్ప మిగతావన్నీ బూర్జువా పార్టీలేనని చెప్పే కమ్యూనిస్టులు సొంతకాళ్లపై నిలబడడానికి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నిస్తున్నాయి. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకుని తప్పు చేశామని పార్టీ రాష్ట్ర మహాసభల్లో విశ్లేషించుకున్న ఉభయ కమ్యూనిస్టులు మళ్లీ ఎన్నికలొచ్చే సమయానికి అదే తప్పు చేస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులు వాపోతున్నాయి. హుందాతనానికి మారు పేరుగా ఉండాల్సిన కమ్యూనిస్టు నేతలు బజారున పడి వాగ్వాదాలకు దిగడం, బహిరంగ లేఖలు రాసుకోవడం వల్ల కిందిస్థాయి కార్యకర్తల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప సాధించేదేమీ లేదన్నది నిర్వివాదాంశం. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య పార్టీల విలీనం నుంచి రాష్ట్ర విభజన వరకు అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. అనేక సందర్భాలలో వీటి మధ్య విభేదాలు బయటపడ్డాయి కూడా. విశాల ప్రాతిపదికన ఐక్య వేదికలు నిర్మించాలని రెండు పార్టీలూ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈమేరకు కొన్ని అంశాలపై కలిసి పని చేశాయి. అయినప్పటికీ పరస్పరం విశ్వసించుకోకపోవడంతో ఒకరిపై ఒకరికి ఏర్పడ్డ అపనమ్మకం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. -
సడలని దీక్ష
సాక్షి, అనంతపురం : సమైక్యమే లక్ష్యమంటూ ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. లక్ష్యాన్ని చేరుకునే దాకా పోరు ఆపబోమని స్పష్టీకరిస్తున్నారు. 81 రోజులైనా అదే ఉత్సాహం, ఊపుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఉద్యోగులు, ఎన్జీఓలు, ఉపాధ్యాయులు సమ్మె విరమించి విధుల్లో చేరిపోయినా.. ప్రజలు మాత్రం ఉద్యమబాట వీడడం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుండడంతో మొక్కవోని దీక్షతో సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాన్ని కొనసాగించారు. అనంతపురం నగరంలో సర్పంచులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్, వాణిజ్యపన్నుల శాఖ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి నాయకుడు పరశురాం నాయక్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రిజిస్ట్రార్ గోవిందప్ప సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బత్తలపల్లిలో రోడ్డుపై చదువుతూ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ర్యాలీ చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టి.. మానవహారాలు నిర్మిం చారు. రాయదుర్గంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ‘మహాత్మా.. నీవైనా రాష్ట్రాన్ని కాపాడు’ అంటూ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, గంట పాటు రాస్తారోకో చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు ఫుట్‌పాత్‌పై ఇంటి సామగ్రి అమ్మి నిరసన తెలిపారు. రాప్తాడులో విద్యార్థులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యమే లక్ష్యం
సమైక్యాంధ్రను పరిరక్షిద్దాం.. సర్వతోముఖాభివృద్ధి సాధిద్దాం అంటూ జిల్లాలో సకల జనులు సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. గెలుపు పొందు వ రకు అలుపు లేదు మనకు అంటూ పోరుబాటలో దూసుకెళ్తున్నారు.ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె బాట వీడినా విద్యార్థులు, మిగిలిన వర్గాల వారు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపుతూ సమైక్య ఆందోళనలో వైఎస్సార్సీపీ తనదైన పాత్రను పోషిస్తోంది. ఉద్యోగులు సమ్మెబాట వీడి విధుల్లో చేరినా ఉద్యమం మాత్రం చల్లారలేదు. ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టి పుట్టపర్తి కూడలిలో సింహనాదం సభను నిర్వహించారు. పలుచోట్ల న్యాయవాదుల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఆందోళనలు ప్రొద్దుటూరులో రాజుపాలెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన గుద్దేటి రాజారామిరెడ్డి ఆధ్వర్యంలో 18 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలు 60వ రోజుకు చేరుకోవడం విశేషం. వీరికి ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్లు నాగేంద్రారెడ్డి, నారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు. పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. చక్రాయపేట మండలానికి చెందిన 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో నందలూరు మండలం ఆడపూరు పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నేత రమేష్‌నాయుడు, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరు మండలం ఓబన కొత్తపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు లక్కిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో 14మంది, శెట్టిగుంట ఆదాం సాహెబ్, అంబటి మురళి ఆధ్వర్యంలో 16మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపైన నిలబడి నిరసన తెలిపారు. వీరికి ఆ పార్టీ నేతలు సుకుమార్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సాయికిశోర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానందిపల్లె మాజీ సర్పంచు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ వేల్పుల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో 20మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురంలో వీఎన్‌పల్లె మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, అలిదెన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో 50మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గంలో ప్రచార రథం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. రాయచోటిలో రామాపురం మండలానికి చెందిన నల్లగుట్టపల్లె, సరస్వతిపల్లె, చిత్తూరు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మురళీధర్‌రెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులురెడ్డి, జాఫర్ అలీఖాన్ సంఘీభావం తెలిపారు. కడపలో 48వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రియాజుద్దీన్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాష, అఫ్జల్ఖాన్ సంఘీభావం తెలిపారు. కడపలో న్యాయవాదుల, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. ప్రొద్దుటూరులో ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పుట్టపర్తి సర్కిల్లో సింహనాదం సభను ఏర్పాటుచేశారు. ఈ సభ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో కొనసాగింది. రాజంపేటలో భాష్యం స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. బద్వేలులో బోడపాడు గ్రామస్తులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. -
ఆగని పోరు
సాక్షి, నెల్లూరు : ఎన్జీఓలు సమ్మె విరమించినా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ మాత్రం ఆగలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు 80వ రోజూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదంటూ నినదించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆందోళనలు కొనసాగించారు. వీఆర్సీ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గాంధీ హానికి వినతి పత్రం సమర్పించారు. కోవూరులో చౌకదుకాణం డీలర్లు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యరాష్ట్రం కోరుతూ చౌకదుకాణాల డీలర్ల ధర్నా నిర్వహించారు. కావలి పట్టణంలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి. ఉదయగిరి పట్టణంలోని బస్టాండు సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం కాశీపేట సెంటర్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
పాలనలో పరుగులు
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: తాను పనిచేస్తూ.. కింది స్థాయి ఉద్యోగులనూ పని చేయించే దిశగా జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలలుగా పాలనలో స్తబ్ధత నెలకొంది. ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్పంచుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అధికారులు మొదలు అన్ని స్థాయిల సిబ్బంది కేంద్ర ప్రభుత్వ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమ్మెకు తాత్కాలికంగా విరమణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బరితెగించి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై గురువారం కలెక్టర్ ప్రత్యక్షంగా దాడులు చేపట్టి ఇసుకాసురుల భరతం పట్టారు. ఇతకపై తరచూ తనిఖీ చేపడతానని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావుతో కలిసి కర్నూలు మండలం మిలటరీ కాలనీలోని జిల్లా పరిషత్ పాఠశాల.. గార్గేయపురం, నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్లను, చివరగా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం డిప్యూటీ డీఈవో అనుమతి తీసుకోకుండానే సెలవు పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయులు వస్తుండటాన్ని గుర్తించి మందలించారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ముందుండాలని సూచించారు. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం లోపే ఉండటాన్ని కలెక్టర్ గుర్తించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల నోట్స్‌ను పరిశీలించారు. వారికి ఎంత వరకు సిలబస్ పూర్తయ్యిందో తెలుసుకుని.. ఇకపై తరచూ కొన్ని పాఠశాలలను సందర్శిస్తానని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, పబ్లిక్ పరీక్షల్లో ఫలితాల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. -
జనోద్యమం @ 80
సాక్షి, అనంతపురం : ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఉద్యమ బాట వీడుతున్నా సామాన్య జనం మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా పోరు సాగిస్తున్నారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో 80వ రోజైన శుక్రవారం కూడా ‘అనంత’లో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అనంతపురంలో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ సర్కిల్లో వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ విభాగం వద్ద ఆందళన చేశారు. యువ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ముట్టడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెలు అమ్ముతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు దిగుతామని గుంతకల్లులో మునిసిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గుత్తిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తోపుడుబండ్లపై పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై..సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శెట్టూరులో జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. పెనుకొండలో న్యాయవాదులు, విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వీరికి ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మద్దతు తెలిపారు. ఏపీ ఎన్జీవోల ఉద్యమంపై విమర్శలు గుప్పించిన మంత్రి కొండ్రు మురళి దిష్టి బొమ్మను జేఏసీ నాయకులు దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి.. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. వీరికి కాపు భారతి సంఘీభావం తెలిపారు. కణేకల్లులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. రాప్తాడులో జేఏసీ కన్వీనర్ ఎంఈఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలే దీక్ష కొనసాగింది. వీరికి వైఎస్సార్సీపీ నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధ్యాయులు విరామసమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆందోళన చేశారు. బత్తలపల్లిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. -
సడలని పోరు
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలన్న ఆకాంక్షతో జిల్లాలో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ కలసికట్టుగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరు సాగిస్తూనే ఉన్నారు. 79వ రోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. గుంతకల్లు, ధర్మవరంలో ఆ పార్టీ నాయకులు రిలే దీక్షలు కొనసాగించారు. రాప్తాడులో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడలో సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి, నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. గుంతకల్లులో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంలో పార్టీ నాయకుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పోస్టర్లను విడుదల చేశారు. ఏపీఎన్జీఓ సంఘం నాయకుల పిలుపు మేరకు సమైక్యవాదులు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు. అనంతపురంలో పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్య శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఎన్టీయూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కుర్చీలను అడ్డంగా తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూ, ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో సమైక్యవాదులు రహదారిపై మానవహారం నిర్మించారు. రాష్ట్ర విభజన జరిగితే రైతులు పండించిన ఫలసాయానికి మార్కెట్ సౌకర్యం తగ్గిపోయి.. గిట్టుబాటు ధర లభించదని కూరగాయలను అమ్ముతూ నిరసన తెలిపారు. గుత్తిలో జేఏసీ అధ్వర్యంలో రిలే దీక్ష చేయగా.. పామిడిలో మౌన దీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సద్భావన సర్కిల్లో మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. కళ్యాణదుర్గంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో టీ సర్కిల్లో సమైక్యాంధ్ర టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి టిఫిన్ విక్రయించి నిరసన తెలిపారు. మడకశిరలో మానవహారం నిర్మించి.. రాస్తారోకో చేశారు. పెనుకొండ, గోరంట్ల, రాయదుర్గంలో రిలే దీక్షలు కొనసాగాయి. మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో వైద్య సిబ్బంది, ఇంజనీరింగ్ విద్యార్థులు, మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. ఉద్యమకారులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. హంద్రీ-నీవా కాలువలో కేంద్ర మంత్రుల ఫొటోలను నిమజ్జనం చేశారు. బెళుగుప్పలో జేఏసీ ఆధ్వర్యంలో పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. -
అదే పట్టు
సమైక్య ఉద్యమం నేటితో 80వ రోజుకు చేరుకుంది. జిల్లాలో సమైక్య ఉద్యమహోరు జోరుగా సాగుతోంది. ర్యాలీలు, మానవ హారాలతో నిరసన తెలియజేస్తున్నారు. రిలేదీక్షలతో సమైక్యకాంక్షను ఢిల్లీకి తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్రను సాధించి తీరుతామని నినదిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాక్షి, కడప: జిల్లాలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురువారంతో 79రోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు అలుపెరుగని పోరు సాగిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 66వ రోజుకు చేరాయి. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షాశిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కే సురేష్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో రెవెన్యూ ఉద్యోగులు, గ్రామనౌకర్లు, వీఆర్వోలు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, పూల అంగళ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దీక్షాశిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. రాజంపేటలో బార్అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎన్జీవోలు చేపట్టిన రిలేదీక్షలు గురువారంతో 60రోజులు పూర్తి చేసుకున్నాయి. రైల్వేకోడూరులో జేఏసీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో కలిసి ధర్నా నిర్వహించారు. బద్వేలులో వైద్య, ఆరోగ్య సిబ్బంది జేఏసీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నర్సులు, ఏఎన్ఎంలు రిలేదీక్షలకు కూర్చున్నారు. మైదుకూరులో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ ఉద్యోగుల దీక్షలు గురువారంతో 60వ రోజుకు చేరాయి. ప్రొద్దుటూరులో చేపట్టదలిచిన విద్యార్థి సింహగర్జన ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. రాయచోటిలో ఏపీ ఎన్జీవోలు, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం సింహపురి వాసులు 77 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను కష్టాల పాలుచేయవద్దని, అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు ఎన్జీఓ భవన్లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్ష చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంలో పూసలకాలనీవాసులు కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. వింజమూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్లో సమైక్యవాదులు రిలేదీక్ష చేసి, రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన రైతుగర్జన విజయవంతమైంది. రిలేనిరాహార దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ నాయకులు, ప్రజలు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కావలిలో ైవె ఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్న వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో పలుచోట్ల రిలేదీక్షలు జరిగాయి. పొదలకూరులో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పొదలకూరు పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. -
ఉద్యమ వ్యవసాయం చేయండి
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: రైతులు పంటలసాగుకు తాత్కాలికంగా విరామం ప్రకటించి సమైక్యాంధ్ర ఉద్యమ వ్యవసాయం చేయాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. రైతులు ఉద్యమపగ్గాలు చేతపట్టాలని, అప్పుడే సమైక్యాంధ్ర అనే ఫలసాయం అందుతుందని ప్రసాదరెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేని నేతలను చెర్నకోలతో అదిలించి, కదిలించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు మిగులుజలాల ఆధారంగానే గాలేరు నగరి, తెలుగుగంగ లాంటి ప్రాజెక్టులు ఆధారపడ్డాయన్నారు. కర్నాటక నుంచి నదీ జలాలు రానందువల్లే అనంతపురం జిల్లా కరువు కాటకాలకు నిలయమైందని, తుంగభద్ర జలాలు నిబంధనల ప్రకారం వచ్చి ఉంటే వారి పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి విభజన వలన మిగతా వారికంటే పూర్తిగా నష్టపోయేది రైతులేనని తెలిపారు. కృష్ణా నదీజలాలపై అల్మట్టి, నారాయణ కేడ్, జూరాల ప్రాజెక్టులు నిర్మించారని, తెలంగాణ విభజన జరిగి కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు సాగునీరు కరువు అవుతుందన్నారు. బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల మనకు నష్టం జరిగిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి మిడ్‌పెన్నార్ ద్వారా కర్నాటక బార్డర్ వరకు తాగునీటిని తీసుకెళ్లడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ మల్లేల లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ ఉద్యమానికి ప్రతి ఇంటి నుంచి రైతులు తరలి రావాలని కోరారు. ఎన్జీఓ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఏ క్షణంలోనైనా ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉద్యమంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం కావాలని కోరారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం విభజన జరిగితే జూరాల ప్రాజెక్టు ఎత్తు పెంచినా, శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ సరఫరాకు ముందుగా నీటిని విడుదల చేసినా మనకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ జేఏసీ నాయకుడు జయరాజ్, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు రషీద్‌ఖాన్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకరాపురం ప్రసాదరెడ్డి, వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు. -
దీక్షా దక్షులు
సాక్షి, కడప : సమైక్యాంధ్రే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అలుపెరగని రీతిలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షా దక్షతతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు దసరా పండుగ సోమవారం రోజు సాగాయి. మంగళవారం సైతం దీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబుతోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సంఘీభావం తెలిపారు. కడప నగరంలో సోమవారం వైఎస్సార్సీపీ నగర ఉపాధ్యక్షుడు మున్నా ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, అంజాద్‌బాషా, మాసీమబాబు సంఘీభావం తెలిపారు. మంగళవారం నగర మాజీ కార్పొరేటర్ నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అంజాద్‌బాషా, అఫ్జల్‌ఖాన్‌లు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో మంగళవారం రోజు 27వ వార్డుకు చెందిన రామ్మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో సోమవారం ఎస్.కొత్తపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత వేమన రాజా నేతృత్వంలో 20మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్ సీపీ నేతలు బ్రహ్మానందరెడ్డి, సుకుమార్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. మంగళవారం ఎస్.ఉప్పరపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 10మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.రాజంపేట పట్టణంలో సోమవారం మైనార్టీ విభాగం వైఎస్సార్సీపీ నాయకుడు జావెద్‌బాషా ఆధ్వర్యంలో 40 మంది దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం కూచివారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో 60మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో సోమవారం రోజు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం గిరినగర్ కాలనీకి చెందిన 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురం పట్టణంలో సోమవారం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మస్తానయ్య ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ నాయయకుడు వల్లెల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో 40మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందులలో సోమవారం కొత్త బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వాసులు 70 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వరప్రసాద్, ప్రభాకర్, చిన్నప్ప ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రాయచోటిలో సోమవారం లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం గాలివీడు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత నాగభూషణ్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
పండుగ పూట.. పోరు బాట
సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఉద్యమం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసే బాధ్యతను సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. పండుగ రోజుల్లోనూ పోరుకు విరామం ఇవ్వకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులను కార్యోన్ముఖులను చే స్తున్నారు.జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి. సాక్షి, కడప: సమైక్యాంధ్ర ప్రకటన వచ్చిన రోజే నిజమైన పండుగ అని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు పోరు ఆగదని జిల్లా ప్రజలు నినదించారు. దసరా సంబరాల్లోనే సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యమం నడిపిస్తూ సమరోత్సాహంతో ముందుకు సాగారు. విభజనకు నిరసనగా వినూత్న ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు, రిలే దీక్షలతో సకల జనులు పోరును సాగించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సుల్లో సమైక్య ఆకాంక్షను బలంగా వినిపించారు. కడప నగరంలో సోమ,మంగళవారాల్లో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సాగునీటిపారుదల, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సాగాయి. మంగళవారం రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శిబిరంలో రైతులు, మైదుకూరు ప్రాంత ఉపాధ్యాయులు, డ్వామా, ఏపీఎంఐపీ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు ప్రసంగించారు. జమ్మలమడుగు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు సాగాయి. మంగళవారం పత్రికా విభాగానికి సంబంధించి హెచ్ఆర్, సర్క్యులేషన్, పేపర్ బాయ్‌లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో క్రైస్తవ జేఏసీ నాయకుడు అగస్తీన్రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో న్యాయవాదులు, మున్సిపల్ సిబ్బంది దీక్షలు సోమవారం కొనసాగాయి. మంగళవారం ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు పట్టణంలో భారీ రైతు సదస్సును నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, టీడీపీ నాయకురాలు లక్ష్మిప్రసన్న సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించి అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర గీతాలు, విచిత్ర వేషధారణలతో నిరసన వ్యక్తంచేశారు. రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. దీనికి వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో సోమ,మంగళవారాల్లో గ్రామ నౌకర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. మంగళవారం పట్టణంలో రైతు సదస్సును నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి జేఏసీ నాయకులు రాష్ర్టం విడిపోతే కలిగే కష్టనష్టాలను వివరించారు. పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి ఎన్జీఓలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం ఎన్జీఓల ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పడుకొని సమైక్య నినాదాలు చేశారు. మైదుకూరులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటి పట్టణంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యాంధ్ర జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో సోమ, మంగళ వారాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ ఏరియా ఆస్ప్రత్రి వైద్యులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వైఎస్సార్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఓపీ సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. -
పండగ పూటా పోరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం 75వ రోజుకు చేరుకుంది. విజయదశమి పండగ రోజూ ఉధ్యమం ఉధృతంగా సాగింది. ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని ఎన్జీఓ భవన్లో ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉదయగిరిలోని దీక్షా శిబిరంలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ సెంటర్లో ఒంటికాలుపై నిలుచుని నిరసన తెలియజేశారు. బస్టాండ్ సెంటర్లో జరిగిన రిలేదీక్షలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కావలిలోనూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు దీక్షలు కొనసాగించారు. వెంకటగిరిలోని కాశీపేట సెంటర్లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట, నాయుడుపేటలో జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్లోనూ సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్లో రిలేదీక్షలు కొనసాగాయి. సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు గుమ్మడి కాయలకు తగిలించి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పగలగొట్టారు. -
సూక్ష్మ సేద్యానికి బ్రేక్
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మె సూక్ష్మ సేద్యంపై ప్రభావం చూపుతోంది. డ్రిప్ యూనిట్లు కావాలంటే దరఖాస్తుతో పాటు మట్టి, నీటి పరీక్షలకు సంబంధించి నమూనా పత్రాలు జత చేయాల్సిరావడంతో రైతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రిప్‌తో పాటు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్ల యూనిట్లకూ అదే పరిస్థితి. దీంతో ఈ ఏడాది సకాలంలో డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేలా కనిపించడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి సరిగ్గా ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)కి కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారయ్యాయి. జిల్లా అధికారులు 20 వేల హెక్టార్లకు డ్రిప్ అవసరమని పంపిన ప్రతిపాదనలు పక్కనపెట్టి తొలివిడతగా 5,900 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు కేటాయించారు. 1700 హెక్టార్లకు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్లు కేటాయించినా వాటిపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. గతేడాది కూడా జిల్లాకు 1,100 హెక్టార్లు టార్గెట్ ఇచ్చినా అందులో 100 హెక్టార్లకు కూడా రైతులు వినియోగించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే వీటి అవసరం రైతులకు లేదనే విషయం అర్థమవుతుంది. వాటి ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఈ కారణంగా 90 శాతం మంది రైతులు డ్రిప్ కోసం ఎగబడుతున్నారు. గత జనవరి నుంచి దాదాపు 9 నెలల పాటు డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియను ఆపేశారు. దీంతో 8 నుంచి 9 వేల మంది రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎపుడెపుడా అని ఎదురుచూసే క్రమంలో కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారు చేయడంతో రైతులు సంబరపడ్డారు. కానీ... ఈ సారి కొత్త నిబంధన పెట్టడంతో మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా మట్టి, నీటి పరీక్షలు చేయించి వాటి నమూనా పత్రాలు జత చేయాలనే షరతు విధించారు. గతంలో మట్టి, నీటి నమూనాలు ఎప్పుడిచ్చినా దాంతో సంబంధం లేకుండా డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేవి. ఇప్పటికే వాటి నమూనాలు లేకుండా వేలాది మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. ఇపుడు వాటిని వెనక్కి తీసుకుని నమూనా పత్రాలు జమ చేయాల్సి ఉంది. ఇప్పటికిపుడు మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవాలనే అలాంటి సదుపాయం అందుబాటులో లేదు. అధికారులు సమైక్య సమ్మెలో ఉన్నందున భూసార, నీటి పరీక్ష ప్రయోగాలలు నిరవధికంగా మూతబడ్డాయి. ప్రయోగశాల తెరచినా సిబ్బంది కొరత కారణంగా వేగంగా పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కొత్త నిబంధన వల్ల డ్రిప్ రైతులకు సకాలంలో యూనిట్లు అందడం కష్టంగా మారింది. -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ఆగస్టు 12 నుంచి ఏన్జీఓ సంఘ నాయకులతోపాటు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. 73 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు శనివారం తెల్లవారుజాము నుంచే బస్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వం యూనియన్ల నాయకులతో రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎండి ఏకె ఖాన్లు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈనెల 10వ తేదిన 954 జీఓను విడుదల చేశారు. ఆ జీఓలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందన్న విషయంలో స్పష్టత లేదని, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మరలా ఈనెల 11న జరిగిన చర్చల్లో 961 జీఓను విడుదల చేశారు. దీంతో చర్చలు సఫలమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా విధులకు హాజరయ్యారు. -
లక్ష్యం దిశగా..
ఓ వైపు ప్రజల అవసరాలను గుర్తిస్తూ...వారికి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూనే.. మరో వైపు సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును సాగిస్తున్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. దసరా నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అయినా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ బాటను మాత్రం వీడలేదు. లక్ష్యం కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. ప్రధానంగా ఎన్జీఓలు తమ పోరును విరమించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు శనివారం దీక్ష విరమించారు. ఆర్టీసీ ఆర్ఎం గోపీనాథరెడ్డి దీక్షకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. జిల్లాలో అత్యంత వైభంగా జరిగే దసరా వేడుకల నేపథ్యంలో ప్రజలకు ఆటంకం కలగకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 73రోజుల తర్వాత శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పాయి. ఇన్ని రోజలుగా అధికచార్జీలు చెల్లించి ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు బస్సులను ఆశ్రయించిన ప్రయాణికులు బస్సులు తిరగడంతో ఆనందంగా ఉన్నారు. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు, నగరపాలక సిబ్బంది, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ సిబ్బంది రిలే దీక్షలు నడుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఎన్జీవోలు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ ఆధ్వర్యంలో 10మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఉద్యమకాలంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు 6లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఉదయం 10-12గంటల వరకూ వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా, చంద్రబాబుదీక్ష భగ్నానికి నిరసనగా సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజంపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులు దీక్షలు చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు, జేఏసీ చైర్మన్ రమణ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో తులసీ స్కూలు విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. మైదుకూరులో నందికాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆపై మానవహారం చేసి రిలేదీక్షలకు కూర్చున్నారు. బద్వేలులో మాలమహానాడు నేత ఎస్రోమ్ ఆధ్వర్యంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. -
కదిలిన జనరథాలు
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :రోడ్లకు మళ్లీ మునుపటి ‘కళ’ వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండు నెలలుగా కనుమరుగైన ‘జనరథాలు’ మళ్లీ కనిపించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణతో శనివారం రాజమండ్రి రీజియన్‌లోని 9 డిపోల నుంచీ బస్సులు తిరిగాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నిర్ణయించడంతో ఆగస్టు 13 నుంచి 836 బస్సులు గత 60 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,200 మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. శనివా రం మధ్యాహ్నానికి 588 కండక్టర్లకు గాను 442 మంది, 675 మంది డ్రైవర్లకు గాను 442 మంది విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది దూరప్రాంత సర్వీసులకు, షిఫ్ట్‌లకు హాజరవుతున్నారు. చర్చల్లో ఆర్టీసీ కార్మికులందరికీ దసరా బోనస్ ప్రకటించి, తొలిరోజు విధులకు హాజరయ్యే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలపడంతో జిల్లాలోనున్న కార్మికులంతా విధులకు ఉత్సాహంగా హాజరయ్యారు. దసరా సందర్భంగా దూరప్రాంతాలు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయనే సమాచారంతో ఉదయం నుంచే బస్టాండ్లకు చేరుకున్నారు. జిల్లా నుంచి ఉదయం హైదరాబాద్‌కు ఎనిమిది ప్రత్యేక బస్సులను నడపగా రాత్రికి మరికొన్ని అదనపు బస్సులను నడిపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లలో అదనంగా బస్సులు నడిపారు. కాగా ఉదయం నుంచి బస్సులు తిరుగుతున్నా ప్యాసింజర్ సర్వీసుల్లో మాత్రం మధ్యాహ్నం నుంచే రద్దీ కనిపించింది. నష్టం రూ.50 కోట్ల పైనే.. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 12 వరకు దఫదఫాలుగా బస్సులను ఉద్యమకారులు ఆపేశారు. దీంతో రీజియన్‌లో రూ.5 కోట్ల వరకు నష్టం వచ్చింది. అనంతరం ఆగస్టు 13 నుంచి 60 రోజుల పాటు సమ్మె కొనసాగడంతో రూ.45 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇన్నిరోజులుగా ఆగిపోవడంతో బస్సుల్లో తలెత్తిన లోపాలకు మరి కొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. కాగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోవాలాలు, ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా చార్జీలు దండుకుని సొమ్ము చేసుకున్నారు. సమ్మె కాలంలో రైళ్లయితే గాలి చొరబడడానికి సందు లేనంత కిక్కిరిసి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు తిరిగి నడవడంతో ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. -
కళతప్పిన దసరా
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: దసరా అంటేనే అందరిలో ఓ ఆనందం. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, రైతులు..ఇలా అందరిలోనూ విజయదశమి ఉత్సాహం నింపుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ఆనందోత్సవాహాలు కరువయ్యాయి. ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. సమ్మె కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్య ప్రజలు సైతం సాదాసీదాగానే పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దసరా ఉత్సవాల్లో భాగ మైన విజయదశమి పండగకు ప్రత్యేకత ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించే వారితో పాటు గృహప్రవేశాలు, వివాహాలకు దసరా ముహుర్తాల్లోనే ప్రాధాన్యం ఇస్తారు. సైకిల్ నుంచి భారీ వాహనాల వరకు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్నింటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. హిందువులతో పాటు మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఈ పండగ నాడు ఆయుధాల పూజ నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దసరాపై ఈ మారు సమైక్య ఉద్యమం తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కూలీలకు ఉపాధి కరువైంది. వరుస బంద్‌ల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వ్యాపారులు నిత్యావసర సరుకులను పెద్దగా దిగుమతి చేసుకోలేదు. ఈ క్రమంలో అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల చేతిలో నగదు లేకపోవడంతో పండగపై ఆసక్తి కనబచరడం లేదు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పండగకు సరుకులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఎప్పుడూ దసరా సందర్భంగా కొనుగోలుదారులతో కిటకిటలాడే నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ఈ సారి వెలవెలబోతోంది. సాధారణంగా దసరా సీజన్లో వారం రోజుల వ్యవధిలో రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపారాలు జరిగితే ఇప్పుడు మాత్రం రూ.20 లక్షల కూడా దాటలేదని వ్యాపారులు చెబుతున్నారు. బోసిపోతున్న వస్త్రదుకాణాలు ఏటా దసరా సందర్భంగా పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ అందజేస్తాయి. చిరువ్యాపారులు సైతం తమ వద్ద పనిచేసే కార్మికులు దుస్తులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి మాత్రం వ్యాపారాలు లేకపోవడంతో పరిస్థితి తిరగబడింది. ఇటీవల నాలుగు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆదాయాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఈసారి బోనస్ అందజేసే విషయంలో వెనుకంజ వేశారు. మొత్తం మీద దసరా పండగ కళతప్పింది. -
సమైక్య లక్ష్యం..సడలని సంకల్పం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని రగిలిస్తున్నారు. అలాగే ఉద్యమ ఆవశ్యకతపై చైతన్యవంతం చేస్తూ నియోజకవర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో పార్టీ నాయకుడు బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో మందలూరు గ్రామానికి చెందిన రైతులు సమైక్యవాణి వినిపించారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మండల కన్వీనర్ చిన్నవీరన్న ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఆత్మకూరులో ఏరువా రామచంద్రారెడ్డి, డోన్‌లో ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో నల్లమేకలపల్లె వాసులు కూర్చున్నారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు ఆపబోమని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కౌతాళం మండలం కంబళనూరు క్యాంప్‌నకు చెందిన కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. అలాగే నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శాతనకోట గ్రామానికి చెందిన 30 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్ని సమైక్య నినాదాలు చేశారు. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. -
ఇడగొడితే..బతికేదెట్లా?
క్రిష్ణగిరి/ కోడుమూరు, న్యూస్‌లైన్:‘ ఏమొచ్చింది నాయనా... ఈ కాంగిరేసోళ్లకు... ఈ రాష్ట్రాన్ని ఇడగొడుతున్నారంట... పిల్లల బతుకులు ఏంగావాలా? బతికేదెట్లా? ఇడగొడితే ఈ కాలవకి నీళ్ళు రావంటా? మీరే ఏదైనా సేయండయ్యా..’’అంటూ మహబూబ్ బీ (70) అనే వృద్ధురాలు.. వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డికి విన్నవించుకుంది. సమైక్యాంధ్ర కోసం ఆయన చేపట్టిన సమైక్య పోరు పాదయాత్ర నాలుగోరోజు శుక్రవారం లాలుమాను పల్లె నుంచి ప్రారంభమై చుంచుఎరగ్రుడి, ఎరుకలి చెరువు, క్రిష్ణగిరి, చెరుకులపాడు మీదుగా వెల్దుర్తి వరకు దాదాపు 28 కి.మీ.లమేర కొనసాగింది. కె.యి. సోదరులకు కంచుకోటగా ఉన్న క్రిష్ణగిరి మండలంలో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రను చూసేందుకు పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు వచ్చారు. ప్రయాణికులు తమ వాహనాలను ఆపి ఆయనతో కరచాలనం చేశారు. క్రిష్ణగిరి గ్రామం దగ్గర రాముడు అనే రైతు తన గోడును కోట్ల హరిచక్రపాణిరెడ్డికి విన్నవించాడు. సాగుచేసిన వేరుశనగ పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గురించి ప్రభుత్వానికి చెప్పాలని కోరాడు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నెకల్లు సురేంద్ర రెడ్డి, కరుణాకర్ రెడ్డి, క్రిష్ణగిరి మండల కన్వీనర్ చిట్యాల రాజేశ్వర్ గౌడ్, బీసీసెల్ మండల కన్వీనర్ రామాంజనేయులు, లకిష్మకాంతా రెడ్డి, కోవెలకుంట్ల వెంకటేశ్వర్లు, ఎస్.ఎరగ్రుడి బజారి, మహిళా మండల కన్వీనర్ రాములమ్మ, కోడుమూరు మండల కన్వీనర్ గిరిప్రకాశ్ రెడ్డి, టౌన్ కార్యదర్శి డీలర్ క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్యకర్తల్లో నూతన ఉత్తేజం: సమైక్యాంధ్ర కోసం కోట్ల హరిచక్రపాణి రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. క్రిష్ణగిరి మండలంలోని గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు. దారుల వెంట ప్రజలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. -
సమ్మెను ఆపేది లేదు
వైవీయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వెలువడే వరకు ఉద్యమానికి ఆపేది లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సహకరిస్తున్నారంటే ప్రజల్లో సమైక్యాంధ్ర అవసరం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. ఉద్యమం తీవ్రస్థాయిలో చేయడం వల్లే ఇప్పటికీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొన్ని సంఘాలు మాత్రం విధులకు హాజరవుతున్నాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదని, చాలామంది మధ్యాహ్న భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఉపాధ్యాయులు సమ్మెబాట వీడారని, అయితే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారన్నారు. ఎన్జీఓ అధ్యక్షుడు కె.వి. శివారెడ్డి మాట్లాడుతూ అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులను కూడా ఉద్యమంలోకి తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నామన్నారు. జెడ్పీ సీఈఓ మాట్లాడతూ విధులకు హాజరవుతూ రోజుకో విభాగం వారితో ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఈశ్వరయ్య, కడప ఆర్డీఓ హరిత, నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, మైనార్టీశాఖ ఈడీ శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి ఖాదర్‌బాషా, జిల్లా అధికారులు అపూర్వసుందరి, ప్రతిభాభారతి, భాస్కర్‌రెడ్డి, ప్రసాద్, ఎంఈఓ నాగమునిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య లక్ష్యం..దీక్షామార్గం
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమకార్యచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి సమైక్య పోరు పాదయాత్ర బుధవారం రెండో రోజు కొనసాగింది. హోసూరు నుంచి ప్రారంభమై పత్తికొండ, రాతన, తుగ్గలి మీదుగా ఎద్దులదొడ్డి వరకు సాగింది. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి నగర్‌లోని ఆర్చి దగ్గర కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల్లో పది మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆదోనిలో స్థానిక నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు, అబ్దుల్ ఖాదర్ నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డలో బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో 12 మంది పాల్గొన్నారు. మండల కన్వీనర్ చిన్నవీరన్న, ఆలూరు సింగిల్ విండో ఛైర్ పర్సన్ సౌమ్యారెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పాల్గొన్నారు. డోన్‌లో మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో పట్టణానికి చెందిన పది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో కౌతాళం మండలం కాత్రికి, లింగాలదిన్నె గ్రామానికి చెందిన 15 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో స్థానిక నాయకులు బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరుచరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరీశంకర్ కాంప్లెక్స్ దగ్గర రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. -
సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం
సాక్షి ప్రతినిధి, కర్నూలు :ఊరూ.. వాడ, చిన్నా.. పెద్దా తేడా లేకుండా జనం సమైక్యాంధ్ర కోసం 71 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నియోజక వర్గ సమన్వయకర్తలు, మండల నేతలు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం ఉద్యమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రైల్వేశాఖ సహాయం మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విభజన ప్రకటన వెలువడిన రోజే ఢిల్లీ వెళ్లారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అధికంగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఒకటి రెండు సార్లు జిల్లాకు వచ్చినా వారిని సమైక్యవాదులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ వెంకటేష్ తాను సమైక్యవాదినని మీసం మెలేసి తొడగొట్టి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో ఉద్యమం మహోద్యమంగా మారింది. ఉద్యమకారులు తీవ్రస్థాయిలో ఉద్యమాలకు తెరతీశారు. టీజీ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలులో ఇంతపెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మంత్రి కానీ, ఆయన అనుచరులు కానీ ఉద్యమకారులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా ఉద్యమంలో పాల్గొని ఓ రోజు దీక్ష చేసి వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఉద్యమం ప్రారంభంలో ఓ రోజు ర్యాలీలో పాల్గొని హైదరాబాద్ వెళ్లిపోయారు. కేబినెట్ ఆమోదం తెలియజేసిన రోజు పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను సమైక్యవాదులు నమ్మటం లేదు. ఇక కోడుమూరు, నందికొట్కూరు, ఆలూరు ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామి, నీరజారెడ్డి పత్తాలేకుండా పోయారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మాత్రం ఐదురోజులు నిరాహారదీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర శూన్యమేనని సమైక్యవాదుల అభిప్రాయం. రెండు కళ్ల సిద్ధాంతానికే కట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యేలు... అధికార కాంగ్రెస్ నేతలు తీరుకు ఏమాత్రం తీసిపోని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు కేఈ కృష్ణమూర్తి డోన్‌కు వచ్చిన సందర్భంలో ఉద్యమం చేస్తున్నవారికి సంఘీబావం తెలియజేసి వెళ్లిపోయారు. తరువాత అటువైపు తిరిగిచూసిన దాఖలాలు కనిపించలేదని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కర్నూలులో దీక్షా శిభిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ఆదోనిలో ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కూడా మొదట్లో ఆందోళనలో పాల్గొన్నారు. ఆతరువాత కనిపించకుండాపోయారు. మిగిలిన నియోజక వర్గ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారికేమీ తీసిపోని విధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమం చేయలేకపోయినప్పటికి విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటానికే మొగ్గుచూపుతున్నారని సమైక్యవాదులు విమర్శలు చేస్తున్నారు. ఒకరిని విమర్శించటానికే పరిమితమైన కాంగ్రెస్, టీడీపీ నేతలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై దాడులుకు దిగామని చెపుతున్నారు. అలా దాడులకు దిగిన సమైక్యవాదులపై కొందరు అధికార కాంగ్రెస్ పెద్దలు అక్రమ కేసులు బనాయించటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీరికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామని హెచ్చరిస్తున్నారు. అలుపెరగని పోరుచేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డ శాసనభ్యురాలు, వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆదినుంచీ ఉద్యమంలో దూకుడుగా ఉంటూ కార్యకర్తలను, శ్రేణులను ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కూడా ఉద్యమంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తన అనుయాయులూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఆ పార్టీకి చెందిన సమన్వయ కర్తలూ పాదయాత్రలతోనూ, రిలే దీక్షలతోనూ ముందడుగు వేసి ప్రజా మన్ననలు పొందుతున్నారు. -
పోరాటం ఆగదు విద్యుత్ జేఏసీ
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రత్నామ్నాయాలు, ప్యాకేజీలతో తమను మభ్యపెట్టలేరని విద్యుత్ జేఏసీ జిల్లా చైర్మన్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాతూరు పవర్ ఆఫీస్ నుంచి టవర్‌క్లాక్ వరకు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం, ప్యాకేజీలిస్తాం, మీ బాధను పంచుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం దారుణమన్నారు. నిజంగా వారికి సీమాంధ్రులపై అంతటి మమకారం ఉంటే, ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సీమాంధ్రుల మనోభావాలను, వారి త్యాగాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రాతిబొమ్మలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతునివ్వడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఉద్యమం చేస్తున్నారని అభినందిస్తున్నారన్నారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వద్దకు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు చంద్రమోహన్, పద్మ, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, తులసీకృష్ణ, మేఘరాజు, రంగస్వామి, రంగయ్య, నాగరాజు, అక్రం, దాదాపీర్, ముత్తు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
ఉధృతంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
సాక్షి, అనంతపురం :రోజులు గడిచే కొద్దీ సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. 71వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు కరెంటు సరఫరా నిలిపేశారు. విద్యుత్ కోత, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సమ్మె వల్ల మూడో రోజు కూడా జిల్లా సర్వజనాస్పత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పలేదు. జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు, ఏటీఎంలను బంద్ చేశారు. అనంతపురం నగరంలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించా రు. కలిసుంటే కలదు సుఖం, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరి జీవితాల్లో వెలుగులు.. అంటూ నినదించారు. సమైక్యవాది మల్లికార్జున నాయక్ మృతికి సంతాపసూచికంగా ఉద్యోగ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి. స్థానిక టవర్ క్లాక్ కూడలిలో ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కేంద్ర మంత్రులకు పిండప్రదానం చేశారు. ఆర్య వైశ్యులు భారీ ర్యాలీ.. ఆటపాటలతో సమైక్య వాణి వినిపించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి.. సప్తగిరి, టవర్ క్లాక్ కూడళ్లలో మానవహారం నిర్మించారు. పంచాయతీ రాజ్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ శాఖ నాల్గో తరగతి ఉద్యోగులకు దసరా పండుగ సరుకులను ఎస్ఈ అందజేశారు. సమైక్యవాదులు ఎస్కేయూ నుంచి ఆకుతోటపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో జేఏసీ ఆధ్వర్యాన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. రాష్ట్రం విడి పోతే నీటి చుక్క కూడా దొరకదంటూ గుంతకల్లులో జేఏసీ నాయకులు బిందె నీరు రూ.500లకు విక్రయిస్తూ నిరసన తెలిపారు. పామిడిలో జేఏసీ నాయకులు చిరంజీవి, బొత్స, కావూరి వేషధారణలో సోనియాగాంధీ చుట్టూ భజన చేస్తున్నట్లుగా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంత్రుల మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రోడ్లు ఊడ్చారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో హాస్టల్ వార్డెన్లు ఒక్క రోజు సామూహిక దీక్ష చేపట్టారు. వీరికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మద్దతు తెలిపారు. తలుపులలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలు చేస్తూ.. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. మడకశిరలో జేఏసీ నాయకులు ఇండేన్ గ్యాస్ గోదామును ముట్టడించారు. అమరాపురం, రొళ్లలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు, మానవహారం చేపట్టారు. సెల్‌టవర్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. పుట్టపర్తిలో విద్యుత్ సరఫరా లేక సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు బంద్ అయ్యాయి. బుక్కపట్నంలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. మల్లికార్జున నాయక్ మృతికి సంతాపంగా పెనుకొండలో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ, భిక్షాటన చేపట్టారు. కేసీఆర్, దిగ్విజయ్, సోనియా దిష్టిబొమ్మలకు సమాధి కట్టి పిండప్రదానం చేశారు. పెనుకొండ, పుట్టపర్తి, శింగనమల, గార్లదిన్నె, ఉరవకొండలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు. పరిగిలో భారీ ర్యాలీ చేశారు. తాడిపత్రిలో మానవహారం నిర్మించారు. కణేకల్లులో ముస్లింల సమైక్య గర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కనగానపల్లిలో సమైక్యవాది రామచంద్రారెడ్డి చేపట్టిన 48గంటల దీక్షను విరమించారు. రాప్తాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి.. కార్యాలయాలు బంద్ చేయించారు. వజ్రకరూరులో పందికుంట గ్రామస్తులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కూడేరు, బెళుగుప్పలో రహదారిపై ఆందోళన చేశారు. -
జోరుతగ్గని పోరు
సాక్షి, నెల్లూరు : సమైక్యపోరు మొదలై 70 రోజులు దాటుతున్నా నేటికీ సింహపురిలో హోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ జిల్లావాసులు నినదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య పోరు మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యుత్ సిబ్బంది సమ్మెతో మూడో రోజు జిల్లాలో పగటి పూట విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో పొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాకిరేవు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, పట్టణ కన్వీనర్ నాసిన నాగులను మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి దంపతులు మూడో రోజు మంగళవారం రిలే దీక్షలు కొనసాగించారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. బోగోలులో జాతీయ రహదారిపై బో గోలు బ్రహ్మాస్త్రం కార్యక్రమాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీతారాంపురానికి చెందిన పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో జేఏసీ నేతల ఆధ్వర్యంలో బ్యాంకులు, తపాలా, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు మూయించారు. సూళ్లూరుపేటలో మన్నారుపోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు పవర్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయి షార్ కేంద్రానికి, రైల్వే లైనుకు, మాంబట్టు పారిశ్రామికవాడలోని పలు కంపెనీలకు కరెంటు సరఫరా ఆగి పోయింది. -
తెలుగు వారందరూ కలిసే ఉండాలి
గుంతకల్లు, న్యూస్‌లైన్: తెలుగు వారందరూ కలిసే ఉండాలని, రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గుంతకల్లు రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారం సాయంత్రం వేలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో తహసీల్దార్ వసంతబాబు, జేఏసీ పట్టణ చైర్మన్ మునివేలు, రైల్వే జేఏసీ సభ్యులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఓబాలిక భరతమాత వేషధారణలో ర్యాలీ ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగులందరూ ఉద్యమానికి మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రెండు నెలలుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు సోదరభావంతో కలిసిమెలసి జీవిస్తుండగా, తెలుగు ప్రజలు ఐక్యంగా జీవించలేరా? అని ప్రశ్నించారు. రైల్వే ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే, రైల్వే ఉద్యోగులందరూ ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. రైల్వేను స్తంభింపజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ ధనరాజ్, నాయకులు ప్రకాష్‌రెడ్డి, కరీముల్లా, ఆన్వర్, కోటేశ్వరరావు, దొరైరాజ్భూషణం, బాలాజీసింగ్, కేఎండీ గౌస్, జీఎన్ ప్రకాష్‌బాబు, అశోక్, రమేష్, సత్తార్, రాబర్ట్, డీఆర్ఆర్ పాల్, డి.వెంకటేశ్వర్లు, శివయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ గాంధీ చౌక్‌కు చేరుకున్న అనంతరం రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, వాసవీదేవి ఆలయం, పాతబస్టాండ్, వైఎస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు చేరుకుని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. -
తమ్ముళ్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందా? ఢిల్లీలో ఏపీ భవన్లో చంద్రబాబు చేపట్టిన దీక్షలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించకపోవడంపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులే జీర్ణించుకోలేకపోతున్నారా? వేర్పాటువాదం చేస్తోన్న టీడీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోండటంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగు బయటపెట్టేందుకే సాహసించడం లేదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు, టీడీపీ శ్రేణులు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నింది. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసైగల మేరకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆధారంగా జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం.. ఆ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ఈనెల 3న యధాతథంగా ఆమోదించిన విషయం విదితమే. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదించిన క్షణాల్లో ‘అనంత’లో సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇది దావానంలా సీమాంధ్రకు వ్యాపించింది. పస్తుతం మహోగ్ర రూపం సంతరించుకున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని ప్రజానీకం మండిపడుతోంది. వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తోండటంతో ఆ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీదీ అదే పరిస్థితి. రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు కన్పిస్తే చాలు.. వెంటబడి తరముతున్నారు. మూడు రోజుల క్రితం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలను అనంతపురంలో సమైక్యవాదులు వెంటపడి తరమడమే అందుకు తార్కాణం. ప్రజా వ్యతిరేకత దెబ్బకు చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ జెండాను చేబూనలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా రాజీనామా బాట పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఏపీ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షలో సమైక్యవాదం విన్పించకుండా వేర్పాటువాదాన్నే పునరుద్ఘాటించడంపై ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. జిల్లాలో సమైక్యవాదాన్ని గట్టిగా విన్పించే ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంగళవారం ఢిల్లీలో చంద్రబాబుకు మద్దతు పలికి.. ఆయన విధానమే సరైనదని సమర్థించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వేర్పాటువాదాన్ని సమర్థించిన పయ్యావుల కేశవ్‌కు సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టే అర్హత లేదని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవడం.. సమైక్య సెంటిమెంటు ప్రజల్లో బలీయంగా నాటుకుపోవడం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టి వేర్పాటువాదాన్ని విన్పించడం జిల్లాలో టీడీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షతో టీడీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మంగళవారం తనను కలిసిన కార్యకర్తలతో వ్యాఖ్యానించడం గమనార్హం. అధినేత వేర్పాటువాదం చేస్తూ.. శ్రేణులు సమైక్యవాదం విన్పిస్తే ప్రజల్లో టీడీపీ అపహాస్యం పాలవుతుందని ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన వేర్పాటువాద దీక్షతో టీడీపీ జెండాలతో సమైక్యాంధ్ర ఉద్యమంలో అడుగుపెట్టలేని దుస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎందాకైనా..
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సమైక్యవాదులు 70 రోజులుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. ప్రజలకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నా, వ్యాపారులు నష్టపోతున్నా, వేతనాలు రాక ఉద్యోగులు అవస్థ పడుతున్నా ఉద్యమ పంథాను మాత్రం వీడడం లేదు. కేంద్రం దిగొచ్చేదాకా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉద్యమ పిడికిలిని దించబోమని స్పష్టం చేస్తున్నారు. వీరికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. మరోవైపు ‘ఎన్ని కుట్రలైనా చేయండి.. ఉద్యమాన్ని నిర్వీర్యపర్చండి’ అంటూ కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు ఆ పార్టీల నాయకులకు నూరిపోస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులను, ఉద్యమకారులను టార్గెట్ చేయాలని, జేఏసీల మధ్య చిచ్చుపెట్టాలని సూచిస్తున్నాయి. ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సైతం తమ అనుచరులను రంగంలోకి దింపి ఉద్యమకారులపై దాడులు చేయిస్తున్నారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాల మధ్య కూడా ఉద్యమకారులు వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్సీపీ అండతో నిప్పు కణికలై కదం తొక్కుతున్నారు. ఫలితంగా 70వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ‘సమైక్య’ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేశారు. బ్యాంకులు, ఏటీఎంలను మూసి వేయించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జెడ్పీ ఎదుట సోనియా, కేసీఆర్, దిగ్విజయ్, బొత్స దిష్టిబొమ్మలకు సమాధి కట్టి నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి.. బ్యాంకులు, ఏటీఎంలను బంద్ చేయించారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్ఓ హేమసాగర్ మద్దతు తెలిపారు. అనంతరం వారు పాతూరు పవరాఫీసు భవనంపెకైక్కి సమైక్య నినాదాలు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు సమ్మెబాట పట్టడంతో రెండవ రోజు కూడా సర్వజనాస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. ఎస్కేయూలో ఎంపీఈడీ కౌన్సెలింగ్‌కు హాజరైన తెలంగాణ విద్యార్థి రవిని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యాన వర్సిటీ ఎదుట 205 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో గొబ్బెమ్మలు పెట్టి నిరసన తెలిపారు. ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రిలో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను బంద్ చేశారు. ముదిగుబ్బలో రాస్తారోకో చేశారు. గుంతకల్లులో రైల్వే ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుందంటూ ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు ‘మాక్ ప్రదర్శన’ నిర్వహించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కట్టారు. టీ-నోట్‌పై జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు వైకుంఠ సమారాధన, పిండ ప్రదానం చేశారు. సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మానవహారం నిర్మించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. సప్తగిరి డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. ఎన్జీఓలు బైక్ ర్యాలీ చేపట్టి..కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసి వేయించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో పట్టణ ఖాద్రీ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సామూహిక దీక్ష చేశారు. ఈ దీక్షకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గాండ్లపెంటలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డిని అడ్డుకున్నారు. రోడ్డుపై ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. నల్లచెరువులో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంతో పాటు మడకశిరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు బంద్ చేయించారు. మడకశిరలో జేఏసీ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటిని ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్ పెకైక్కి నిరసన తెలిపారు. రైతులు పొలం పనులు వదిలి ‘సమైక్య’ ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో రొళ్లలో అర్ధనగ్న ప్రదర్శన, అమరాపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల, గార్లదిన్నె, నార్పలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, సోమందేపల్లిలో భిక్షాటన, కణేకల్లులో ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తిలో వైద్య సిబ్బంది, పరిగి, గోరంట్లలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాప్తాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, చెన్నెకొత్తపల్లిలో రాస్తారోకో చేపట్టారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. రాష్ట్రం విడిపోతే ఆకులు తిని బతకాల్సిందేనంటూ ఆకులు తింటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులకు మున్సిపల్ ఉద్యోగులు పిండప్రదానం చేశారు. నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేపట్టారు. -
కరెంటు కట్ కట
రాజధాని నగరానికి సమైక్య సెగ తాగింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సిటీలో చీకట్లు అలముకుంటున్నాయి. కోర్ సిటీలో రెండు, శివారు ప్రాంతాల్లో ఆరు గంటల పాటు అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఉస్మానియాతో పాటు మిగతా ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ పనిచేయక రోగులు అవస్థలు పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విజయవాడ, రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పాటు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా కేంద్రాల నుంచి నగరానికి రావాల్సిన కోటాపై కోత పడింది. ప్రస్తుతం గ్రేటర్ అవసరాలు తీర్చాలంటే రోజుకు సుమారు 1800 మెగవాట్ల విద్యుత్ అవసరం కాగా 1400 మెగవాట్లకు మించి సరఫరా కావ డం లేదు. సరఫరాకు డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతోంది. అధికారులు ఈ లోటును పూడ్చేందుకు లోడ్ రిలీఫ్, లైన్ల పునరుద్ధరణ పేరుతో అనధికారిక విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారులు, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు, వెల్డింగ్వర్కర్లు, జ్యూస్సెంటర్లు, పిండిగిర్నీల యజమానులు రోజువారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వ స్తోంది. ప్రతి అరగంటకోసారి లైన్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుండటంతో గృహాల్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు తప్పని తిప్పలు అనధికారిక కోతలతో గృహవినియోగదారులు, పరిశ్రమలకే కాదు.. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, గాంధీ, ఫీవర్, సరోజినీదేవి, ఈఎన్టీ, ఛాతీ, ఎంఎన్‌జే, మానసిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ వార్డుల్లోని కంప్యూటర్లు మూగబోతుండటంతో రోగుల అడ్మిషన్లలో జాప్యం జరుగుతోంది. అంతే కాదు.. ఈసీజీ, టూ డీఎకో, ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రాసౌండ్ పనిచేయక పరీక్షలు నిలిచిపోతున్నాయి. లిప్ట్‌లు పని చేయక పై అంతస్తుల్లోని వార్డులకు చేరుకునేందుకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక నగరంలోని అర్బన్‌హెల్త్ సెంటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్సల్లో తీవ్ర ఆటంకం కలుగుతోంది. కోతలపై సమాచారం ఇవ్వని డిస్కం నగరంలో గత మూడు రోజుల నుంచి ఎడాపెడా కోతలు అమలు జరుగుతున్నా... వీటిపై డిస్కం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపి వేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచినీరు సరఫరా అవుతున్న సమయంలో ఇంట్లో కరెంట్ లేకపోవడంతో మోటార్లు పని చేయడం లేదు. అపార్ట్మెంట్లకు నీరు అందడం లేదు. సిటీలో కోతల తీరు ఇలా.. చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, ఏజీ వర్సిటీ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అరగంటకోసారి సుమారు ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నల్లగండ్ల, హైదరాబాద్ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో మూడుగంటలు చార్మినార్, దారుషిఫా, చంచల్‌గూడ తదితర ప్రాంతాల్లో ఉదయం 10-30 నుంచి 12 గంటల వరకు కూకట్‌పల్లిలో ఉదయం గంటన్నర, సాయంత్రం గంట చొప్పున అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు చంపాపేట్, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, ఐఎస్‌సదన్, బీఎన్‌రెడ్డి, తదితర ప్రాంతాల్లో సుమారు మూడు గంటలు ఉప్పల్, తార్నాక, నాచారం, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో మూడు గంటలు నిలోఫర్‌లో విద్యుత్‌కు అంతరాయం నాంపల్లి : విద్యుత్ అంతరాయంతో నిలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో సోమవారం ఉదయం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నవజాత శిశువులు ఉక్కపోతతో అలమటించిపోయారు. పనిచేయాల్సిన రెండు జనరేటర్లు మొరాయించినట్లు తెలిసింది. నిలోఫర్‌లో 100-150 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుంటారు. రోజుకు 15 నుంచి 20 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. వెయ్యికి పైగా ఓపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోతే పనిచేసే రెండు జనరేటర్లు సరపోవని పలువురు వైద్యులు చెబుతున్నారు. 24 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే నవజాత శిశువులకు ప్రమాదకరం. ఎంతోమంది గర్భిణుల సిజేరియన్ ఆపరేషన్లు నిలిచిపోతాయి. కాగా ఈ విషయమై నిలోఫర్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోమవారం రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. గంటా రెండు గంటలు సరఫరా నిలిచిపోతే పెద్ద ప్రమాదం ఏమి ఉండదని, ఎక్కువ సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే మాత్రం చిన్న పిల్లలకు ఇబ్బందవుతుందని అన్నారు. వ్యాపారం లేక విలవిల్లాడుతున్నాం అనధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల వరకు కరెంటు పోతోంది. గత నాలుగు రోజుల నుంచి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. అసలే పండుగ సీజన్. వ్యాపారం లేక ఏడుపొస్తోంది. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అధికారులు కూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే కరెంటు తీసేస్తున్నారు. అదేమని ప్రశ్నించినా సప్లై లేదు మేమేం చేస్తామని సమాధానం ఇస్తున్నారు. - దాసు నవ్య, ఇంటర్నెట్ నిర్వాహకురాలు, తార్నాక ఇబ్బందులు పడుతున్నాం ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కోతలను విధిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో వచ్చే కోతలు సీమాంధ్ర సమ్మె వల్ల వర్షాకాలంలో రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కోతలు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. - పగిళ్ల భూపాల్‌రెడ్డి, ఆర్కేపురం -
బంద్ విజయవంతం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు సింహపురిలో ఎగసిపడుతున్నాయి. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మూడో రోజూ బంద్ సంపూర్ణమైంది. ఆదివారం వేకువజాము నుంచే బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్సీపీ శ్రేణులు తెల్లవారుజాము నుంచే రోడ్లను దిగ్బంధించాయి. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. నెల్లూరులో వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కార్యకర్తలు రోడ్లపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్లోని పార్టీ కార్యాలయం నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ భవన్లో ఉద్యోగులు, వీఆర్సీ సెంటర్లో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో, గాంధీబొమ్మ సెంటర్లో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో అన్నదానం చేశారు. కావలిలో బంద్‌ను వైఎస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. వైఎస్ఆర్సీపీ, సమైక్యాంధ్ర, ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అమరా యాదగిరి గుప్తా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్డీఓ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. దీక్షలో అనంతసాగరం నాయకులు చిలకా సుబ్బారెడ్డి తదితరులు కూర్చున్నారు. పట్టణంలోని దుకాణాలన్నింటిని కార్యకర్తలు మూయించారు. గూడూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సమన్వయకర్త బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్, మల్లు విజయకుమార్‌రెడ్డి, నాగులు తదితరులు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పొదలకూరులో గిరిగర్జన విజయవంతమైంది. పెద్దసంఖ్యలో గిరిజనులు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం పలికారు. సోనియా, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మనుబోలులో గ్రామదేవత మనుబోలమ్మకు విద్యార్థులు పూజలు చేశారు. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సైదాపురంలో బైక్ ర్యాలీ చేశారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు నెలవల సుబ్రహ్మణ్యం, కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాండురంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్‌లతో భారీ ర్యాలీ జరిగింది. దుకాణాలన్నింటని మూయించారు. మానవహారంతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ సరఫరా చేయాలని మన్నారుపోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సోనియా దిష్టిబొమ్మ, బొత్స, పనబాక లక్ష్మి, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మోహన్ చిత్రపటాలను తగలబెట్టారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, కలిగిరిలో బంద్ విజయవంతమైంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేటలో బైక్ ర్యాలీ నిర్వహిచారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. -
విభజన చీకట్లు
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఆదివారం ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేసిన ఉద్యోగులు సమ్మెకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల 8 గంటలకు నిలిచిపోయింది. రాత్రి వరకు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. అత్యవసర సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 2ృ0 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడృకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ృగారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని ృ00 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సవెృ్మలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గృడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పినాకిని, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 06ఎన్‌ఎల్‌ఆర్91-సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు 92- సబ్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సిబ్బంది సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ది గారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని 400 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సమ్మెలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజిల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
రైల్వే శాఖకు సమైక్య సెగ
ఒంగోలు, న్యూస్‌లైన్: రైల్వే శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలోకి దిగారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. సోమవారమూ మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 5.35 గంటలకు రైల్వేకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ఐదు నిముషాల్లోనే మరో గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఆగిన రైళ్లు తిరిగి కదలడానికి అరగంటకుపైగా సమయం పట్టింది. ప్రారంభంలోనే అరగంట ఆలస్యంగా బయల్దేరిన పినాకిని(విజయవాడ- చెన్నై) ఎక్స్‌ప్రెస్ చీరాల సమీపానికి వచ్చేసరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ ఇంజన్‌ను తెప్పించి దాదాపు గంటన్నర ఆలస్యంగా రైలును నడిపారు. రద్దయిన రైళ్లు ఇవే.. ముందస్తుగా గూడ్సు వాహనాలను నిలిపివేయాలని రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పలు ప్యాసింజర్ రైళ్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా లోడు తగ్గకపోవడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు పలు చోట్ల స్టాపింగ్ కల్పించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలుకు చేరుకోగానే కేవలం విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే కొన్ని రైళ్లు రద్దవడంతో ప్రయాణికుల ఇబ్బందులను ఒంగోలు స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చీరాల, బాపట్ల, తెనాలి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించి ప్రయాణికులు ఎక్కేందుకు వీలుగా పది నిమిషాల వరకు ఒంగోలు స్టేషన్లో ఆపారు. కోరమాండల్తోపాటు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలు మోహరించాయి. ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఒక్కసారిగా పలు రైళ్ల సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమవడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం రైళ్ల సర్వీసులు కూడా రద్దవడంతో ముందస్తుగా బుక్ చేసుకున్న వారు, చంటి పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రి కుర్చీ కోసమే దీక్షలు : ఎంపీ గుత్తా
మిర్యాలగూడ రూరల్, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో పట్టు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్‌ముఖర్జీకి లేఖను అందించామని, ఆ లేఖనే పరిగణనలోకి తీసుకోవాలని పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు. నేడు బాబు మాటమార్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేపడుతానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ప్లీనరీలో తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అడ్డు చెప్పబోదని చెప్పి ఇప్పుడు సమైక్యాంధ్ర అనడం ఏమిటన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కందిమళ్ల లకా్ష్మరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, చౌగాని భిక్షంగౌడ్, తిరునగర్ భార్గవ్, డీసీసీబీ డెరైక్టర్ సజ్జల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సురేష్‌బాబుపై సీఐ జులుం
పెనమలూరు, న్యూస్‌లైన్ :పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబుపై ఆదివారం ఏసీపీ షకీలాభాను ఎదుటే పెనమలూరు సీఐ ధర్మేంద్ర జలుం ప్రదర్శించారు. దీనికి సురేష్‌బాబు అభ్యంతరం చెప్పగా సీఐ వేలు చూపిస్తూ అంతుచూస్తానని హెచ్చరించారు. దీంతో సురేష్‌బాబు కూడా ఎదురు తిరగటంతో పోలీసులు జోరు తగ్గించారు. వివరాల్లోకి వెళితే.. పెనమలూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం గంగూరు వద్ద బందరు రోడ్డుపై పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. బందరు రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డు వేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ ధర్మేంద్ర సీఆర్పీఫ్ సిబ్బందితో అక్కడకు వచ్చీ రావడంతోనే సురేష్‌బాబుపై విరుచుకుపడ్డారు. విజయవాడలో ఎక్కడా బంద్ జరగటం లేదని, ఇక్కడ అడ్డుకుంటారేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తామంతా రోడ్డుపై వంటావార్పు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తామని సురేష్‌బాబు చెప్పినా సీఐ అంగీకరించలేదు. అడ్డు తీసివేయాలని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వేలుచూపిస్తూ హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో అడ్డు తొలగించే యత్నం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈలోగా తూర్పు డివిజన్ ఏసీపీ షకీలాభాను అక్కడకు వచ్చారు. సీఐ ఆమె ఎదురుగానే సురేష్‌బాబుతో వాగ్వాదానికి దిగుతూ రెచ్చిపోయారు. సీఐ ప్రవర్తనపై సురేష్‌బాబు అభ్యంతరం చెబుతూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.సీఐ ఇతర పార్టీలకు కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సీఐ కూడా ఈ విధంగానే వ్యవహరించి బదిలీపై వెళ్లారని, వైఖరి మార్చుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. తాను పరిశీలిస్తానని, వివాదం వద్దని ఏసీపీ చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు. సైకిల్ కాంగ్రెస్‌కు సీఐ మద్దతు : సురేష్‌బాబు పెనమలూరు సీఐ ధర్మేంద్రకి సైకిల్ కాంగ్రెస్ నేతలంటే ఎనలేని భక్తని, వారు బందరురోడ్డుపై ఆందోళన చేస్తే వారి వెంటే ఉండి కార్యక్రమం నడిపించారని సురేష్‌బాబు ఆరోపించారు. పెనమలూరు, పోరంకి గ్రామ టీడీపీ నేతలు బందరు రోడ్డుపై వంటావార్పు చేస్తే సీఐ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సైకిల్ కాంగ్రెస్‌తో సీఐ మిలాఖత్ అయ్యి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చు విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐ వైఖరి మార్చుకోక పోతే పోలీస్‌స్టేషన్ ఎదుటే సమైక్యవాదులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు. -
ఆగ్రహ జ్వాల
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. పార్టీ పిలుపు మేరకు 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ బంద్, ఆందోళనల నేపథ్యంలో మూడో రోజు కూడా ‘అనంత’ జనజీవనం స్తంభించిపోయింది. రైల్‌రోకోలు, రహదారుల దిగ్బంధం, ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు, వంటా వార్పు తదితర నిరసనలు జిల్లా నలుమూలలా హోరెత్తాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలు, కుల, ప్రజా సంఘాల జేఏసీల నేతలు, సమైక్యవాదులు, ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, లింగాల శివశంకర్‌రెడ్డి, మీసాల రంగన్న, రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక తపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుకడ్డంగా పాతటైర్లకు నిప్పంటించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. నగరంలో మెడికల్, యువ జేఏసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ఎస్కేయూలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆదివారం పశువుల సంతను ‘అనంత’ మార్కెట్‌యార్డు ఎదురుగా రోడ్డుపై నిర్వహించాల్సి వచ్చింది. ధర్మవరం పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకుడు రేగాటిపల్లి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించి... 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు. దర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో సమైక్యవాదులు వంటా వార్పు చేపట్టారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును గంటపాటు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు 15 మందిని పోలీసులు అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. పట్టణంలో ఎస్సీ, ఎస్టీలు ర్యాలీ, వంటా వార్పు చేపట్టారు. గుత్తిలో వైఎస్సార్సీపీ నేతలు సోనియా, బొత్స, దిగ్విజయ్, కేసీఆర్, పనబాకలక్ష్మి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ హర్షకుమార్ తనయుల దౌర్జన్యానికి నిరసనగా గుత్తిలో ఉద్యోగ జేఏసీ నేతలు మౌనదీక్ష చేశారు. అనంతరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పామిడిలో వైఎస్సార్సీపీ నాయకులు వంటా వార్పు చేపట్టారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేత నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు రాస్తారోకో చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బొత్సదిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి... రోడ్డుపై సమాధి కట్టి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరి పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బంద్ చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా వజ్ర భాస్కర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. జేఏసీ నాయకులు నోటికి అడ్డంగా నల్లని రిబ్బన్ కట్టుకొని పట్టణంలో ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేశారు. తలుపుల, తనకల్లు, ఎన్పీ కుంట, నల్లచెరువు మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతలు బంద్ చేపట్టారు. కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎల్ఎం మోహన్‌రెడ్డి, నాయకులు కిరిటీ యాదవ్, రామాచారి, దేవపుత్ర చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పట్టణ బంద్ చేపట్టారు. ఉద్యోగ జేఏసీ నేతలు తెలుగుతల్లి విగ్రహం వద్ద మానవహారం నిర్మించారు. విభజనతో మనస్తాపం చెంది కంబదూరు మండలంలో వైఎస్సార్సీపీ బంద్‌లో పాల్గొన్న చెన్నంపల్లి వాసి మల్లికార్జున నాయక్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో బంద్ విజయవంతమైంది. మడకశిర లో వైఎస్సార్సీపీ నేతల దీక్షలు రెండో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేత వైసీ గోవర్దన్‌రెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ్ మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది. మడకశిరలో జేఏసీ నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా సోమవారం పుట్టపర్తిలో 72 గంటల బంద్‌ను విజయవంతం చేశారు. కొత్తచెరువులో దీక్ష చేస్తున్న సమైక్యవాదులకు కర్ణాటక రాష్ట్ర వైఎస్సార్ వేదిక నాయకులు మద్దతు ప్రకటించారు. బుక్కపట్నం, కొత్తచెరువులో బంద్ విజయవంతమైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పెనుకొండ వైఎస్సార్సీపీ నేతలు స్థానికంగా ఉన్న కుంభకర్ణుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ప్రార్థించారు. సమైక్యవాదులు మంత్రి రఘువీరా దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి.. తరువాత ఉరితీసి నిరసన తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు ధర్నా చేశారు. సోమందేపల్లిలో విద్యార్థులు సైకిల్‌ర్యాలీ, రొద్దంలో ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. గోరంట్ల, పరిగిలో వైఎస్సార్సీపీ నేతలు బంద్ చేపట్టారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బంద్ విజయవంతం చేశారు. విద్యార్థుల ర్యాలీలో ఎమ్మెల్యేపాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో వైఎస్సార్సీపీ శ్రేణులు రహదారిని దిగ్బంధించారు. రాప్తాడులోని 44వ జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో పార్టీ కార్యకర్తలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అదే మండలం తగరకుంటలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. చెన్నేకొత్తపల్లిలో బంద్‌ను తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో శింగనమలలోని తాడిపత్రి-అనంతపురం రహదారిపై రాస్తారోకో చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో బంద్ విజయవంతమైంది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బంద్ చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి జేసీ సోదరులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీసు బలగాలను భారీగా మోహరించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకు ర్యాలీ చేపట్టి.. బంద్ విజయవంతం చేశారు. ఉరవకొండ, విడపనకల్లులో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉరవకొండలో జేఏసీ రిలే దీక్షలకు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. వజ్రకరూరులో వైఎస్సార్సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. -
జేసీ మూక అరాచకం
తాడిపత్రి/టౌన్/రూరల్, న్యూస్‌లైన్ : తాడిపత్రి పట్టణంలో జేసీ సోదరుల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘ఊరందరిదీ ఒకదారి అయితే... ఉలిపికట్టెది మరోదారి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పైగా అందరూ తమ ‘దారి’లోనే నడవాలంటూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర వస్తుందా అంటూ ఉద్యమకారులను హేళన చేస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు జీవితాలు, జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే... జేసీ సోదరులు మాత్రం అందుకు భిన్నంగా స్వలాభం, రాజకీయ స్వార్థంతో ‘సమైక్య’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఆదివారం సమైక్యాంధ్ర బంద్ చేపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై స్వయాన జేసీ ప్రభాకరరెడ్డి దగ్గరుండి తన అనుచరులతో రాళ్ల దాడి చేయించారు. పోలీసుల సమక్షంలోనే వీరంగం చేసి.. భయానక వాతావరణం సృష్టించారు. బంద్‌లో భాగంగా వ్యాపారులు మూసేసిన దుకాణాలను దౌర్జన్యంగా తెరిపించి... భయబ్రాంతులకు గురి చేశారు. శనివారం జిల్లా అంతటా బంద్ ఉన్నప్పటికీ తాడిపత్రిలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. దాంతో సమైక్యవాదులు కార్యాలయంపై దాడి చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకరరెడ్డి ఆదివారం పట్టణంలో వీరంగం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు పట్టణవాసులు 72 గంటల బంద్ పాటిస్తుండగా... దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడు. వ్యాపారులతో బలవంతంగా దుకాణాలను తెరిపించాడు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర రాదంటూ తన లారీలు, బస్సులను కూడా తాడిపత్రిలో యథేచ్ఛగా తిప్పించాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకులు మున్నా, మనోహర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, పేరం మహ్వేరరెడ్డి, ప్రకాష్‌బాబు, శరబారెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, వెంకటమల్లారెడ్డి, కంచం రామ్మోహన్‌రెడ్డి, రవీనాథ్రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పెద్దపేట లక్ష్మిదేవి, లక్ష్మిదేవి తదితరులు కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా తెరిపించిన దుకాణాలను తిరిగి బంద్ చేయిస్తూ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి సీబీ రోడ్డు, పోలీస్‌స్టేషన్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తన అనుచరులతో కలిసి రాళ్లు, కర్రలు తీసుకుని వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చూస్తుండగానే వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అయితే... వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా అక్కడే నిలబడి జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణ ఒత్తిడి తెచ్చారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమపైకి దౌర్జన్యంగా వస్తున్న వారిని అడ్డుకోవాలని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ మూకలు విసిరిన ఓ రాయి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు తగలింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జీ చేశారు. అయినప్పటికీ జేసీ ప్రభాకరరెడ్డి అక్కడ్నుంచి కదలకుండా మరింత రెచ్చగొడుతూ అనుచరులను ఉసిగొల్పాడు. పోలీసులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ వారినే వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. జేసీ ప్రభాకరరెడ్డిని, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై పట్టణ ప్రజలు మండిపడ్డారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం
పులివెందుల అర్బన్/టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని సమైక్యవాదులు రాజు, తిరుపాల్‌లు ఆదివారం సాయంత్రం పాత బస్టాండు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ ట్యాంకు ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సమైక్యవాదులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. గంటసేపు ట్యాంకుపైకి ఎక్కి దూకుతామని పేర్కొనడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం మున్సిపల్ ట్యాంకుపైకి ఎక్కిన రాజు, తిరుపాల్‌లను దిగాలంటూ సమైక్యవాదులు కోరారు. ఎంతసేపటికి దిగి రాకపోవడంతో డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్లు జోక్యం చేసుకొని మీ కుటుంబ సభ్యులకోసమైన దిగిరావాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణ త్యాగం చేయవద్దని కోరారు. సమైక్యవాదులు కూడా కిందికి దిగి రావాలంటూ పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరుకొని సమైక్యవాదులు కిందికి దిగిరావాలని మేమంతా సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తూ సమైక్యాంధ్ర సాధించుకుందామని చెప్పారు. దీంతో సమైక్యవాదులు మున్సిపల్ ట్యాంకు నుంచి కిందికి దిగడంతో సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురిని మింగిన మద్దిలేరు
గడివేముల, న్యూస్‌లైన్: సరదాగా పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు చిన్నారులు మృత్యువు బారిన పడ్డారు. ప్రమాదవశాత్తు వాగులో నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన శనివారం గడివేములలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ వెంకటరమణ, నాగమణి దంపతులకు కిరణ్(9), విజయ్ (7) సంతానం. వివాహమైన పదేళ్లకు ఇద్దరు కుమారులు జన్మించడంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. వీరిద్దరూ స్థానిక రాజరాజేశ్వరి పాఠశాలలో చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్నారు. వారి ఇంటి పక్కనే ఉంటున్న పెద్దస్వామి సోదరి రమాదేవి (13) మానసిక వికలాంగురాలు. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నా, వదిననే పోషిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పెద్ద స్వామి భార్యాబిడ్డలతో పొలానికి వెళ్లాడు. వారి వెంట రమాదేవి, కిరణ్, విజయ్ సరాదాగా వెళ్లారు. ప్రమాదం ఇలా జరిగింది: మధ్యాహ్నం భోజనం చేసేందుకు అందరూ ఇంటికి బయలుదేరారు. పిల్లలు పరిగెత్తుకుంటూ ముందు వచ్చారు. మార్గమధ్యంలో మద్దిలేరు వాగు దాటే ప్రయత్నంలో విజయ్ అదుపు తప్పి గతంలో మట్టి కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. నీట మునుగుతున్న తమ్ముడిని కాపాడేందుకు కిరణ్ దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగిపోయారు. వాగు ఒడ్డున ఉన్న రమాదేవి వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. ఈత రాకపోవడంతో బాలిక కూడా నీట మునిగింది. అక్కడే ఉన్న పెద్దస్వామి కుమార్తె వెనుకకు పరిగెత్తి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో నీటిలో గాలించారు. సమీపంలోని గుంతలో ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంకటరమణ వాగు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. వాగు దాటే ప్రదేశానికి సమీపంలో మట్టి కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదానికి కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి గ్రామానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. గౌరు పరామర్శ: ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి గడివేముల చేరుకుని మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కాతా రాజేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ వై.శివరామిరెడ్డి, డి.సత్యనారాయణరెడ్డి, తదితరులున్నారు. -
సమైక్యాంధ్ర సాధనకు ఉద్యమం తీవ్రతరం
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో సంఘీభావంగా నెల్లూరులో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వివరించారు. మైపాడు గేట్, ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, హరనాథపురం, చిల్డ్రన్స పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అన్ని చోట్ల ఒకేసారి రాస్తారోకో నిర్వహించనున్నట్లు వివరించారు. సీఎం పదవి కోసం రామనారాయణరెడ్డి గుంటనక్కలా కాచుకొని ఉద్యమాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు మండవ రామయ్య, మున్వర్, ధర్మవరపు సుబ్బారావు, బాలకృష్ణచౌదరి, రామకృష్ణారెడ్డి, పడవల కృష్ణమూర్తి, సుబ్బారావు, మురళి, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా నీళ్లే దిక్కు
సోమశిల, న్యూస్‌లైన్: జిల్లాలోని రైతులు పంటలు పండించుకునేందుకు శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న కృష్ణానది నీళ్లే దిక్కవుతున్నాయి. పెన్నానది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతుండటంతో నదికి వరద ప్రవాహం లేకుండా పోయిం ది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వస్తున్న కృష్ణానది జలాలతోనే జలాశయంలోని నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఈ జలాలతో జలాశయం పూర్తిగా నిండే పరిస్థితి లేకపోవడంతో పంటలు ఎలా పండించుకోవాలని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఐఏబీ సమావేశం నిర్వహణ అనుమానంగా మారింది. ఆయకట్టు పరిధిలో తొలికారు సాగుకు సుమారు 50 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ కింద 7 టీఎంసీలు, చెన్నైకు తాగునీటి అవసరాలకు తరలించేందుకు 10 టీ ఎంసీలు కేటాయించాలి. మరోవైపు అక్టోబర్ మొదలైనా పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పరిమిత ఆయకట్టుకే సాగునీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. నీటి విడుదలకు సంబంధించి నిర్వహించాల్సిన ఐఏబీ సమావేశం ప్రక్రియ సైతం డోలాయమానంలో పడింది. ఈ సమావేశంలో ప్రధాన భూమిక పోషించే మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి పితాని సత్యనారాయణ హాజరుపై అనుమానాలు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో వీరు జిల్లాకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రైతుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. 2010-11లో తొలికారులో భాగంగా 4.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అధికారులు గత ఏడాది 3 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. రెండు పంటకు చుక్కనీరు కూడా విడుదల చేయలేదు. కండలేరు జలాశయంలోని ఆయకట్టు పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో అధిక శాతం చెన్నైకి తరలించాలి. గత ఏడాది కూడా నీటి లభ్యత లేకపోవడంతో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కేవలం 75 వేల ఎకరాలకే అందించారు. పెన్నానదికి వరదలు రాకపోతే ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలాలేవు. -
అకుంఠిత దీక్ష
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్షలు రెండో రోజు గురువారం కొనసాగాయి. జిల్లాలో 10 నియోజకవర్గాల పరిధిలోని 12 మంది సమన్వయకర్తలతోపాటు పలువురు నేతలు ఆమరణ నిరాహారదీక్షలు కొనసాగించారు. వీరికి మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ నేతలకు సంఘీభావం ప్రకటించగా, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 120 కార్లతో నార్తురాజుపాళెం నుంచి ర్యాలీగా బయల్దేరి గురువారం జిల్లావ్యాప్తంగా పర్యటించి దీక్ష చేస్తున్న నేతలకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలు రెండో రోజూ కొనసాగాయి. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గురువారం వీరి దీక్షా శిబిరాలకు వచ్చి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరీగ మురళీధర్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పిన విధంగా పాలకులు నడచుకోవాలన్నారు. రాష్ట్రం లో 8 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 6 కోట్ల వరకు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారన్నారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, బాలచెన్నయ్య, నాయకుడు బత్తిని విజయ్‌కుమార్‌లు చేపడుతున్న నిరవధిక దీక్షలు గురువారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బండ్లమూడి అనిత తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వస్తున్నదనే సమాచారంతో వైఎస్సార్సీపీ నేత నాశిన నాగులు ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలు కొనసాగాయి. వీరికి బండ్లమూడి అనిత, స్టీరింగ్‌కమిటీ సభ్యుడు శంకర్రాజు, మండల కన్వీనర్లు కృష్ణారెడ్డి, వీరారెడ్డి, రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, శింగం శెట్టి భాస్కర్‌రావు తదితరులు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేపట్టిన దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెలవల సుబ్రమణ్యం ఆమరణ నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు.ఉదయగిరిలో ఎమ్మె ల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సందర్శించి మేకపాటికి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, చేజర్ల మండలం మడపల్లి సర్పంచ్ ఇ.నారాయణ, తోడేటి పెంచలయ్య, ఇందూరు శేషారెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని నార్తురాజుపాళెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కొడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు మండల కన్వీనర్లు ఆమరణదీక్షలను కొనసాగించారు. వీరికి మద్దతుగా పలువురు సర్పంచ్‌లు గురువారం రిలేదీక్షలను కొనసాగించారు. -
విద్యార్థి గర్జన
సాక్షి, కడప : జిల్లాలో వేలాది మంది విద్యార్థుల గొంతుకలు ఒక్కటై సమైక్య నినాదాన్ని మారుమోగించాయి. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉండాలంటూ నినాదాలతో హోరెత్తించారు. శాంతి ర్యాలీలు, ధర్నాలు,రాస్తారోకోలు, మానవహారాలతో జిల్లా దద్దరిల్లింది. గాంధీ జయంతి రోజున సత్యాగ్రహ బాటలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆయన స్ఫూర్తితో, క్రమశిక్షణతో శాంతియుతంగా సమైక్యాంధ్రను సాధించగలమని ముక్తకంఠంతో నినదించారు. కడపలో వేలాదిమంది విద్యార్థులు సమైక్య నినాదాలతో గర్జించారు. 500 మీటర్ల జాతీయ పతాకంతో జిల్లా పరిషత్ ఆవరణం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కోటిరెడ్డి కూడలిలో మానవహారం నిర్మించారు. కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ట్రెజరీ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో ర్యాలీ నిర్వహించి మహత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, నీటిపారుదలశాఖ, వాణిజ్యపన్నులశాఖ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. జమ్మలమడుగు పట్టణంలో మహాత్మాగాంధీ 1869లో జన్మించినందున అందుకు గుర్తుగా 1869మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఇందులో డ్వాక్రా మహిళలు, ఐసీడీఎస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, నర్సులు, క్యాంప్‌బెల్ ఆస్పత్రికి చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సతీమణి సరస్వతితోపాటు పలువురు పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద సమైక్యాంధ్ర పాటలు, అంజలిబృందం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జేఏసీ కన్వీనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి, అల్లె ప్రభావతి సంఘీభావం తెలిపారు. రాయచోటిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. రైల్వేకోడూరు పట్టణంలో జేఏసీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి 64 ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివలింగానికి పాలాభిషేకం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బద్వేలు పట్టణంలో డ్వామా సిబ్బంది 24 గంటల దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోరుమామిళ్ల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి ఇంటిపై, వాహనాలపైన సమైక్య జెండాలు రెపరెపలాడాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు నేతృత్వంలో ఎన్జీఓలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు గాంధీ విగ్రహం వద్ద ధర్నాను చేపట్టారు. శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇరిగేషన్, వస్త్ర భారతి, మున్సిపాలిటీ, వైద్యులు,న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కమలాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వినతిపత్రం సమర్పించారు. పులివెందులలో ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ, ఎన్జీఓలు వీరికి మద్దతు తెలిపారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాబిషేకం చేశారు. మైదుకూరులో ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ సమర దీక్ష
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనలో అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.. తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని చెబుతూ వైఎస్సార్సీపీ నాయకులు జిల్లాలో బుధవారం సమైక్య నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు నిరాహార దీక్షలతో సమైక్య వాణిని హోరెత్తిస్తున్నారు. ఈ దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు వివిధ వర్గాల నాయకులు, ప్రజలు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, అభినందిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలో 1247 మంది నేతలు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులోనే ఎంపీ పదవికి రాజీనామా చేశారని, ఆమరణ దీక్ష చేసి సమైక్య వాణి వినిపించారని పేర్కొన్నారు. తమ పార్టీ విభజనకు వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పోరాటం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు విభజనను వ్యతిరేకిస్తూనే అధిష్టానం ఎదుట తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.రాయదుర్గంలో.. స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు మద్దతుగా రాయదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట మండలాల కన్వీనర్లు మల్లికార్జున, ఆలూరు తిప్పన్న, శ్రీకాంత్‌రెడ్డి, అశ్వర్థరెడ్డి, పార్టీ నాయకులు పేర్ని బాలాజి, బొజ్జిరెడ్డి, కేశవరెడ్డి, పీఎస్ మహేష్, బోనబాగి శర్మ, అరుణ, అనూరాధ, కోఫియా రిలే దీక్షలు చేపట్టారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్, మహాత్మాగాంధీ, అంబేద్కర్, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూపురంలో.. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈయనకు మద్దతుగా చిలమత్తూరు నాయకులు మగ్బూల్సాహెబ్, టేకలూరు సర్పంచ్ జబీఉల్లా, నాయకులు పీఎస్ వేణుగోపాల్‌రెడ్డి, దాదాపీర్, అమీర్‌ఖాన్, సయ్యద్ అన్వర్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సమన్వయకర్తలు చౌళురు రామకృష్ణారెడ్డి, ఇనయతుల్లా, నాయకులు డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, మండలాల కన్వీనర్లు అంజన్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.అనంతపురంలో... స్థానిక సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ నాయకులు బోయ తిరుపాలు, చింతకుంట మధు, మారుతీ నాయుడు, కొర్రపాడు హుసేన్‌పీరా, వేమల నదీం, డాక్టర్ వైడి వర్మ 36 గంటల దీక్ష చేపట్టారు. మరో 40 మంది పార్టీ కార్యకర్తలు రిలే దీక్ష చేశారు. దీక్షకు ముందు ఎమ్మెల్యే అరవింద్‌నగర్‌లోని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో తెలుగుతల్లి, మహానేత వైఎస్, అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉరవకొండలో.. క్లాక్‌టవర్ సర్కిల్లో సీఈసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా ఉరవకొండ, బెళుగుప్ప, కూడేరు, విడపనకల్లు మండలాల కన్వీనర్లు సుంకన్న, రామాంజినేయులు, రామచంద్ర, హనుమంతు 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 750 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కదిరిలో.. స్థానిక మారుతీ సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎస్ఎండీ ఇస్మాయిల్, మహమ్మద్ షాకీర్ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పట్టణ, రూరల్ కన్వీనర్లు చాంద్‌బాషా, లోకేశ్వరెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, కేఎం సాలార్ బాషా, జేకే జాఫర్‌ఖాన్, నూర్ మహమ్మద్, జిలాన్ బాషా 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు పట్టణంలో పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గుంతకల్లులో.. స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు 150 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు వెంకట్రామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలసి హనుమేష్ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బుడగ జంగాల నాయకులు సంఘీభావం తెలిపి, జానపద గీతాలు పాడారు. కళ్యాణదుర్గంలో.. స్థానిక గాంధీ సర్కిల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పేస్వామి 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కుందుర్పి మండలాల కన్వీనర్లు తిరుమల వెంకటేసులు, చెన్నమల్లప్ప, ఎస్కే అంజనేయులు, మరో 50 మంది 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో కలసి తిప్పేస్వామి భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరికి ఉద్యోగ జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఓడీ చెరువులో.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువులో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, బయపురెడ్డి, తిప్పేపల్లి పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి, ఓడీసీ సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు మధుసూదన్‌నాయుడు, పార్టీ మైనార్టీ కన్వీనర్ వెల్డింగ్ బాషా, జేకేపల్లి సర్పంచ్ రాజప్ప, నాయకుడు బయప్పరెడ్డి 36 గంటల దీక్ష చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి రిలే దీక్ష చేశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో.. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీకి చెందిన 23 మంది కార్యకర్తలు రిలే దీక్ష చేశారు. దీక్షకు సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య, కళ్యాణదుర్గం నియోజకవవర్గ సమన్వయకర్త ఎల్ఎం మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. పెనుకొండలో.. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ 30 గంటల దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు దాదూ, సరస్వతమ్మ, సుశీలమ్మ, మల్లిక, గజేంద్ర, గోవిందు, అమీర్ 30 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ సంఘీభావం తెలిపారు. శింగనమలలో.. స్థానిక రామాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి 36 గంటల దీక్ష చేపట్టారు. మద్దతుగా పార్టీ నాయకులు 23 మంది 36 గంటల దీక్ష చేపట్టారు. అంతకుముందు శింగనమలలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మవరంలో.. స్థానిక కాలేజీ సర్కిల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు సుమారు 35 మంది రిలే దీక్ష చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మడకశిరలో.. వైఎస్సార్ సర్కిల్లో పార్టీ నాయకులు వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైటీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు, మండల కన్వీనర్లు రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
వైఎస్ఆర్సీపీ దీక్షలకు వెల్లువలా మద్దతు
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు బుధవారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వివిధ సంఘాల జేఏసీ నాయకులు, మహిళా సంఘాలు, మైనార్టీ ఉద్యోగులు, సమైక్య వాదుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీక్ష కొనసాగుతున్న ప్రతి చోటా సమైక్య వాదులు వైఎస్సార్సీపీ నాయకులకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి చేపట్టిన 36 గంటల దీక్షకు మైనార్టీ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, లయన్స్‌క్లబ్ సభ్యులు, మహిళా సంఘాలు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి చేపట్టిన దీక్షకు బుడగజంగాలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి దీక్షకు ఉద్యోగ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఓడీచెరువులో 36గంటల దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ హరిక్రిష్ణకు ఉపాధ్యాయ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఉరవకొండలో 36 గంటల దీక్ష చేపట్టిన పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డికి అపూర్వ మద్దతు లభించింది. మండల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
సమైక్య ద్రోహులను తరిమికొట్టండి
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న వారిని తరిమికొట్టాలని ప్రజలకు వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి వద్ద నంద్యాల నియోజకవర్గానికి చెందిన 65 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల 48 గంటల దీక్షను భూమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌లపై విరుచుకపడ్డారు. ఈ పార్టీలన్నీ సమైక్యవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఆ పార్టీలను తరిమికొడితే తప్ప సీమాంధ్రకు న్యాయం జరగదని పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులను జేఏసీ నాయకులు నిలదీయాలని కోరారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, జేఏసీ నాయకులు ఆయన వలలో పడొద్దని సూచించారు. ఒకవైపు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటూనే మరోవైపు 10 జిల్లాలతో కూడిన తెలంగాణాను హైదరాబాద్‌ను రాజధానిగా కలిపి ప్రకటించాలని బహిరంగంగా చంద్రబాబు ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. స్వార్థం కోసం ఏ పనిచేయడానికైనా ఆయన సిద్ధహస్తుడని ఆరోపించారు. బాబు..అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నాయకునిగా గుర్తించి దూరం ఉంచాలని భూమా అన్నారు. సీమాంధ్ర ప్రజల శ్రేయస్సును కోరుతున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తమ పార్టీకి అండదండలు అందిచాల్చిన బాధ్యత జేఏసీతో పాటు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. భారతదేశంలోనే ఇంత వరకు విభజన కోసం ఆందోళనలు చేశారో తప్ప సమైక్యతకోసం ఎన్నడూ ఉద్యమం జరగలేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తే తప్ప సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు. టీడీపీ అధినేతకు పదవీ వ్యామోహం పట్టిందని అందుకే కాంగ్రెస్, బీజేపీలపై ఆయన పార్టీ యూ టర్న్ తీసుకుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు ఉండడంతో వారు కేంద్రానికి భయపడి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతల బాగోతాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందన్నారు. గత వారం రోజుల నుండి వైఎస్ఆర్ను లక్ష్యంగా చేసుకుని ఈ రెండు పార్టీలు వ్యూహాన్ని రూపొందించుకుంటున్నాయని భూమా ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రిలే దీక్షలకు విశేష స్పందన లభించింది. నంద్యాల, గోస్పాడు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. -
సమైక్య కేక
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 63వ రోజు మంగళవారం ఉధృతంగా సాగింది. అలుపెరగక సింహపురివాసులు పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సూళ్లూరుపేటలో మంగళవారం పులికాట్ పొలికేక పేరుతో భారీసభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌పై బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తం గా పార్టీ శ్రేణులు నిరాహారదీక్షలకు దిగనున్నారు. వైఎస్సార్సీపీ మాదిరిగా మిగిలిన పార్టీలు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, విద్యార్థి, జేఏసీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరిలో జే ఏసీ నేతలు కేసీఆర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలోని వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రోడ్డుపై ఆటాపాట నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి నిరసనను వ్యక్తం చేశారు. గూడూరులో టవర్‌క్లాక్ సెం టర్లో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50 రోజులకు చేరుకున్న సందర్భంగా జేఏసీ, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జేఏసీ నేతలు తోలు బొమ్మలాటతో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హోటల్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్‌పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆమరణ నిరాహారదీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై పార్టీ కార్యకర్తలతో మండల కన్వీనర్లు సమీక్షించారు. పొదలకూరులో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ప్రదర్శన జరిపారు. రిలే నిరాహారదీక్షలు చేశారు. రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞాలు నిర్వహించారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం బైపాస్‌రోడ్డులో మూడు పంచాయతీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తహశీల్దార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. మానవహారం నిర్మించారు. నడిరోడ్డుపై ఉపాధ్యాయులు కబడ్డీ, ఖోఖో ఆడారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆద్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. సూళ్లూరుపేట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ గర్జనను వినిపించేందుకు వేలాది మందితో పులికాట్ పొలికేకను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఓ స్కూల్లో పనిచేస్తున్న బెల్జియం దేశస్తులు ఆందోళనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు గుండు గీయించుకొని నిరసన తెలిపారు. వరికుంటపాడులో సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో స్థానిక యువకులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఫొటో, వీడియోగ్రాఫర్లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఆదర్శరైతుల దీక్షకు వ్యవసాయ శాఖ జేడీ సుబ్బారావు సంఘీభావం తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం టపాతోపు జాతీయరహదారిని దిగ్బంధించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాజుపాళెం నుంచి భారీ ర్యాలీ, జాతీయ రహదారిపైనే వంటావార్పు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. -
2 నుంచి ఆమరణ దీక్షలు
పాణ్యం రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు చేపట్టనున్నామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ దీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వచ్చేంత వరకు దీక్షను కొనసాగుతుందని వివరించారు. అలాగే మండల కేంద్రాల్లో వచ్చే నెల 10వ తేదీన రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. అలాగే 17వతేదీన మండల కేంద్రాల్లో ఆటో డ్రైవర్ల యూనియన్, రిక్షా యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలతో కలిసి 21వ తేదీన వైఎస్సార్సీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో 24వ తేదీన యువకులతో బైక్‌ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఓడిన అభ్యర్థులు కలిసి కర్నూలులో 26వ తేదీన దీక్షలు చేపడుతారన్నారు. మండల కేంద్రాల్లో విద్యార్థులచే 29వ తేదీన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1వ తేదీన గ్రామాల్లో సమైక్య తీర్మానాలు, పంచాయతీలు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, జననేత అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జననేతతోనే సంక్షేమం సాధ్యం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుందని గౌరు వెంకటరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు రాజీనామాలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తక్షణమే వారు పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖతోనే కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర విభజనను పూనుకున్నారని గౌరు ఆరోపించారు. ఈ పాపం ఊరుకొనే పోదని, ప్రజలు ఆయనను క్షమించబోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అందరు కలిసి కట్టుగా పని చేసి పార్టీ అభివృద్ధికి, గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరు చరితా రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాలం చంద్రశేఖర్‌రెడ్డి, తొగర్చేడు శ్రీనివాసరెడ్డి, మద్దూరు సుధాకర్‌రెడ్డి, ఆలమూరు డెరైక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఒడ్డుగండ్ల మోహన్, గోనవరం దానం, కొండజూటూరు బోగేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇక చురుగ్గా... ఉద్యమం లోకి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో రెండు నెలలుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరో నేత తోడయ్యారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పోరుబాట సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమైక్య ఉద్యమ జెండా భుజానికెత్తుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన మరుసటి రోజు శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కలిసి గత ఆగస్టు 2న తాను ఇచ్చిన రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా కోరారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలు విన్న స్పీకర్ ఏమీ మాట్లాడలేదని, అధికారులు తన మాటలను రికార్డు చేసుకున్నారని ఆయన తెలిపారు. చూస్తూ ఊరుకోలేను... 13 జిల్లాల ప్రజలు, ఉద్యోగులు రెండు నెలలుగా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తుంటే బాధ్యత గల ఎంపీగా చూస్తూ కూర్చోదలుచుకోలేదని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆగస్టు 2నే రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినప్పటికీ, ఆమోదం పొందలేదన్నారు. రాజీనామాలు ఆమోదించుకున్నాకే ఉద్యమంలోకి రావాలని ప్రజా ప్రతినిధులకు ప్రజలు, జేఏసీ నాయకులు స్పష్టంగా చెపుతున్న నేపథ్యంలో తాను ఆ దిశగా అడుగులు వేసినట్లు చెప్పారు. ఇక నుంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొంటానన్నారు. ప్రస్తుతం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే అని, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమైక్యాంధ్రకు ప్రతినిధిగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. జననేత నేతృత్వంలో సమైక్యాంధ్ర కొనసాగుతుందన్న నమ్మకం ఉందని, సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భావితరాల ఆశాదీపిక వైఎస్సార్ తనయుడు ఒక్కరేనని, అందుకే ఆయనకు అండగా నిలిచినట్లు చెప్పారు. -
ఒకటే గమ్యం.. గమనం
సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర కోసం లక్షల గళాలు ఘోషిస్తున్నాయి. వేల పిడికిళ్లు బిగిస్తున్నాయి. ఒకటే గమ్యం..గమనంతో సకల జనం ఉద్యమబాట పడుతున్నారు. తెలుగు జాతిని విడదీయవద్దంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 60వ రోజు శనివారం ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగాయి. రహదారుల దిగ్బంధం, వంటావార్పులతో ఉద్యమకారులు కదంతొక్కారు. రాష్ట్రాన్ని విభజిస్తే భావితరాల వారు రోడ్లపై మిర్చిబజ్జి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. విభజన హోటల్ పేరిట టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విభిన్న రకాల అల్పహారాలను ప్లేట్ రూ. 10లకే విక్రయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నగరపాలక సంస్థ ఉద్యోగులు నగరంలో మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ నోట్‌ను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తే కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆదోని పాతబస్టాండ్ సర్కిల్లో నిర్వహించిన గర్జనకు వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరైన దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఆళ్లగడ్డలో గాంధీ విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆలూరులో ఉపాధ్యాయ జేఏసీ మహిళా నేతలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. పత్తికొండ పట్టణంలో 18 మంది ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. దేవనకొండలో జెడ్పీ హైస్కూల్ చెందిన పూర్వపు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోడుమూరు పట్టణంలో ఫొటోగ్రాఫర్లు, సప్లయర్ షాపు యజమానులు కదం తొక్కారు. ప్యాలకుర్తి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరాహార దీక్షకు కూర్చున్నారు. గూడూరులో చికెన్ వ్యాపారులు, సి.బెళగల్లో కూల్‌డ్రింక్స్ యజమానులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు రిలే నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్షల్లో శనివారం వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. డోన్ , ప్యాపిలి, వెల్దుర్తిలో దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని శివ సర్కిల్‌ను దిగ్బంధించారు. అనంతరం సర్కిల్లో వివిధ ఆటలు ఆడుతూ మధ్యాహ్నం వరకు విద్యార్థులు నిరసన తెలిపారు. ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం శివ సర్కిల్లో పొదుపు మహిళల చేత మహిళా ప్రయాణికులకు బొట్టుపెట్టించి నిరసనను వ్యక్తపర్చారు. -
నేడే ప్రజాగర్జన
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమ ముఖద్వారం ప్రముఖ పాత్రపోషిస్తోంది. మొట్టమొదటి సారిగాఈ గడ్డ మీద నుంచే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా లక్షగళాలు ఘోషించాయి. ముస్లింలు మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించి దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఇదే స్ఫూర్తితో సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బహిరంగ సభ జరిగే ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఖరారుచేశారు. అలాగే సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. రెండు ప్రధాన గేట్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు నవాబు రసూల్ ఖాన్ ద్వారాలు నామకరణం చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చే వారందరికీ మంచినీళ్లు, మజ్జిగ, అన్నం ప్యాకెట్లు సరఫరా చేయడానికి 500 మంది వలంటీర్లను నియమించారు. వారికి ప్రత్యేక డ్రస్కోడ్ రూపొందించారు. బహిరంగ సభ వేదిక పక్కన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం పది గంటల నుంచి ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి బహిరంగ సభ మొదలవుతుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు ప్రధాన వక్తగా పాల్గొంటారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు ఆర్టీసీ, విద్యుత్ ఇరిగేషన్ తదితర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు.. విభజనతో కలిగే పరిణామాలు, ఉద్యోగులకు ఏర్పడే నష్టం, కలసి ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు భవిష్యత్తు వ్యూహాన్ని వివరించనున్నారు. వేదికపైన ఎవరెవరు ఆసీనులవుతారు, ఎంతమంది ప్రసంగిస్తారనేదానిని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు నిర్ణయిస్తారని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నేతలు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు శనివారం ఏర్పాట్లను సమీక్షించారు. బహిరంగసభ విజయవంతానికి జిల్లా అధికారుల సంఘం నేతలు సూర్యప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, హరినాథరెడ్డి, ఆనంద్‌నాయక్ తదితరులు పూర్తిగా సహకరిస్తున్నారు. భారీగా తరలివస్తున్న ఉద్యోగులు, ప్రజలు సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభకు వేలాదిమంది పాదయాత్ర ద్వారా కర్నూలుకు తరలివస్తున్నారు. డోన్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల మంది పాదయాత్ర ద్వారా శనివారం ఉదయమే కర్నూలుకు బయలుదేరారు. రాత్రికే వారు కర్నూలుకు చేరుకున్నారు. మరిన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది పాదయాత్ర ద్వారా తరలివస్తున్నారు. నగరం మొత్తం సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన ఫ్లెక్సీ బ్యానర్ల పోస్టర్లతో నిండిపోయింది. ప్రజాగర్జన బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి సమైక్యవాదాన్ని బలంగా ఢిల్లీ పీఠానికి చాటిచెప్పాలనే కసి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. -
విభజనపై అమెరికాలో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ అమెరికాలోని తెలుగు వారు, యువకులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తెలుగువారు ఒక చోటకు చేరి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయం కొమ్మినేని ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలిపారు. సీమాంధ్రలో 60 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచకపోగా, వారికి అందుబాటులో లేకుండా తప్పించుకు తిరగడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే కాంక్షతో సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పూనుకుందని, తెలంగాణ దుష్టశక్తులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నారైలు దాచర్ల అశోక్, చలసాని అనిల్, మందడపు పుల్లారావు, కొడాలి వెంకట్, చుండు పవన్, బి.శ్రీకాంత్, ఎం.సివేశ్, ఎం.విద్యాసాగర్, ఎన్.కిరణ్, డి.బాలాజీ, జి. కళ్యాణ్, శివ, నగేష్, రణధీర్, వి.రవి, కె. మహేంద్ర, విద్య, జనార్ధన్ పాల్గొన్నారు. -
60వ రోజైన ‘పశ్చిమ’జనోద్యమం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై ప్రజ్వరిల్లుతోంది. 60వ రోజైన శనివారం కూడా ‘పశ్చిమ’ వాసులు గర్జనలు, వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి విభజన నిర్ణయంపై కన్నెర్ర చేశారు. వినూత్న ఆందోళనలు, కేంద్ర పాలకులు మనసులు మార్చాలంటూ గర్జనలు, పాదయాత్రలు, జన జాగారం వంటి కార్యక్రమాలతో ఉద్యమస్ఫూర్తిని ఉరకలెత్తించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర కార్యాల యాల ముట్టడిలో భాగంగా రెండో రోజు టెలికం, బ్యాం కులు, పోస్టల్ శాఖ కార్యకలాపాలను ఎన్జీవోలు స్తంభింప చేశారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో పశు సంవర్థకశాఖ, ఏపీఎస్ఐడీసీ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గురుశిష్య సమైక్య భేరి నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో మమేకమయ్యారు. గజల్ శ్రీనివాస్ ‘ఓయి తెలుగువాడా...మనకి దే వెలుగువాడ...’ అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగలించేలా గజల్స్‌ను ఆలపించారు. చిన్నారులు దేశభక్తి గీతాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. భీమవరంలో ఉపాధ్యాయులు వెనక్కినడిచి నిరసన తెలిపారు. జీవీఐటీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ రహదారిని దిగ్భందించి సమైక్యనాదం చేశారు. ఉద్యమం 60 రోజులు నిండిన సందర్భంగా 60 అంకె ఆకారం లో నిలబడి విద్యార్థులు, అధ్యాపకులు తమ దీక్షను ఎవరూ భగ్నం చేయాలేరని చాటిచెప్పారు. ఉండిలో గొడుగులతో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు నిరసన తెలిపారు. యండగండిలో రాస్తారోకో చేశారు. కాళ్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సర్రాజు పాదయాత్ర నిర్వహించారు. బొండాడ గ్రామం నుంచి కాళ్లకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కేంద్రంలోని పెద్దల మనస్సులను మార్చాలని వెంకన్నకు నాయకులు పూజలు నిర్వహించి వేడుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా జన జాగారాన్ని తాడేపల్లిగూడెంలో శని వారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ సమైక్యాంధ్ర ఆవశ్యకత తెలిపే కళారూపాలను ప్రదర్శించారు. పాలకొల్లు రైతు వేదిక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ నిమ్మల రామానాయుడు నేతృత్వంలో రాష్ట్రం విడిపోతే అందరికి అన్నం పెట్టే అన్నదాతకూ అన్నం కరువే అంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శన పలువురిని ఆలోచింపజేసింది. ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నరసాపురం ఆర్డీవో వసంతరావు తహసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సహయకులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగవద్దని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. పోడూరు మండలంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు. చాగల్లులో రిలే దీక్షలో ఫొటోగ్రాఫర్లు పాల్గొని మద్దతు తెలిపారు. ఆర్అండ్ బీ రోడ్డుపై తెలంగాణ- సీమాంధ్ర జట్లుగా ఏర్పడి కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సీమాంధ్ర జట్టు గెలిచింది. తెలంగాణ నాయకుల ఆటలు ఎంతోకాలం సాగవని ఆటగాళ్లు సమైక్య శపథం చేశారు. తాళ్లపూడి బజారు సెంటరులో ఎన్జీవో లు రోడ్లను ఊడ్చి తెలంగాణ నాయకులకు పట్టిన దుమ్ము వదలగొడతామని ప్రతిజ్ఞ చేశారు. బుట్టాయగూడెంలో బూసరాజు పల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. అధ్యాపకులు, సిబ్బంది కబడ్డీ ఆడి ఢిల్లీ పెద్దలకు దిమ్మతిరిగేలా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సమైక్యాంధ్రకు మద్దతుగా కావలిపురానికి చెందిన 100 మంది రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిడదవోలులో ఉపాధ్యా య జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో ముస్లిం ఉపాధ్యాయులు 12 మంది పాల్గొన్నారు. గణపతి సెంటర్లో రోడ్డుపైన నమాజ్ చేసి నిరసన తెలిపారు. పెరవలి మండలం తీపర్రులో వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులు రిలే నిరాహారదీక్షలు చేశారు. నర్సాపురం బస్టాం డ్ సెంటర్లో 20 మంది కరాటే విద్యార్థులు విన్యాసాలు చేశా రు. అంబేద్కర్ సెంటర్లో సాయిబాబా గుడిలోని ఉత్సవమూర్తిని సమైక్యాంధ్రకు మద్దతుగా ఊరేగించారు. స్వామికి పాలాభిషేకం చేశారు. -
బంగారం కుదువబెట్టి..
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు నిలిచిపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం చావోరేవో అంటూ.. కష్టాలను పంటిబిగువన భరిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలను తీర్చుకునేందుకు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువబెడుతున్నారు. బంగారంపై అప్పు తెచ్చుకుని కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఉద్యోగులకే పరిమితం కాలేదు. వ్యాపారులు.. వృత్తులపై ఆధారపడి జీవించే వారూ బ్యాంకులు లేదా తాకట్టు వ్యాపారుల వద్దకు వెళుతున్నారు. 45 రోజుల్లో రూ.300 కోట్లు ఉద్యమం ప్రారంభించిన 45 రోజుల్లో జిల్లాలోని బ్యాంకుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తిదారులు బ్యాంకుల్లో బంగారాన్ని కుదువబెట్టి సుమారు రూ.300 కోట్లను రుణాలుగా తీసుకున్నా రు. ఈ విషయూన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. తాకట్టు, ప్రైవేటు సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పులు దీనికి అదనం. సాధారణ రోజులతో పోలిస్తే బంగారంపై ఇస్తున్న అప్పులు ఇటీవల విపరీతంగా పెరిగాయని ఆ అధికారి వెల్లడించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు చాలామంది బంగారు ఆభరణాలపై అప్పులు తీసుకుంటున్నట్టు వివరించారు. వ్యాపారులు, వృత్తిదారులు తీసుకుంటున్న మొత్తాలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పారు. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి బంగారంపై సుమారు రూ.1,000 నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకుంటారని తెలిపారు. ఈ లెక్కన చూస్తే నెలకు సగటున రూ.100 కోట్లను గోల్డ్ లోన్స్గా ఇస్తుంటామన్నారు. దీనికి భిన్నంగా గడచిన 45 రోజుల్లో బంగారంపై రూ.300 కోట్లమేర రుణాలు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నా రు. రానున్న రోజుల్లో ఆభరణాలపై ఇచ్చే రుణాల మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. సా ధారణంగా రైతులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు బంగారంపై రుణాలు తీసుకుంటారని, ఉద్యోగులు అప్పుడప్పుడూ మాత్రమే ఈ రుణాలను వినియోగించుకుంటారని వివరించారు. అందుకు భిన్నంగా గడచిన 45 రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉన్నట్టు స్పష్టం చేశారు. రియల్టర్లదీ అదేదారి సమైక్యాంధ్ర ఉద్యమంతో మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. విభజన నిర్ణయం వెలువడగానే సీమాంధ్రలోని భూముల ధరలకు బూమ్ వచ్చింది. వ్యాపారం లాభసాటిగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భావించారు. అయితే భూములు కొనగోలు చేసేందుకు అవసరమైన నగదు లేక, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయ క లావాదేవీలు నిలిచిపోయూయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రైవేటు, జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ.50 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష
బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యం లో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఎం. శ్రీరామ్మూర్తి తెలిపారు. బలిజిపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వైఎస్సార్సీపీ సమైక్యాంధ్రకు మద్దతిస్తున్నందున ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు దీక్ష చేపట్టడానికి నిర్ణయించామన్నారు. దీక్షలో తనతో పాటు పాలూరు నారాయణరావు (బర్లి), గంటా గౌరీశంకరరావు (గంగాడ) కూర్చుంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.కాశినాయుడు, ఎస్.సత్యంనాయుడు, పి.సత్యనారాయణరాజు, పి.మురళీకృష్ణ, విజయందొర, పి.నారాయణరావు, జి.చిరంజీవిమాష్టారు, పి.వెంకటినాయుడు, శాంతారాం, డి.భాస్కరరావు, లక్ష్ముంనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అరవయ్యో రోజునా.. అదే ఆగ్రహజ్వాల
జనాభిమతాన్ని పరిగణించకుండా, ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయంపై సీమాంధ్ర జనం ఆగ్రహం జ్వాలాతోరణమై అరవై రోజులైంది. ఢిల్లీ పెద్దల దాష్టీకంపై ఊరూవాడా రణరంగమై అరవై రోజులైంది. అయితేనేం- తెలుగుజాతిని నిలువునా చీల్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ తమ సమరం ఆగబోదని అన్ని వర్గాలూ ఒకే గొంతుగా నినదిస్తున్నాయి. క్యాలెండర్లో మరో పేజీ తిరగబోతున్నా, జీతభత్యాలు లేక యాతనలు ఎదురవుతున్నా.. సమైక్యాంధ్రను పరిరక్షించాలన్న తమ సంకల్పం సడలబోదని ఉద్యోగవర్గాలు పోరుబాటలో సాగుతూనే ఉన్నాయి. సాక్షి, రాజమండ్రి : మరో రెండురోజుల్లో మరో నెల గతించనుంది. అయితేనేం.. రెండు నెలల క్రితం జూలై 31న రగులుకున్న ధర్మాగ్రహజ్వాల రోజురోజుకూ జ్వాజ్వల్యమానమవుతూనే ఉంది. ‘తారీఖులు, తరలే నెలలు.. కావేవీ మా పోరుకు అడ్డం- తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణే మా అంతిమ లక్ష్యం’ అంటూ సీమాంధ్ర ప్రాంతంలో ఊరూరా, వాడవాడనా ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య సమరంలో భాగంగా 60వ రోజైన శనివారం జిల్లాలో సమైక్యవాదులు విభజన నిర్ణయం పట్ల తమ నిరసనను వివిధ రూపాల్లో చాటారు. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో గ్రామంలో సమైక్య ప్రార్థనలు చేస్తున్న రావులపాలెంకు చెందిన షకీనా మినిస్ట్రీస్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సోనియాకు సైతాన్ పట్టినందునే రాష్ట్రాన్ని ముక్కలు చేయజూస్తున్నారని, ఆ సైతాన్ వదిలి పోవాలని ప్రార్థనలు జరిపారు. ఉద్యమం 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద దీక్షల్లో 60 మంది పాల్గొన్నారు. హరికథా కాలక్షే పంతో పాటు అల్లూరి సీతారామరాజు వేషధారణతో ప్రదర్శన చేశారు. ఏలేశ్వరంలో సమైక్యవాదులు 60 ఆకృతిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాజానగరం పాతబస్టాండ్ సెంటర్ వద్ద దీక్షాశిబిరంలో ‘హ్యూమన్ హెల్పింగ్ హ్యాండ్స్’ అనే సేవా సంస్థ 60 ఏళ్ల వృద్ధుడిని సన్మానించింది. బజ్జీలు, టీలు విక్రయించిన ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి జంక్షన్, కడియం మండలం వేమగిరి సెంటర్లలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మంత్రి పితాని సత్యనారాయణ కాన్వాయ్‌ను అడ్డుకుని ఘెరావ్ చేశారు. తక్షణం రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని మంత్రి చెప్పడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు ‘రాజీనామా చేశానని మీకు మీరు అనుకుంటే సరిపోదు, దాన్ని ఆమోదింప చేసుకోవా’లని డిమాండ్ చేశారు. దానికి మంత్రి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బజ్టీలు, టీలు విక్రయించారు. రాష్ట్రం విడిపోతే తమకు ఇదే గతి అంటూ సందేశం ఇచ్చారు. హర్షవర్థన పాఠశాల విద్యార్థులు రైల్వే స్టేషన్ రోడ్డులో రాస్తారోకో చేశారు. కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి కలెక్టరేట్ ఎదుట దహనం చేశారు. గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు గిరిజనులతో సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శింపజేశారు. 300 అడుగుల పొడవున ఉన్న జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. కాపు సద్భావనా సంఘం ఆధ్వర్యంలో నాగమల్లితోటలో వంటా వార్పు చేశారు. ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఉద్యోగులు దస్తావేజు పేపర్లపై సమైక్య నినాదాలు రాసి ప్రదర్శించారు. కోనసీమలో.. అమలాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి ఇళ్లు, దుకాణాల వద్ద జోలె పట్టి భిక్షాటన చేశారు. కార్లు, మోటారు సైకిళ్లు తుడిచి నిరసన తెలిపారు. కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సిద్ధి వినాయక మోటార్ మెకానిక్స్ అసోసియేషన్ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించింది. అల్లవరంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. కోనసీమ రైతు జేఏసీ ఆధ్వర్యంలో మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీని ఏర్పాటు చేశారు. ముమ్మిడివరంలో తహశీల్దారు కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పువ్వులు పంచి సమ్మెలోకి ఆహ్వానించారు. కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్లో జేఏసీ నేత లు విద్యార్థులకు సమైక్యాంధ్ర ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందచేశారు. అంబాజీపేటలో రాట్నాలతో దేవాంగులు రోడ్డుపైనే నేత నేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఉద్యోగుల జేఏసీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది. పి.గన్నవరంలో నిరవధిక దీక్షల్ల్లో భాగంగా ఉద్యోగులు, రాజకీయ జేఏసీ సభ్యులు పోరు నిద్ర చేపట్టారు. అయినవిల్లి మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ముక్తేశ్వరం సెంటర్ వరకూ దింపు కార్మికులు మోకులు కట్టుకుని ర్యాలీ చేశారు. మామిడికుదురులో ఉద్యోగులు జాతీయ రహదారిపై దుస్తులు ఉతుకుతూ నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసరు డాక్టర్ సీవీ కృష్ణారావు ఆర్ఆర్జీహెచ్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలబడి నిరసన తెలిపారు. తాండవ నదిలో జలదీక్ష సామర్లకోటలో మహిళలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ స్థానికులకు మెహెందీ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా మెహెందీ పెట్టించుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తుని వద్ద తాండవ నదిలో జలదీక్ష చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకూ నదిలో నిలుచుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో సత్యదేవా టెంట్ హౌస్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 50 వాహనాల్లో భారీ ర్యాలీ చేశారు. బాలాజీచౌక్ వద్ద వలయంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. మలికిపురంలో మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. జగ్గంపేటలో సమైక్యవాది ఒమ్మి రఘురాం చేపట్టిన 48 గంటల దీక్షను పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ విరమింప చేశారు. ద్రాక్షారామలో జేఏసీ దీక్షలకు పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 42వ రోజుకు చేరాయి. పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు లింగంపర్తిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డప్పుకొడుతూ సమైక్య నినాదాలు చేశారు. కోరుకొండ మండలం నిడిగట్లలో పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఆ సంప్రదాయాలు మనవి కూడా.. గండేపల్లిలో జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో చేశారు. చిన్నారులకు సమ్మక్క, సారక్క వేషాలు వేసి ఆ దేవతలు సమైక్యాంధ్రులు ఆరాధించే మాత ప్రతిరూపాలేనని చాటి చెప్పారు. రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. రామచంద్రపురం ప్రధాన రహదారిలో మహిళలు బతుకమ్మ పండగ జరిపి, ఆ సంప్రదాయం కేవలం తెలంగాణదే కాదు రాష్ట్రం మొత్తానికి చెందినదని చాటి చెప్పారు. రాజానగరం మండలం రాధేయపాలెం, పాతతుంగపాడు గ్రామాల్లో జేఏసీ ఆధ్వర్యలో ఇంటింటా సమైక్య జెండాలను ఆవిష్కరించారు. రామచంద్రపురంలో అంగన్వాడీ ఉద్యోగుల పిల్లలతో సమైక్య చిన్నారి గర్జన నిర్వహించారు. చిన్నారులు దేశ నాయకుల వేషాలు వేసి సమైక్యంగా ఉండాలంటూ ఉద్బోధించారు. పట్టణ ప్రధాన రహదారిలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కె.గంగవరం, ద్రాక్షారామల్లో ఉపాధ్యాయలు అర్ధనగ్నంగా మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. -
రగులుతున్న జ్వాల
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాల ప్రజ్వరిల్లుతూనే ఉంది. 59 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం స్పందించక పోవడంపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటిచెబుతున్నారు. ఫలితంగా శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఎగిసిపడింది. సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. అనంతపురం నగరంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాత్రంతా ఆట పాటలతో జాగరణ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి... సమైక్య నినాదాన్ని విన్పించారు. సమైక్య వాదులకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మద్దతు ప్రకటించి... రాగిముద్ద, చట్నీ వడ్డించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గీతామందిరంలో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ సద్భావన సదస్సులో సమైక్యవాణిని గట్టిగా వినిపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రిలేదీక్షలు చేస్తున్న మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు.. సంఘీభావం తెలిపారు. రాష్ట్రం విడిపోతే నీటి కష్టాలు తప్పవంటూ కార్పొరేషన్ ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఖాళీ కుండలతో ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఎస్కేయూలో జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులను మూసివేయించారు. ఆకుతోటపల్లి మహిళలు, వర్సిటీ జేఏసీ నాయకులు స్థానిక 205 జాతీయ రహదారిపై ర్యాలీ, రాస్తారోకో చేశారు. ధర్మవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. సమైక్యవాదులు ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బత్తలపల్లిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. ముదిగుబ్బలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. గుంతకల్లులో జేఏసీ నాయకులు గొర్రెల కాపరుల వేషధారణలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమ రాళ్ల సీమగా మారుతుందంటూ హిందూపురంలో జేఏసీ నాయకులు తోపుడుబండ్లపై రాళ్లు పెట్టుకుని ర్యాలీ చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రోడ్లపై రాళ్లు కొడుతూ నిరసన తెలిపారు. ఏపీఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను ముట్టడించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు ఖాళీ కుర్చీలను మోస్తూ ర్యాలీ చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఎన్పీకుంట మండల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. సాధన స్కూలు విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. తలుపులలో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో వడ్డెర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉద్యమంలో కలసి రాకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు బుద్ధి చెబుతామంటూ జేఏసీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. మడకశిర, అమరాపురం, రొళ్లలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను బంద్ చేశారు. మడకశిరలో ఉద్యోగులు కోట బురుజు ఎక్కి, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకుని నిరసన తెలిపారు. గుడిబండలో ఆర్టీసీ ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ఆటా పాట నిర్వహించారు. పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రామ్ వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు చెబుతూ, బుక్కపట్నంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు పెనుకొండలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. పరిగిలో బఠానీలు అమ్ముతూ నిరసన తెలిపారు. గోరంట్ల, రొద్దం మండలాల్లో సమైక్యవాదులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. రాయదుర్గంలో మెడికల్ షాపు నిర్వాహకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. కణేకల్లులో బారిక కులస్తులు భారీ ర్యాలీ చేశారు. రాప్తాడులో ఉపాధ్యాయులు రాస్తారోకో, శింగనమలలో జేఏసీ నాయకులు ర్యాలీ, నార్పలలో మహిళలు మౌనదీక్ష, తాడిపత్రిలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి చేపట్టారు. పెద్దవడుగూరులో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులు రూ.10 వేల విరాళం అందజేశారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దర్గాలో ప్రార్థనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. కూడేరులో విద్యార్థులు రాస్తారోకో, బెళుగుప్పలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. -
ప్రజల్లోనే ఉండండి.. సమస్యలపై పోరాడండి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ప్రజల్లోనే ఉండండి.. వారి సమస్యలపై పోరాడండి.. సమైక్య ఉద్యమంలో మమేకమై ముందుండి పనిచేయండి’ అని జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులను పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ క్యాంపు కార్యాలయంలో బుధ, గురువారాల్లో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిణామాల గురించి జగన్మోహన్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిత్యం జనం మధ్యనే ఉండాలని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా తగిన విధంగా స్పందించాలని ఆదేశించారు. తనను కలిసిన నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీ ఎలా చేయాలనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్రెడ్డిని గురువారం కలిసిన వారిలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కణితి విశ్వనాథం, స్థానిక నాయకుడు డాక్టర్ డి.జీవితేశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఆయన భార్య విజయ, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా కన్వీనర్ కె.వి.సత్యనారాయణ, టెక్కలి స్థానిక నాయకులు బగాది రామకృష్ణ, చిలకా దేవానంద్ ఉన్నారు. కాగా బుధవారం జగన్మోహన్రెడ్డిని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ నేత తమ్మినేని సీతారాం, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు కలిశారు. -
పదవుల్ని వదలండి ఎన్జీఓల డిమాండ్
సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సాధ్యం కాదని ఏపీ ఎన్జీఓలు స్పష్టం చేస్తున్నారు. పదవులు పట్టుకుని వేలాడుతూ, సోనియా పంచన తిరుగుతుండడంపై ప్రజలు ఏవగించుకుంటున్నారని ఎలుగెత్తుతున్నారు. ‘ఇకనైనా పదవుల్ని పరిత్యజించి, ఉద్యమ బాట పట్టండి’ అని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నారు. సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్య ఉద్యమం 58వ రోజైన గురువారం కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా సాగింది. అమలాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ కుర్చీలు నెత్తిన పెట్టుకుని ‘సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులారా! కుర్చీలు వదలండి! రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి సమైక్యతను కాపాడండి’ అని నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద మంత్రుల మాస్క్‌లతో సమైక్యవాదులు ప్రదర్శన చేశారు. మంత్రుల మనసు మారాలంటూ పాస్టర్లు రోడ్డుపై ప్రార్థనలు చేశారు. దేవదూతల వేషాల్లోని చిన్నారులు మంత్రులకు జ్ఞానోదయం కలిగించినట్టు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సామర్లకోటలో మంత్రి తోట నరసింహంను సమైక్యవాదులు అడ్డగించి రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. కోరుకొండలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను సమైక్యవాదులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నడో రాజీనామా చేశానని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్న పెందుర్తి జేఏసీ దీక్షలో పాల్గొని వెళ్లిపోయారు. ఏపీఎన్జీఓల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండవ రోజైన గురువారం కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అడ్డుకున్నారు. దీంతో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల నుంచి హైదరాబాద్, విశాఖ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు తిరగలేదు. ధవళేశ్వరంలో ప్రైవేట్ బస్సులను నిలిపివేసిన సమైక్యవాదులు వాటిలో ప్రయాణిస్తున్న తెలంగాణ విద్యార్థులను గుర్తించి వారితో సమైక్య నినాదాలు చేయించారు. సీమాంధ్ర వాసుల సామరస్యాన్ని, రాష్ట్రం విడిపోతే వచ్చే అనర్థాలను వారికి వివరించారు. రాజమండ్రిలో ‘బాలఘోష’ సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన పురోహితుడు వేలూరి వెంకట కామేశ్వరశర్మ ధవళేశ్వరంలో తూర్పు డెల్టా ప్రధాన కాలువలో జలదీక్ష చేశారు. రాజమండ్రిలో ఫ్యూచర్స్ కిడ్స్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు ఏవీ ఆప్పారావు రోడ్డు నుంచి జాతీయ రహదారిపై స్కేటింగ్ చేస్తూ జేఎన్ రోడ్డు వరకూ ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన తమ భవిష్యత్తును కాలరాస్తుందంటూ చిన్నారులు రాజమండ్రిలో పశు సంవర్ధకశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ‘బాలఘోష’ కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ జిల్లా చైర్మన్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల పిల్లలు సహాయ సంచాలకుల కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీమాంధ్ర జిల్లాలకు చెందిన మున్సిపల్ ఇంజనీర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ హోమ్ వద్ద సమావేశమైన ఎన్జీఓలు తమ రాష్ట్ర ఆధ్యక్షుడికి తెలంగాణ వాదుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలని కోరుతూ మండల ఫ్లవర్ డెకరేటర్స ఆధ్వర్యంలో కడియం కెనాల్ రోడ్డులో ఇద్దరు పూల వ్యాపారులను ఇరు ప్రాంతాలకు చెందిన వధూవరులుగా అలంకరించి వివాహం చేశారు. కాకినాడలో బజ్టీలు వేసి ఉపాధ్యాయుడి నిరసన కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల దీక్షా శిబిరం వద్ద వెంకటరావు అనే ఉపాధ్యాయుడు బజ్జీలు వేసి నిరసన తెలి పారు. మరో ఉపాధ్యాయుడు పరసా సత్యనారాయణ తొలి బజ్జీని రూ.530కు కొనుగోలు చేశారు. బజ్జీల అమ్మకం ద్వారా వచ్చిన రూ.2200ను ఉపాధ్యాయ జేఏసీ శిబిరానికి విరాళంగా ఇచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు హృదయాకార గుర్తులు ధరించి దీక్షల్లో పాల్గొన్నారు. దస్తావేజు లేఖరులు పొట్టి శ్రీరాములు వేషధారణతో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. జిల్లా పరిషత్ సెంటర్లో న్యాయశాఖ మహిళా ఉద్యోగులు గాజులు, కుంకుమ పంచి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ శవయాత్ర సాగించి కాకినాడ కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. కరాటే క్రీడాకారుల విన్యాసాలు అమలాపురంలో డివిజన్ పరిధిలో గురుకుల పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. గడియార స్తంభం సెంటర్లో కొనసాగుతున్న నిరవధిక దీక్షల్లో సాంఘిక, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనగా, శిబిరం వద్ద జాతీయ గీతాలాపనతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంబంధిత శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావుతో పాటు జేఏసీ ప్రతినిధులు నక్కా చిట్టిబాబు, ఇతర ఉద్యోగులు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేశారు. అమలాపురం పవర్కిక్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మంది క్రీడాకారులు గడియారస్తంభం సెంటర్లో విన్యాసాలు చేశారు. మందపల్లి శనైశ్చరాలయంలో దేవస్థానం చైర్మన్ సిద్దంశెట్టి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర సమైక్యతను కాపాడాలంటూ హోమం చేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై చేనేత కార్మికులు రోడ్డుపై నేత నేసి, నూలు వడికి నిరసన తెలిపారు. విడిపోతే డెల్టాలు ఎడారే.. మామిడికుదురులో కోనసీమ రైతు జేఏసీ కన్వీనర్ యాళ్ల వెంకటానందం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా గోదావరి డెల్టాలు ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 30న ఎదురులంక నుంచి చించినాడ వరకూ భారీ మోటారు సైకిల్ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై వ్యాయామ ఉపాధ్యాయులు కర్రలతో వ్యాయామ విన్యాసాలు చేసి నిరసన తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ దీక్షకు మద్దతుగా సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రాజోలులో దారపురెడ్డి బాబ్జీ చేపట్టిన రిలే దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. రాజోలులో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పూ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మలికిపురంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. సఖినేటిపల్లిలో పొలిటికల్ జేఏసీ రిలే దీక్షలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు చేపట్టింది. పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ కళాశాల విద్యార్థులు కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. జాతీయ దళిత ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్ సెంటర్లో వంటా వార్పూ చేపట్టారు. సామర్లకోట జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను నిలిపి, విద్యార్థులను, ఉపాధ్యాయులను దీక్షా శిబిరం వద్దకు తరలించి సమైక్య నినాదాలు చేయించారు. పెద్దాపురం జేఏసీ దీక్షల్లో ఆ పట్టణానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి శేఖర్ భార్య, తెలంగాణ లోని సంగారెడ్డికి చెందిన రాణి సుజాత పాల్గొని సమైక్యరాష్ట్రానికి మద్దతు పలికారు. తునిలో నియోజకవర్గంలోని ఐదు మండలాల వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అధికారులు మోటారుసైకిల్ ర్యాలీ చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. వాహనాలను తుడుస్తూ నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ముస్లింల వంటావార్పు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజానగరంలో జాతీయ రహదారిపై ముస్లింలు వంటా వార్పూ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించారు. రామచంద్రపురంలో జేఏసీ నేతలు భిక్షాటన చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు మండలంలోని గ్రామాలకు వెళ్లి రైతులను చైతన్యం చేశారు. న్యాయవాదుల జేఏసీ, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీల దీక్షలు కొనసాగుతున్నాయి. కె.గంగవరం మండలం ఎర్రపోతవరంలో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల పోరు నిద్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు గురువారం రాత్రి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోరు నిద్ర చేపట్టారు. రిలే నిరాహారదీక్ష ముగించాక ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, తోటకూర సాయిరామకృష్ణ, సుబ్బరాజు, పెద్దిరాజు, కృష్ణమూర్తి తదితరుల నాయకత్వంలో సుమారు 50 మంది ఉపాధ్యాయులు రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. -
పోరు.. జోరు
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్రే ధ్యేయంగా అనంతపురం జిల్లాలో అలుపెరుగని పోరు సాగుతోంది. 58వ రోజు గురువారం కూడా సడలని దీక్షతో సమైక్యవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించారు. ఊరువాడా సమైక్య నినాదాలతో మార్మోగుతోంది. ర్యాలీలు, రిలే దీక్షలు, వినూత్న నిరసనలతో జిల్లా హోరెత్తుతోంది. అనంతపురం నగరంలో ఏపీఎన్జీఓలు, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తంతో సంతకాలు చేసి ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు. ఉపాధ్యాయులు జాక్టో ఆధ్వర్యంలో జోలె పట్టుకుని భిక్షాటన చేశారు. కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షలకు స్వయం సహాయక సంఘాల మహిళలు మద్దతు తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు గీతా మందిరం ఎదుట సాష్టాంగ నమస్కారాలు, మోకాళ్లపై కూర్చుని రాష్ట్రాన్ని విడదీయొద్దని దేవుళ్లను ప్రార్థించారు. రాష్ట్ర విభజనకు కారకులైన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. బుడగజంగాలు సమైక్య నినాదాలు చేస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి, టవర్ క్లాక్ సర్కిళ్లలో మానవహారం నిర్మించి.. ఒకే భాష.. ఒకే రాష్ట్రం అని నినాదాలు చేశారు. ఎస్కేయూ వద్ద 205 జాతీయ రహదారిపై వర్సిటీ పీజీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. దీంతో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాడవాడన సమైక్యమే.. ధర్మవరంలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు భారీ ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనాలు చేశారు. ముదిగుబ్బలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, టీచర్లు, విద్యార్థులు కలసి సైకి ల్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ, జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రిలే దీక్షలకు వండ్రంగులు మద్దతు తెలిపారు. గుత్తిలో శ్రీకృష్ణదేవరాయ యువసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా సహకార శాఖ ఉద్యోగులు సమైక్య నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. పామిడిలో కుమ్మరులు రోడ్డుపైనే కుండలు తయారు చేసి నిరసన తెలిపారు. హిందూపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ఆధ్యాపకులు అంబేద్కర్ సర్కిల్లో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. విద్యుత్ జేఏసీ నాయకులు సద్భావన సర్కిల్లో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబును విమర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ కుమార్తె కవిత దిష్టి బొమ్మలను దహనం చేశారు. చిలమత్తూరులో సమైక్యవాదులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొడికొండ చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కదిరిలో ఉద్యోగులు.. సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండేల ముసుగులు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంలో అరేకటిక, రాజస్థాన్ వ్యాపారుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు తిప్పేస్వామి, ఎల్ఎం మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు వేర్వేరుగా పిలుపునిచ్చారు. మడకశిరలో ఆటో యజమానులు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. అమరాపురంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. పుట్టపర్తిలో ఉద్యమకారులు ర్యాలీ చేపట్టి సమైక్య సమరభేరి పోస్టర్లను విడుదల చేశారు. ఆమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువుల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో తొండంపల్లి, రాంపురం గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. గోరంట్ల, పరిగిలో జేఏసీ నాయకులు ప్రైవేటు వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. రొద్దంలో ఉపాధ్యాయులు రోడ్డుపై వ్యాయామం చేస్తూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో ప్రాణత్యాగం చేసైనా సమైక్యాంధ్రను పరిరక్షించుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బోర్‌వెల్స్ యజమానులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు వేపాకులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఉరవకొండలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
మహిళలకు ఆసరా
నల్లగొండ, న్యూస్‌లైన్ :సీమాంధ్రులకు బుద్ధి చెప్పేందుకు ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జనభేరికి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలిరావాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ కేంద్ర సంఘం నాయకులు ముత్యం వెంకన్నగౌడ్, స్వామిరెడ్డి, గోపాల్‌రావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జనభేరి సన్నాహక సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సీ మాంధ్ర పాలకులు విద్యుత్ సంస్థను విచ్ఛిన్నం చేసి ప్రాజెక్టులను తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో సంస్థను కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమన్నారు. పార్లమెం టులో బిల్లు ఆమోదింపజేసుకునే వరకు రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనభేరి సభ తర్వాత అక్టోబర్ 5వ తేదీన తలపెట్టిన విద్యుత్‌ఉద్యోగులు సమరభేరికి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో విద్యుత్ టీజాక్ కేంద్ర సంఘం నాయకులు యాదగిరి, సత్యనారాయణ, రవీందర్, టీజాక్ జిల్లా చైర్మన్ కృష్ణ య్య, కేవీఎన్‌రెడ్డి, కోకన్వీనర్లు మహ్మద్‌సలీం, వెంకటయ్య, సీహెచ్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కరెంట్‌రావు, శ్రీని వాస్, నరేష్‌కుమార్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ముత్తయ్య, సురేష్‌కుమార్, తిరుపతయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బాలూనాయక్, టి. యాదయ్య, జైపాల్, నాగేంద్రప్రసాద్, గురువయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, కిషన్‌ప్రసాద్, పద్మ, హేమలత, సుగుణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జనహోరు
సాక్షి, కడప/రాయచోటి: రాష్ట్రవిభజన నిరసిస్తూ, సమైక్యరాష్ట్ర సాధన కోసం సాగుతున్న పోరుకు ‘రాయచోటిరణభేరి’ విజయంతో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘రణభేరి’ పేరుతో సభను నిర్వహించారు. ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి ఆర్డీవో వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. ఉదయం 11.05 గంటలకు మొదలైన సభలో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అశోక్‌బాబు ఢంకా మోగించి సమైక్యవాణి ఢిల్లీకి వినపడేలా రణభేరిని మొదలెట్టారు. 58రోజులుగా శాంతియుతంగా సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా నల్లపావురాలు ఎగరేశారు. సభ మొదలవగానే వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష, బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ‘వామ్మో..ఓ సోనియమ్మా..మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఏం పిల్లడో ఎల్దమొస్తవా!’ అంటూ ఆటపాటలతో అలరించారు. మండుటెండను లెక్కచేయక. గురువారం రాయచోటిలో విపరీతమైన ఎండకాసింది. అయినా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సభాప్రాంగణంలోనే కూర్చుండిపోయారు. సమైక్యనేతల మాటలను నిశితంగా ఆలకించారు. రాయలసీమకు వాటిల్లే కష్టం, అందులోనూ వైఎస్సార్‌జిల్లాకు కలిగే నష్టం, సీమ కరువు పరిస్థితులు, సమైక్యరాష్ట్రం ఆవశ్యకతపై అశోక్‌బాబు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అలాగే సాగునీటి వనరులు, విడిపోతే తలెత్తే ఇబ్బందులు, ఆర్టీసీ మనుగడపై ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖరరెడ్డి వివరణాత్మకంగా ప్రసంగించారు. ఉద్యోగసంఘాల రాష్ట్ర, జిల్లా నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, ఆవశ్యకతలను వివరించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు సమైక్యవాదంపై పాటపాడి అభినయించారు. సమైక్యవాదానికి కొత్త ఊపిరి: రాయచోటి రణభేరి ఊహించినదానికంటే విజయం సాధించడంతో జిల్లాలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి కొత్త ఊపిరి, సమైక్యవాదుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది.58 రోజులుగా సాగుతున్న ఉద్యమం సమైక్య ప్రకటన వచ్చేవరకూ ఆగే ప్రసక్తే లేదని అశోక్‌బాబు ఉద్ఘాటించారు. జీతాలు రాకపోయినా బెదరమని, సమైక్య ఉద్యమం గురించి అవాకులు, చెవాకులు పేలితే నాలుకలు చీల్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదని సమైక్య పరిరక్షణవేదిక అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. రణభేరి విజయవంతం అయ్యేందుకు రాయచోటి జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి వారంరోజులుగా శ్రమించారు. సభలో జేఏసీ కోకన్వీనర్ డీఆర్వో ఈశ్వరయ్య, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, సమైక్య ఉద్యమ నాయకులు గంగిరెడ్డి, రవికుమార్, శివకుమార్, శివారెడ్డి రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు భత్సవత్సం నాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వినాయకం, గెజిటెడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు పాల్గొన్నారు. -
రోజు రోజుకు బలోపేతం
గుంటూరు,న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం 58వ రోజు గురువారం నిరసనలు, ఆందోళనలతో హోరెత్తింది. జిల్లాలో పలు చోట్ల ప్రదర్శనలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు, టీడీపీ రిలేదీక్షలు 29వ రోజుకు చేరాయి. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు వీధుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. బాపట్లలో పాత బస్టాండు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర దీక్షలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే ఎంతో మంచిదన్నారు. ప్రత్తిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ వేమూరు నియోజకవర్గం దోనేపూడిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. చిలకలూరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, జాతీయరహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. మంగళగిరిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం రోడ్డుపై యోగా చేసి నిరసన తెలిపారు. నరసరావుపేట, మాచర్లలో సమైక్యాంధ్ర కోసం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేటలో 1000 మంది ఆర్యవైశ్యులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. రేపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మేళ్లవాగులో ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ప్రదర్శన జరిగింది. గుంటూరు నగరంలో ... ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్లో రోడ్డుపై బట్టలు ఉతికి రజకులు నిరసన తెలిపారు. ఇంటర్‌బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద ‘విభజన వాద సంహారం’ పేరుతో జూనియర్ కళాశాలల అధ్యాపకులు రోడ్డుపై లఘునాటిక ప్రదర్శించారు. విభజనవాదులను భరతమాత కాళికాదేవి అవతారంలో ఆగ్రహించి సంహరించినట్లు చూపారు. ప్రభుత్వ పాఠశాలలఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హాస్టళ్లకు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థినులను ఇళ్లకు పంపారు. విద్యా సంస్థల బంద్ సందర్భంగా విద్యార్థి జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బుడంపాడులోని గుంటూరు చానల్లో జలదీక్ష చేశారు. -
మరో సమిధ
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : విభజన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురై ఆర్టీసీ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సోమశేఖర్రాజు (54) బుధవారం బస్‌స్టేషన్ ప్రాంగణంలో పత్రికలో విభజన వార్తలను చదువుతూ తీవ్ర ఉద్వేగానికి లోనై తుదిశ్వాస విడిచారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ మృతిని మరచిపోకనే సోమశేఖర్రాజు తనువు చాలించడం జిల్లా వాసులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. సౌమ్యుడు, స్నేహశీలి సోమశేఖర్రాజు సోమశేఖర్రాజు స్వస్థలం గూడూరు. విధి నిర్వహణలో అంకిత భావం, నిబద్ధతతో పనిచేస్తూ అంచెలంచెలుగా పదోన్నతి పొంది ప్రస్తుతం జోనల్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ విభాగంలో ట్రాఫిక్ టికెట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల మన్ననలు అందుకోవడంతోపాటు సహ ఉద్యోగులు, కార్మికులతో స్నేహంగా మెలిగేవారు. సహృదయుడు, స్నేహశీలి అయిన సోమశేఖరరాజు మృతి పలువురు కార్మికులు, అధికారులను కలచివేసింది. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు : నిద్రావస్థలో ఉన్నట్టుగా పడిఉన్న సోమశేఖర్రాజు మృతదేహాన్ని చూసి ఆయన భార్య,బిడ్డలు కన్నీరుమున్నీరయ్యారు. పైకి లేవమని కోరుతూ భార్య, కుమారుడు తట్టితట్టి లేపడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. పలువురు నివాళి : ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖర్రాజు మృతదేహాన్ని ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్ఎం చింతా రవికుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు, ఎన్జీఓ సంఘ నాయకులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. భౌతికకాయానికి ఊరేగింపు... : మరో సమిధనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల వరకు రాజు మృతదేహాన్ని ఊరేగించారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జోహార్లర్పించారు. ఎన్జీఓల ప్రతిన : సోమశేఖర్రాజు మృతి సమాచారం తెలుసుకున్న ఎన్జీఓలు అధికసంఖ్యలో మోటార్ సైకిళ్లలో ఎన్జీఓ భవన్ నుంచి బస్‌స్టేషన్ ప్రాంగణానికి చేరుకున్నారు. జోహార్ సోమశేఖర్రాజు, జై సమైక్యాంధ్ర నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. సోమశేఖరరాజు ఆత్మార్పణను వృథా కానివ్వబోమని, ఆయన ఆశయ సాధన కోసం విశ్రమించకుండా పోరాటం సాగిస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, శామ్యూల్, మహబూబ్, రమణరాజు, పెంచలరెడ్డి, ఏఎస్ఆర్ కుమార్, ఏవీ గిరిధర్, రమేష్‌రెడ్డి, శేఖర్, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు. -
రోగులపై సమ్మెట
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం రోగులపైనా తీవ్రంగా ఉంటోంది. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమ్మెలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సమ్మె ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇక్క డ వైద్యులు, మినిస్టీరియల్ సిబ్బంది, చివరకు కాంట్రాక్టు ఉద్యోగులు సైతం సమ్మె బాట పట్టారు. దీనివల్ల వైద్య సేవలు మృగ్యమవుతున్నాయి. బుధవారం ఆస్పత్రి రోగులతో కిక్కిరిసింది. ప్రధానంగా ఓపీ విభాగంలో భారీ రద్దీ కన్పించింది. బాలింతలు, గర్భిణులు, మహిళలు తమ పిల్లలను ఎత్తుకుని క్యూలో గంటల కొద్దీ నిరీక్షించారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతి రోజూ ఉదయం తొమ్మి ది నుంచి 10 గంటల వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తోంది. దీనివల్ల రోగు లు ముందుగా ఓపీ చీటీలు తీసుకున్నా గంటల కొద్దీ వేచివుండక తప్పడం లేదు. ఈ క్రమంలో కొందరు క్యూలోనే సొమ్మసిల్లిపోతున్నారు. ప్రస్తుతం విషజ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో ఓపీ నంబర్ 2, 3లలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ రోగులకు చికిత్స చేసేందుకు ఐదుగురు వైద్యులు కూడా లేరు. దీంతో భారమంతా ఆస్పత్రి సూపరింటెండెంట్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, అసోసియేట్ ప్రొఫెసర్లు భీమసేనాచార్, మోహన్‌రావు తదితరులపై పడుతోంది. ఓపీ పూర్తయ్యేలోపు మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. ఇక ఓపీ నంబర్ -6లో గర్భిణుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఒక వైద్యురాలిని మాత్రమే అందుబాటులో ఉంచా రు. ఆమె అన్నీ చూసుకోవాల్సి వస్తోం ది. వాస్తవంగా ఆస్పత్రిలో అత్యధిక సంఖ్యలో వైద్యులుండే యూనిట్ గైని క్ వార్డే. అయితే, వైద్యులు సమ్మె బాట పట్టడంతో ఓపీ సేవలు ఆలస్యమవుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రభా వం వల్ల వైద్య పరీక్షలకు సైతం భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఈ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తక్కువ సంఖ్యలో ఉండడంతో సకాలంలో వైద్యపరీక్షలు పూర్తి కావడం లేదు. 150 మంది చిన్నారులు... ముగ్గురు సిబ్బంది ఇమ్యునైజేషన్ విభాగంలో తక్కువ సిబ్బంది కారణంగా వైద్యసేవల్లో జాప్యం జరుగుతోంది. బుధవారం రోజున టీకాలు వేస్తుండడంతో 150 మందికిపైగా చిన్నారులను తీసుకొస్తున్నారు. వీరికి సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు మాత్రమే టీకాలు వేయాల్సి వస్తోంది. దీనివల్ల గంటల కొద్దీ ఆలస్యమవుతోంది. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోనే పరిస్థితి ఇలా వుంటే... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీలు)లో ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ సేవలు మరింత నామమాత్రంగా ఉండడంతో అధిక శాతం మంది జిల్లా కేంద్రానికి వస్తున్నారు. -
నాయకుడొచ్చాడు
సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని, ఓట్లు...సీట్లకోసం రాష్ట్ర విభజన చేయరాదంటూ ఉద్యమిస్తున్న సమైక్యవాదుల మనోస్థైర్యం పెరిగింది. చిత్తశుద్ధితో పోరాటం చేయగల నాయకుడు లేరనే లోటు తీరింది. ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నా సమర్థవంతంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకున్నామనే భావన తొలగిపోనుంది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్దిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకోగలరనే భరోసాను ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతోంది. 57రోజులుగా అలుపెరగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు. ఎంతటి కష్టనష్టాన్ని భరించేందుకైనా వెనుకంజ వేయడంలేదు. జీతం కంటే జీవితం ముఖ్యమని ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన రాజకీయపార్టీలు ఓట్ల కోసం డొంకతిరుగుడు వ్యవహారాలు నడుపుతున్నారు. పదవుల్లో ఉంటే ప్రాంతం కోసం ఉద్యమించేందుకు వీలుంటుందని, అందుకోసమే కొనసాగుతున్నామని ఉచిత సలహాలిస్తున్నారు. ప్రాంతం కంటే రాజకీయాలే మిన్నగా భావిస్తూ కాలం నెట్టుకొస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల తీరును సమైక్యవాదులు నిరసిస్తున్నారు. రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజన ఏర్పడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఎడారిగా మారుతాయని, అందరికీ అనువైన హైదరాబాద్ ఒక ప్రాంతానికే పరిమితం అవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జైల్లో ఉంటూ ఆమరణదీక్షను సైతం చేపట్టారు. ఈపరిస్థితుల్లో బెయిల్‌పై ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల కావడాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు. ఈ మేరకు సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కలిసి ఉద్యమం ఉధృతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. రాజకీయ సంక్షోభంపైనే దృష్టి.... రాష్ర్ట విభజనలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి ఇప్పటికే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మంత్రులు రామచంద్రయ్య, అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసీరెడ్డిలపై సమైక్యవాదులు తీవ్ర స్థాయిలో విరుచుకుబడ్డారు. ఎమ్మెల్యే కమలమ్మ, ఎమ్మెల్సీ బత్యాలకు సైతం సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన తప్పలేదు. ఉద్యమం బలపడే కొద్ది కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ రాజీనామా చేయాలని తద్వారా రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై కూడా ఉద్యమకారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్సార్సీపీలాగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాలని కోరుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతోనే విభజన ప్రకటన ఉత్పన్నమైందని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే, మలిముద్దాయి తెలుగుదేశం పార్టీనే అని పేర్కొంటున్నారు. జగన్ విడుదలతో మనోస్థైర్యం.... రాష్ట్ర విభజన అనివార్యం కానుందని, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సమైక్యవాదులు మదనపడుతున్నారు. సమైక్యరాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఒక్కమారుగా సమైక్యవాదుల్లో మనోస్థైర్యం పెరిగింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రత్యక్షంగా పోరాటం చేయగలిగిన, ప్రజాదరణ కల్గిన బలమైన నాయకుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. బలమైన నాయకత్వం లేని కారణంగానే, రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైందని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. ఈనేపధ్యంలో ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల కావడాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం తనను కలిసేందుకు వచ్చారని తెలుసుకుని ముందుగా వారిని జగన్ ఆహ్వానించడాన్ని ఈసందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా
సాక్షి, రాజమండ్రి :ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే కొందరు సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. అటువంటి ఉల్లంఘనను అడ్డుకునే చర్యలను బుధవారం రాత్రి నుంచి సమైక్యవాదులు చేపట్టారు. జిల్లాలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను నిలువరించే చర్యలను జేఏసీ చేపట్టింది. ఉద్యోగ, ఆర్టీసీ జేఏసీలు, ఏపీ ఎన్జీఓలు ఇతర ఉపాధ్యాయ వర్గాలు రాత్రి హైదరాబాద్ వెళ్లే సర్వీసులను ఎక్కడికక్కడ నిలువరించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో జాతీయ, ఇతర ప్రధాన రహదారులపై బస్సులను అడ్డగించారు. బస్సుల టైర్లలో గాలి తీసేశారు. సమైక్యవాదులై ఉండి సమైక్య ద్రోహులుగా వ్యవహరించ వద్దని హితవు పలికారు. జిల్లా నుంచి సుమారు 45 బస్సులు రోజూ హైదరాబాద్‌కు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఇవే కాకుండా వైజాగ్ నుంచి 25 బస్సులు రాజమండ్రి మీదుగా రాజధాని వెళుతున్నాయి. మరో 20 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి అనధికారికంగా తిప్పుతున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఈ బస్సులు 3200 నుంచి 3600 మంది ప్రయాణికులను హైదరాబాద్ చేరవేస్తున్నాయి. సాధారణ రోజుల్లో బస్సు తరగతిని బట్టి రూ. 450 నుంచి రూ. 850 వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె కారణంగా రూ.850 నుంచి రూ.1200కి పైగా చార్జీ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. -
రామచంద్రపురం ఎమ్మెల్యేకు సమైక్య సెగ
జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు సమైక్య సెగ తగిలింది. మంగళవారం ఆయన రామచంద్రాపురం నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వా మిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో బయలుదేరారు. ఆయన ప్రయూణిస్తున్న కారు దేవులపల్లి చేరుకోగా, బంద్ చేస్తున్న సమైక్యవాదులు, ఎన్జీవోలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి సమైక్యవాదుల వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజన విషయం తెలియగానే తాను స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపించానని, కావాలంటే దానికి సంబంధించిన కాపీలు కారులోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆందోళనకారులకు తెలియజేశారు. వాటిని చూపిస్తానని, తాను కూడా సమైక్యవాదినేనని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అందోళనలో కొద్దిసేపు పాల్గొన్నారు. సమైక్యవాదులు రెండు మోటారు సైకిళ్లు సమకూర్చడంతో వాటిపై అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి, తరువాత మరో వాహనం ఎక్కి మద్ది ఆంజనే యస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. -
ఎస్ఏ పదోన్నతుల తిర‘కాసు’
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల వ్యవహారంలో తిర‘కాసు’ చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ముడుపులు దండుకునేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పదోన్నతుల కల్పించాలని సిబ్బంది కోరుతున్నా అధికారులు పట్టించుకోకుండా ఏడాదికిపైగా పెండింగ్ ఉంచారు. ఇప్పుడు సమ్మె సమయంలో ఫైల్ సిద్ధం చేయడం వెనుక పెద్ద కథ నడిచిందంటున్నారు. పరిపాలన విభాగంలో ఈ ఫైలును చూడాల్సిన సీ-1 క్లర్క్ కూడా సమ్మెల్లో ఉన్నప్పటికీ, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ద్వారా ఫైలు సిద్ధం చేయించినట్లు తెలిసింది. పదోన్నతులు కల్పించేందకు రంగం సిద్ధం చేశాము. ఇందుకు ముడుపులు ముట్టజెప్పాలని తన సన్నిహితుల ద్వారా అర్హులైన వారికి సమాచారం అందించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితేబ జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఏడాది నుంచి ఏదో ఒక వంక చెబుతూ దీనిని పెండింగ్‌లో ఉంచారు. దీనికితోడు ఆరు నెలల కిందట ఇవ్వాల్సిన చార్జ్‌మెమోలను తొక్కి పెట్టి పదోన్నతులు కల్పించే సమయంలో దానికి బయటికి తీసుకొచ్చారు. దీంతో మరోమారు పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో సిబ్బంది సమ్మెలోకి వెళ్లిన సిబ్బంది పదోన్నతులపై ఆశలు వదులుకున్నారు. అయితే ఉన్నఫళంగా అధికారులు పదోన్నతుల కల్పించేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించారు. సమ్మె సమయంలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సిద్ధపడడాన్ని ఉద్యోగవర్గాలే తప్పుపడుతున్నాయి. ఓ అధికారి బాధ్యతలు ఈ నెలతో ముగుస్తుండడంతో, ఈలోగా పదోన్నతులు కల్పించి తన వరకు సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారానికి తెరతీసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. -
బంద్ విజయవంతానికి సహకరించాలి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: విభజనకు నిరసనగా మంగళవారం తలపెట్టిన రాష్ట్రబంద్ విజయంతానికి అన్ని వర్గాలు సహకరించాలని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రవీంద్రబాబు పిలుపు నిచ్చారు. బంద్‌కు ప్రజలను సమాయత్తం చేసేందుకు సోమవారం రాత్రి ఆటోల్లో మైకు ప్రచారం, మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఎన్జీఓ భవన్ వద్ద ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటల నుంచే జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాణిజ్య, వర్తక వర్గాలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. విద్యా సంస్థల బంద్ యథాతథంగా కొనసాగుతుందన్నారు. బుధ, గురువారాల్లో ట్రావెల్స్ వాహనాల బంద్ నిర్వహిస్తామన్నారు. శుక్ర, శనివారాల్లో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. మోటారు సైకిళ్ల ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సుధాకరరావు, శ్రీకాంత్, శేఖరరావు, సతీష్, శివప్రసాద్, వెంకమరాజు, ఆంజనేయవర్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బంద్ వైఎస్సార్సీపీ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. విజయవంతం చేసేందుకు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్పంచుకోవాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ పాటించనున్నాయి. ప్రైవేట్ వాహనాలతో పాటు ఆటోలు కూడా నిలిచిపోతుండటంతో బంద్ సంపూర్ణం కానుంది. 18, 44వ జాతీయ రహదారులతో పాటు, జిల్లాలోని ప్రధాన రహదారుల దిగ్బంధించనుండటంతో రాకపోకలు స్తంభించనున్నాయి. కర్నూలులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మూడు బృందాలుగా విడిపోయి బంద్‌ను పర్యవేక్షించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్, కో-చైర్మన్ సంపత్‌కుమార్, కోశాధికారి శ్రీరాములు తెలిపారు. బంద్‌ను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు.. ప్రజాసంఘాలు సహకరించాలని ఆయన కోరారు. -
తవ్వుకో.. అమ్ముకో!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది కేంద్రంగా ఇసుక మాఫియా విజృంభిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలో ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇసుక రీచ్‌లను అధికారికంగా ఎవరికీ అప్పగించకపోవడంతో జేసీబీ ఓనర్లు మొదలుకొని లారీలు, ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా తుంగభద్ర ఇసుకను తరలించకుపోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గత నెలరోజులుగా సాగుతున్న ఈ అక్రమ ఇసుక రవాణా ఇటీవలికాలంలో ఎక్కువవడంతో విజిలెన్స్ అధికారులు శనివారం సర్వసాధారణంగా జరిపిన దాడిలో 9 లారీలు పట్టుబడ్డాయి. అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఉంటే ప్రతిరోజు వందలాది లారీలు, ట్రాక్టర్లు తుంగభద్ర నదీ తీరంలో అడ్డంగా దొరికిపోతాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. తుంగభద్ర నదీ తీర గ్రామాలైన పంచలింగాలతో పాటు మునగాలపాడు నుంచి నిత్యం లారీల్లో అక్రమంగా ఇసుక తరలుతోంది. ఇక్కడి స్థానికులే ఈ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులు. సాధారణంగా ప్రభుత్వ రాయల్టీ చెల్లిస్తేతప్ప ఇసుక రవాణాకు అవకాశం ఉండదు. కానీ పంచలింగాలలో కొందరు అక్రమార్కుల వద్ద పదికి పైగా జేసీబీలు ఉన్నాయి. వీటి ద్వారానే ఇసుకను లారీల్లో నింపి హైదరాబాద్, శంషాబాద్, కడప వంటి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 50 లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం. విషయం అధికారులకు తెలిసినా అక్రమార్కులను ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతి పొందితే ఒక్కో లారీకి(17 టన్నులు) ప్రభుత్వ రాయల్టీ కింద రూ.4వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రీచ్‌లలో ఎవరికీ అనుమతి లేకపోవడంతో రాయల్టీ కూడా అక్రమార్కులకు మిగిలిపోతోంది. ఈ లెక్కన ప్రతిరోజూ సుమారు రూ.2 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పూర్తిగా అక్రమ రవాణా కావడంతో 17 టన్నుల లారీలో అంతకు మించి ఇసుకను తరలిస్తున్నా అడ్డుకునే అధికారులు లేకుండాపోయారు. దీంతో ఇసుకాసురులు ఒక్కో లారీలో దాదాపు 20 నుంచి 50 టన్నుల మేర రవాణా చేస్తూ దానిని రూ.50 వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం గమనార్హం. తరులుతోందిలా... ప్రతి రోజూ తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటలు, రాత్రి 10 నుంచి 1 గంట వరకు నగరంలోని సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారి ఇసుక ట్రాక్టర్ల మోతతో మారుమ్రోగుతోంది. ప్రస్తుతం నదిలో నీరు తగ్గడంతో పూడూరు, పంచలింగాల గ్రామాల్లో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను నది నుంచి తోడేసి పంచలింగాల, మహబూబునగర్ జిల్లా సరిహద్దు గ్రామమైన పుల్లూరు సమీపంలో భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి నుంచి జేసీబీల సహాయంతో ప్రతి రోజు కనీసం 30 నుంచి 40 లారీలకు పైగానే హైదారబాద్కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కలిసొచ్చిన ఉద్యోగుల సమ్మె జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అయితే ఈ మొబైల్ టీంలు నదికి వరద నీరు రావడంతో తనిఖీలు చేయడం లేదు. రెవెన్యూలోని అధికారులంతా సమ్మెలో ఉండగా ఇద్దరు వీఆర్వోలు మాత్రం ఆన్ డ్యూటీ అంటూ రెండు వారాల క్రితం వరకు ఇసుకాసురుల నుంచి భారీగా అక్రమ వసూళ్లు చేశారు. ఇక రాత్రి విధుల్లో ఉండే పోలీసులు వాహనాలను నిలిపి ఒక్కో ట్రాక్టర్ కు రూ.500 ప్రకారం వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. నాల్గో పట్టణ పోలీసు స్టేషన్లో పని చేసే ఇద్దరు హోంగార్డులు రాత్రయితే చాలు జాతీయ రహదారిపై నిలబడి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 9 లారీలు సీజ్ శనివారం రాత్రి పంచలింగాల సమీపంలో డంపు చేసిన ఇసుకను లారీల్లో నింపుతున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా.. వారి రాకను పసిగట్టిన లారీ డ్రైవర్లు, కూలీలు పరారయ్యారు. అక్కడ ఇసుక నింపుకుంటున్న 3 లారీలను అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి నుంచి అంతకు ముందే 6 లారీలు కడపకు బయలుదేరిన సమాచారం స్థానికులు ఇవ్వడంతో ఓర్వకల్లు మండల సమీపంలో వాటిని వెంబడించి పట్టుకుని సీజ్ చేశారు. డంపు దగ్గరున్న వాహనాలను అక్కడి నుంచి తరలించడం కోసం విజిలెన్స్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. -
సమైక్య గర్జన
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా సింహపురి వాసులు సింహాలై గర్జించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ దద్దరిల్లేలా నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమాలతో నెల్లూరు దద్దరిల్లింది. 54వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. నెల్లూరులో బలిజ, తెలగ, కాపు సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన పేరుతో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బలిజ సంఘీయులు సమైక్యవాణి వినిపించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ పొట్టిశ్రీరాములు విగ్రహం, కనకమహల్ సెంటర్, గాంధీబొమ్మ మీదుగా వీఆర్సీ వరకు సాగింది. ర్యాలీలో శ్రీకృష్ణదేవరాయలు తదితర వేషధారణలో ఉన్న వ్యక్తులు ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముస్లింలు కోటమిట్ట నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరాహారదీక్షలో కూర్చున్నారు. వీరి కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలేదీక్షలు కొనసాగాయి. గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగించారు. వీఆర్సీ సెంటర్లో సోనియా దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు దహనం చేశారు. పొదలకూరురోడ్డులోని నేతాజీనగర్ వాసులు వాటర్‌ట్యాంకు సెంటర్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో యాదవ శంఖారావం జరిగింది. స్థానిక అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీకృష్ణుడు వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయగిరి బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్ష కొనసాగించారు. సీతాతామపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగించడంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ, దుత్తలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. వరికుంటపాడులో వెంగమాంబపురం వివేకానంద యూత్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు రిలేదీక్ష చేశారు. జేఏసీ నాయకులు గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు ఆత్మకూరు నుంచి పెంచలకోన వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్ విగ్రహ కూడలిలో చేనేత కార్మికులు రోడ్డుపైనే మగ్గం నేశారు. కావలిలో ఉద్యోగులు, ఆర్టీసీ, సమైక్యాంధ్ర జేఏసీలు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీకాకుళం అరబన్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ పాత శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీ(కలెక్టర్ బంగ్లా) వాసులు డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాలనీలో ఆదివారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో పాల్గొన్న మహిళలు, చిన్నారులు, యువకులు సమై క్య నినాదాలు వినిపించారు. రాష్ట్రం కలసి ఉంటేనే అభివృద్ధి పథంలో పయనిస్తుం దని పేర్కొన్నారు. ర్యాలీలో కాలనీవాసులు ఎం. శ్రీనివాసరావు, పొట్నూరు వెంకట్రావు, కర్నాయిన హరి, డి.మాధవరావు, ఉమామహేశ్వరరావు, బి.గిరి, కిరణ్, బాబీ, శంకర్ పట్నాయక్, రామచంద్రరావు, నాగేశ్వరరావు, ఎల్.రామారావు పాల్గొన్నారు. -
మహా సంకల్పం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ఉద్యమమే ఊపిరిగా జిల్లా ప్రజలు అలుపెరుగని సమరం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర తప్పా మరో ప్రత్యామ్నాయం లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు... ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు కదం తొక్కుతుండడంతో ‘సమైక్య’ సమరం ఉవ్వెత్తున సాగుతోంది. 54వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. అనంతపురంలో జాక్టో నేతలు దీక్షలు కొనసాగిస్తూనే.. చెవిలో పూలు పెట్టుకుని, బూట్లు శుభ్రం చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే వేపాకు మండలతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ఎన్జీఓలు, పంచాయితీరాజ్, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24న జిల్లాలో తలపెట్టిన మహా మానవహారం విజయవంతం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో వివిధ సంఘాల జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బహుజన మేధావుల సదస్సు నిర్వహించి.. ఉద్యమానికి మద్దతు పలికారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన సర్పంచులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ప్రభుత్వానికి పంపారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏన్టీయూ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. మడకశిరలో విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రోడ్డుపైనే చదువులు కొనసాగించారు. అమరాపురంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి... కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ధర్మవరంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే యజ్ఞం చేశారు. ధర్మవరంతో పాటు బత్తలపల్లి, ముదిగుబ్బ, ఆత్మకూరు, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, పెనుకొండ, పామిడి, గుత్తి, రొద్దం, పరిగి, కణేకల్లులో సమైక్యవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి. గుంతకల్లులో వేలాది మంది వాల్మీకులు గర్జించారు. ర్యాలీ, బహిరంగసభతో ‘సమైక్య సింహ గర్జన’ చేశారు. జేఏసీ నేతలు రోడ్డుపైనే మిరపకాయలు, బజ్జీలు విక్రయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు రిలేదీక్షలను కొనసాగించారు.లేపాక్షిలో సోమవారం తలపెట్టిన ‘బసవన్న రంకె’ సభకు సర్వం సిద్ధం చేశారు. హిందూపురంలో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు బడిత పూజ చేశారు. కదిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24న నిర్వహించనున్న మహా మానవహారంపై కదిరి డివిజన్లోని అన్ని మండలాల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చెవిలో పూలు, పొర్లు దండాలు, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎరుకల కులస్తులు, న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. ఓడీసీలో జేఏసీ నేతలు రాస్తారోకో చేపట్టారు. కొత్తచెరువులో రిటైర్డ్ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ, పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. పెనుకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లిలో సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ నేతలు గడ్డితింటూ నిరసన తెలిపారు. పరిగిలో జేఏసీ నేతలు ఈలలు వేస్తూ ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, రాజకీయ జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. క్లబ్ హోటల్ రామయ్య ఉచితంగా టిఫిన్ పెట్టారు. మేదర్లు రోడ్డుపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. కణేకల్లులో కుమ్మర్లు కుండలు చేస్తూ నిరసన తెలిపారు. నార్పలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. సోనియా, షిండే, దిగ్విజయ్, కేసీఆర్ మాస్కులు ధరించిన వ్యక్తులను కొరడాలతో కొడుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థులు రిలేదీక్షలు చేశారు. మహిళా ఉద్యోగులు గాలిపటాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పెద్దపప్పూరులో జాతీయపతాకంతో జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. యాడికిలో రాయలచెరువు, యాడికి గ్రామనౌకర్లు రిలేదీక్షలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కూడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి. -
రాష్ట్ర విభజన వద్దు
భోగాపురం, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన నిర్ణయూన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం భోగాపురం, డెంకాడ మండలాల పాత్రికేయులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజీఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు జంపన రవివర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. వీరికి ఎన్జీఓ సంఘ నాయకులు కొమ్మూరు దుర్గారావు, సంఘ ఉద్యోగులు సీహెచ్‌ఆర్‌కె రాజు, డీసీసీబీ అధ్యక్షుడు సుందర గోవిందరావు, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు, హెచ్‌డీటీ భాస్కరరావు, ఆర్ఐ పిట్ట అప్పారావు తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం పాత్రికేయులంతా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎస్బీఐ కూడలి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు ఎం.రామారావు, పల్లి శ్రీను, పైల శ్రీను, ఏలూరు రమణ, ఎం.కుసరాజు, రవితేజ, సవరవిల్లి శంకరరావు, పోతిరెండి గోపి, ఏకాంబరం, రమేష్, అట్టాడ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రణభేరి విజయవంతానికి కృషి
రాయచోటి, న్యూస్‌లైన్ : ఈ నెల 26న నిర్వహిస్తున్న రాయచోటి రణభేరి సభ విజయవంతానికి అందరూ సమష్టి కృషి చేయాలని సమైక్యాంధ్ర అధికార జేఏసీ కన్వీనర్, కడప ఆర్డీఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మార్సీ భవనంలో రాయచోటి - లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లోని అన్ని మండలాల సమైక్యాంధ్ర అధికార, అనధికార జేఏసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజనను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆందోళనకు దిగడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈనెల 26వ తేదీన రాయచోటి ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణంలో రాయచోటి రణభేరి కార్యక్రమాన్ని నిర్వహింప తలపెట్టామన్నారు. రణభేరి సభ నిర్వహణ కు అవసరమైన ఏర్పాట్ల కోసం 20 కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ, స్టేజీ నిర్మాణం, భోజనం, తాగునీటి వసతుల కల్పన తదితర విషయాలకు ప్రత్యేక కమిటీలు వేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రణభేరి సభ విషయమై పట్టణంతో పాటు గ్రామీణప్రాంతాల్లో సైతం జోరుగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామాలలోని డీలర్లు, వీఆర్ఓలు, డ్వాక్రా, అంగన్వాడీల మహిళలు తదితరులు ఇంటింటికి వెళ్లి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సభ విషయంపై విసృ్తతంగా ప్రచారం చేయడం, అన్ని వర్గాల ప్రజలను రణభేరికి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సమైక్యవాదులపై ఉందన్నారు. రణభేరికి ముఖ్య అతిధులుగా ఏపీఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, గజల్ శ్రీనివాస్, వంగపండు ఉష, రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, సత్యవాణి తదితరులు హాజరై ప్రసంగిస్తారన్నారు. కార్యక్రమంలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లి, సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు మండలాలకు చెందిన అధికార, అనధికార జేఏసీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో పాటు మెప్మా, ఐసీడీఎస్, డ్వాక్రా, ప్రైవేటు స్కూల్స్ అండ్ కళాశాలల కరస్పాండెంట్లుతో పాటు రాయచోటి జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి, సభ్యుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.19 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ
ఏలూరు(ఆర్ఆర్ పేట) న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో మేముసైతం అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో జిల్లాలో ఆర్టీసీ సుమారు రూ.19 కోట్ల ఆదాయం కోల్పోయింది. పశ్చిమ రీజియన్ పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం డిపోల పరిధిలో రోజూ 640 బస్సులు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేవి. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.45 లక్షల ఆదాయం వచ్చేది. సమ్మె ప్రభావంతో జిల్లాలో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయూస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర అన్ని యూనియన్లు సమ్మెలో ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి ఆదివారం నాటికి 41 రోజులైంది. రోజుకి సుమారు రూ.45లక్షలు చొప్పున రూ.18.50 కోట్లకుతోడు రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే ఈ ఏడాది జులై 30న జిల్లా బంద్ కారణంగా పూర్తిగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో సుమారు రూ. 19 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ పశ్చిమ రీజియన్ కోల్పోయింది. -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సివిల్ సప్లయీస్‌కు సంబంధించిన 15 మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్ఎస్) పాయింట్లలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సంబంధిత ఇన్చార్జిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతం హెచ్చరించారు. గోడౌన్లో సరుకుల రవాణాకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని శనివారం సాక్షి లో ‘అడిగేవారు లేరు.. దోచేద్దాం!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జాయింట్ కలెక్టర్ స్పందించారు. సివిల్ సప్లయీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు సరఫరా అయ్యే సరుకులకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కాటా ద్వారా వేమెంట్ వేసి డీలర్లకు అప్పగించాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించని గోడౌన్ ఇన్చార్జిలను సస్పెండ్ చేస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నగర శివారు కొత్తూరులోని ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఆయన సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌లోని సరుకుల నిల్వ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్ల వద్ద తూకాలు వేసి సరుకులు ఇవ్వకపోవడంతో డీల ర్లు, అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. గోడౌన్ల వద్ద తూకాలు వేసి సరుకులు ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీలర్ల కు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సరుకులను ఈనెల 30 తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొ త్తూరు స్టాక్ పాయింట్‌కు పామాయిల్ సత్వరమే సరఫరా చే యాలని సివిల్ సప్లయీస్ డీఎంను ఆదేశించారు. రేషన్‌షాపుల డీలర్లు త్వరితగతిన డీడీలు కట్టాలన్నారు. కొత్తూరు గోడౌన్లో రెండు నెలలకు సంబంధించి చక్కెర నిల్వల్లో ఉన్న తేడాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారుల ను ఆదేశించారు. సివిల్ సప్లయీస్ డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీ వాకాడు: వాకాడులోని పౌరసరఫరాల గిడ్డంగిని శనివారం ఆ శాఖ వి జిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అ నంతరం గిడ్డంగిలో ని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డీఎం ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 15పౌరసరఫరాల గిడ్డంగులున్నాయన్నారు. అందులో పదింటికి సొంత భవనాలు ఉ న్నాయని, మరో 5 గిడ్డంగులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. అయితే జిల్లాలో ఎక్కడా అవకతవకలు జరగకుండా అరికట్టేందుకు తమ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ పరిశీలనలో ఎలాంటి అవకతవకలు లేవని ఆయన అన్నారు. ఈయన వెంట అసిస్టెంట్ మేనేజర్ పుల్లంశె ట్టి, డీటీ మాధవరావు ఉన్నారు. -
రాజీనామాలతో విభజన ఆగుతుంది
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగుతుందని వైద్య ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఇజ్రాయిల్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రాస్పత్రి ఆవరణలో సమైక్యాంధ్ర పేర్లు రాసిన బెలూన్లను ఎగుర వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విభజన వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు .. ఒకే భాష ఒకే రాష్ట్రం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలు ఆందోళనల పేరుతో రోడ్డెక్కుతున్నా సీమాంధ్ర ప్రాంత పాలకులు, ఢిల్లీ పెద్దలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు సోనియా భజన మానుకుని ఉద్యమానికి మద్దతుగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకపోతే ప్రజలే తగిన సమయంలో నాయకులకు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వెంకటే్‌ష్, డాక్టర్ సత్యశ్రీనివాస్, డాక్టర్ ఫరిదుద్దీన్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ త్రినాథ్, వైద్య ఉద్యోగుల సంఘ నాయకులు బాలాజీ, ఉమాపతి, డి.త్రినాథ్, కిల్లాడి రాము, బాలాజీ ప్రాణిగ్రాహి, సుహాసిని, జయ, సుజాతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
అడిగేవారు లేరు... దోచేద్దాం!
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం అక్రమార్కులకు వరంగా మారింది. పౌరసరఫరాల శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఉద్యమంలో పాల్గొనడంతో ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో దోపిడీ పంజా విసురుతున్నారు. జిల్లాలోని మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్ఎస్) పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో మొత్తం 15 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది నగరానికి సమీపంలో కొత్తూరులో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్. ఈ పాయింట్ పరిధిలో 265 రేషన్ షాపులు ఉన్నాయి. నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని చౌకదుకాణాలకు 2,129 మెట్రిక్ టన్నుల బియ్యం, 65 టన్నుల పంచదార, 144 టన్నుల పామాయిల్‌తో పాటు అమ్మహస్తం సరుకులు సరఫరా అవుతున్నాయి. అవినీతి జరుగుతుంది ఇలా.. జిల్లాలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అవుతుంటాయి. ఎఫ్‌సీఐ నుంచి వచ్చే ప్రతి బస్తాను తూకం వేసి పంపుతారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ చౌకదుకాణాలకు వెళ్లే బియ్యం బస్తాలను తూకం వేసి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇక్కడ చేపట్టడం లేదు. రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యంలో బస్తాకు కనీసం 2 నుంచి 3 కిలోలు లోడేస్తున్నారు. దీని వల్ల డీలర్లకు నష్టం వస్తున్నా.. ఏం చేయలేని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే కొందరు అధికారులకు ‘మేము పంపాలి’ కదా అంటూ గోడౌన్ ఇన్చార్జి చెబుతుంటారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పేరు చెప్పి గోడౌన్ ఇన్చార్జి బహిరంగంగా అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 15 స్టాక్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,872 రేషన్ షాపులకు 11,246 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,500 లారీల ద్వారా రేషన్ షాపులకు బియ్యం సరఫరా అవుతున్నాయి. మొత్తం మీద ప్రతి నెల 6 వేల బస్తాలకు పైగా బియ్యం పక్కదారిపడుతున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.75 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. ఈ తరుగు నష్టం చివరకు లబ్ధిదారుల మీదనే పడుతుంది. డీలర్లు లబ్ధిదారులకు సరఫరా చేసే సరుకుల్లో తూకాల్లో మోసం చేసి తరుగు నష్టాన్ని డీలర్లు పూడ్చుకుంటున్నారు. అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో.. రేషన్ షాపులకు ఇచ్చే అలాట్మెంట్లో డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు, గోడౌన్ ఇన్చార్జి ‘అయిన వారికి ఆకుల్లో..కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉంటూ నచ్చిన వారికి అలాట్మెంట్ ఎక్కువ, నచ్చని వారికి అలాట్మెంట్ తక్కువ చేస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. ర్యాప్, టాప్ కూపన్లకు సంబంధించిన అలాట్మెంట్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి అలాట్మెంట్ ఉన్న డీలర్లుకు సరుకులు పంపకుండా, ర్యాప్, టాప్ లేని కొందరు డీలర్లుకు పంపుతున్నట్లు డీలర్లు లబోదిబోమంటున్నారు. పంచదార, పామాయిల్ పంపిణీలోనూ... డిమాండ్ డ్రాఫ్ట్‌లు చెల్లించిన ప్రతి డీలరుకు పంచదార సరఫరా చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబరులో కేవలం 20 శాతం మంది డీలర్లకు పూర్తిస్థాయిలో పంచదార సరఫరా అయింది. మిగిలిన 80 శాతం మంది డీలర్లకు సంబంధించి కోటాలో 17 శాతం తగ్గించి పంపినట్లు డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాలాజీనగర్, పొదలకూరురోడ్డు, పోస్టాఫీస్ ఏరియా, నవాబుపేట వంటి ప్రాంతాల్లోని డీలర్ల్లకు ఇంకా పామాయిల్ చేరలేదు. దీంతో ఆయా ప్రాంతాల డీలర్లు వినియోగదారులకు ఏమి చెప్పాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. మా దృష్టికి రాలేదు ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల కొత్తగా బాధ్యతలను స్వీకరించాను. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకుంటాను. టి. ధర్మారెడ్డి, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్. -
సమ్మెలో.. సడేమియా
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు కార్పొరేషన్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. అయితే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగులు రహస్యంగా పనులు చేసి సొమ్ము దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా 37 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆ సంస్థ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఏపీఎన్జీఓలతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగ కూడదనే ఉద్దేశంతో శానిటేషన్, మంచినీరు, వీధిలైట్లకు సంబంధించి మాత్రమే ఉద్యోగులు పనిచేయాల్సి ఉంది. కార్పొరేషన్లో అడుగడుగునా అవినీతిమయం కావడంతో ఇక్కడి ఉద్యోగుల్లో కొందరు అత్యవసర పనులు కాకుండా ఇతర వాటికి సంబంధించి రహస్యంగా చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే సమ్మె ఉంటే మాకేంటి? మాపని మాది అని దురుసుగా సమాధానమిస్తున్నారు. సమ్మెను కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు తమకు అనుకూలంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్నారు. రహస్యంగా కాంట్రాక్టర్ల సేవలో తరిస్తూ వివిధ పనులకు సంబంధించిన బిల్లులను తయారు చేసి వారి నుంచి అధిక మొత్తంలో లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె ప్రారంభమైన మొదట్లో ఈ తతంగమంతా రాత్రివేళలో జరిగేది. ప్రస్తుతం వారంతా తమను ఎవరు ఏమీ అడగరని, ఎలాంటి ఇబ్బందులు లేవనుకుని పగలు కూడా అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో ఉన్న ఉద్యోగులంతా వీరు తీరుపై మండిపడుతున్నారు. తామంతా జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు మాత్రం అక్రమంగా సంపాదించుకునేందుకు ఇలా చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు రికార్డుల్లో సంతకాలు చేయకుండానే అనధికారికంగా విధులు నిర్వరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగమంతా అధికారపార్టీ నేతల ప్రోత్సాహంతోనే జరుగుతుందనే విమర్శలున్నాయి. నగర, రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ మరోవైపు రోడ్లు, కాలువల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులనే ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ సిబ్బందితో చేసిపెడుతూ పని కానిచ్చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు అత్యవసర సేవలు మినహా అనధికారికంగా, రహస్యంగా ఇతర పనులు చేస్తున్న వాటిని నిలిపివేసి సంబంధిత ఉద్యోగులను సమ్మెలో పాల్గొనేటట్టు చూస్తే బాగుంటుందని ఆ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. -
టీడీపీ సమైక్య ఉద్యమం
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయున్నున్నట్లు ఆ పార్టీ మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి తెలిపారు. మినీ బైపాస్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నగర కమిటీ సమావేశం జరిగింది. ముందుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో అశువులు బాసిన ఉపాధ్యాయుడు బీ శంకరయ్యయాదవ్‌కు నివాళులర్పించారు. రెండు నిమషాలు మౌనం పాటించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మైపాడు గేట్ సెంటరు నుంచి కనకమహల్, వీఆర్సీ, పెద్దబజార్, చిన్నబజార్, సంతపేట మీదుగా నర్తకి సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పాల్గొంటారని చెప్పారు. కార్పొరేషన్లో ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించిన విషయంపై టీడీపీ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయుకులు కార్పొరేషన్‌ను దోచుకుతింటున్నారని ఆరోపించారు. సమావేశంలో మండవ రామయ్య, తిరుమలనాయుడు, మున్వర్, శేషయ్య, బాషా, మురళీమోహన్, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, బాలాజీ, మహేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
మహా సక్సెస్
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 50 రోజులైన నేపథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బుధవారం 36 కిలో మీటర్ల మేర కడప ఔటర్ రింగురోడ్డు చుట్టూ ఏర్పాటుచేసిన మహా మానవహార కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వెల్లువెత్తింది. కడప నగరం నుంచే కాకుండా చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, సిద్ధవటం మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. యోగి వేమన విశ్వవిద్యాలయ విద్యార్థులతోపాటు వివిధ ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఈడీ తదితర వృత్తి విద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా కడప నగరంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి కదనోత్సాహంతో పాల్గొనడం విశేషం. ఎక్కడ చూసినా చిన్నారుల సందడే కనిపించింది. భారతమాత, తెలుగు తల్లి, అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు తదితర వేషధారణలతో ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర జెండాలు చేతబూని నినాదాలతో సందడి చేశారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు గెజిటెడ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ మతాలకు చెందిన పెద్దలు తమకు కేటాయించిన ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. రింగురోడ్డును ఐదు జోన్లుగా విభజించారు. జేఎంజే కళాశాల నుంచి మొదలుపెడితే రాయచోటి రోడ్డు, పులివెందుల రోడ్డు, ఆలంఖాన్‌పల్లె ఇర్కాన్ సర్కిల్, తిరుపతి రోడ్డు, జెఎంజె కళాశాల వరకు మహా మానవహారాన్ని నిర్వహించారు. దీంతో చిత్తూరు- కర్నూలు 18వ జాతీయ రహదారి, కడప- తిరుపతి, పులివెందుల, తాడిపత్రి ఎక్స్‌ప్రెస్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సివచ్చింది. రెఫరెండం జరపాలి- ఏజేసీ : రాష్ట్రాన్ని విభజించాలా, వద్దా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తొలుత రెఫరెండం నిర్వహించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛెర్మైన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మానవహారం కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెఫరెండం నిర్వహిస్తే అత్యధిక శాతం ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటారన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య పద్ధతి అని పేర్కొన్నారు. ప్రజాస్పందనను చూసైనా విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన రాజకీయ పార్టీలు వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. చేసిన తప్పిదాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర కోసం 50 రోజులుగా ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో సైతం కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయని, కానీ సమైక్య ఉద్యమంలో మాత్రం స్వల్ప సంఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పేదలకు అందడం లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టం కంటే ఇది చాలా స్వల్పమేనని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎస్మా, ఇతర నిర్బంధాలు ప్రయోగించాలని చూస్తున్నప్పటికీ జనం స్వచ్ఛందంగా ఉద్యమంలోకి తరలివస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించినందువల్లే ప్రజలు ఎక్కడికక్కడ నినదిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం.. డీఆర్ఓ సమైక్యాంధ్రను సాధించడం కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా ఉద్యమాలు నిర్వహిస్తామని డీఆర్ఓ ఈశ్వరయ్య అన్నారు. యాభై రోజులుగా వివిధ వర్గాల ప్రజలు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించే వరకు పోరుబాట వీడబోమన్నారు. ప్రభుత్వంలో చలనం కలిగించడానికి వివిధ రకాల ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రకటన వెలువడేవరకు ఉద్యమం. ఆర్డీఓ: సమైక్యాంధ్రప్రదేశ్ ప్రకటన వెలువడేవరకు ఉద్యమం ఆగబోదని కడప ఆర్డీఓ వీరబ్రహ్మయ్య అన్నారు. చిన్నపిల్లల మొదలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి తరలివస్తున్నారన్నారు. ప్రజా స్పందనను చూసైనా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తెలుగుజాతిని రెండుగా చీల్చే విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సోనియా స్పందించాలి.. జెడ్పీ సీఈఓ : సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని చూసైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించాలని జెడ్పీ సీఈఓ మాల్యాద్రి కోరారు. నాయకులెవరూ లేకుండానే లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని, బహుషా జాతీయోద్యమ కాలంలో కూడా ఇలా జరిగి ఉండదన్నారు. హైదరాబాద్‌తోనే భవిష్యత్తు.. డీఈఓ : హైదరాబాద్ లేకపోతే సీమాంధ్రుల భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య అన్నారు. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఫార్మా, రంగాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాజధానిని దూరం చేస్తే ఈ ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఉద్యోగులను నిందించడం తగదు.. ఎన్జీఓ అధ్యక్షుడు ప్రజాప్రతినిధులను ఎవరో కొందరు గట్టిగా నిలదీశారని, ఆ నేరాన్ని ఉద్యోగులపై మోపడం రాజకీయ నాయకులకు తగదని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. రాజీనామాలు చేయాలంటూ తమను ఎవరూ కోరలేదని ప్రజాప్రతినిధులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమాన్ని మరింత వేడెక్కించేందుకు ఈనెల 19, 20 తేదీలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామన్నారు. అలాగే 24వ తేదీ 13 జిల్లాల్లో రహదారుల దిగ్బంధనం జరుగుతుందన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను దిగ్బంధిస్తామన్నారు. ఈ నెల 30న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటసుబ్బయ్య, డీపీఆర్ఓ వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తి నాయుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉపాధ్యాయ విభాగం కన్వీనర్ జివి నారాయణరెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎస్విబి రాజేంద్రప్రసాద్, నాగముని, జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షుడు ఎం.వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన గుండెలు
రాజంపేట రూరల్/రైల్వేకోడూరు అర్బన్/ప్రొద్దుటూరు టౌన్ న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో గుండెలు పగులుతున్నాయి. రాజంపేటలో ఒకరు, రైల్వేకోడూరులో మరో యువకుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలిదానం అయ్యారు. రాజంపేట ప్రభుత్వ క్రీడామైదానంలో శనివారం జరిగిన రణభేరి సభలో చిట్వేలి మండలం మైలుపల్లెకు చెందిన లైన్మెన్ ఆర్.వెంకట్రావు(47) ఆకస్మికంగా మృతిచెందారు. జై సమైక్యాంధ్ర అంటూ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఆయనను వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులతో పరీక్షలు చేయించారు. వైద్యులు కూడా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు. నెల్లూరుజిల్లా గూడూరుకు చెందిన వెంకట్రావుకు బద్వేలుకు చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ గుండెపోటుతో మృతిచెందిన వెంకట్రావు కుటుంబానికి రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మేడా మల్లికార్జునరెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సభలోనే ప్రకటించారు. భావోద్వేగానికి గురై.. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగానికి గురై రైల్వేకోడూరుకు చెందిన ఉంగరాల రాకేష్(35) మృతిచెందారు. న్యూకృష్ణానగర్‌కు చెందిన రాకేష్ సమైక్యాంధ్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఢిల్లీలో శుక్రవారం కోర్ కమిటీ తెలంగాణా విషయమై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భావోద్వేగానికి గురై శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు భార్య మయూరి తెలిపారు. మృతుడికి కూతురు సాయి, కొడుకు బబ్లూ ఉన్నారు. గుండెపోటుకు గురై.. సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుకు గురై ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసులు (45) మృతి చెందాడు. శనివారం సమైక్యాంధ్రా కోసం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన శ్రీనివాసులు గుండెపోటుకు గురై కుప్పకూలారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలను గ్రామస్థాయిలో వివరిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని డీఈఓ మువ్వా రామలింగం పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాంధీబొమ్మ సమీపంలో చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి తీసుకురావాలని కోరారు. విభజన జరిగితే రాబోయే తరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని తెలియజేయాలని సూచించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరానికి శంకరయ్య ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్ రమణయ్య, ఎస్ నాగేంద్ర, కృష్ణారెడ్డి, సుబ్బారావు, చెంచురామయ్య, జగదీష్ పాల్గొన్నారు. సమైక్యాంధ్రకే కట్టుబడాలి సీమాంధ్రలోని అన్ని రాజకీయపార్టీలు సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాయని స్పష్టంగా ప్రకటించాలని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి తులసీరాంబాబు పేర్కొన్నారు. నగరంలోని వీఆర్సీ కూడలిలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారంతో 18వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో యోగాసనాలు వేస్తూ ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పరంధామయ్య, గోపాల్, చలపతి, ఎమ్సీ అచ్చయ్య, రత్నం, అబ్దుల్గయాజ్, జమీర్, భాస్కర్‌రెడ్డి, సనావుల్లా, ఉమాశంకర్, సుధాకర్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. ముందంజలో నిలవడం అభినందనీయం భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రథమ వరుసలో నిలవడం అభినందనీయమని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. నగరంలోని కేఏసీ కళాశాల సమీపంలో జూనియర్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహారదీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. సికిందర్, రవీంద్రబాబు పాల్గొన్నారు. కేంద్రానికి గుణపాఠం చెప్తాం విభజన నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని యూపీఏ సర్కార్‌కు తగిన గుణపాఠం చెప్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు తిరుమలనాయుడు పేర్కొన్నారు. విభజనకు నిరసనగా శుక్రవారం వీఆర్సీ కూడలిలో నిరసన ప్రదర్శన, మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కకు సోనియా మాస్క్ తగిలించి తమ నిరసనను వ్యక్తం చేశారు. హాజీ, దత్తు, తదితరులు పాల్గొన్నారు. కేంద్రం దిగిరావాలి సీమాంధ్రుల ఉద్యమ ప్రభావంతో కేంద్రం దిగిరాక తప్పదని ఆర్టీసీ జేఏసీ నాయకుడు రమణరాజు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం స్థానిక బస్‌స్టేషన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ఎదుట జీటీ రోడ్డుపై మానవహారం చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్రలోని ప్రజలు విభజనను వ్యతిరేకిస్తుంటే, కొందరు స్వార్థపరుల ప్రయోజనాల కోసం యూపీఏ సర్కార్ విభజన చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఢిల్లీ పెద్దలు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏవీఎస్ కుమార్, ఏవీ గిరిధర్, పెంచలరెడ్డి, సీహెచ్ శ్రీనివాసులు, ఇస్మాయిల్, డీబీ శామ్యూల్, నారాయణరావు, మహబూ, శేఖర్, మాల్యాద్రి, శశికుమార్, డీసీ అబ్బయ్య, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు బైక్ ర్యాలీ నేడు రాష్ట్ర విభజనకు నిరసనగా శనివారం ఉదయం స్థానిక బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కార్మిక్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మాల్యా ద్రి తెలిపారు. తమ సంఘానికి చెందిన 30 మంది మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని వెంకటేశ్వరుడ్ని ప్రార్థిస్తామన్నారు. అలుపెరగని పోరాటం సమైక్య రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని వీఎస్‌యూ జేఏసీ కార్యదర్శి సుజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శుక్రవారం వీఆర్సీ కూడలిలో మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని అధ్యాపకులు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుజయ్‌కుమార్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నాయని చెప్పారు. శ్రీనివాసులురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వీరారెడ్డి, పీసీరెడ్డి, హనుమారెడ్డి, హుస్సేనయ్య, శ్రీలత, విజేత, విజయ, దీప్తి, జలజకుమారి, మౌళి, తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో నెల్లూరు(బారకాసు): సమైక్యాంధ్రకు మద్దతుగా నగరపాలక సంస్థ ఉద్యోగులు శుక్రవారం పొదలకూరు రోడ్డులోని సంస్థ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఉద్యోగులు కోలాటమాడుతూ నిరసన వ్యక్తం చేశారు. చక్రపాణి, కృష్ణకిషోర్, శ్రీను, మునిరత్నం, పద్మ, చినబాబు, మోజెస్ పాల్గొన్నారు. టైలర్స్ భారీ ర్యాలీ నెల్లూరు(హరనాథపురం): సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం టైలర్ షాపులను మూసేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపైనే ఆటాపాటా నిర్వహించి నిరసన తెలియజేశారు. స్థానిక వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పైడా వెంకటేశ్వర్లు, టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మస్తాన్‌వలీ, ట్రెజరర్ షుకూర్, మస్తాన్, శ్రీనివాసులు, సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె చీకట్లు
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో గురువారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల ఫీడర్లల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఆయా విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 1950 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా సబ్స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లల్లో ఫ్యూజులు పోయి పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీరు సరఫరా, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయి. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని బుజబుజ నెల్లూరు, వెంకటాచలం మండలం, కాకుటూరు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకే సరఫరా నిలచిపోయింది. నెల్లూరు నగరంలోని నవాబుపేట ఫీడర్లో ఒక బిట్, టౌన్-2 ఫీడర్ పరిధిలోని పోలీసుకాలనీ, ప్రభుత్వాస్పత్రి ఎదురు ప్రాంతాలు, రాజరాజేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని అక్కంపేట, మాంబట్టు ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సరఫరా ఆగిపోయింది. గూడూరు డివిజన్ పరిధిలోని చాగణం, పోతేగుంట ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విడవలూరు మండలం ఊటుకూరు, గిద్దలూరు ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, ఉదయగిరి డివిజన్లోని గండిపాళెం ఫీడర్లో పూర్తిగా సరఫరా ఆగిపోయింది. వీటితో పాటు ఆత్మకూరు, రాపూరు, కావలి, వెంకటగిరి డివిజన్లలో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. ఇబ్బందుల్లో ప్రజలు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లలో ఫ్యూజులు మాత్రమే పోయినట్టు ఆశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జిల్లాలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురికాలేదని చెబుతున్నారు. అయితే అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సిమ్ కార్డులను వెనక్కి ఇవ్వడంతో విద్యుత్ సమాచారంపై ఎవరికి ఫోన్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఒక్క రోజుకే జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా బంద్ కావడంతో రానున్న రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నాం విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం సరఫరా ఆగింది. ఆయా సబ్స్టేషన్లలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్నాం. సాధ్యమైనంత వరకు సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరిస్తున్నాం. -నందకుమార్, ఎస్ఈ, ట్రాన్స్‌కో -
సమైక్య కేక
కావలి, న్యూస్‌లైన్ : సమైక్య నినాదాలతో కావలి పట్టణం హోరెత్తింది. అందరి నినాదం, లక్ష్యం సమైక్యాంధ్ర సాధనగా గురువారం పట్టణ నడిబొడ్డు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో సమైక్యాంధ్ర ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ‘కావలి కేక’ నిర్వహించారు. జిల్లా అధికారులు, సమైక్య వాదులు, ఉద్యోగ సంఘాల నేతలు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంఘాల నిర్వాహకులు, వ్యాపారులు, కార్మికులు, అన్ని వర్గాలతో లక్ష గళ ఘోష మిన్నంటింది. పట్టణంలో రెండు కిలోమీటర్ల పొడవున్న భారీ సమైక్య పతాకంతో విద్యార్థులు రాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో కుంకుమ పూజ చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమైక్య గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు డీఆర్వో రామిరెడ్డి మాట్లాడుతూ కొందరి స్వార్థం కోసం రాష్ట్ర విభజన చేయొద్దన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రవాసులకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయన్నారు. హైదరాబాద్‌ను అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఉద్యోగ, విద్య సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలోని యువత నిరుద్యోగులుగా మారుతారన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసమే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. ఆర్డీఓ పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి మాట్లాడుతూ గడ్డిపోచలు ఒక్కటై మదపుటేనుగును బందిస్తాయని, చీమలన్నీ ఒక్కటై మహాసర్పాన్ని చంపుతాయన్నారు. అదే తరహాలో సమైక్యవాదులందరూ ఒక్కటైతే రాష్ట్ర విభజన అంశం ఆగిపోతుందన్నారు. డీఈఓ మువ్వారామలింగం మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఓ కిరాతకుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓలు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు తెలుగువారి ప్రత్యే క రాష్ట్రం కోసం తన ప్రాణాలను వదిలారన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డి సమైక్యాం ధ్ర రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా వదలుకోగా, విశాలాంధ్ర కోసం పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప పోరాటాన్ని చేశారన్నారు. వీరందరు జిల్లాకు చెందినవారేనని చెప్పారు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాలను వదిలిన ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ గొప్ప ఉద్యమకారుడిగా నిలిచారన్నారు. రాష్ట్రం విభజన జరిగితే విద్య, ఉద్యోగ, విద్యుత్ సమస్యలుతో పాటు పారిశ్రామికంగా తిరోగమనం పరిస్థితులను వివరించారు. తెలుగుతల్లికి కుంకుమార్చన స్థానిక శివాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహాన్ని ఊరేగింపుగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లోని సభ ప్రాంగణానికి తీసుకువచ్చారు. శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య నినాదం తెలుగువారందరూ ఒక్కటేనంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య నినాదం చాటారు. చిన్నారులు నృత్యాలను ప్రదర్శించారు. కేసీఆర్ , కేటీఆర్, కోదండరాం, హరీష్‌రావు వంటి కేటుగాళ్ల వల్ల ఈ దుస్థితి వచ్చిందంటూ నినాదాలు ఇస్తూ నృత్య ప్రదర్శనలు కొనసాగించారు. కావలి కేకకు వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, వివిధ రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి, అదనపు జేసీ పెంచలరెడ్డి, ఐకేపీ పీడీ వెంకటసుబ్బయ్య, కావలి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎన్జీఓ అసోసియేషన్ కావలి తాలూకా అధ్యక్షుడు నరసారెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ తిరివీధి ప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జేసీ.. పచ్చి అవకాశవాది
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఉద్యోగులు, రైతులు, కూలీలు, వ్యాపారులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే మనగతేం అవుతుందంటూ ఎంతో మంది ఉద్వేగానికి గురై గుండెపోటుతో తనువు చాలించారు. ఈ పరిస్థితిలో రాష్టాన్ని సమైక్యంగా ఉంచడానికి ఉద్యమించాల్సింది పోయి.. కేవలం రాజకీయ స్వార్థంతో రాయల తెలంగానం చేయడం ఎంత వరకు సమంజసమ’ంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఓ సీనియర్ రాజకీయ వేత్తగా సరైన మార్గం అనుసరిస్తున్నారో.. లేదో.. ఆయనే అర్థం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలో జేసీ పావుగా మారారని పైలా ఆరోపించారు. తెలంగాణ సీఎల్పీ సమావేశానికి పిలవకుండానే వెళ్లి, అక్కడ రాయల తెలంగాణ వాదాన్ని వినిపించడమేమిటని నిలదీశారు. తనది గద్వాల్ ప్రాంతమని, తన పూర్వీకులు తాడిపత్రి ప్రాంతానికి వలస వచ్చారని అక్కడ మాట్లాడడం.. మీ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమన్నారు. రాజకీయ కురు వృద్ధుడైన జేసీ రాయలసీమ అస్థిత్వాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను రెండుగా చీల్చి తెలంగాణ లో కలుపుతామనడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ‘కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రాణం కేసీ కెనాల్. సీమను చీల్చడం వల్ల ఈ రెండు ప్రాంతాల రైతుల మధ్య అంతర్రాష్ట్ర నీటి వివాదాలు, యుద్ధాలు తలెత్తుతాయి. రూ.600 కోట్లు వెచ్చించిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం, చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లు, యాడికి కాలువ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. మీ కుటుంబానికి అత్యున్నత రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా ప్రజల రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు కడుపులు మాడ్చుకుని రోడ్లపైకొచ్చి సమ్మెలు చేస్తుంటే, మీ బస్సులను హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాలకు ఎక్కువ ట్రిప్పులు పెంచి.. ప్రజల నుంచి అత్యధికంగా చార్జీలు వసూలు చేస్తోంది నిజం కాదా.. అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోబియాతో.. రాయల తెలంగాణ జపం పఠిస్తున్నారన్నది బహిరంగ రహస్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగిస్తుందని, తాడిపత్రిలో తమ పార్టీ చేతిలో ఓటమి ఖాయమనే నిర్ధారణకు వచ్చిన మీరు రాయల తెలంగాణ మంత్రాన్ని జపిస్తున్నారని జేసీపై ధ్వజమెత్తారు. వేలాది మంది సమైక్యాంధ్ర ఉద్యోగులతో చేపట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైన తర్వాత కూడా.. రాయల తెలంగాణ ప్రస్తావన తేవడం లక్షలాది మంది సీమాంధ్ర ఉద్యోగుల మనోభావాలను అవమానపర్చడమేనని అన్నారు. మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వందలాది బస్సులు నిరాటంకంగా హైదారాబాద్‌కు తిరగడం కోసం మీరు వేర్పాటు వాదాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు ఆత్మను క్షోభ పెట్టవద్దని ఆయన బహిరంగ లేఖలో జేసీని కోరారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, నాయకులు మీసాల రంగన్న, జేఎం బాషా, తాడిపత్రి టౌన్ కన్వీనర్ సలాం, తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కుతున్న జనం
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : ఆకాశమే హద్దుగా ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, మహిళా జేఏసీలు కదం తొక్కుతున్నాయి. 44వ రోజు గురువారం కూడా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, విద్యా, ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగ సంఘాలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగా అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు సమావేశమై ఈ నెల 14న ‘అనంత నారీ గర్జన’ నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. జెడ్పీ ఎదుట పంచాయితీ రాజ్ ఉద్యోగ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలకు రాప్తాడు నుంచి వందలాది మంది ఉద్యోగులు పాదయాత్రగా వచ్చి సంఘీభావం తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కుర్చీలకు అతుక్కుపోయారని జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు.. ఖాళీ కుర్చీల్లో మంత్రుల ఫొటోలు ఉంచి ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో దీక్షా శిబిరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు రిలే దీక్షకు కూర్చున్నారు. న్యాయవాదులు, వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ, విద్యుత్ ఉద్యోగులు, హౌసింగ్, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పశు సంవర్ధక శాఖ జేఏసీ చైర్మన్ డాక్టర్ కె.జయకుమార్ నేతృత్వంలో ఉద్యోగులు గొడుగులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతుండగా... ఆర్టీసీ, విద్యుత్తు కార్మిక సంఘాలు మానవహారం నిర్వహించారు. ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ, జేఏసీ, టీడీపీ, కాంగ్రెస్ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. కుమ్మరి చేతి వృత్తుల వారు రోడ్డుపైనే కుండలు తయారు చేస్తూ నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పుట్టపర్తిలో రజకులు రోడ్డుపైనే దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేశారు. పామిడిలో సమైక్యవాదులు దీక్షలు కొనసాగిస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ప్రైవేట్ పాఠశాలల అధ్యాపకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పొర్లుదండాలతో నిరసన తెలిపారు. చిలమత్తూరులో ఉద్యోగ జేఏసీ నేతలు సమైక్యర్యాలీ నిర్వహించారు. లేపాక్షిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. కదిరిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేశారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యమే తమ అభిమతం అంటూ వేలాది మంది సమైక్యవాదులు గాండ్లపెంటలో గర్జించారు. కళ్యాణదుర్గంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీదివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ బస్సును జేఏసీ నేతలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యవాదులు దీక్షలు కొనసాగిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోతే మన దుస్థితి ఇలా తయారవుతుందని మడకశిరలో జేఏసీ నేతలు చిప్పలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అమరాపురం, తలుపుల, గోరంట్ల, రొద్దం, సోమందేపల్లి, ఆత్మకూరు, పెద్దవడుగూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గోరంట్లలో కమ్మ సంఘం ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యమంలో పాల్గొనాలనే డిమాండ్‌తో రాయదుర్గంలో బీజేపీ నాయకులకు చెందిన దుకాణాల వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుల చేత ‘జై సమైక్యాంధ్ర’ అనిపించారు. కణేకల్లులో ఎన్జీవోలు హెల్మెట్లు ధరించి ప్రదర్శన నిర్వహించారు. డి.హిరేహాళ్లో విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన రిలేదీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు రాప్తాడు నుంచి అనంత పురానికి పాదయాత్రగా వెళ్లారు. శింగనమలలో సమైక్యవాదులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం వినతిపత్రం సమర్పించారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యాంధ్రకు మద్ధతుగా జేఏసీ నేతలు ఆరమరణ దీక్షకు దిగారు. తాడిపత్రిలో మునిసిపల్, ఇంజనీరింగ్ విద్యార్థుల, వైద్య జేఏసీ నాయకులు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అబాకస్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు శరీరానికి వేపమండలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యాడికిలో చీరల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండ జేఏసీ నేతలు కుటుంబ సభ్యులతో రిలే దీక్షలకు దిగారు. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు మోకాళ్లపై నిల్చొని సమైక్య నినాదాలు చేశారు. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి సమీపంలోని రిలయన్స టవర్పెకైక్కి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు స్థానిక కోర్టులో పనిచే స్తున్న తెలంగాణలోని నల్గొండకు చెందిన గోపినాయక్ కూడా మద్దతు తెలిపారు. -
సమైక్య పోరులో భాగస్వామ్యం
కర్నూలు, న్యూస్‌లైన్: విభజన నిర్ణయంపై సమైక్య పోరు హోరెత్తుతోంది. మరింత తీవ్రతరం చేసేందుకు అన్ని వర్గాల ఉద్యోగులు, ప్రజా సంఘాలను ఒక్క వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాయలసీమ స్థాయి విస్తృత సమావేశం ఈనెల 13న కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి సమైక్య హామీ వెలువడే వరకు ఆందోళన బాట వీడేది లేదని బుధవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు నిరసన గళం వినిపించారు. చాలా ప్రాంతాల్లో నాయకులకు సద్బుద్ధి ప్రసాదించాలంటూ వినాయక విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి సమైక్య ఉద్యమంలో మమేకం కాగా.. ఆర్టీసీ బస్సులు గత 42 రోజులుగా డిపోలు దాటని పరిస్థితి. కర్నూలులో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. దంత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్లో సోనియాగాంధీ, చిదంబరం, షిండే, కేసీఆర్, బొత్స చిత్ర పటాలకు పిండ ప్రదానం చేసి మురుగు కాల్వలో పడేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బళ్లారి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి మానవహారం నిర్మించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను ఎస్ఈకి అప్పగించి గురువారం నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. చాగలమర్రి మెయిన్ బజార్లో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రుద్రవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాల పట్టణంలోని దంత వైద్యులు ఆసుపత్రులను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాలేజీలను బంద్ చేయించి ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల డివిజన్లో ఎయిడెడ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. మహిళా రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఫరూక్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట మైనార్టీ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆలూరులో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యేలు మసాల ఈరన్న, లోక్‌నాథ్ మద్దతు ప్రకటించారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 43వ రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ మహిళా కార్మికులు దీక్ష చేపట్టారు. ప్యాపిలిలో వస్త్ర వ్యాపారులు 200 అడుగుల జాతీయ జెండాతో సమైక్యాంద్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా 30వ రోజున నాల్గో తరగతి ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మద్దికెరలో జేఏసీ చేపట్టిన ఉద్యమానికి ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించి దీక్ష చేపట్టారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక సోమప్ప సర్కిల్ నుండి శివ సర్కిల్ వరకు రోడ్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు. -
ప్రజోద్యమం
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని జిల్లా వాసులు నినదిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కదం తొక్కడంతో 42వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు ఇప్పటికీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు నిరవధికంగా మూతబడ్డాయి. దీంతో పాలన స్తంభించిపోయింది. అనంతపురం నగరంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా ముస్లింలు కదంతొక్కారు. టవర్‌క్లాక్ సమీపంలో రిలే దీక్షలకు కూర్చున్నారు. జాక్టో ఆధ్వర్యంలో స్థానిక యోగి వేమన విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. చెడు చూడకు... చెడు వినకు... చెడు మాట్లాడకు అంటూ... వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ జేఏసీ, ఎన్జీవోలు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్కేయూ వద్ద విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పదవులే పరమావధిగా భావిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరిని నిరసిస్తూ పుట్టపర్తి జేఏసీ నేతలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా పౌరుషం తెచ్చుకోండంటూ చీర, సారె పోస్టు ద్వారా పంపారు. మరికొందరు జేఏసీ నేతలు మొండెం దాకా ఇసుకలో పూడ్చుకుని నిరసన తెలిపారు. సమైక్యవాదులు వినాయకునికి వినతి పత్రం సమర్పించారు. అమడగూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుక్కపట్నంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. గుంతకల్లులో ఎన్జీవో, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు రాస్తారోకో చేశారు. కదిరిలో వయోజన విద్య సిబ్బంది రిలే దీక్షలు ప్రారంభించారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తుఫాన్ చిత్రప్రదర్శనను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. మడకశిరలో జేఏసీ నాయకులు నోటికి నల్ల బట్ట కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నడుముకు ఆకులు, గడ్డి కట్టుకుని నిరసన తెలిపారు. అమరాపురం, రొద్దంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నడుముకు ఆకులు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండ, సోమందేపల్లిలో న్యాయవాదులు గణనాథునికి వినతిపత్రం అందజేశారు. గోరంట్లలో జేఏసీ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరంలో ఎన్జీవో, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లిలో జేఏసీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో రైతులు, సమైక్యవాదులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎన్జీవో, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నాటిక ప్రదర్శించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ తాలూకా కన్వీనర్ నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కణేకల్లులో మత్య్స కార్మికులు బంద్ చేపట్టారు. కణేకల్లులో యువకులు రిలేదీక్ష చేపట్టారు. రాప్తాడులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రిలో ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి. పోలీసుస్టేషన్ సర్కిల్లో జేఏసీ నేతలు మానవహారం నిర్మించారు. పెద్దవడుగూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. కూడేరులో ఆటోడ్రైవర్లు టవరెక్కి నిరసన తెలిపారు. ఉరవకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని జేఏసీ నేతలు ఉరవకొండలో వినాయకునికి వినతి పత్రం సమర్పించారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటనతో తీవ్ర వేదనకు గురై అగళి మండలం రామనపల్లికి చెందిన చంద్ర(45), ఆర్జీపల్లికి చెందిన రామచంద్రప్ప (45), రొళ్ల మండలం కొడగార్లగుట్టకు చెందిన నవీన్‌కుమార్ (28) గుండెపోటుతో తనువు చాలించారు. -
పోరాట పటిమ
సాక్షి, కర్నూలు: సెలవు రోజైనా.. పండగైనా సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం కొనసాగుతోంది. బిగిసిన పిడికిళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించే గొంతుకలు రోజురోజుకు ఉద్యమ తీవ్రతను పెంచుతున్నాయి. మేము సైతం అంటూ పిల్లలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టడం సమైక్యవాదుల పోరాట పటిమకు నిదర్శనం. వినాయక చవితి రోజైన సోమవారం, మంగళవారం రోజుల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. విభజనవాదులకు సద్బుద్ధి ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధిస్తామని సమైక్యవాదులు హెచ్చరించారు. నగరంలో తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ఉపాధ్యాయులు మూసివేయించారు. జిల్లా జూని యర్ లెక్చరర్ల జేఏసీ అధ్యక్షుడు కె.చెన్నయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర విభజనకు కారణమయ్యారంటూ సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, బొత్స సత్యనారాయణ, కేసీఆర్ చిత్రాలతో కూడిన దిష్టిబొమ్మను కేసీ కెనాల్లో నిమజ్జనం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఎన్టీఆర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. వాణిజ్య పన్నుల ఉద్యోగులు ఆ శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపైనే బైఠాయించారు. రాజకీయ నాయకులకు సద్బుద్ధి ప్రసాదించి, సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చూడాలనే పోస్టర్లతో గణనాథుడిని వేడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల నిరవధిక దీక్షతో జిల్లాలోని 970 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదోనిలో ఐదో తరగతి విద్యార్థులు 14 మంది జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ సర్కిల్ ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలపడం విశేషం. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీ సెంటర్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కొనసాగుతోంది. ఉపాధ్యాయులు వినాయకుడి వద్ద భజన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలో బలిజ సమైక్య శంఖారావం పేరుతో బలిజ సంఘీయులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. -
ప్రజలను మభ్యపెడుతున్న బాబు
పుట్లూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించని పక్షంలో రాయలసీమలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్రను అడ్డుకుంటామని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి హెచ్చరించారు. ఆదివారం మాజీ సర్పంచ్ రామకేశవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు కారకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి, వాటిని ఆమోదింపజేసుకుని, ఆ తర్వాత ఆత్మగౌరవ యాత్ర కొనసాగించాలని హితవు పలికారు. ఆయనది ఏ వాదం అన్న విషయంపై ఆయనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుని జై సమైక్యాంధ్ర నినాదంతో రావాలని, లేనిపక్షంలో యాత్రను రాయలసీమ ప్రజలు అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌లు మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ కంచెం శ్రీనివాసులరెడ్డి, సేవాదళ్ కన్వీనర్ ధనుంజయనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయినా సమైక్యమే ధ్యేయం
సాక్షి, గుంటూరు: సమైక్య ఉద్యమం ఆరంభమై 39 రోజులు దాటింది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు అందలేదు. మరో వైపు ఉద్యమంలో పాల్గొంటున్న వ్యాపారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇక్కడ జీతాలకన్నా జీవితాలే ముఖ్యమని ఉద్యోగులు, వ్యాపారం కంటే సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా వ్యాపారులు ఉద్యమబాటలో ముందుకు కదులుతున్నారు. నష్టపోయినా కష్టం లేదని రాష్ట్ర పరిరక్షణే ధ్యేయమని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా అంతటా సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కారణంగా రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోవడంతో గ్రామాల నుంచి నిత్యం పట్టణాలకు వెళ్లే జనం లేకుండా పోయారు. దీనికితోడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సమ్మె కారణంగా మూతపడటంతో పట్టణాలకు వెళ్లే ఉద్యోగులు తక్కువయ్యారు. ఈ కారణాల వల్ల గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల వంటి పట్టణాల్లో వివిధ రకాల వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. గుంటూరులోని వాసవీ హోల్‌సేల్ వస్త్ర దుకాణాల సముదాయానికి నిత్యం వచ్చే కొనుగోలుదారులు బాగా తగ్గారు. ఇదే విధంగా రెడీమేడ్ వస్త్రాలు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారాలు కూడా జనం లేక మందగించాయి. వివిధ రకాల పండ్ల దిగుమతికి కేంద్రమైన గుంటూరు, తెనాలి పట్టణాల్లో బేరాలు బాగా సన్న గిల్లాయి. అరటి, చక్కెరకేళి, బత్తాయి పండ్ల వ్యాపారానికి నిలయమైన పొన్నూరులోనూ కొనుగోళ్లు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి పండ్లను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసే వారు తగ్గారు. తగ్గిన చవితి కొనుగోళ్లు.. వినాయక చవితికి వారం రోజుల ముందు నుంచే గుంటూరులో రెడీమేడ్ వస్త్ర వ్యాపారాలు ఊపందుకునేవి. అయితే ఈ ఏడాది మాత్రం వీటి అమ్మకాలు బాగా తగ్గాయి. వస్త్ర వ్యాపారానికి పేరున్న బ్రాడీపేట, నాజ్‌సెంటర్, పాత బస్టాండ్ , కొత్తపేట సెంటర్లలో శనివారం కొనుగోలుదారులు బాగా తక్కువగా కనిపించారు. ఇక గుంటూరు, నర్సరావుపేట, తెనాలి వంటి ప్రధాన పట్టణాల్లోని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యాపారం, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ జనాలు లేక వ్యాపారాలు మందగించాయి. ఆర్టీసీ బస్సులు లేక రోజూ పట్టణాలకు వచ్చే గ్రామీణ జనం రాకపోవడమే కారణమని నిర్వాహకులు చెపుతున్నారు. సినిమాహాళ్లలోనూ ప్రేక్షకుల సంఖ్య పలచగా ఉంటోంది. గుంటూరు నగరంలోని కొన్ని థియేటర్లలో మార్నింగ్‌షో, రెండో ఆటలకు పట్టుమని పదిమంది కూడా ఉండటం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేనప్పుడు అర్ధరాత్రి వరకూ బస్సులు తిరిగే అవకాశం ఉండటంతో గ్రామీణ జనం సెకండ్‌షో చూసి మరీ వెళ్లేవారు. ఇపుడా పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు పట్నంబజార్, తెనాలి గాంధీచౌక్ సెంటర్, సత్తెన పల్లి గడియారం స్తంభం సెంటర్, చిలకలూరిపేట చినరథం సెంటర్లలోనూ వ్యాపారాలు బాగా పడిపోయాయి. నిత్యం వేలాది మంది కొనుగోలుదారులతో కళకళలాడే ఈ వ్యాపార కూడళ్లు జనం తక్కువై వెలవెలబోతున్నాయి. పట్టణాల్లో ఏర్పాటు చేసుకున్న ఏసీ సెలూన్లు, బ్యూటీపార్లర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజూ సుమారు రూ. మూడు కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే బ్రాడీపేట ప్రాంతంలోనూ క్రయవిక్రయాలు బాగా తగ్గాయి. వ్యాపారాలు ఇలా వున్నా వ్యాపారస్తులు మాత్రం సమైక్య ఉద్యమం వైపే పయనిస్తున్నారు. సమైక్య రాష్ట్రమే ధ్యేయమంటున్నారు. నష్టపోయినా ఉద్యమంలో పాల్గొని సమైక్య రాష్ట్ర పరిరక్షణకు పాటుపడతామని తెగేసి చెబుతున్నారు. -
‘సమైక్యం’తో మమేకం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంతో మమేకమవుతున్నారు. ర్యాలీలు, మానవహారాలు, నిరసన దీక్షలతో జిల్లా శుక్రవారం దద్దరిల్లింది. ఆర్టీసీ బస్సులు లేకపోవడం, పలు ప్రాంతాల్లో ఆటోవాలాలు సైతం సంఘీభావం ప్రకటిస్తూ బంద్‌కు పిలుపునివ్వడంతో సామాన్య జనజీవనం స్తంభించినట్లయింది. సీఎస్‌పురం మండలం డీజీపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా టీచర్లు పాఠశాలను వదిలి రోడ్డుపై పాఠ్యాంశాలు బోధించారు. సీఎస్‌పురంలో ఉపాధ్యాయ జేఏసీ కూడా ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయ జేఏసీ ప్రకటించింది. అద్దంకిలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం నుంచి 3 వేల మందికిపైగా ఉద్యోగులు, ఆరోగ్య మిత్రలు ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, పొక్లయినర్లతో ర్యాలీ సాగింది. అద్దంకి బస్టాండు సెంటర్లో ‘రాష్ట్ర విభజన చీడ పురుగు’ పేరుతో తయారు చేసిన దిష్టిబొమ్మను దహనం చేశారు. నూర్‌బాషా సంఘం కూడా ర్యాలీ నిర్వహించింది. పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం, రాస్తారోకో చేశారు. భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో, మానవహారంతో పాటు శాంతిహోమం నిర్వహించారు. వినూత్న నిరసనలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో కవులు, రచయితలు నిరసన గళం వినిపించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు భీమనాథం హనుమారెడ్డి ఆధ్వర్యంలో కవితాగోష్ఠి నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట, ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగులు చెవిలో పూలుపెట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు భారీగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు జేఏసీగా ఏర్పడి సమైకా్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం భవనం ముందు రిలే దీక్ష చేపట్టారు. ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలిపారు. జే.పంగులూరు, సంతనూతలపాడు, మార్కాపురం, మద్దిపాడు, బేస్తవారిపేట, కొమరోలులో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు నిరసన ర్యాలీలు, రిలే దీక్షలు కొనసాగించారు. పర్చూరులో మూడుబొమ్మల సెంటర్లో న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి: గిద్దలూరులో ఉద్యమ జేఏసీ నాయకులు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాచర్లలో జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షను వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి ప్రారంభించారు. యర్రగొండపాలెంలో గురుకుల పాఠశాల విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు భారీగా రోడ్డుపైకి వచ్చి సమైక్యవాదానికి సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలో ఎన్జీఓలు, మున్సిపల్ ఉద్యోగులు, జర్నలిస్టులు సంయుక్తంగా సమైక్య ర్యాలీ చేశారు. కదం తొక్కిన విద్యార్థి లోకం: దర్శిలో పది వేల మందికిపైగా విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దర్శి కూడలిలో సమైక్యాంధ్ర గర్జన నిర్వహించారు. జేఏసీ చైర్మన్ రాజకేశవరెడ్డి పాల్గొన్నారు. మార్టూరులో 10 వేల మందికిపైగా విద్యార్థులు జాతీయ రహదారిపైకి వచ్చి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. పొన్నలూరు మండలం చవటపాలెం ఎస్సీకాలనీ వాసులు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. జరుగుమల్లి మండలం చిరికూరపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. కందుకూరులో 200 మంది ఆటోవాలాలు బంద్ పాటించి ర్యాలీ నిర్వహించారు. ఉలవపాడులో ఎంఈఓ బీ.శ్రీమన్నారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఉలవపాడు ఎంపీడీఓ, తహసీల్దారు సంఘీభావం ప్రకటించారు. ఆటోవాలాలంతా తాము సమ్మెలో పాల్గొనడమే కాకుండా విద్యాసంస్థలను కూడా మూసేయించి బంద్ పాటించారు. వీరికి ముఠాకూలీలు సైతం సంఘీభావం ప్రకటించారు. చీరాలలో ఎల్ఐసీ ఏజెంట్లు చేపట్టిన రిలే దీక్షకు మెప్మా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు క్యారమ్స్, వైకుంఠపాళీ ఆడుతూ నిరసన తెలిపారు. బీసీ ఫెడరేషన్ దీక్షలు కొనసాగాయి. కనిగిరిలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్ష, ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. వెలిగండ్ల మండలం రామగోపాలపురంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పామూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని రహదారులను దిగ్బంధించారు. పామూరు, ఇనిమెర్ల గ్రామాల్లో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. సింగరాయకొండలో జేఏసీ నాయకులు చండీయాగం నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం సింగరాయకొండలో శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లోని విద్యార్థులను బయటకు పంపి తాళాలు వేయించారు. -
పింఛన్ కష్టాలు
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం నిరుపేదలైన పింఛనుదారులపైనా పడింది. నగర, పురపాలక సంఘాల సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో ఈ నెల పింఛన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కష్టంగా మారింది. ప్రతి నెల ఒకటి, 5వ తేదీల్లో పింఛను అందుకునే వారు. ఈ దఫా సమ్మె కారణంగా ఇప్పటి వరకు అందలేదు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో 43 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఒక్క అనంతపురంలోనే 23 వేల మంది ఉన్నారు. పింఛను సొమ్ము బ్యాంక్‌లో కూడా జమ అయ్యింది. డీఆర్డీఏ నుంచి అక్విటెన్స్లూ వచ్చాయి. అయినా సిబ్బంది సమ్మె కారణంగా పంపిణీకి నోచుకోలేదు. దాదాపు 49 మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్మార్ట్ కార్డులు, ఐకేపీ సంఘాల సభ్యుల ద్వారా పింఛన్ పంపిణీ చేశారు. నగర, పురపాలక సంఘాల పరిధిలో స్మార్ట్ కార్డుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంపిణీ సాధ్యపడలేదు. నగరం, పట్టణాల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేయించేలా అధికారులు చొరవ తీసుకొని ఉంటే సమస్య పరిష్కారమయ్యేది. అయితే వారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. -
సమైక్యాంధ్ర సింహగర్జనకు ఇంటికొకరు రండి
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా గురువారం నెల్లూరులో లక్షమందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ వెల్లడించింది. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆశాఖ జిల్లా అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి మాట్లాడుతూ సింహగర్జనకు లక్ష మందికి పైగా హాజరవుతారన్నారు. జిల్లాలో ప్రతి ఇంటి నుంచి ఒక్కరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి సమైక్యాంధ్ర సింహగర్జన ర్యాలీ ప్రారంభమై గాంధీబొమ్మ, వీఆర్స్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోల్ బంకు మీదుగా ఏసీ స్టేడియానికి చేరుకుంటుందన్నారు. నగరంలోని 15 ప్రదేశాల నుంచి జనం సభకు చేరుకుం టారని ఆయన తెలిపారు. ఈ గర్జనకు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా హాజరు కావచ్చన్నారు. వేదిక సభ్యుడు, ఏజేసీ పెంచలరెడ్డి మాట్లాడుతూ ఉద్యమానికి వచ్చే ప్రజలకు వ్యాపారులు తాగునీరు అందించాలని కోరారు. సభాప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. సింహగర్జన విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్టీఓ రాంప్రసాద్ మాట్లాడుతూ సభ ముగియగానే ఏసీ స్టేడియం నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు 40 ప్రైవేటు వాహనాలను రాకపోకలకు అందుబాటులో ఉంచుతామన్నారు. నేడు మోటారు సైకిల్ ర్యాలీ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా బుధవారం ఆర్టీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ మోటారుసైకిల్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ తెలిపారు. అనంతరం రవాణాసంస్థ అధికారులు రిలేదీక్షలో పాల్గొంటారనిపేర్కొన్నారు. శాంతిభద్రతలకు ప్రత్యేక ఏర్పాట్లు: డీఎస్పీ సమైక్యాంధ్ర సింహగర్జనలో భాగంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి తెలిపారు. నగరంలోని బీవీఎస్ బాలికల ఉన్నతపాఠశాల (నవాబుపేట), శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం (ఆత్మకూరు బస్టాండ్), ఏబీఎం కాం పౌండ్ (బోసుబొమ్మ), గాంధీబొమ్మసెంటర్, వీఆర్సీ సెంటర్, వైఎంసీఏ గ్రౌండ్, శ్రీసర్వోదయ కళాశాల, ఆర్టీసీ బస్‌స్టేషన్, కస్తూరిబా ఉన్నత పాఠశాల, కేవీఆర్ పెట్రోలు బంకు, టీటీడీ కల్యాణమండపం, ఎన్జీవో హోం, వేదాయపాళెం, అయ్యప్పస్వామి గుడి ప్రాంతాల నుంచి సభకు హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలివే నగరంలోని బారాషహీద్ దర్గా, వేదాయపాళెం, అయ్యప్పగుడి, మినీబైపాస్, మాగుంటలే అవుట్ ప్రాంతాలను పార్కింగ్ కోసం ఎంపిక చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పొదలకూరు, జొన్నవాడల మీదుగా వచ్చే వాహనాలు బారాషహీద్ దర్గా వద్ద, గూడూరు వైపు నుంచి వచ్చే వాహనాలు అయ్యప్పగుడి, వేదాయపాళెం వద్ద, కోవూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మినీబైపాస్ వద్ద, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు మాగుంట లేఅవుట్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు. పోస్టర్,కరపత్రాల విడుదల సమైక్యాంధ్ర సింహగర్జన పోస్టర్లు, కరపత్రాలను వేదిక నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ మూర్తి, ఎన్జీవో జేఏసీ చైర్మన్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
సమరభేరి
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 35వ రోజైన మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలోని ఏసీ స్టేడియంలో గురువారం లక్ష మందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో ఈ నెల 5న లక్షమందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహిస్తున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, డీఆర్ఓ రామిరెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 15 ప్రాంతాల నుంచి ర్యాలీగా బయల్దేరి ఏసీ స్టేడియానికి చేరుకుంటారన్నారు. స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఎంపీడీఓల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో సమైక్య రాష్ట్రం కోసం వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ మువ్వా రామలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కావలి ఆర్డీవో పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఎంఈవో సత్యనారాయణ, ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అల్లూరులో విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, 100 మీటర్ల జాతీయ పతాకంతో ఉరేగింపు నిర్వహించారు.ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 22 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటి దీక్షలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది కూర్చున్నారు. పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. సమైక్యవాదుల ఆధ్వర్యంలో పొదలకూరులో బంద్ పాటించి వంటావార్పు జరిపారు. గూడూరులో జేఏసీ నాయకులు బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. కొన్ని బస్సులు తిరుగుతుండటంతో గాలితీసేశారు. జేఏసీ నాయకులపై ఆర్ఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేఏసీ నాయకులు డిపో ఎదుట బైఠాయించి ఆర్ఎం, డీఎం ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఆర్ఎంను ఎస్ఐ పిలిపించి తానూ సమైక్యవాదినే అని చెప్పించడంతో ఆందోళన విరమించారు. జేఏసీ నాయకులు విద్యార్థులతో కలిసి చిల్లకూరు జాతీయరహదారిపై రాస్తారోకో చేసి మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాలిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేశారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15 రోజులుగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు గానుగపెంట ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి మద్దతు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పట్టణంలో భిక్షాటన చేశారు. సీతారాంపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పోరాట సమితి రిలే దీక్షలు కొనసాగాయి. వింజమూరులో సకల జనుల సమ్మె జరిగింది. విద్యార్థులు, యువకులు రోడ్డుపై ఆటలు ఆడారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో గ్రామస్తులు నిరాహారదీక్ష చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ నుంచి మునులపూడి వరకు ఉద్యోగ జేఏసీ నాయకుల ర్యాలీ నిర్వహించారు. -
జన ప్రవాహం
జిల్లాలో సమైక్య ఉద్యమం ఎగిసిపడుతోంది. నెల రోజులు దాటినా ఏమాత్రం జోరు తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో సమైక్యవాదులు ఉద్యమంలో ఉరకలేస్తున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి. పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు ప్రతి చోటా సమైక్య ఉద్యమ ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రతిన బూనుతున్నారు. నెల రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడటంతో పరిపాలన స్తంభించింది. ప్రజలకు అసౌకర్యం క లుగుతున్నా చలించడం లేదు. సమైక్యాంధ్రే తమ లక్ష్యమంటూ నినదిస్తున్నారు. సాక్షి, కడప : సమైక్యాంధ్ర గర్జన సభలకు జన ప్రవాహం వెల్లువెత్తుతోంది. పురిటిబిడ్డ మొదలు పండు ముదుసలి వరకు అందరి తారకమంత్రం సమైక్యాంధ్రనే. ప్రతిక్షణం సమైక్య నినాదం వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు కదిలే వరకు అదే నినాదం మారుమోగించాలి అనే రీతిలో ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్జీఓలు, వివిధ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కచోట సమైక్య పరంపర కొనసాగుతూనే ఉంది. 36 రోజుల కిందట మొదలైన సమైక్య సెగలు జిల్లాలో ఇప్పటికి రాజుకుంటూనే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాట పడుతున్నారు. కడపలో వైఎస్సార్సీపీ నేతలు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు సౌదరి రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు చేపట్టిన ఆమరణ దీక్షలు మంగళవారంతో రెండవరోజు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి,యానాదయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ప్రగతి భవన్‌పై సమైక్యాంధ్ర బెలూన్ను ఎగురవేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగే సభకు జిల్లా నుంచి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఈశ్వరయ్య, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ఆర్వీఎం పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జిల్లా అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కేశవరెడ్డి, నారాయణ, చైతన్య, రవీంద్రభారతి పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్షలకు సంఘీభావం తెలిపారు. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, డీఆర్డీఏ, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో ప్రైవేటు స్కూల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిపబ్లిక్ క్లబ్ సొసైటీ సభ్యులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు. పట్టణంలో ‘జన గర్జన’ పేరుతో బుధవారం పీఆర్ హైస్కూలులో జరిగే సభను జయప్రదం చేయాలని ఆర్డీఓ రఘునాథరెడ్డి ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో పోరు గర్జన పేరుతో 20 వేల మందికి పైగా ఉద్యోగులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీసుస్టేషన్ వరకు రోడ్లపై కూర్చొని మొత్తం పట్టణాన్ని దిగ్బంధించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. దీనికి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్‌కుమార్ నేతృత్వంలో దాసరి పెద్ద భూషయ్య తదితరులు కూర్చొన్నారు. బద్వేలు పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు వెంకటేశ్వర్లు, బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్ తదితరులు తమ మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో పద్మశాలీయులు మగ్గాలతో ర్యాలీని నిర్వహించారు. రోడ్డుపైనే మహిళలు పడుగు వేస్తూ నిరసన తెలిపారు. వసంతపేట సాయిబాబా ఆలయం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఆదర్శ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్‌ర్యాలీని చేపట్టారు. పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 7వ తేదీ హైదరాబాదులో జరిగే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. వేంపల్లె, సింహాద్రిపురంలలో ఆందోళనలు కొనసాగాయి. రాయచోటి పట్టణంలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఏసీ శిబిరంలో ఆటాపాటా కార్యక్రమాన్ని చేపట్టారు. మైదుకూరు పట్టణంలో చిరు వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి వంటా వార్పు చేపట్టారు. ఖాజీపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైల్వేకోడూరులో వైద్య సిబ్బంది రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ దీక్షలకు ఆకేపాటి మురళి, పోలా శ్రీనివాసులురెడ్డి, శరత్కుమార్రాజులు సంఘీభావం తెలిపారు. మహిళలు సమైక్యాంధ్ర కోసం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే యాగం నిర్వహించారు. కమలాపురంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి నుంచి కమలాపురం క్రాస్‌రోడ్డు వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. క్రాస్‌రోడ్డులో మానవహారంగా ఏర్పడ్డారు.