సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఉద్యమం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసే బాధ్యతను సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. పండుగ రోజుల్లోనూ పోరుకు విరామం ఇవ్వకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులను కార్యోన్ముఖులను చే స్తున్నారు.జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి.
సాక్షి, కడప: సమైక్యాంధ్ర ప్రకటన వచ్చిన రోజే నిజమైన పండుగ అని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు పోరు ఆగదని జిల్లా ప్రజలు నినదించారు. దసరా సంబరాల్లోనే సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యమం నడిపిస్తూ సమరోత్సాహంతో ముందుకు సాగారు. విభజనకు నిరసనగా వినూత్న ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు, రిలే దీక్షలతో సకల జనులు పోరును సాగించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సుల్లో సమైక్య ఆకాంక్షను బలంగా వినిపించారు.
కడప నగరంలో సోమ,మంగళవారాల్లో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సాగునీటిపారుదల, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సాగాయి. మంగళవారం రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శిబిరంలో రైతులు, మైదుకూరు ప్రాంత ఉపాధ్యాయులు, డ్వామా, ఏపీఎంఐపీ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు ప్రసంగించారు.
జమ్మలమడుగు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు సాగాయి. మంగళవారం పత్రికా విభాగానికి సంబంధించి హెచ్‌ఆర్, సర్క్యులేషన్, పేపర్ బాయ్‌లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో క్రైస్తవ జేఏసీ నాయకుడు అగస్తీన్‌రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలు సంఘీభావం తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలో న్యాయవాదులు, మున్సిపల్ సిబ్బంది దీక్షలు సోమవారం కొనసాగాయి. మంగళవారం ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు పట్టణంలో భారీ రైతు సదస్సును నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, టీడీపీ నాయకురాలు లక్ష్మిప్రసన్న సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించి అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర గీతాలు, విచిత్ర వేషధారణలతో నిరసన వ్యక్తంచేశారు.
రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. దీనికి వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు పట్టణంలో సోమ,మంగళవారాల్లో గ్రామ నౌకర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. మంగళవారం పట్టణంలో రైతు సదస్సును నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి జేఏసీ నాయకులు రాష్ర్టం విడిపోతే కలిగే కష్టనష్టాలను వివరించారు.
పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి ఎన్జీఓలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం ఎన్జీఓల ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పడుకొని సమైక్య నినాదాలు చేశారు.
మైదుకూరులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటి పట్టణంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యాంధ్ర జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో సోమ, మంగళ వారాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ ఏరియా ఆస్ప్రత్రి వైద్యులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వైఎస్సార్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఓపీ సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
పండుగ పూట.. పోరు బాట
Published Wed, Oct 16 2013 2:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement