జిల్లాలో సమైక్య ఉద్యమం ఎగిసిపడుతోంది. నెల రోజులు దాటినా ఏమాత్రం జోరు తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో సమైక్యవాదులు ఉద్యమంలో ఉరకలేస్తున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి.
పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు ప్రతి చోటా సమైక్య ఉద్యమ ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రతిన బూనుతున్నారు. నెల రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడటంతో పరిపాలన స్తంభించింది. ప్రజలకు అసౌకర్యం క లుగుతున్నా చలించడం లేదు. సమైక్యాంధ్రే తమ లక్ష్యమంటూ నినదిస్తున్నారు.
సాక్షి, కడప : సమైక్యాంధ్ర గర్జన సభలకు జన ప్రవాహం వెల్లువెత్తుతోంది. పురిటిబిడ్డ మొదలు పండు ముదుసలి వరకు అందరి తారకమంత్రం సమైక్యాంధ్రనే. ప్రతిక్షణం సమైక్య నినాదం వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు కదిలే వరకు అదే నినాదం మారుమోగించాలి అనే రీతిలో ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్జీఓలు, వివిధ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కచోట సమైక్య పరంపర కొనసాగుతూనే ఉంది. 36 రోజుల కిందట మొదలైన సమైక్య సెగలు జిల్లాలో ఇప్పటికి రాజుకుంటూనే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాట పడుతున్నారు.
కడపలో వైఎస్సార్‌సీపీ నేతలు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు సౌదరి రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు చేపట్టిన ఆమరణ దీక్షలు మంగళవారంతో రెండవరోజు పూర్తయ్యాయి.
వీరి దీక్షలకు వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి,యానాదయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ప్రగతి భవన్‌పై సమైక్యాంధ్ర బెలూన్‌ను ఎగురవేశారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరగే సభకు జిల్లా నుంచి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఈశ్వరయ్య, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ఆర్వీఎం పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జిల్లా అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కేశవరెడ్డి, నారాయణ, చైతన్య, రవీంద్రభారతి పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్షలకు సంఘీభావం తెలిపారు. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, డీఆర్‌డీఏ, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో ప్రైవేటు స్కూల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిపబ్లిక్ క్లబ్ సొసైటీ సభ్యులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు. పట్టణంలో ‘జన గర్జన’ పేరుతో బుధవారం పీఆర్ హైస్కూలులో జరిగే సభను జయప్రదం చేయాలని ఆర్డీఓ రఘునాథరెడ్డి ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో పోరు గర్జన పేరుతో 20 వేల మందికి పైగా ఉద్యోగులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీసుస్టేషన్ వరకు రోడ్లపై కూర్చొని మొత్తం పట్టణాన్ని దిగ్బంధించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. దీనికి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ దీక్షలు వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్‌కుమార్ నేతృత్వంలో దాసరి పెద్ద భూషయ్య తదితరులు కూర్చొన్నారు. బద్వేలు పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు వెంకటేశ్వర్లు, బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్ తదితరులు తమ మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలో పద్మశాలీయులు మగ్గాలతో ర్యాలీని నిర్వహించారు. రోడ్డుపైనే మహిళలు పడుగు వేస్తూ నిరసన తెలిపారు. వసంతపేట సాయిబాబా ఆలయం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఆదర్శ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్‌ర్యాలీని చేపట్టారు.
పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 7వ తేదీ హైదరాబాదులో జరిగే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. వేంపల్లె, సింహాద్రిపురంలలో ఆందోళనలు కొనసాగాయి.
రాయచోటి పట్టణంలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఏసీ శిబిరంలో ఆటాపాటా కార్యక్రమాన్ని చేపట్టారు.
మైదుకూరు పట్టణంలో చిరు వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి వంటా వార్పు చేపట్టారు. ఖాజీపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు.
రైల్వేకోడూరులో వైద్య సిబ్బంది రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు.
రాజంపేటలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ దీక్షలకు ఆకేపాటి మురళి, పోలా శ్రీనివాసులురెడ్డి, శరత్‌కుమార్‌రాజులు సంఘీభావం తెలిపారు. మహిళలు సమైక్యాంధ్ర కోసం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే యాగం నిర్వహించారు.
కమలాపురంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి నుంచి కమలాపురం క్రాస్‌రోడ్డు వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. క్రాస్‌రోడ్డులో మానవహారంగా ఏర్పడ్డారు.
జన ప్రవాహం
Published Wed, Sep 4 2013 3:46 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement