కుట్రను తిప్పికొడతాం..
ఈడేపల్లి : మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలు రైతుల భూములను లాక్కునేందుకు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టినట్టు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. స్థానిక ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ భవనంలో శుక్రవారం భూ పరిరక్షణ పోరాట సమితి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేస్తున్న భూ దందాపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను రైతులకు తెలియజేసేందుకు నవంబరు 1వ తేదీ నుంచి బందరు మండలంలోని గ్రామాల్లో రాత్రింబవళ్లు పాదయాత్రలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
పరిశ్రమల పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో 14 నెలలుగా రైతులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. పోర్టు నిర్మించాలన్న బందరు ప్రజల చిరకాల వాంఛను పరిశ్రమలవైపు మళ్లించి రైతులను దోచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పోర్టులైన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల్లో 1800 నుంచి 2000 వేల ఎకరాల్లో నిర్మించారన్నారు. పోర్టు నిర్మించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్లకు ఉంటే పోర్టు నిర్మాణం జరిగేదన్నారు. కానీ దీనిని పట్టించుకోకుండా పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని రైతులను అనాథలను చేసేందుకే మంత్రి, ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తూ, అధికారులతో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.
సర్కారీ దందాను వివరిస్తాం...
సీపీఐ నేత, భూ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు మొదుగుమూడి రామారావు మాట్లాడుతూ వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రాత్రింబవళ్లు గ్రామాల్లో పాదయాత్రలు చేసి ప్రభుత్వం చేస్తున్న భూదందాపై రైతులకు వివరిస్తామన్నారు. మొదటిరోజు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి రామకృష్ణ హాజరవుతారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, భూ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాలను ప్రభుత్వం దోచుకుని ఇతర దేశాలకు అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షులు షేక్ సిలార్‌దాదా మాట్లాడుతూ పూటకోమాట చెప్పి నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటివరకు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు రైతులు ఇచ్చింది కేవలం 543 ఎకరాలేనని, వాటిల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్ల బినామీ పేర్లతో పత్రాలను తయారు చేసి, తమ భూములకు ఇచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత అచ్చేబా, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మతిన్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రామిశెట్టి ప్రసాద్, సీపీఎం నాయకులు సీహెచ్ జయరావు పాల్గొన్నారు.