ముత్తుకూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య దీవెనయాత్రలో భాగంగా శుక్రవారం ముత్తుకూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త దళితవాడ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయంపై రాష్ట్రపతి పునరాలోచించేవారని కాకాణి అభిప్రాయపడ్డారు. తీర్మానం చేయకుండా, ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం ద్వారా సమైక్యవాదానికి తూట్లు పొడిచారన్నారు. తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరించడంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు బయటపడిందన్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, బలవంతంగా వ్యానులో తరలించడం వెనుక ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ఉదంతం ద్వారా సమైక్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి డ్రామాలాడుతున్న విషయం స్పష్టమైపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాదం బట్టబయలయిందన్నారు.
మొహం చూపని ఎమ్మెల్యే ఆదాల
ఓట్లేసిన ప్రజలకు మొహం చూపని ఎమ్మెల్యేల్లో ఆదాల ప్రభాకరరెడ్డి ప్రముఖులని కాకాణి ఎద్దేవా చేశారు. పనుల కోసం ఎవరైనా వెళ్లి అడిగితే ‘నేనిచ్చిన నోటు, మీరేసిన ఓటుకు చెల్లు’ అంటూ హేళన చేసి పంపిస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్దనరెడ్డి, నాయకులు దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, నంగా చెంగారెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, సర్పంచ్ పల్లంరెడ్డి జనార్దనరెడ్డి, దువ్వూరు గోపాలరెడ్డి, సన్నారెడ్డి రమణారెడ్డి, కారంచేటి ప్రసాద్‌శర్మ, సుమంత్‌రెడ్డి, జవహర్, టీ రాజ పాల్గొన్నారు.
సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
Published Sat, Jan 11 2014 3:58 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement