ఏదైతే కాకూడదనుకున్నారో అదే అయ్యింది. సమైక్య వాదులు అలుపెరుగకుండా 129 రోజుల పాటు సాగించిన ఉద్యమాన్ని కేంద్ర పెద్దలు ఇసుమంతైనా పట్టించుకోలేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపిందంటూ ప్రకటించడంతో అనంత వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం అర్ధరాత్రి దాటినా నిరసన కొనసాగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేటి బంద్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగు ప్రజల మనోభావాలకన్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జన్మదినోత్సవ కానుక ఇవ్వడానికే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపడంపై ‘అనంత’ ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. 129 రోజులుగా సాగుతోన్న సమైక్యాంధ్ర మహోద్యమాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరశించారు. ఎస్కేయూ వద్ద విద్యార్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతపురం నగరంలోని వైఎస్‌ఆర్ సర్కిల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాలతో కలిసి సమైక్యాంధ్ర మహోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు పూనుకుంది.
అధిక శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ జీవోఎంను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా జీవోఎంను కోరారు. సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం ఒకానొక దశలో రాయలసీమ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. రాయలసీమను నిలువునా చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసేందుకు పూనుకుంది.
జీవోఎం కూడా రాయల తెలంగాణకే ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రాయలసీమ విభజనపై సీమ ప్రజానీకం భగ్గుమనడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాయి.
ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసు బలగాలతో భారీ ఎత్తున కవాతు నిర్వహించి.. ప్రజలను భయోత్పాతానికి గురిచేసే యత్నం చేయడం గమనార్హం. కాగా కేంద్ర ప్రకటనపై ఉరవకొండ, కదిరి, పుట్టపర్తిలో సమైక్యవాదులు ఆందోళన నిర్వహించారు.
గీన్ సిగ్నల్‌పై ‘అనంతా’గ్రహం
Published Fri, Dec 6 2013 2:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement