సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా దద్దమ్మలుగా మారిపోయారని ఏపీ ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఫొటోలున్న ఫ్లెక్సీలను శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట దహనం చేశారు. సోనియాగాంధీతో
పాటు మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిందంబరం, షిండే, జైరాం రమేష్ తదితరుల ఫొటోలు కల్గిన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఉద్యోగులు ప్రకటించారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసేందుకు జాక్టో ముందుకు వచ్చి కార్యాచరణ రూపొందించింది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై చర్చించాయి. ఆదివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చే సేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా 9వ తే దీన నల్ల బ్యాడ్జీలతో నిరసన, 10వ తేదీ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేయించాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జాక్టో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరోసారి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.
పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలగకుండా, ఉద్యమ తీవ్రత తగ్గకుండా ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలో భాగంగా మూడు రోజులపాటు కలెక్టర్ కార్యాలయంలో కార్యకలాపాలు ముందుకు సాగలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు విఫలమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చే శారు. జీతాలు రాకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు రెండు నెలలకుపైగా ఉద్యమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు.
హిందూపురంలో ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓలు విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను తగులబెట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. మడకశిర , పెనుకొండ, గోరంట్లలో ఆందోళనలు చేపట్టారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ 160వ రోజూ దీక్ష కొనసాగించారు.
దద్దమ్మలు వీళ్లు
Published Sun, Feb 9 2014 2:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement