నిత్యావసర వస్తువుల ధరలు ఢాం..ఢాం అంటూ పేలుతుంటే సంబరాల దీపావళి చిన్నబోనుంది. ఉప్పు నుంచి పప్పు వరకు.. ఆకుకూరల నుంచి కూరగాయల వరకు ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. తలుచుకుంటేనే కంట నీరు తెప్పిస్తోంది ఉల్లి. అదే దారిలో పయనిస్తోంది టమాట. ఈ రెండూ లేనిదే ఏ కూరా సిద్ధం కాదు. బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల భారాన్ని మోయలేక మోస్తున్న సామాన్యుడు దీపావళి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు.
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడు ఈ ఏడాది దిపావళిని సంబరంగా జరుపుకునేందుకు వెనకడుగు వేస్తున్నాడు. సటపాసుల విక్రయాలకు అనుమతులు పొందేందుకు అడిగినంతా ఇచ్చుకుని..లెసైన్స్‌లు పొందిన విక్రయదారులు గిట్టుబాటు పేరుతో ఈ ఏడాది ధరలు పెంచనున్నారు. ఈ భారమంతా కొనుగోలుదారుల మీదే పడుతోంది.
వీటిని కొని పండుగ చేసుకోవాలా..వద్దా అన్న సందిగ్దంలో పడిన సామాన్యుడు.. పిల్లల సరదా తీర్చేదెట్టా అన్న ఆవేదనలో ఉన్నాడు. ఎంత వెచ్చించినా.. కాసింతైనా సంతృప్తికరంగా సరంజామా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు సమైక్య ఉద్యమం కారణంగా వేతనాలు కోల్పోయారు. ఈ నెలలో పూర్తి వేతనం రానందున ప్రభుత్వం ఇచ్చిన రుణంతో గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదో పండుగా చేశామంటే చాశామన్నట్లు జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. కొత్త దుస్తులు కొనడం ఈసారి వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరిగా కొనలాంటే అప్పు చేయాల్సిందే. దీపావళికి పిండి వంటలు చేసుకోవడం మామూలే. ఇందుకు చక్కెర, బెల్లం, పప్పులు, శనగపప్పు, శనగపిండి, నూనె, ఉద్దిపప్పు తదితరాలు తప్పనిసరి. వీటి ధరలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి. కూరగాయల ధరలైతే ఇక చెప్పక్కరలేదు. పేదలు పచ్చడి కూడా చేసుకోలేక బతుకీడుస్తున్నారు.
ఈ పరిస్థితిలో జిల్లాలో ఈ ఏడాది టపాకాయలు విక్రయాలు అంతగా ఆశాజనకంగా ఉండక పోవచ్చని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో దాదాపు 250 మంది లెసైన్స్ దారులు ఉండగా..ఒక్క అనంతపురం నగరంలోనే 47 మంది ఉన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా రూ.27 నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండగా ఒక్క అనంతపురం నగరంలోనే రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. మొత్తం జీరో వ్యాపారం కావడంతో ఈ విక్రయాల్లో వ్యాపారులకు 80-90 శాతం వరకు లాభాలు సమకూరుతాయి. అయితే ఈ ఏడాది అధికారులకు మామూళ్లు కూడా పెరగడంతో ఆ ప్రభావం టపాకాయల ధరలపై పడటం ఖాయం.
ధరలు ఢాం..ఢాం
Published Fri, Nov 1 2013 3:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement