టపాకాసుల దందా | Commercial Tax Officers Demanding More Money For Diwali Crackers Permit In Anantapur | Sakshi
Sakshi News home page

టపాకాసుల దందా

Published Mon, Oct 7 2019 10:13 AM | Last Updated on Mon, Oct 7 2019 10:13 AM

Commercial Tax Officers Demanding More Money For Diwali Crackers Permit In Anantapur  - Sakshi

టపాసుల పండగొస్తే కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు పండగే. శివకాశి నుంచి దొడ్డిదారిలో తెచ్చుకున్న సరుకును రాచమార్గంలో అమ్ముకునేందుకు అనధికార అనుమతులు ఇచ్చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రూ. వందల కోట్ల ఈ వ్యాపారంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారుల వాటానే ఎక్కువ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది.   

సాక్షి, అనంతపురం : జిల్లాలో ఏటా టపాసుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈ పండుగొస్తే చాలు ఇటు వ్యాపారులతో పాటు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎలాంటి పన్నులు చెల్లించకుండానే టపాసుల విక్రయాలు చేస్తూ పెద్ద ఎత్తున టపాసుల దందా సాగిస్తున్నారు. గంపగుత్తగా పన్నులు కట్టించుకుని జేబులు నింపుకుంటున్నారు. కమర్షియల్‌  అధికారులు ఉత్తుత్తి జీఎస్టీ పేరుతో టపాసుల వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్ల కార్యక్రమానికి తెరలేపుతూ సిరుల వర్షం కురిపించుకుంటున్నారు.  

ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి 
మార్కెట్లో విక్రయించే ప్రతి వస్తువుకూ పన్నులు చెల్లించాలి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సరకు తయారీ సమయంలో కానీ.. కొనుగోలు సమయంలో కానీ తప్పనిసరిగా ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. టపాసులపై  జీఎస్టీ (గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) 14 శాతం, ఎస్‌ఎస్‌టీ (సెంట్రల్‌ సర్వీస్‌ టాక్స్‌) 14శా>తం చొప్పున  మొత్తం  28 శాతం మేర పన్ను  చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతి ఏటా రూ. 100 కోట్ల నుంచి రూ.120 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు దాదాపు రూ.30 కోట్ల వరకూ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో మాత్రం పన్నుల వసూళ్లు మాత్రం న్యాయ బద్దంగా చేపట్టడం లేదు. ఇందుకు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులుకు అందుతున్న ముడుపులే కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  

అధికారులకు ముడుపులు ముట్టేదిలా.. 
జిల్లాకు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి టపాసులు దిగుమతి అవుతున్నాయి. ఇదంతా ‘జీరో’ దందానే. కొంతమంది పేరుమోసిన డీలర్లు ఈ తంతంగం నడిపిస్తున్నారు. దీపావళి పండుగ రోజు నిబంధనల ప్రకారం అన్నట్లు రెవెన్యూశాఖ అధికారులు హంగామా చేస్తారు. నెల రోజుల ముందే వ్యాపారాల అనుమతి కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్స్‌ కేటాయింపు చేస్తారు. సదరు వ్యాపారస్తులు పేరుకు మాత్రమే. కానీ వీరి వెనుక ఉన్నది పేరు మోసిన బడా లీడర్లే. తొలుత మూడు రోజుల వ్యాపారమే కదా అని కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారుల వద్ద పంచాయతీ పెడతారు. వారికి ముట్టజెప్పేది ముట్టిన తర్వాత వ్యాపారుల నుంచి గంపగుత్తగా ట్యాక్స్‌లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రూ. 5 లక్షల వ్యాపారం చేసే వ్యాపారి చేత రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు మాత్రమే ట్యాక్స్‌ చెల్లించినట్లు ఓ డీడీని సమర్పిస్తారు. అంతే ఇక ఎన్ని రూ.లక్షల సరుకు విక్రయాలు చేపట్టినా కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు కన్నెత్తి చూడరు.  

రూ.కోట్లలో వ్యాపారం చేసినా.... 
కొన్నేళ్లుగా టపాసుల వ్యాపారానికి పేరుగాంచిన ఓ నేత కోట్లకు పడగలెత్తాడు. అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు తదితర నియోజకవర్గాలోని మండలాలకు సరకును ఇతనే సరఫరా చేస్తున్నాడు. ఏటా దాదాపుగా రూ.50 కోట్ల నుంచి  రూ.60 కోట్ల వ్యాపారం ఇతనొక్కడే సాగిస్తుండడం గమనార్హం. అయితే ఆ వ్యాపారం తగ్గట్టు పన్నులు మాత్రం చెల్లించడం లేదు. పండుగ రోజు మూడురోజుల పాటు సాగే టపాసు దుకాణాల విక్రయదారులతోనే కాస్తో కూస్తో పన్నులు కట్టించి చేతులు దులుపుకుంటున్నాడు. కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు మాత్రం పెద్ద మొత్తంలో చేతులు తడిపి వ్యాపారాన్ని కొనసాగించుకుంటున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement