జేఎన్టీయూపై జీఎస్టీ కత్తి | GST Shock to JNTU A in Anantapur | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూపై జీఎస్టీ కత్తి

Published Fri, May 3 2019 10:46 AM | Last Updated on Fri, May 3 2019 10:46 AM

GST Shock to JNTU A in Anantapur - Sakshi

జేఎన్‌టీయూ: జేఎన్టీయూ(ఏ)పై జీఎస్టీ కత్తి వేలాడుతోంది. దేశవ్యాప్తంగా 2017 జూలై 1 నుంచి గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) అమల్లోకి రాగా..జాతీయ స్థాయిలో వివిధ స్లాబుల్లో అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వర్తిస్తోంది. అయితే జేఎన్టీయూ(ఏ) దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. జీఎస్టీ పన్ను గురించి తెలియకుండా వ్యవహారాలను, కార్యకలాపాలను యథాతథంగా నిర్వహిస్తోంది. ఇదే తరహాలో కార్యకలాపాలు నిర్వహించి జీఎస్టీ చెల్లించని  జేఎన్టీయూ (కాకినాడ) రూ.కోట్ల  జరిమానా చెల్లించింది. ప్రస్తుతం జీఎస్టీ అధికారులు  జేఎన్టీయూ    (ఏ) ఆర్థిక వ్యవహారాలపై దృష్టిసారించారు. ఎంత మేర పన్ను కట్టాలన్న దానిపై లెక్క తేల్చే పనిలో జీఎస్టీ అధికారులు ఉన్నారు. మరో వైపు జరిమానా సైతం విధించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపు, ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన  జేఎన్టీయూ(ఏ) కీలకాధికారి నిర్లక్ష్యం ఇపుడు వర్సిటీకి రూ.కోట్ల కష్టాలు తెచ్చిపెట్టింది.

ఏటా యూసీఎస్‌ ఫీజులు చెల్లింపు
జేఎన్టీయూ(ఏ) పరిధిలో ఏటా 60 వేల మంది విద్యార్థులు బీటెక్‌ , ఎంటెక్, ఎంఫార్మసీ,  ఎంబీఏ కోర్సులను అభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థి యూసీఎస్‌ (యూనివర్సిటీ కామన్‌ సర్వీసెస్‌ ఫీజు)ను ఏటా ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌కు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని కళాశాలల నిర్వాహకులు  జేఎన్టీయూ(ఏ)కు చెల్లిస్తారు. బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థి రూ.2,250, రెండు, మూడు, నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ. 1,500 చొప్పున ఫీజులు చెల్లిస్తారు. ఈ మొత్తం ఏడాదికి రూ.20 కోట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న ఫీజు మొత్తానికి తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. విద్యార్థి ఎంత మొత్తం చెల్లిస్తారో అంతే మొత్తంలో 14 శాతం జీఎస్టీ చెల్లించాలని నిబంధన స్పష్టం చేస్తోంది. అయితే 2017 జూలై నుంచి ఇప్పటి దాకా జీఎస్టీ నయాపైసా చెల్లించలేదు. జీఎస్టీ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పాటించలేదు. దీంతో జీఎస్టీ అధికారుల ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అధికారులు ఇప్పటికే పలు వర్సిటీలకు జరిమానా సైతం విధించారు. దీంతో జీఎస్టీ మొత్తంతో సహా జరిమానా సైతం కట్టాల్సిన పరిస్థితి  జేఎన్టీయూ(ఏ)కు ఏర్పడింది. 

దిద్దుబాటు చర్యలు
పన్ను చెల్లించాల్సిన అంశాన్ని తెలుసుకోలేకపోయిన  జేఎన్టీయూ(ఏ) కీలకాధికారి దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేశారు. ఇపుడేం చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టును వెంటనే భర్తీ చేశారు. అయినప్పటికీ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వకుండా కీలకాధికారి రిక్తహస్తం చూపించారు. అన్నీ తానే నడుపుతున్నప్పటికీ ఇలాంటి కీలకమైన అంశాలను విస్మరించడం బాధ్యారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జీఎస్టీ పన్ను చెల్లించకపోవడంతో జరిమానా విధిస్తే .. ఎవరు బాధ్యత వహిస్తారు...? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement