JNTU (A)
-
జేఎన్టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్ కోర్సుల్లో బీఈ, బీటెక్ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు. నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూప్‌లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రామ్‌ను సైతం తాజాగా కోర్ గ్రూప్‌గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. యూసీఎస్ బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్ సర్విసెస్ (యూసీఎస్) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్వోసీ) జారీచేస్తామని జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు. వర్సిటీ ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) ఎన్వోసీ జారీకి యూసీఎస్ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పోర్టల్‌లో వివరాలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది. అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి
కేపీహెచ్‌బీకాలనీ: యువత తమ ఉజ్వల భవిష్యత్‌కు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని జేఎన్టీయూహెచ్ చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శనివారం జేఎన్టీయూలో నిర్వహించిన రెండు రోజుల మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే తమ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. ఒకసారి ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటి డెవలప్మెంట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని అన్నారు. పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యా బోధనకు జేఎన్టీయూహెచ్ కృషి చేస్తున్నదని తెలిపారు. వర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారా కళ్యాణి, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ ట్రస్టీ కొండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్ మేళాలో 144 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా సుమారు 65 వేల మంది యూజీ, పీజీ, డిప్లమో, ఇంటర్, ఎస్ఎస్సి విద్యార్హతలు ఉన్న ఔత్సాహికులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
జేఎన్టీయూ(ఏ): ఎక్కడి నుంచైనా ఆన్లైన్ పరీక్షలు రాసే వీలు
అనంతపురం విద్య: ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీటిలోఏదో ఒకటి ఉంటే చాలు.. పరీక్ష హాలుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటి నుంచే ఆన్లైన్లో పరీక్ష రాసేయొచ్చు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పిస్తూ జేఎన్టీయూ (అనంతపురం) నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. బీటెక్ సెమిస్టర్ ప్రధాన పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న జేఎన్టీయూ (ఏ) ముందుగా మిడ్ పరీక్షల్లో దీన్ని అమలు చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మిడ్ పరీక్షలను ఈ నూతన విధానంలోనే ప్రారంభించారు. దీన్ని పరిశీలించాక వర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల్ని ఈ నూతన విధానంలోనే నిర్వహిస్తామని వీసీ జింకా రంగజనార్దన చెప్పారు. నూతన విధానంలో పరీక్ష నిర్వహణ కోసం వర్సిటీ ప్రత్యేక వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది. విద్యార్థి యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసిన వెంటనే మెయిల్‌కు ప్రశ్నపత్రం వస్తుంది. పరీక్షల షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన సమయానికే ప్రశ్నపత్రం అందుబాటులోకి వస్తుంది. -
నేడు ఏపీ ఈసెట్–2020
అనంతపురం విద్య: ‘ఏపీ ఈసెట్–2020’ సోమవారం రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ ఈసెట్ కన్వీనర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు. వరుసగా ఏడో దఫా జేఎన్టీయూఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌లో మొత్తం 14 బ్రాంచిలకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ (మేథమేటిక్స్), సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ బ్రాంచిలకు పరీక్ష జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మైనింగ్, ఫార్మసీ బ్రాంచిల వారికి పరీక్ష ఉంటుందన్నారు. ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు చేసి ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరీక్ష కేంద్రంలో పూర్తిగా నిషేధించామన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్ వెనుక ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ స్థానంలో తప్పనిసరిగా సంతకం చేయాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన అభ్యర్థి టెస్ట్ సర్టిఫికెట్‌ను అందజేస్తే.. ఐసోలేషన్ కేంద్రంలో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
జేఎన్టీయూపై జీఎస్టీ కత్తి
జేఎన్టీయూ: జేఎన్టీయూ(ఏ)పై జీఎస్టీ కత్తి వేలాడుతోంది. దేశవ్యాప్తంగా 2017 జూలై 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి రాగా..జాతీయ స్థాయిలో వివిధ స్లాబుల్లో అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వర్తిస్తోంది. అయితే జేఎన్టీయూ(ఏ) దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. జీఎస్టీ పన్ను గురించి తెలియకుండా వ్యవహారాలను, కార్యకలాపాలను యథాతథంగా నిర్వహిస్తోంది. ఇదే తరహాలో కార్యకలాపాలు నిర్వహించి జీఎస్టీ చెల్లించని జేఎన్టీయూ (కాకినాడ) రూ.కోట్ల జరిమానా చెల్లించింది. ప్రస్తుతం జీఎస్టీ అధికారులు జేఎన్టీయూ (ఏ) ఆర్థిక వ్యవహారాలపై దృష్టిసారించారు. ఎంత మేర పన్ను కట్టాలన్న దానిపై లెక్క తేల్చే పనిలో జీఎస్టీ అధికారులు ఉన్నారు. మరో వైపు జరిమానా సైతం విధించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపు, ఆర్థిక లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన జేఎన్టీయూ(ఏ) కీలకాధికారి నిర్లక్ష్యం ఇపుడు వర్సిటీకి రూ.కోట్ల కష్టాలు తెచ్చిపెట్టింది. ఏటా యూసీఎస్ ఫీజులు చెల్లింపు జేఎన్టీయూ(ఏ) పరిధిలో ఏటా 60 వేల మంది విద్యార్థులు బీటెక్ , ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ కోర్సులను అభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థి యూసీఎస్ (యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ ఫీజు)ను ఏటా ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌కు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని కళాశాలల నిర్వాహకులు జేఎన్టీయూ(ఏ)కు చెల్లిస్తారు. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి రూ.2,250, రెండు, మూడు, నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ. 1,500 చొప్పున ఫీజులు చెల్లిస్తారు. ఈ మొత్తం ఏడాదికి రూ.20 కోట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న ఫీజు మొత్తానికి తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. విద్యార్థి ఎంత మొత్తం చెల్లిస్తారో అంతే మొత్తంలో 14 శాతం జీఎస్టీ చెల్లించాలని నిబంధన స్పష్టం చేస్తోంది. అయితే 2017 జూలై నుంచి ఇప్పటి దాకా జీఎస్టీ నయాపైసా చెల్లించలేదు. జీఎస్టీ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పాటించలేదు. దీంతో జీఎస్టీ అధికారుల ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అధికారులు ఇప్పటికే పలు వర్సిటీలకు జరిమానా సైతం విధించారు. దీంతో జీఎస్టీ మొత్తంతో సహా జరిమానా సైతం కట్టాల్సిన పరిస్థితి జేఎన్టీయూ(ఏ)కు ఏర్పడింది. దిద్దుబాటు చర్యలు పన్ను చెల్లించాల్సిన అంశాన్ని తెలుసుకోలేకపోయిన జేఎన్టీయూ(ఏ) కీలకాధికారి దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేశారు. ఇపుడేం చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టును వెంటనే భర్తీ చేశారు. అయినప్పటికీ ఫైనాన్స్ ఆఫీసర్‌కు కనీసం చెక్ పవర్ ఇవ్వకుండా కీలకాధికారి రిక్తహస్తం చూపించారు. అన్నీ తానే నడుపుతున్నప్పటికీ ఇలాంటి కీలకమైన అంశాలను విస్మరించడం బాధ్యారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జీఎస్టీ పన్ను చెల్లించకపోవడంతో జరిమానా విధిస్తే .. ఎవరు బాధ్యత వహిస్తారు...? అనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
కరువు సీమకు కల్పతరువు..
సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు. గత విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వహణకు సరైన స్థలాన్ని గుర్తించాలని కమీషనర్ పాండాదాస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. -
బది‘లీల’లు
సాక్షి, అనంతపురం: జిల్లాలో బదిలీల ప్రక్రియ మొదలైంది. తొలుత జేఎన్టీయూ(ఏ)లో బదిలీల ప్రక్రియ మొదలు కాగా, మలి దశలోరెవెన్యూశాఖలోని సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి. మరో రెండు మూడురోజుల్లో పోలీసుశాఖలోని ఎస్ఐలు, సీఐల బదిలీలు జరగనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ఎస్ఐలు, సీఐలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొంత మంది హైదరాబాద్‌లో తిష్టవేశారు. గడిచిన ఎన్నికల్లో తమకు మద్దతుగా పనిచేయలేదన్న భావనతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులను ముందుగా బదిలీ చేయించి..వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని రప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఆర్డీఓ వెంకటేశంను బదిలీ చేయించి..ఆయన స్థానాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందుల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామమూర్తితో భర్తీ చేసేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితో పాటు మంత్రులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక కళ్యాణదుర్గం ఆర్డీఓ మలోలను కర్నూలుకు బదిలీ చేయించి.. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామారావును రప్పించుకునేందుకు అధికార పార్టీ నాయకులు మార్గం సుగమమం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాజీవ్ విద్యామిషన్‌కు ఇన్చార్జ్ పీవోగా వ్యవహరిస్తున్న డీఈఓ మధుసూదన్‌రావును ఆ బాధ్యతల నుంచి తప్పించి..ఆయన స్థానంలో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు జిల్లా మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో సీఎం పచ్చజెండా ఊపిన వెంటనే వీరికి బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ కానున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరిపాలనదక్షుడు, మంచి మాటకారిగా పేరుపొందిన జేసీని తూర్పుగోదావరి జిల్లాకు రప్పించుకునేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే జేసీని మరికొంత కాలం పాటు జిల్లాలోనే పనిచేయాలని మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డిలు సూచించినట్లు సమాచారం.