జేఎన్‌టీయూహెచ్‌లో జాబ్ మేళాను ప్రారంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై
కేపీహెచ్‌బీకాలనీ: యువత తమ ఉజ్వల భవిష్యత్‌కు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని జేఎన్‌టీయూహెచ్ చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శనివారం జేఎన్‌టీయూలో నిర్వహించిన రెండు రోజుల మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే తమ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు.
ఒకసారి ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటి డెవలప్‌మెంట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని అన్నారు. పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జేఎన్‌టీయూ జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యా బోధనకు జేఎన్‌టీయూహెచ్ కృషి చేస్తున్నదని తెలిపారు.
వర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారా కళ్యాణి, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ ట్రస్టీ కొండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్ మేళాలో 144 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా సుమారు 65 వేల మంది యూజీ, పీజీ, డిప్లమో, ఇంటర్, ఎస్‌ఎస్‌సి విద్యార్హతలు ఉన్న ఔత్సాహికులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment