సాక్షి, అనంతపురం: జిల్లాలో బదిలీల ప్రక్రియ మొదలైంది. తొలుత జేఎన్‌టీయూ(ఏ)లో బదిలీల ప్రక్రియ మొదలు కాగా, మలి దశలోరెవెన్యూశాఖలోని సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు, తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి. మరో రెండు మూడురోజుల్లో పోలీసుశాఖలోని ఎస్‌ఐలు, సీఐల బదిలీలు జరగనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ఎస్‌ఐలు, సీఐలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొంత మంది హైదరాబాద్‌లో తిష్టవేశారు. గడిచిన ఎన్నికల్లో తమకు మద్దతుగా పనిచేయలేదన్న భావనతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులను ముందుగా బదిలీ చేయించి..వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని రప్పించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు.
ఇందులో భాగంగా పెనుకొండ ఆర్డీఓ వెంకటేశంను బదిలీ చేయించి..ఆయన స్థానాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందుల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామమూర్తితో భర్తీ చేసేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితో పాటు మంత్రులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక కళ్యాణదుర్గం ఆర్డీఓ మలోలను కర్నూలుకు బదిలీ చేయించి.. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామారావును రప్పించుకునేందుకు అధికార పార్టీ నాయకులు మార్గం సుగమమం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాజీవ్ విద్యామిషన్‌కు ఇన్‌చార్జ్ పీవోగా వ్యవహరిస్తున్న డీఈఓ మధుసూదన్‌రావును ఆ బాధ్యతల నుంచి తప్పించి..ఆయన స్థానంలో నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు జిల్లా మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మరో రెండు మూడు రోజుల్లో సీఎం పచ్చజెండా ఊపిన వెంటనే వీరికి బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ కానున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరిపాలనదక్షుడు, మంచి మాటకారిగా పేరుపొందిన జేసీని తూర్పుగోదావరి జిల్లాకు రప్పించుకునేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే జేసీని మరికొంత కాలం పాటు జిల్లాలోనే పనిచేయాలని మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డిలు సూచించినట్లు సమాచారం.
బది‘లీల’లు
Published Wed, Sep 10 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement