Department of Revenue
-
దేవుడి భూముల్లో ‘సౌర’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్ : దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కానుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు దశాబ్దాలుగా వృథాగా ఉంటున్నాయి. ఈ భూముల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వ్యవసాయానికి ఉపయోగపడని భూములను గుర్తించి వాటిల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా దేవాదాయ శాఖ కాకుండా.. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీలు) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూములు ఇవ్వటం ద్వారా లీజు రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయం రానుండగా, సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ రూపంలో ఎస్‌హెచ్‌జీలకు రాబడి సమకూరుతుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల భూములను గుర్తించి ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో రెడ్కో, ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రస్తుతానికి 250 ఎకరాల భూములను గుర్తించారు. 62 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వీలుంది. వీటి ద్వారా నిత్యం సగటున 2.48 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి ఆలనాపాలనా అంత పక్కాగా లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. వీటిల్లో విడిపించుకోదగ్గ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధిత దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు పొందే కసరత్తు దేవాదాయ శాఖ ప్రారంభించింది.ఇప్పటికే 57 శాతం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయించారు. ఇప్పటికి స్వాధీనం అయిన భూములు, కబ్జా కాకుండా ఉన్న భూములను దేవాలయాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభమైంది. అయితే వ్యవసాయ యోగ్యంగా లేని భూములపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి లేకుండా పోయింది. ఇప్పుడు వాటిల్లో సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే దీన్ని సొంతంగా నిర్వహించగలిగే స్థాయిలో దేవాదాయ శాఖ వద్ద మానవవనరులు లేవు. దీంతో ఎస్‌హెచ్‌జీలను తెరపైకి తెచ్చారు.దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాల భూములుఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రెండుదశల్లో నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో ఐదు దేవాలయాలకు చెందిన 231 ఎకరాలను గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 20 ఎకరాలు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి చెందిన 100 ఎకరాలు, నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ గోశాలకు చెందిన 96 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాలు, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బుజలాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి చెందిన 6 ఎకరాలను మొదటి దశ కోసం గుర్తించారు. రెండో దశలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబాబాద్‌లోని శ్రీ శివాలయం, హనుమకొండ రాగన్న దర్వాజా ప్రాంతంలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవాలయాలకు చెందిన 21 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు.వీటిల్లో త్వరలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్లో రెడ్ కో, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఎకరాకు రూ.15 వేల మేర లీజును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘రెవెన్యూ’ సేవల్లో తేడా కనపడాలి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్‌మోడల్‌గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. 3 నెలలకోసారి లీగల్ సమావేశాలు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. అందరికీ శిక్షణ తప్పనిసరి.. రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు. ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం పెంపు సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టండి సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్‌కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సినిమా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నేలకూలిన 150 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా (నిద్ర గన్నేరు) వృక్షాన్ని తిరిగి అదే ప్రదేశంలో బతికించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటించారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి బుధవారం కూలిన చెట్టును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కెమికల్ ట్రీట్మెంటు ద్వారా ఈ చెట్టును మళ్లీ చిగురింప జేసేందుకు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ముందుకొచి్చందన్నారు. -
‘ధరణి’ అధికారాల బదలాయింపు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. ♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. ♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతేనే సీసీఎల్ఏకు ♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్‌తో పాటు సీసీఎల్ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది. ♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు. ♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. -
రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌరవాన్ని పెంచుతాయని వివరించారు. సీఎం జగన్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ఈ భూముల యజమానులు ఎన్ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్ జగన్ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని, ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు. వైఎస్సార్ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు. 15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్‌ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు ఒక స్కూల్ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్‌ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు. తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రతి సెక్రటేరియట్ ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్ ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్ఓఆర్ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్ టైటిల్‌తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు. వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్‌కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్ భూములపై హక్కులు నిరుపేదలకు వరం. గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్లైన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అసైన్డ్ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్. సీఎం జగన్ ఫిలాసఫీ లోకల్టెక్. చంద్రబాబు కార్పొరేట్ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది. అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు.. జగన్ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహనరావు చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్ రీజియన్‌లో 1,400 ఎకరాల అసైన్డ్ భూములను దోచుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. అభినవ కొమరం భీం జగన్ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి అసైన్డ్ భూములకు సీఎం వైఎస్ జగన్ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్.. అభినవ కొమరం భీం. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వీఆర్వోలు ‘వెనక్కి’?
సాక్షి, హైదరాబాద్: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్ అసిస్టెంట్... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్‌మన్, అటెండర్ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది. వీఆర్ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక ఇబ్బందితో.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్‌గా, తోటమాలిగా, అటెండర్‌గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని అంటున్నాయి. పని లేక.. జీతాలు రాక.. ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు. సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. సంఘాలకు అతీతంగా సమావేశమై.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీఆర్‌ఏలతోనే తంటా! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్‌లో పనిచేసిన వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసు వ్యవహారాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు. -
నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంటు, సదరు ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, లేదంటే ఆ ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు నిరూపించే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆస్తులు ఉంటే వాటికి జీవోలు 58, 59 (ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ) ద్వారా పరిష్కారం చూపిస్తారు. లేదంటే నేరుగా పరిష్కరిస్తారు. ఈ విధంగా రిజిస్టర్ చేసేందుకు 125 గజాల లోపు ఉన్న ఆస్తులపై ఎలాంటి స్టాంపు డ్యూటీ వసూలు చేయరు. అంతకు మించితే మాత్రం మార్కెట్ రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.5 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి గడువును పేర్కొనలేదు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్‌ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
చరిత్రాత్మక నిర్ణయం.. ‘అసైన్డ్’ రైతుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు ఇవ్వడం భూముల వ్యవహారాల్లోనే మేలి మలుపు. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లక్షలాది మంది రైతుల బతుకు చిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. భూమి లేని నిరుపేదలు, ఆర్మీలో పని చేసిన వారు, స్వాతంత్య్ర సమర యోధులకు వ్యవసాయ భూములు ఇస్తారు (అసైన్ చేస్తారు). తమకు ఇచ్చిన భూములను స్వాతంత్య్ర సమర యోధులు, ఆర్మీలో పని చేసిన వారు (ఎక్స్ సర్వీస్‌మెన్).. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ నిరుపేదలు మాత్రం అమ్ముకునే అవకాశం లేదు. 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో ఈ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22 (ఎ)లో పెట్టారు. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసే ప్రక్రియ ప్రారంభించింది. 1954 తర్వాత అసైన్డ్ అయిన భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయి. 1977లో ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–పీఓటీ) చట్టం వచ్చింది. దీని ప్రకారం భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు అమ్ముకోకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, చదువుల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా అమ్ముకునే అవకాశం లేదు. ఈ చట్టం రూపొందించడానికి ముందు ఉన్న అసైన్డ్ భూములు కూడా ఈ చట్టం వల్ల నిషేధిత జాబితాలోకి వచ్చేశాయి. హక్కు లేక.. అమ్ముకోలేక.. తమకు ఇచ్చిన భూమిలో ఏదైనా అవసరం వచ్చి అరెకరం, ఇంకొంత గానీ అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోలేని పరిస్థితి ఉండడంతో అసైన్డ్ రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేక కాగితాల మీద రాసి అమ్మకాలు జరిపారు. ఫలితంగా వారికి రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా దక్కేది కాదు. తక్కువ రేటుకే తమ భూములను సాదాబైనామాల పద్ధతిలో అమ్ముకునేవారు. ఆ భూమిపై హక్కు లేకపోవడం వల్ల రెవెన్యూ శాఖ ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది. ఆ భూమి ప్రభుత్వం తీసేసుకుంటుందని, వేరే అవసరాలకు రిజర్వు చేస్తోందనే భయాందోళనలు రైతుల్లో ఉండేవి. మరో వైపు రెవిన్యూ రికార్డులు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని తెలిపేలా లేవు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్డ్ చేస్తే ఆ రికార్డులు క్షేత్ర స్థాయికి తగ్గట్టుగా లేవు. 1954 నుంచి అసైన్మెంట్లు (కేటాయింపులు) జరుగుతూనే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు లేవు. ప్రజాప్రతినిధుల కమిటీతో విస్తృత అధ్యయనం ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. కేరళ రాష్ట్రంలో అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. తమిళనాడులో మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు, వారు లేకపోతే వారి వారసులు (హక్కుదారులు) వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ భావించింది. ఇందుకోసం ఏపీ అసైన్మెంట్ (పీఓటీ)–1977కు సవరణలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అంటే అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్దారులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15.21 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు మేలు జరుగుతుంది. సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. 20 ఏళ్లకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. ఈ 20 ఏళ్లలో 4,00,695 మందికి 5,88,211 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ప్రతి సంవత్సరం రెవిన్యూ విభాగం 20 ఏళ్లు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి, వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. గతంలో మాదిరిగా ఒక భూమిని 22(ఎ) నుంచి తొలగించాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ శాఖ తనకు తానే 20 ఏళ్లు దాటిన భూములను జాబితా నుంచి తీసివేస్తుంది. అసైన్డ్ రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అవినీతి ఉండదు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎటువంటి హక్కులు రావు. అలాంటి వారి విషయంలో 1977 పీఓటీ చట్టం అమల్లో ఉంటుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలు అమ్ముకోవచ్చు వ్యవసాయ భూములే కాకుండా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఇళ్లపై 20 సంవత్సరాల తర్వాత గత చట్టాల ప్రకారం సర్వ హక్కులు లభించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 ఏళ్లకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన వారితోపాటు, మిగిలిన వారికీ ఇది వర్తిస్తుంది. -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్‌లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్‌ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
రెవె‘న్యూ’ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏ.. గ్రామ రెవెన్యూ సహాయకుడు.. పేరుకే రెవెన్యూ ఉద్యోగి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాల్లోనూ భాగస్వామ్యం ఉంటుంది. వీఆర్ఏలు అంటే గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి లాంటి వారనే అభిప్రాయమూ ఉందంటే వారిదెంతటి కీలక పాత్రో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేశాక.. వీఆర్ఏలే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఏకైక దిక్కుగా మిగిలారు. అలాంటి వీఆర్ఏల సేవలు గ్రామాల్లో అవసరం లేదని, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గందరగోళానికి దారితీస్తోంది. వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వారిని ఇతర శాఖలకు పంపితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఏల విధులెన్నో.. వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరి జాబ్‌చార్ట్ మాత్రం మిగతా ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లోని చెరువులు, కుంటల సంరక్షణతో పాటు ఏ చెరువు కట్ట తెగినా, వాగులు పొంగినా, అలుగులు పోసినా నీటిపారుదల శాఖ ఏఈ, డీఈలకు వీఆర్ఏలే ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. గతంలో అయితే నీటి పంపకం (తైబందీ) కూడా వీరి పర్యవేక్షణలోనే జరిగేది. ఇక, గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాట్లు చేసేది, గ్రామంలోకి ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా దగ్గరుండి గ్రామానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది వీఆర్ఏలే. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత కూడా వీరిదే. పదో తరగతి నుంచి అన్ని స్థాయిల్లోని పరీక్షలకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, పంట నష్టం, శాంతిభద్రతలు, అగ్నిప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం కోసం వీఆర్ఏలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల (పోలింగ్) ప్రక్రియలో సైతం తెరవెనుక పనిచేస్తుంటారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు నుంచి ఆయా స్టేషన్లలో వసతుల కల్పన, పోల్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ బాక్సుల పర్యవేక్షణ (స్ట్రాంగ్ రూంలకు తరలించేంతవరకు) చేసేది వీఆర్ఏలే. గ్రామాల్లో ‘ప్రభుత్వ ప్రతినిధి‘! ఇక గ్రామాల్లో హత్యలు జరిగినప్పుడు, గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినప్పుడు, దోపిడీలు, ఆత్మహత్యల్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీఆర్ఏలే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిస్తారు. గంజాయి రవాణా, స్మగ్లింగ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉండేలా పోలీసులు నిర్వహించే పంచనామాలో సాక్షులుగా (పంచ్) వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. వీటితో పాటు 56 రకాల రెవెన్యూ విధులను వీరు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉండే వ్యక్తి వీఆర్ఏ. అలాంటి వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపిస్తే రెవెన్యూ శాఖ పునాదులు కదలడం ఖాయమని, ఆ వ్యవస్థ మనుగడే కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర శాఖలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వీరి నిష్క్రమణ కారణంగా ఎదురయ్యే సమస్యలకు గ్రామస్థాయిలో పరిష్కారమే ఉండదని అంటున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిని.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై మౌనం పాటిస్తున్నారు. వారు వెళితే కష్టమే.. వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే వారికి పేస్కేల్ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలా కాకుండా వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసే వారుండరు. రెవెన్యూ పాలనే కాదు.. ఇతర శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు కూడా కష్టతరమవుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. – కె.గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఆర్ఏలకు సంబంధించిన గణాంకాలివీ.. రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు: 10,416 మొత్తం వీఆర్ఏ పోస్టుల సంఖ్య: 23,046 విధుల్లో ఉన్న వీఆర్ఏలు: 21,434 డిగ్రీ, ఆపైన చదువుకున్నవారు: 2,909 ఇంటర్ విద్యార్హతలున్నవారు: 2,343 పదో తరగతి చదివినవారు: 3,756 పదో తరగతిలోపు చదువుకున్నవారు: 7,200 నిరక్షరాస్యులు: 5,226 విద్యార్హతలపై కిరికిరి? ► ఇతర శాఖలకు పంపే మాట అటుంచితే కేబినెట్ ఆమోదించిన విధంగా వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిని క్రమబద్ధీకరించే విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు చాలామందిని పేస్కేల్ నుంచి దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలలో కేవలం 9,008 మందికి మాత్రమే 10వ తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్నాయి. మిగిలిన 12,426 మంది వీఆర్ఏలు పదో తరగతి కన్నా తక్కువ చదువుకోగా, వీరిలో 5వేల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఒకవేళ విద్యార్హతలే క్రమబద్ధీకరణకు ప్రామాణికమైతే తగిన విద్యార్హతలు లేని వీఆర్ఏల కుటుంబాల్లో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వాలని వీఆర్ఏల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేస్తున్నాయి. కానీ రెవెన్యూ వర్గాలు మాత్రం.. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న మెజారిటీ వీఆర్ఏల విషయంలో ఏం నిర్ణయం తీసుకునేదీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో 11 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో భూపరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ప్రతిపాదన సముచితమేనని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని హెచ్ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని బీఆర్ఎస్కు కేటాయిస్తామని ఆ శాఖ పేర్కొంది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ పేరిట బదలాయించడం లాంఛనమే కానుంది. అయితే, కేబినెట్ నిర్ణయాల ను వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచడం, తమకు భూమిని కేటాయించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించిన వారంరోజుల్లోనే రెవెన్యూశాఖ అంగీకారం తెలిపి మంత్రివర్గ సమావేశం ముందు నోట్ పెట్టడం, కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదన ఇదే కేబినెట్ ముందు భూపరిపాలన శాఖ పెట్టిన నోట్ ప్రకారం ఈనెల 12న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట భూకేటాయింపు కోసం ప్రతిపాదన వచ్చింది. ఈ భూమిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కేంద్రంలో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, శిక్షణ తీసుకునే వారికి వసతి, సెమినార్ రూమ్‌లు, విద్యావేత్తలకు పని ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక కార్యకర్తలు, ప్రజా నాయకుల అవసరాలను తీర్చేందుకు ఇదో ప్రతిష్టాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇందుకు కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో గల 11 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగానే.. బీఆర్ఎస్ ప్రతిపాదనను పరిశీలించిన భూపరిపాలన శాఖ కేబినెట్ ముందు సవివరంగా నోట్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉన్న 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి కేటాయించినట్టు ఈ నోట్లో పేర్కొంది. జాతీయస్థాయిలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని కేటాయించినట్టు తెలిపింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత ఏప్రిల్ 28న ఆ భూమిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పునర్కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీకి బోయిన్‌పల్లిలో భూమి ఇచ్చినట్టుగానే కోకాపేటలో బీఆర్ఎస్కు భూమి ఇవ్వడం సముచితమేనని భూపరిపాలన శాఖ ఆ నోట్లో స్పష్టం చేసింది. రూ.40 కోట్లకు...? ఈ భూమిని కేబినెట్ నిర్ణయించిన ధరకు బీఆర్ఎస్కు కేటాయిస్తామని భూపరిపాలన శాఖ నోట్లో పేర్కొంది. దీనిప్రకారం ఈ భూమి తమ పేరిట బదలాయించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రూ.40 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని రూ.40 కోట్లకు బీఆర్ఎస్కు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున మాత్రమే తీసుకుని విలువైన భూములను బీఆర్ఎస్ పేరిట బదలాయించుకున్నారని, హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని, ఇది బీఆర్ఎస్ భూదాహానికి నిదర్శనమనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. -
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్‌బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్‌బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్‌బుక్‌లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్‌బుక్‌లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్‌బుక్‌లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్‌బుక్‌ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్‌బుక్‌లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్‌బుక్‌లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్‌బుక్‌లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్‌బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. ట్రాన్స్‌పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
‘చుక్కల’ చిక్కుల్లేవ్!
సాక్షి, అమరావతి: భూముల చరిత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా స్తంభించిపోయిన చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతన్నలకు ఊరట కల్పించింది. రెవెన్యూ శాఖ నిర్వహించిన సుమోటో వెరిఫికేషన్ ద్వారా రికార్డులన్నింటినీ పూర్తిగా పరిశీలించి చుక్కల నుంచి విముక్తి కల్పించింది. ‘‘22 ఏ (1) ఇ’’ నుంచి తొలగిస్తూ ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించిన జీవోలు జారీ కాగా మిగతావి త్వరలో వెలువడనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 43 వేల ఎకరాల చుక్కల భూములకు విముక్తి లభించింది. ఈ భూములను రైతులు ఇక స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. వాటిపై రుణాలు పొందేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లక్షల మంది రైతు కుటుంబాల్లో మానసిక వేదనను తొలగిస్తూ చుక్కల భూములకు విముక్తి కల్పించిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూముల సమస్యలపై స్పెషల్ ఫోకస్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూముల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అన్ని భూములను రీ సర్వే చేస్తోంది. షరతుల గల పట్టా భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డలో 18 వేల ఎకరాలకు సంబంధించి రైతులకు మేలు జరిగింది. అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు చట్టాన్ని మార్చింది. కృష్ణా, గోదావరి డెల్టాలోని లంక భూములకు డి పట్టాలిచ్చేందుకు నిబంధనలను సవరించింది. అదే క్రమంలో చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తోంది. నిషేధిత ఆస్తుల జాబితాలోని 22 ఏ (1) ఇ నుంచి చుక్కల భూములను తొలగించింది. నిబంధనలకు అనుగుణంగా ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని తొలుత జిల్లా కలెక్టర్లను ఆదేశించినా వివాదాలు, దళారుల కారణంగా అడుగు ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. 1.81 లక్షల సర్వే నెంబర్ల రీ–వెరిఫికేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలో చుక్కల భూములన్నింటినీ సుమోటోగా రీ వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022 ఆగస్టు 22, 25వ తేదీల్లో జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ రెండు సర్క్యులర్లు జారీ చేశారు. చుక్కల భూములు కాకపోయినప్పటికీ 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22–ఏ (1)ఇ కింద నమోదు చేసిన భూములతోపాటు అసలు నిషేధిత జాబితాలో చేర్చకూడని వాటిని 22 ఏలో పొందుపరచిన కేసులపై ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను రెవెన్యూ యంత్రాంగం సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీవోలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నెంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు, రెవెన్యూ శాఖ నిర్వహించే 10 (1) అకౌంట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా కోర్టు ఉత్తర్వులుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2017లో చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి ఆ భూమి 11 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం సంబంధిత రైతు ఆధీనంలో ఉందో లేదో పరిశీలించారు. ఆర్ఎస్ఆర్ (రీ–సెటిల్మెంట్ రిజిష్టర్)లోని 16వ కాలమ్‌లో చుక్కల భూమిగా నిర్దేశించే కాలమ్‌ను పరిశీలించారు. వీటి ప్రకారం రికార్డుల్లో పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా సంబంధిత రైతు ఆధీనంలో భూమి ఉంటే 22 (ఏ)1 ఇ నుంచి తొలగించారు. అలాగే చుక్కల భూముల కేటగిరీ కిందకు రావని గుర్తించిన భూములను నిబంధనల ప్రకారం ఏ కేటగిరీలో చేర్చాలో అందులో (22ఏ (1) చేర్చారు. రైతులకు సర్వ హక్కులు నిషేధిత జాబితాలో ఉండడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లను ఇన్నాళ్లూ నిలిపివేశారు. పంట రుణాలు కూడా రావడంలేదు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరగడమే కానీ ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నింటికీ తెర దించుతూ చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్ జగన్ ముగింపు పలికారు. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. ప్రణాళిక ప్రకారం చుక్కల భూముల సమస్యను పరిష్కరించి వాటికి విముక్తి కలిగించి లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీనిద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభిస్తాయి. 15 ఏళ్ల అవస్థలు తీరాయి.. గ్రామంలో పూర్వీకులు నుంచి వచ్చిన 2.50 ఎకరాలు భూమిని 15 ఏళ్ల క్రితం రెడ్ మార్క్‌లో పెట్టారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. అప్పటి నుంచి పొలం అమ్ముకోవాలంటే రిజిస్టర్ కాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా. సమస్య పరిష్కరించాలని చాలాసార్లు అధికారులకు అర్జీలిచ్చినా స్పందన లేదు. సీఎం జగన్ ప్రభుత్వం మా సమస్యను ఇంత సులభంగా పరిష్కరిస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – జానపాటి అవులయ్య, వేములకోట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.. 18 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 432–3, 4లో 2.30 ఎకరాల భూమి కొన్నాం. అప్పటి నుంచి అందులో సాగు చేసుకుంటున్నాం. 2015లో ఆ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. దీంతో విక్రయించేందుకు, బ్యాంకు రుణం పొందేందుకు వీలు లేకుండా పోయింది. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇన్నాళ్లకు మా భూమిని చుక్కల నుంచి తప్పించినట్లు చెప్పారు. మేం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించారు. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం – నల్లగొర్ల మస్తానయ్య, మహిమలూరు, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా చుక్కల భూములంటే? ఆంగ్లేయుల హయాంలో నిర్వహించిన రీ సర్వేలో కొందరు భూ యజమానులు సర్వేకు ముందుకు రాకపోవడం, భూమి ఎవరిదో నిర్థారించలేకపోవడంతో ఆర్ఎస్ఆర్–1లోని పట్టాదార్ కాలమ్, రిమార్క్స్ కాలమ్‌లో మూడు చుక్కలు పెట్టి వదిలేశారు. శిస్తు కట్ట లేని రైతులు సర్వేకు విముఖత చూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదు కాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ సర్వే జరగలేదు. రికార్డులు అలా చుక్కలతోనే ఉండడంతో వాటిని చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిసి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు తదితరులు ఉన్నారు. -
ఆదాయం లేని ఆలయాలకు ఊరట
సాక్షి, అమరావతి: ఆదాయం తక్కువ ఉండే ఆలయాలపై అదనపు భారాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ సోమవారం జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు జారీచేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. కమిషనర్ ముందుగానే ఆయా ఆలయాల నుంచి ఆ తరహా ఫీజులను వసూలు చేయవద్దని సూచిస్తూ మెసేజ్ ఆదేశాలు జారీచేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవదాయ శాఖకు చెల్లించాలి. ఆదాయం తక్కువ ఉండే పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి. దేవదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్ ఫీజుగా 1.5 శాతం చొప్పున చెల్లించాలి. ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ తరహా ఫీజులు వసూలు నుంచి మినహాయించే విషయం పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితిని ఏటా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. 95 శాతం ఆలయాల ఆదాయం రూ.ఐదులక్షల లోపే.. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు ఉన్నాయి. వీటిలో ఏటా రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు 23,465 ఉన్నాయి. అంటే దేవదాయ శాఖ పరిధిలోని మొత్తం గుళ్లలో ఏటా రూ.ఐదులక్షల లోపు నికర ఆదాయం ఉండే ఆలయాలే 95 శాతం. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉన్న వాటిలో 4,131 ఆలయాలు మాత్రమే దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల (ఈవోల) పర్యవేక్షణలో ఉన్నాయి. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితి పెంపుతో కొత్తగా 1,254 ఆలయాలకు లబ్ధికలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆలయాలు ఏటా రూ.7.31 కోట్ల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉందని వెల్లడించారు. అర్చకుల జీతభత్యాలకు వెసులుబాటు.. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం అమలుకు కృషిచేస్తున్న అందరికీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
రెవెన్యూలో క్రమశిక్షణ కొరడా
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇద్దరు తహసీల్దార్లను ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా రివర్షన్ ఇచ్చారు. మరొకరికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వగా ఇంకో ముగ్గురికి ఇక్రిమెంట్లలో కోత విధించారు. భూముల వ్యవహారాల్లో అక్రమాలు చేస్తే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల తహసీల్దార్ సీహెచ్ శ్రీదేవికి నాలుగు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా రివర్షన్ ఇచ్చారు. 2017లో ఆమె పెద్దపంజాణి మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు ముత్తుకూరు గ్రామంలో 350 ఎకరాల అటవీ శాఖ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయ్యి రిలీవైన తర్వాత రోజు వెబ్ ల్యాండ్‌లో ఈ మార్పులు చేయించినట్లు తేలింది. ఆమెకు సహకరించిన పెద్దపంజాణి వీఆర్వో డి.శ్రీనివాసులను సైతం పూర్తిగా విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె తహసీల్దార్ ఈశ్వరయ్య అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2017లో ఆయన అట్లూరు మండల తహసీల్దార్‌గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసినట్లు రుజువైంది. ఒక వీఆర్వో భార్య పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూముల్ని మార్చినట్లు విచారణలో తేలడంతో విదుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ తహసీల్దార్ డి.చంద్రశేఖర్‌ను శాశ్వతంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి రివర్షన్ చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ పి.విజయకుమారి, అదే జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ పీవీ రమణకు రివర్షన్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దార్ డీవీబీ వరకుమార్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్లు టి.రామకృష్ణ, కె.శ్రీని వాసరావు, ఏలూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ పి రాకడమణికి ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. చితూ ్తరు జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ నరసింహులకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిప్యూటీ సర్వేయర్, మరో టైపిస్ట్పైనా చర్యలు తీసుకున్నారు. గతంలోలాగా కాకుండా.. గతంలో అక్రమాలు బయట పడితే సస్పెండ్ చేసి వదిలేసేవారు. దీంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని ఏమీ జరగనట్లు పనిచేసేవారు. ఆ అక్రమాలపై తదుపరి విచారణ ఏళ్ల తరబడి కొనసాగేది. చివరికి వాటి నుంచి ఎలాగోలా బయటపడి క్లీన్చిట్ తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అక్రమాలు నిజమని తేలితే ఊహించని విధంగా చర్య తీసుకుంటుండటంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వణికిపోతున్నారు. రివర్షన్ అనే పదం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న వి చారణలు త్వరితగతిన పూర్తి చేసేలా తమ శాఖ వి జిలెన్స్ విభాగాన్ని సీసీఎల్ఏ సాయిప్రసాద్ పరుగులు పెట్టిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తాజా ఘటనలతో అక్రమాలు అంటేనే ఉలిక్కిపడుతున్నారు. -
సర్వే సెటిల్మెంట్ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్‌లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అవుతున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్ డివిజన్ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్ హోదాకు పెంచారు. రీజినల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జాయింట్ డైరెక్టర్ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉండేవారు. ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్ పోస్టును మండల ల్యాండ్ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో డెశీ అండ్ జియో ఇన్ఫర్‌మ్యాటిక్స్‌గా మార్చారు. సెంట్రల్ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్ సర్వే ఆఫీస్ అండ్ జియో స్పేషియల్ వింగ్‌గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. -
Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫైల్‌పై సీఎం సంతకం పెట్టడమే తరువాయి అని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తుండగా.. అందులో 3–6 తరగతుల మధ్య, 7–9 తరగతుల మధ్య, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించింది. ఇదే సమయంలో 1 నుంచి 9వ తరగతి వరకు.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలనూ తీసుకుంది. ఈ కేటగిరీల మేరకు పదో తరగతి, ఆపై చదివినవారు 5 వేల మంది వరకు ఉంటారని, వారికి పేస్కేల్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. రెవెన్యూ సంఘాలు ఈ ప్రతిపాదనల విషయంగా ఉన్నతాధికారులను సంప్రదించినా.. విద్యార్హతల ఆధారంగా ప్రతిపాదనలు పంపుతున్నామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టింగ్ ఎక్కడెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలలో ఎంత మందిని ఏయే శాఖలకు పంపుతారనే దానిపై రెవెన్యూ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారని.. అయితే డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు పంపుతారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అలాకాకుండా పేస్కేల్ వర్తించేవారు, డైరెక్ట్ రిక్రూటీలను మాత్రమే రెవెన్యూలో కొనసాగించి.. మిగతా వారిని వివిధ శాఖలకు పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు డైరెక్ట్ రిక్రూటీలలో కొందరిని వ్యవసాయశాఖకు కూడా పంపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు అంటున్నారు. గౌరవ వేతనం కేటగిరీలోకి వచ్చే వీఆర్ఏలను ప్రభుత్వం తన అవసరాలను బట్టి వివిధ శాఖల్లో ఉపయోగించుకుంటుందని, ఈ మేరకు నీటిపారుదల శాఖలోకి లష్కర్లుగా వెళ్లేవారికి గౌరవ వేతనమే ఉంటుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అంతా గప్‌చుప్‌గా..! వీఆర్ఏలు, వీఆర్వోల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నోరు మెదిపేందుకు ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు. సీసీఎల్ఏ అధికారులను ఎప్పుడు అడిగినా.. తమకేం తెలియదంటూ దాటవేస్తున్నారని, కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదని వీఆర్ఏల సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు కొన్ని వీఆర్ఏ సంఘాలు ఈనెల 23న పేస్కేల్ కోసం సీసీఎల్ఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇప్పుడే వీఆర్ఏ పేస్కేల్ అంశం పరిష్కారం కావాలని.. లేకుంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన వీఆర్ఏలలో కనిపిస్తోంది. ఐదేళ్లుగా నాన్చుడే.. అర్హతల మేరకు సర్వీసు క్రమబద్ధీకరణ, డ్యూటీ చార్ట్, పేస్కేల్ ఇస్తామని సీఎం స్పష్టంగా మూడుసార్లు ప్రకటించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించ నట్టు.. అధికారులు మా సమస్యను ఐదేళ్లుగా నాన్చుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. – రమేశ్ బహదూర్, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన బాట వీడం న్యాయమైన మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వేల మంది వీఆర్ఏలకు సంబంధించిన అంశాన్ని వీలైనంత త్వరగా సానుకూలంగా పరిశీలించాలి. ఈనెల 23న సీసీఎల్ఏ వద్ద నిరసన చేపడతాం. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం. – వెంకటేశ్ యాదవ్, వీఆర్ఏ అసోసియేషన్ కార్యదర్శి -
అన్ని శాఖలకు తల్లి.. రెవెన్యూ శాఖ
సాక్షి, అమరావతి: అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కొత్త కార్యాలయాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ కార్యదర్శి ఎ.బాబు, సంయుక్త కార్యదర్శులు గణేష్‌కుమార్, తేజ్ భరత్, సీఎంఆర్వో (కంప్యూటరైజేషన్ ఆఫ్ ఎంఆర్వో ఆఫీసెస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు మంత్రి ధర్మాన ప్రసాదరావును సన్మానించారు. -
లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యసాధనకు అనుగుణంగా పనిచేస్తానని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులోని తన చాంబర్లో బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీషర్లు సర్వే చేశాక 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే నిర్వహించలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పెద్దఎత్తున భూ సర్వే నిర్వహించడం ద్వారా టైటిల్ ఫ్రీ చేయడం ద్వారా భూ యాజమాన్య హక్కులను అందరికీ బదిలీ చేయడం జరుగుతోందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ–స్టాంపులకు అనుమతిచ్చే ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి,రామకృష్ణ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.