భూముల క్రమబద్ధీకరణ షురూ!
* చెల్లింపు కేటగిరీ మార్గదర్శకాలకు సవరణ
* ఆగస్టు 15న పట్టాల పంపిణీ!
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇక ఊపందుకోనుంది. చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలను తాజాగా సవరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తాజాగా చెక్ మెమోను జారీ చేసింది. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తులను మండలస్థాయి అధికారులు దుమ్ముదులిపే పనిలో పడ్డారు.
నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి ఆగస్టు 15న పట్టాల పంపిణీని లాంఛనంగా చేపట్టాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. సర్కారు సూచనల మేరకు జీవో 59 కింద క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి.
ప్రస్తుతానికి పాత దరఖాస్తులకే..
చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచితకేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196 చేరింది. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారుల నుంచి సొమ్ము వసూలుపై సర్కారు ఆదేశాలివ్వకపోవడంతో ప్రస్తుతానికి పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.
చెక్ మెమోలో ప్రధానంగా దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫొటోలు, అందులోని నిర్మాణానికి సంబంధించిన ఫొటోను అధికారులు సేకరించాలి. ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే పూర్తి వివరాలను సేకరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒకేసారి సొమ్ము చెల్లించినవారికి 5 శా తం రాయితీ ఇవ్వనున్నారు. పరిశీలన అనంతరం చెల్లించినవారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్‌లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన చెల్లిస్తున్నవారికి ఎండార్స్‌మెంట్ పత్రాలను ఇవ్వనున్నారు.