Payment category
-
‘క్రమబద్ధీకరణ’ గడువు పెంపుపై తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం, పలుమార్లు గడువు పెంచినా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2014 డిసెంబర్లో జీవో 59 విడుదల చేసిన సర్కారు.. 90 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేసింది. అయితే ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్న భూపరిపాలన విభాగంలో కమిషనర్లు తరచుగా మారుతుండటంతో సిబ్బందికి మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఎట్టకేలకు గత నెల మొదటి వారం నుంచి పూర్తి సొమ్ము చెల్లించిన కొన్ని దరఖాస్తులను క్లియర్ చేసిన తహసీల్దార్లు ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. మరోవైపు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారు మరికొన్ని వాయిదాలు చెల్లించాల్సి రావడం, కొన్ని దరఖాస్తుల్లో పేర్కొన్న భూమి పాక్షిక కమర్షియల్/పాక్షిక రెసిడెన్షియల్ కేటగిరీలో ఉండటం క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. గడువు పొడిగించలేం..: భూముల క్రమబద్ధీకరణ ఏడాదిన్నరగా సాగుతున్నందున మరోమారు గడువు పొడిగించడం సమంజసం కాదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు గడువు ముగిసినందున తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇమ్మని కొందరు దరఖాస్తుదారులు తహసీల్దార్లను డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరణను త్వరితగతిన ముగించేందుకు గడువు పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖ రాశారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి వాటితో సీసీఎల్ఏ బిజీగా ఉండటంతో గడువు పెంపుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. శాఖల మధ్య సమన్వయం కొరవడింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం అవసరమైన కన్వేయన్స్ డీడ్లను మాన్యువల్‌గానే జారీ చేయాలని ప్రభుత్వం గత నెల 27న ఆదేశాలు జారీ చేసినా, భూపరిపాలన విభాగం అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో జారీ అయిన కన్వేయన్స్ డీడ్లనే రిజిస్ట్రేషన్లకు వినియోగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, తహసీల్దార్లను సీసీఎల్ఏ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఒకే అంశంపై సర్కారు ఒకరకంగా, సీసీఎల్ఏ మరో విధంగా ఆదేశాలివ్వడంతో ఏ ఆదేశాలను అమలు చేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. కన్వేయన్స్ డీడ్‌లోని వివరాలను అవసరమైనట్లు మార్పు చేసేందుకు సీసీఎల్ఏ అవకాశం ఇవ్వకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మరింత జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. జీవో 59 కింద కన్వీయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేసే విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన నిబంధనలు ఏవీ అందలేదని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. కబ్జా అయిన ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబరులోనే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర కిందే చెల్లింపు కేటగిరీ కింద 50వేల దరఖాస్తులు సర్కారుకు వచ్చినా నేటికీ ఒక్క దరఖాస్తుకు మోక్షం కలిగించలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
భూముల క్రమబద్ధీకరణలో ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. చెల్లింపు కేటగిరీలో వాయిదాల పద్ధతే ఇందుకు కారణమైంది. తొలి వాయిదా సొమ్ము చెల్లించాలంటూ భూపరిపాలన విభాగం జారీచేసిన నోటీసులతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మారిన దరఖాస్తుదారులకు, క్రమబద్ధీకరణ నిమిత్తం వాయిదా సొమ్ము చెల్లించాలంటూ వారం రోజులుగా రెవెన్యూశాఖ నోటీసులు పంపుతోంది. దీనిప్రకారం ఈనెల 10తో తొలి వాయిదా గడువు ముగిసింది. గడువు దాటాక వచ్చిన నోటీసులను చూసి లబ్ధిదారులు నివ్వెరపోతున్నారు. దీనిపై మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళితే.. అవి సీసీఎల్ఏ కార్యాలయం నుంచే వచ్చాయని, తాము చేయగలిగిందేమీ లేదని చెబుతున్నారు. వాయిదా సొమ్ము ఇప్పుడు చెల్లిస్తామంటే.. గడువు ముగిసినందున నిబంధనలు ఒప్పుకోవంటూ వాపసు పంపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కాదని గడువు తర్వాత సొమ్ము స్వీకరిస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని క్షేత్రస్థాయి అధికారులు జంకుతున్నారు. క్రమబద్ధీకరణకు చెల్లింపులు ఇలా.. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరించేందుకు గత డిసెంబరులో ప్రభుత్వం జీవో నెంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో వచ్చిన 16,915 దరఖాస్తులను కూడా పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. సొమ్ము చెల్లింపునకు వాయిదాల సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తాజాగా సవరించిన షెడ్యూలు ప్రకారం.. చెల్లింపు కేటగిరీలో గత ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31వరకు పెంచారు. మార్పిడి దరఖాస్తు దారులకు ఈ నెల 10లోగా మొదటి వాయిదా, రెండో వాయిదాను 31లోగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 30తో ముగిసిన మూడో వాయిదా గడువును సెప్టెంబరు 30 వరకు, సెప్టెంబరు 30తో ముగియనున్న నాలుగో ఇన్స్టాల్మెంట్ గడువును నవంబరు 15 వరకు పొడిగించారు. చివరి వాయిదా గడువును మాత్రం యథావిధిగా (డిసెంబరు 31) ఉంచినట్లు సవరణ షెడ్యూల్లో పేర్కొన్నారు. సీసీఎల్ఏ నుంచే ఈ గందరగోళం భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) ఇటీవల ఆదేశించింది. అయితే వాయిదాల గడువును, నోటీసు న మూనాను సీసీఎల్ఏ అధికారులే రూపొందించారు. సీసీఎల్ఏ ఈనెల ప్రారంభంలో ఆన్లైన్లో జారీచేసిన నోటీసులనే మండల రెవెన్యూ అధికారులు డౌన్లోడ్ చేసి తమ పరిధిలోని లబ్ధిదారులకు పోస్టు ద్వారా పంపారు. అవి లబ్ధిదారులకు చేరేసరికి వాయిదా గడువు కాస్తా ముగిసింది. దీంతో ఇటు లబ్ధిదారుల్లోనూ, అటు అధికారుల్లోనూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కనీసం రెండో వాయిదా గడువు (ఆగస్టు 31)లోగా మొదటి వాయిదా సొమ్మును కూడా స్వీకరించేందుకు అనుమతించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
భూముల క్రమబద్ధీకరణ షురూ!
* చెల్లింపు కేటగిరీ మార్గదర్శకాలకు సవరణ * ఆగస్టు 15న పట్టాల పంపిణీ! సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇక ఊపందుకోనుంది. చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలను తాజాగా సవరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తాజాగా చెక్ మెమోను జారీ చేసింది. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తులను మండలస్థాయి అధికారులు దుమ్ముదులిపే పనిలో పడ్డారు. నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి ఆగస్టు 15న పట్టాల పంపిణీని లాంఛనంగా చేపట్టాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. సర్కారు సూచనల మేరకు జీవో 59 కింద క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి. ప్రస్తుతానికి పాత దరఖాస్తులకే.. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచితకేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196 చేరింది. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారుల నుంచి సొమ్ము వసూలుపై సర్కారు ఆదేశాలివ్వకపోవడంతో ప్రస్తుతానికి పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. చెక్ మెమోలో ప్రధానంగా దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫొటోలు, అందులోని నిర్మాణానికి సంబంధించిన ఫొటోను అధికారులు సేకరించాలి. ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే పూర్తి వివరాలను సేకరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒకేసారి సొమ్ము చెల్లించినవారికి 5 శా తం రాయితీ ఇవ్వనున్నారు. పరిశీలన అనంతరం చెల్లించినవారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన చెల్లిస్తున్నవారికి ఎండార్స్మెంట్ పత్రాలను ఇవ్వనున్నారు. -
క్రమబద్ధీకరణ సొమ్ము చెల్లింపు గడువు పెంపు
చెల్లింపు కేటగిరీ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం లబ్ధిదారులు సొమ్ము చెల్లించేందుకు సర్కారు మరింత గడువిచ్చింది. గతంలో ఇచ్చిన వాయిదాల కాలపరిమితి షెడ్యూలును తాజాగా సవరించింది. ఈ మేరకు శనివారం కలెక్టర్లకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు పంపింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31 వరకు పెంచారు. జూన్ 30తో ముగిసిన వాయిదా గడువును సెప్టెంబర్ 30 వరకు, సెప్టెంబర్ 30తో ముగియనున్న నాలుగో ఇన్స్టాల్మెంట్ గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. చివరి ఇన్స్టాల్మెంట్ గడువును యథావిధిగా (డిసెంబర్ 31) ఉంచినట్లు షెడ్యూల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అలాగే.. చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్ర మబద్ధీకరించేందుకు అధికారులు పాటించాల్సిన నిబంధనలతో రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం నుంచి చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించి, ఆగస్టు 15 లోగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. కొత్త మార్గదర్శకాలు ఇలా.. చెల్లింపు కేటగిరీ (జీవో 59) కింద దరఖాస్తు చేసుకున్న కుటుంబంలోని మహిళ పేరిటే స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. మహిళలు లేని పక్షంలోనే దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి పేరిట కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తుదారు వివరాలను నిర్ధారించుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్.. తదితర గుర్తింపు కార్డులు పరిశీలించాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలం అభ్యంతర కరమైనదో, కాదో నిర్ధారించుకోవాలి. ఎఫ్టీఎల్, శిఖం, కోర్టుకేసులున్న భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను తిరస్కరించాలి. అభ్యంతరం లేని భూములైనప్పటికీ అవి ఏ ప్రభుత్వ విభాగానికి చెందినవన్న సమాచారాన్ని సేకరించాలి. ఆయా విభాగాల నుంచి అనుమతి పొందాకే క్రమబద్ధీకరణ చేపట్టాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలాన్ని ఫొటో తీయాలి. స్థలం రిజిష్ట్రేషన్ ధర, లబ్ధిదారు చెల్లించిన సొమ్మును పరిశీలించాలి. ఈ వివరాలన్నింటితో చెక్‌మెమోను ఆర్డీవో ఆధ్వర్యంలోని కమిటీ అనుమతించాకే దరఖాస్తుదారు పేరిట ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా దరఖాస్తును తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. -
జీవో 59 పై ఎట్టకేలకు కదలిక
* చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు సర్కారు సన్నద్ధం * క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు పెంపు! * 46 వేల దరఖాస్తులకు కలగనున్న మోక్షం సాక్షి, హైదరాబాద్ : చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారికి ఆయా స్థలాలను చెల్లింపు కేటగిరీలో క్రమద్ధీకరించేందుకు గత డిసెంబర్లో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీచేసిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో మొత్తం 46వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఇన్నాళ్లూ ఆ దరఖాస్తులను అటకెక్కించారు. ఈ అంశంపై ‘జీవో 59పై కదలికేదీ?’ శీర్షికన గత నెల 20న సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు కదిలింది. దరఖాస్తులను పరిశీలించి, అందులో పేర్కొన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో కదలిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూశాఖ సర్క్యులర్ పంపించింది. అన్ని దరఖాస్తులకు మోక్షం..! ఆక్రమిత భూముల క్ర మబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నందున, చెల్లింపు కేటగిరీలో అన్ని దరఖాస్తులకు మోక్షం లభించనుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. జీవో నంబరు 58 కింద ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇళ్ల స్థలాలను, వారికి ఉచితంగా క్రమబద్ధీకరించే అంశంలో మార్గదర్శకాలను ప్రభుత్వం పలుమార్లు సడలించింది. చివరికి దరఖాస్తుదారుడు అర్హుడని నిర్ధారించేందుకు పంచనామా ఉన్నా చాలని సర్కారు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరణ పట్ల కూడా ప్రభుత్వం ఇదే రకమైన వైఖరి అవలంభించవచ్చని తెలుస్తోంది. అలాగే భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరో మూడు నెలల పాటు గడువును పొడిగించాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపో, మాపో ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని, అధికారుల పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది. క్రమబద్ధీకరణ సొమ్ము ఖజానాకు.. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు దారులు చెల్లించిన సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలందాయి. దీంతో ఆఘమేగాల మీద శుక్రవారమే అన్ని మండలాల నుంచి అధికారులు సుమారు రూ.300కోట్లను జమచేశారు. ఇంతకు మునుపు దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్మును తహశీల్దార్ల ఖాతాల్లోనే ఉంచారు. దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో సదరు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. చెల్లింపు కేట గిరీ కింద వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖ జానాకు జమ చేయాలని తాజాగా సర్కారు ఆదేశాలివ్వడంతో.. దాదాపుగా అన్ని దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.