చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం, పలుమార్లు గడువు పెంచినా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2014 డిసెంబర్‌లో జీవో 59 విడుదల చేసిన సర్కారు.. 90 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేసింది. అయితే ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్న భూపరిపాలన విభాగంలో కమిషనర్లు తరచుగా మారుతుండటంతో సిబ్బందికి మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు.
ఎట్టకేలకు గత నెల మొదటి వారం నుంచి పూర్తి సొమ్ము చెల్లించిన కొన్ని దరఖాస్తులను క్లియర్ చేసిన తహసీల్దార్లు ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. మరోవైపు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారు మరికొన్ని వాయిదాలు చెల్లించాల్సి రావడం, కొన్ని దరఖాస్తుల్లో పేర్కొన్న భూమి పాక్షిక కమర్షియల్/పాక్షిక రెసిడెన్షియల్ కేటగిరీలో ఉండటం క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది.
గడువు పొడిగించలేం..: భూముల క్రమబద్ధీకరణ ఏడాదిన్నరగా సాగుతున్నందున మరోమారు గడువు పొడిగించడం సమంజసం కాదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు గడువు ముగిసినందున తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇమ్మని కొందరు దరఖాస్తుదారులు తహసీల్దార్లను డిమాండ్ చేస్తున్నారు.
క్రమబద్ధీకరణను త్వరితగతిన ముగించేందుకు గడువు పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి వాటితో సీసీఎల్‌ఏ బిజీగా ఉండటంతో గడువు పెంపుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.